Proverbs - సామెతలు 1 | View All

1. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు.

2. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును

3. నీతిన్యాయ యథార్థతల ననుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును

4. జ్ఞానములేనివారికి బుద్ధి కలిగించుటకును ¸యౌవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు.

5. జ్ఞానముగలవాడు విని పాండిత్యము వృద్ధిచేసికొనును వివేకముగలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును.

6. వీటిచేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు.

7. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు.

8. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము.

9. అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునై యుండును

10. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము.

11. మాతోకూడ రమ్ము మనము ప్రాణముతీయుటకై పొంచియుందము నిర్దోషియైన యొకని పట్టుకొనుటకు దాగియుందము

12. పాతాళము మనుష్యులను మింగివేయునట్లు వారిని జీవముతోనే మింగివేయుదము సమాధిలోనికి దిగువారు మింగబడునట్లు వారు పూర్ణ బలముతోనుండగా మనము వారిని మింగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము.

13. పలువిధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన యిండ్లను దోపుడుసొమ్ముతో నింపుకొందము

14. నీవు మాతో పాలివాడవై యుండుము మనకందరికిని సంచి ఒక్కటే యుండును అని వారు నీతో చెప్పుదురు.

15. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవలయందు నడువకుండ నీ పాదము వెనుకకు తీసికొనుము.

16. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు.
రోమీయులకు 3:15-17

17. పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థము.

18. వారు స్వనాశనమునకే పొంచియుందురు తమ్మును తామే పట్టుకొనుటకై దాగియుందురు.

19. ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించువారి ప్రాణము అది తీయును.

20. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంతవీధులలో బిగ్గరగా పలుకుచున్నది

21. గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయు చున్నది పురద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది

22. ఎట్లనగా, జ్ఞానములేనివారలారా, మీరెన్నాళ్లు జ్ఞానములేని వారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్లు అపహాస్యము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్లు జ్ఞానమును అసహ్యించు కొందురు?

23. నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీమీద కుమ్మరించుదును నా ఉపదేశమును మీకు తెలిపెదను.

24. నేను పిలువగా మీరు వినకపోతిరి. నా చేయిచాపగా ఎవరును లక్ష్యపెట్టకపోయిరి

25. నేను చెప్పిన బోధ యేమియు మీరు వినక త్రోసి వేసితిరి నేను గద్దింపగా లోబడకపోతిరి.

26. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చునప్పుడు నేను అపహాస్యము చేసెదను

27. భయము మీమీదికి తుపానువలె వచ్చునప్పుడు సుడిగాలి వచ్చునట్లు మీకు అపాయము కలుగు నప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించునప్పుడు నేను అపహాస్యము చేసెదను.

28. అప్పుడు వారు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టెదరుగాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడ కుందును.

29. జ్ఞానము వారికి అసహ్యమాయెను యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వారి కిష్టము లేకపోయెను.

30. నా ఆలోచన విననొల్లకపోయిరి నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి.

31. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము ననుభ వించెదరు తమకు వెక్కసమగువరకు తమ ఆలోచనలను అనుసరించెదరు

32. జ్ఞానములేనివారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు.

33. నా ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును.బైబిల్ అధ్యయనం - Study Bible
1:1 సామెతలు అంటే భావగర్భితమైన, సూచనప్రాయమైన క్లుప్త వ్యాఖ్యలు లేదా ఉపమానాలు. ఇశ్రాయేలు ఐక్యరాజ్యాన్ని పరిపాలించిన చిట్టచివరి రాజు సొలొమోను (1రాజులు 1-11 అధ్యా.). 

