4:1-2 కార్యనిర్వహణ చేసేవారి బాధ్యతలను ఎరిగివుండాలని పౌలు కొరింథీయులకు పిలుపునిచ్చాడు. నాయకత్వంలో ఉన్న - వారిని క్రీస్తు సందేశాన్ని పంచే బాధ్యతగల సేవక-గృహనిర్వాహకులుగా సంఘం చూడాలి.
4:3-4 "దేవుని మర్మములను” (వ.1) గూర్చిన తన గృహనిర్వాహకత్వపు పరీక్ష మనుష్యుల నుండిగాని, లేక తననుండి గాని కాక ప్రభువు నుండి వచ్చినదని పౌలుకు తెలుసు. “సిలువ వేయబడిన క్రీస్తు" అనే వెర్రితనముగా ఉన్న సందేశాన్ని గురించి ఎంత నమ్మకంగా ఉన్నారో అని విశ్వాసులందరూ పరీక్షింపబడతారు (2:2).
4:5 ఒకని పరిచర్య విషయంలో తీర్పు తీర్చవద్దని పౌలు హెచ్చరిస్తున్నాడు. అంత్య తీర్పులోనే అన్ని బయల్పరచబడతాయి.
4:6 ఈ మార్గం తప్పిన, గర్విష్టి నాయకులు ఎవరో పౌలు బయట పెట్టలేదు. అతడు తనపైన, అపొల్లో పైన పెట్టి సాదృశ్యంగా చెప్పాడు. తమ వెర్రితనపు సందేశంలో, వ్రాసియున్న సంగతులను అతిక్రమించి ఏమీ చేయలేదని పౌలు, అపొలోలు నాటకీయంగా తేటపరిచారు. ఆ కొరింథీయుల మధ్య “సిలువవేయబడిన యేసు క్రీస్తును తప్ప" (2:1-2) మరి ఏమీ ఎరుగకుండా ఉండాలని పౌలు నిశ్చయించుకున్నాడు. సంఘం ఒకని పక్షమున మరియొకని మీద ఉప్పొంగకూడదు. వారు ప్రభువునందే అతిశయించాలి.
4:7 కొరింథీ సంఘంలో ఆధిపత్యాన్ని ఆశిస్తున్నవారికి పౌలు అలంకారికంగా జవాబిస్తున్నాడు. కృపద్వారా వరమును పొందినవానికి అతిశయించేందుకు ఏమీ లేదు.
4:8 విపరీతమైన వ్యంగ్యాన్ని ఉపయోగిస్తూ, కొరింథు విశ్వాసులు ఇతరుల యెడల అతిశయపడడం వారిని తృప్తులుగా ఐశ్వర్యవంతులుగా చేసిందని పౌలు అంటున్నాడు. వారు మహిమపరచబడడం పూర్తయిపోయినట్లు, తాము ఇప్పటికే నిత్యత్వంలో రాజులుగా ఏలుతున్నట్లు వారు భావిస్తున్నారు. కొంతవరకు ఇది నిజమవ్వాలని పౌలు ఆశించాడు. ఎందుకంటే విశ్వాసులందరూ క్రీస్తుతో కూడా ఏలబోతున్నారు (2తిమోతి 2:12).
4:9 వేడుకగా (గ్రీకు. ధియేట్రన్, “వేదిక మీద చూపబడుతూ”) ఉన్నామని పౌలు పేర్కొనడం, సాధారణంగా నేరస్తులను అందరూ చూస్తుండగా గుంపుగా నడిపించి, ఆసక్తిగా చూస్తున్న ప్రేక్షకుల మధ్య చంపబడడాన్ని సూచిస్తుంది. అయితే అన్యజనులో లేక అవిశ్వాసులైన యూదా అధికారులో కాక, సాక్షాత్తు దేవుడు - అపొస్తలులను అలా అవమానకరమైన స్థితిలో చూపించడానికి ఎన్నుకున్నాడని పౌలుకు తెలుసు.
4:10 దానికి భిన్నంగా కొరింథీయులకు పౌలు ఒక ప్రమాదాన్ని గురించి హెచ్చరించాలన్న ఉద్దేశంతో ఉన్నాడు. సువార్తను నమ్మకంగా వెదజల్లుతున్న అపొస్తలులు పెట్టివారుగా చూపిస్తుండగా, ఆధ్యాత్మికంగా పూర్తిగా ఎదగని కొరింథీయులు తరిమివేయబడకుండా శ్రమను హింసను తప్పించుకోవడంలో బుద్ధిమంతులుగా (గ్రీకు. ఫ్రానిమోస్) ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు “శరీరసంబంధులైన మనుష్యుల"వలె ప్రవర్తిస్తున్నారు (3:3).
4:11-13 పౌలు అపొస్తలుల పరిచర్య జీవిత విధానాన్నీ, స్వభావాన్ని వర్ణిస్తున్నాడు. లోకం తన మానవజ్ఞానంతో వారిని మురికిగాను పెంటగాను ముద్రవేసింది. (2కొరింథీ 2:16తో పోల్చండి). అంటే శౌచాలయంలోని విసర్జనలు (గ్రీకు.. పెరికాథర్మా)గా, చెత్తడబ్బాలు, సెప్టిక్ టాంకులలోని
మలములా (గ్రీకు. పెరిప్సెమా) అని అర్థం. సమాజంలోని అథములను రోమీయులు ఇలా పిలిచేవారు. అయినప్పటికీ క్రీస్తు బోధించిన విధంగా (లూకా 6:27-36) వారు దీవిస్తూ... ఓర్చుకుంటూ, బతిమాలుకొంటూ ఉన్నారు అని పౌలు చెబుతున్నాడు.
4:14 పౌలు హెచ్చరికలు ఒక ప్రేమగల తండ్రి తన పిల్లలకు చేసే గద్దింపుల్లాగా ఉన్నాయి.
4:15 సువార్త ద్వారా తాను వారికి తండ్రిని అని పౌలు కొరింథీ విశ్వాసులకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రస్తుతమున్న వారి ఉపదేశకులకు భిన్నంగా అతడు కొరింథులో సంఘాన్ని స్థాపించినవాడు (అపొ.కా. 18).
4:16 -తనను పోలి నడుచుకోమని పౌలు కొరింథీ విశ్వాసులను బతిమాలుతున్నాడు. దీనిలో క్రీస్తుకోసం "వెర్రివారు"గా కనిపించడం ఇమిడి ఉంది (వ. 10-13; 2:1-2తో పోల్చండి). ఆ విధంగా విశ్వాసులు "లోకమునకు మురికిగా గుర్తించబడడానికి ప్రోత్సహించ బడుతున్నారు (4:13).
4:17. ఒక కుమారుడుగా తిమోతి ఒక విధిగా కొరింథీయులకు వారి తండ్రి నడుచుకొను విధమును... జ్ఞాపకం చేయును (అంటే "క్రీస్తు కోసం వెర్రివారు"గా ఉండడం, వ.10తో