1:2 జ్ఞానము అంటే ఏదైనా విషయం మీద సంపూర్ణమైన పరిజ్ఞానం , కౌశలం. ఇది క్రమశిక్షణ, తెలివి, బుద్ధి కుశలత, ఇంకా ఇతర సుగుణాలన్నిటినీ మించింది. జీవితంలో ఎదురయ్యే ఏ సమస్యనైనా అధిగమించడానికి ఒకని తెలివిని అన్వయించగల సామర్థ్యమే జ్ఞానం. దేవుడనుగ్రహించే వరమైన వాక్యానుసారమైన జ్ఞానంలో నైతికత, దేవుని గురించిన అనుభవపూర్వక అవగాహనలు భాగమై ఉన్నాయి (2:6). ఉపదేశము అంటే తప్పుడు నడత వలన కలగబోయే దుష్పరిణామాల గురించి హెచ్చరిక, లేదా ఇటువంటి
హెచ్చరికల్ని లక్ష్యపెట్టడంలో విఫలమైన వారిని ప్రేమపూర్వకంగా సరిదిద్దే పాఠం. ఇది భౌతిక దండన కూడా కావచ్చు. ఈ భావాన్నిచ్చే హెబ్రీ పదం పలుచోట్ల “ఉపదేశము” అని అనువదించబడింది (వ.3). ఎందుకంటే దీని అంతిమ లక్ష్యం వికాసం, విద్య, కేవలం దండన కాదు. గ్రహించుట అంటే కార్యాచరణకు ప్రేరేపించే విషయ పరిజ్ఞానాన్ని అంతర్గతం చేసుకోవడం. వివేక సల్లాపములు అంటే సత్యాన్ని వెల్లడి చేసే అంతఃపరిశీలనలు. 

1:3 బుద్ధికుశలత ఇచ్చు ఉపదేశము. అంటే “బుద్ధిని, కౌశల్యాన్ని నేర్పే క్రమశిక్షణ" అని అక్షరార్థం (వ.2 నోట్సు చూడండి). బుద్ధి కుశలత అంటే నేర్పరితనం లేదా చాకచక్యంతో కూడిన తెలివి, లోతుగా ఆలోచించగల సామర్థ్యం, పర్యాలోచన (సూక్ష్మబుద్ధి) లేదా నిశిత పరిశీలన, విజయానికి నడిపించే ఆచరణీయ జ్ఞానం. బుద్ధికుశలత అనే అర్థాన్నిచ్చే హెబ్రీ పదం “ జ్ఞానము" అనీ (16:23; 21:11), “బుద్ది" అనీ (10:5; 14:35; 15:24; 17:2; 19:14; 21:16), “చెవి యొగ్గు" అనీ (16:20), “యుక్తి" అనీ (17:8), “కనిపెట్టు"ను అనీ (21:12) కూడా అనువదించబడింది. సాధారణంగా చాకచక్యంతో కూడిన ఈ తెలివిని నీతి (దేవుని నిర్దేశక నియమాలతో ఏకీభావం) న్యాయం (ఏది సరైనదో దాన్ని పునరుద్ధరించడం) యథార్థతలు (ముక్కుసూటితనం, సత్యసంధత, ఋజుత్వం) నిర్దేశిస్తాయి. 

1:4 జ్ఞానము లేనివారు అంటే సామాన్యమైన అమాయకులు. వీరు సాధారణంగా దేనిపట్ల నిబద్ధత చూపించని యౌవన వయస్కులు. సాధారణంగా వీరిలో వివేచన (8:5), ఇంగితజ్ఞానం (9:4,16; 22:3; 27:12) కొరతగా ఉంటాయి. వీరు జ్ఞానాన్ని అనుసరించాలని కోరుకోరు, అలాగని అపహాసకుల్లాగా బుద్దిహీనతలో చిక్కుకోరు (1:22), అయితే దేన్నైనా నమ్మడానికి సిద్ధపడతారు (14:15,18). దేనికీ బద్దులు కాకుండా ఉండాలని ప్రయత్నించేవారు శిక్షార్హులు, ఎందుకంటే వీరు నీతిమార్గాన్ని చేపట్టలేదు (1:32; 9:6). చెడుమార్గంలో పయనించేవారిని చూసి వీరు హెచ్చరిక పొంది ఉండాల్సింది (19:25; 21:11). సామెతలు గ్రంథంలో బుద్ది అనే అర్థాన్నిచ్చే హెబ్రీ పదమెప్పుడూ గుణాత్మకమైన భావాల్నే స్ఫురింపజేస్తుంది.

ఈ విశేషణం 22:3; 27:12 వచనాల్లో బుద్ధిమంతుడు అనే అర్థంతోను, 12:16,23; 13:16; 14:8,15,18; 15:5 లో వివేకి అనే అర్ధంతోను కనబడుతుంది. వివేకం గల వ్యక్తి దూరదృష్టితో అపాయాన్ని ముందుగానే గ్రహించి తెలివిగా వ్యవహరిస్తాడు. ఏదేమైనా, ఇతర గ్రంథాల్లో ఈ హెబ్రీ పదం సాధారణంగా “వంచన” లేదా “యుక్తి" అనే అర్థంలో అంటే దేవుని చిత్తాన్ని సూటిగా ధిక్కరించడమనే అర్థంలో వాడబడింది (ఆది 3:1; యోబు 5:12). తెలివి అంటే సంగ్రహపర్చుకొని మనసులో నిలిపి ఉంచుకున్న వాస్తవిక విషయపరిజ్ఞానం (హెబ్రీ. దాత్: 8:9-10,12 దగ్గర పదాధ్యయనం చూడండి). తెలివి ఒక పనిముట్టు, వివేకం ఒక సాధకుడు. ఒక పనిమంతుడు వర్తింపజేసుకోడానికి జ్ఞానం లేకపోతే తెలివి నిష్ప్రయోజనమవుతుంది. వివేచన తనకు తానుగా ఆలోచించి ప్రణాళిక చేయగల సామర్థ్యం . ఈ పదానికి వ్యతిరేకమైనది కుట్రపూరితమైన ఎత్తుగడ అనే వ్యతిరేక అర్థం ఉంది. (12:2; 14:17; 24:8), సామెతలు గ్రంథంలో యౌవనులు అనే పదం పరిణతి దశకు దగ్గరగా ఉండడాన్ని సూచిస్తుంది. అంటే తన జీవితం గురించి స్వయం నిర్ణయాలు తీసుకోగలిగే దశ (22:6). 

1:5 వివేకముగలవాడు. అంటే తాను వినినదానిని, చూసినదానిని అర్థం చేసుకొని ఆ తెలివి తన క్రియలను నడిపించేటట్లు దానిని అంతర్గత పర్చుకోగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తి. 

1:6 సామెతలను భావసూచక విషయములను అనేవి రెండూ పర్యాయ పదాలు (వ. 1). రెండు పంక్తుల్ని మించిన ఉపదేశాలను జ్ఞానుల మాటలు సూచిస్తుండవచ్చు, లేదా ఒకదానికొకటి భిన్నంగా ఉన్నవాటిని తెలియజేసే ఉపదేశాలు కావచ్చు (22:17; 24:23; 30:1; 31:1; ప్రసంగి 9:17; 12:11 లతో పోల్చండి). అర్థం చేసుకోడానికి జటిలంగా ఉన్న సామెత, లేదా ఎదుటి వ్యక్తి జవాబు చెప్పలేని విధంగా ఉండే క్లిష్టమైన మాటను గూఢవాక్యము (న్యాయాధి 14:12; 1రాజులు 10:1) అంటారు. 

1:7 దేవుని పట్ల భక్తిపూర్వక భయం, గౌరవం, ప్రేమ నమ్మకం, ఇత్యాదివన్నీ కలిగి ఉండడమే యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట. దేవుని పట్ల భయభక్తులున్నప్పుడు జ్ఞానం, నమ్రత, విధేయత, ఆశీర్వాదం ఉంటాయి (8:13; 10:27; 14:26-27; 16:6; 19:23; 22:4). మూలము అంటే ముందుగా ఉన్నది, అనివార్యంగా ముందు ఉండవలసినది, ముఖ్యాంశం లేదా ప్రధాన నియమం (4:7). మూడు రకాల “మూర్ఖులు” మొండితనం గల దుర్నీతిపరులు (1:22; 17:7). మూర్ఖులు (హెబ్రీ. ఎవిల్; 10:8,10,14,21 దగ్గర పదాధ్యయనం చూడండి) తామే తెలివి గలవారమనుకొని ఉపదేశమును లేదా మంచి సలహాను లేదా దిద్దుబాటును తిరస్కరించుదురు. 

1:8 ఉపదేశము - వ.2 నోట్సు చూడండి. బోధ అనే పదం నైతిక మార్గదర్శకాల్ని అందించగల అధికార స్థానంలో ఉన్న వ్యక్తిని సూచిస్తుంది, ఇతర చోట్ల ఈ పదం “ధర్మశాస్త్రం” అనే అర్థాన్నిస్తుంది. (28:4; 7,9;

ద్వితీ 4:44 తో పోల్చండి). ఉపదేశించే పని తండ్రిది మాత్రమే అనీ, బోధించే పని తల్లిది మాత్రమే అనీ పాఠకులు విడదీసి చూడరాదు. ఈ విధంగా వేర్వేరుగా చెప్పడం హెబ్రీ పద్యశైలిలోని ఒక పద్ధతి (4:3; 6:20; 19:26; 23:22; 30:11,17). ఇంటిలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడంలో తల్లిదండ్రులిద్దరూ భాగస్వాములే. 

1:9 మాలిక...హారములు గౌరవానికి, మార్గనిర్దేశానికి, సంరక్షణకు చిహ్నాలు. 

1:10 ప్రేరేపింపగా అనే మాటకు మూలమైన హెబ్రీ పదం "
జ్ఞానము లేనివారికి” అనే పదానికి సంబంధించినది (వ.4 నోట్సు చూడండి). 

1:11 ప్రాణము తీయుటకై పొంచియుందము అనే మాటలు సరదా కోసం నిష్కారణంగా ప్రాణం తీయడాన్ని సూచిస్తున్నాయి. (“వ్యర్థము" - వ.17; “నిర్నిమిత్తముగా" - 3:30; 24:28, “హేతువులేని" - 23:29; 26:2). పట్టుకొనుట అంటే “చాటుగా మాటువేసి దాడిచేయడం" అని అక్షరార్థం, పొంచి ఉండడానికిది పర్యాయపదం.

1:12-13 పాతాళము సమాధిని సూచిస్తుంది. సమాధిలోనికి - సమాధి లోపలికి దిగి వెళ్ళే ద్వారం. ఈ రెండూ మృత్యువుకు సంకేతాలే. దుష్టుల అంతం పాతాళం (15:11), అయితే నీతిమంతులు పాతాళానికి వెళ్లకుండా తప్పించబడతారు. మ్రింగబడునట్లు... పూర్ణబలముతో నుండగా - బాధకు గురైన వ్యక్తి సజీవుడుగా పూర్ణబలం కలిగి ఉన్నాడు, మరణానికి దాపున లేడు. 

1:14 భాగస్తుడు కావడం లేక పాలివాడవై ఉండడం ఒకని గమ్యాన్ని తెలియజేస్తుంది (యెషయా 17:14). ఈ పదంలో “మా మార్గాన్నే నీ "భవితవ్యం"గా ఎంచుకో, దోపుడుసొమ్ములో మాతో కలిసి "పాలు పంచుకో" అన్న ద్వందార్థాన్ని స్ఫురిస్తున్నది. 

1:15 సామెతలు గ్రంథంలో దుష్టుల మార్గమున... త్రోవలయందు లేక వారి దారిలో వెళ్ళవద్దనీ, దానికి బదులుగా నీతిమార్గాన్ని ఎన్నుకోవాలన్న హెచ్చరిక పదే పదే కనబడుతుంది. (4:13-15). ఒక వ్యక్తి ఎన్నుకొనే జీవనశైలి ఆ వ్యక్తినొక నిర్దేశిత భవితవ్యానికి నడిపిస్తుంది. ఒక మనిషి క్షణమైనా దుష్టపూరితమైన జీవనశైలిని ప్రయత్నించకూడదు. 

1:16 సాధారణమైన హెబ్రీ పదం (రా; 24:8,18-19 దగ్గర పదాధ్యయనం చూడండి) దుష్టత్వం లేక కీడు అనే అర్థాన్నిస్తుంది. "దుష్టత్వం" ఒక జీవిత విధానం (2:12), “హాని” చేయడం దీని ఉద్దేశం (3:29), దాని ఫలితం “ఆపద" (12:21; 13:17), అంతిమ పర్యవసానం “వినాశనం" (5:14; 21:12). ఈ మాటలకన్నిటికీ ఇదే హెబ్రీ పదం ఉపయోగించారు. 20:14లో దేన్నైనా కొనే వ్యక్తి దాన్ని “జబ్బుది" లేక నీచమైనది అని చెప్పడానికి ఈ పదాన్నే ఉపయోగించారు. 

1:17-18 పక్షి చూస్తుండగా వల వేస్తే పక్షి దానిలో చిక్కదు. అయితే తమ జీవిత విధానం నాశనం కలిగిస్తుందని తెలిసినా దుష్టులు దాని నుండి తొలగిపోలేరు. 

1:19 వ.10-19 ల్లోని గుంపు గురించిన సారాంశం: ఆశాపాతకులందరి గతి అట్టిదే, అంటే అన్యాయంగా లాభం పొందాలనుకోవడం (15:27; 28:16; యిర్మీయా 6:13; 8:10; యెహె 22:27; హబ 2:9), ఇది చివరకు వారి వినాశనానికే దారితీస్తుంది (1:18,31-32; 2:19; 8:36; 29: 6,24). 

1:20-23 వ్యక్తిత్వారోపణలో ఒక స్త్రీ లాగా కనబడుతున్న జ్ఞానము వీధులలో... బిగ్గరగా పలుకుతూ అందరికీ వినబడేలాగా హెచ్చరిస్తున్నది. ఆమె జ్ఞానం) గద్దింపును తృణీకరించేవారు. ఆపదలో పడతారు. జ్ఞానం ఐహిక జీవితానికి సంబంధించిన ఆచరణీయ వ్యవహారాల్లో సఫలత నివ్వడంతో బాటు నిత్యజీవాన్ని సైతం ఇస్తుంది (3:22). 

1:20-21 సంతవీధులలో - ఇది క్రయవిక్రయాలు జరిగే బహిరంగ ప్రదేశం. సాధారణంగా పురద్వారములలో అంటే గవునుల దగ్గర పౌరసంబంధమైన చర్చలు, వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి (24:7 నోట్సు చూడండి). 

1:22 జ్ఞానము లేనివారలారా - వ.4 నోట్సు చూడండి. అపహాసకులు తమ మూర్ఖత్వాన్ని గట్టిగా హత్తుకొని మార్పు చెందడానికి ఏ మాత్రం ఇష్టపడరు. అపహాసకుడు నీతిని హేళన చేస్తూ ధిక్కారం ప్రదర్శిస్తాడు (17:5). అపహాసకులు గర్విష్ణులు (21:24), కలహప్రియులు (22:10), మంచిపేరు కోల్పోయినవారు (24:9), అపహాసకులు దిద్దుబాటును కోరుకోరు. కాబట్టి (9:7-8; 13:1; 15:12), మంచిని నేర్చుకోలేరు (14:6), ఫలితంగా శిక్ష పాలవుతారు (3:34; 9:12; 19:29). జ్ఞానం లేనివారికి అపహాసకులు ఒక చెడ్డ "మాదిరి"గా మాత్రమే ఉంటారు (19:25; 21:11). "బుద్దిహీనులు" అనే అర్థమిచ్చే కేసిల్ అనే హెబ్రీ పదానికి (17:10,12,16, 21,24-25 నోట్సు చూడండి), “మూర్ఖులు" అనే అర్థాన్నిచ్చే ఏవిల్ అనే హెబ్రీ పదం చాలా దగ్గర పర్యాయ పదం (1:7; 17:7 తో పోల్చండి). బుద్ధిహీనులు మూర్ఖత్వంతో చెడునడతను విడిచిపెట్టలేరు, దానితోబాటు వారి మొండితనం వారిని మరింత మూర్ఖుల్ని చేస్తుంది. బుద్ధిహీనులకు వారి చెడునడతే సంతోషం కాబట్టి వీరి దరిదాపుల్లో ఉండడం సైతం అపాయకరం. 

1:23 ఈ వచనంలో హెచ్చరికతో బాటు, ఆ హెచ్చరికను విని మంచిమార్గం లోకి వచ్చినవారికి వాగ్దాన పూర్వకమైన ఆశీర్వాదం కూడా కనబడుతుంది. 

1:24-25 ఇక్కడ చేయి చాపడం భయపెట్టడం కోసం (నిర్గమ 7:5), లేక స్నేహపూర్వకంగా (యెషయా 65:2) కావచ్చు. అది ఏ విధంగానైనా ఇక్కడ మటుకు ఎవరూ స్పందించలేదు. 

1:26-27 తీవ్రమైన వినాశనానికి అపాయము ఒక ఆకస్మిక ప్రారంభం (ద్వితీ 32:35; యిర్మీయా 48:16). మిక్కటమైన భయముతో ఉన్నప్పుడు వణకు అదుపులోకి రాదు. అపాయం కలిగినప్పుడు లోకం మంచిదారిలోకి రావడం జ్ఞానానికి సంతోషాన్నిస్తుంది. దుష్టులకు శిక్ష, నీతిమంతులకు సత్ఫలితం కలుగుతాయి. తుపాను, సుడిగాలి ఎల్లప్పుడూ వినాశనాన్నే మిగుల్చుతాయి (10:25; హోషేయ 8:7). కష్టమును దుఃఖమును అనే మాటలకు మూలమైన హెబ్రీ పదాలకు నిర్బంధం లేదా క్రుంగుదల అని భావం (24:10). 

1:28-29 జ్ఞానం లేనివారు జ్ఞానమును అసహ్యించుకోవడం, కష్టం, దుఖం నుండి విడుదల పొందడం కోసం జ్ఞానం చేసే గద్దింపుల్ని నిర్లక్ష్యం చేస్తారు కాబట్టి (వ.24; వ. 22 తో పోల్చండి), జ్ఞానం చేసే న్యాయ విమర్శలో వారి మొఱలు తృణీకరించబడతాయి (వ.26-27; జెకర్యా 7:13 తో పోల్చండి). వెదకెదరు అనే మాటకు హెబ్రీ పదం ఒత్తిడి సమయంలో ఆతృతతో వెతకడాన్ని సూచిస్తుంది (కీర్తన 63:1; 78:34; హో షేయ 5:15). వారు తనను ఓపికతో వెదకాలని దేవుడు కని పెడుతున్నాడు (8:17; ద్వితీ 4:29 తో పోల్చండి; 2దిన 7:14; యిర్మీయా 29:13), అయితే యథార్థ హృదయంతో వెదకనివారికి ఆయన ప్రత్యుత్తరమియ్యడు (యెషయా 1:15; 59:2-3). చివరికి సమయం మించిపోయి వీరికి సహాయం అందని పరిస్థితి ఏర్పడుతుంది. (యిర్మీయా 11:11;14:12; యెహె 8:17-19, హో షేయ 5:6; 2 పేతురు 3:9-10). 

1:30 వారు గద్దింపును విలువలేనిదిగా పరిగణించి దానిని తృణీకరించిరి (5:12). 

1:31 వెక్కసమగువరకు - "తృప్తి పొందును” గురించి 18:20 నోట్సు చూడండి (28:19 తో పోల్చండి). 

1:32 హెబ్రీలో దేవుని విసర్జించి అనే పదాన్ని (హోషేయ 11:7) “అపనమ్మకత్వం" లేదా "తిరుగుబాటు” అని కూడా అనువదించవచ్చు. క్షేమము కలిగినదని మైమరచి ప్రజలు అభద్రతను లేక అసత్య భద్రతను నమ్ముతున్నారు (కీర్తన 30:6; యిర్మీయా 22:21; యెహె 16:49).. 

1:33 సురక్షితముగా అని అనువదించిన హెబ్రీ పదం, దేవుణ్ణి కాక ఇతరమైన వాటిని నమ్మడం, అభద్రత లేదా అసత్య భద్రత అనే అర్థాన్నిస్తుంది (11:28; 28:26). "జ్ఞానం" నిజమైన భద్రతను వాగ్దానం చేస్తున్నది. ఎందుకంటే జ్ఞానం దేవునికి సంబంధించింది కాబట్టి (2:6). 


Shortcut Links
సామెతలు - Proverbs : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |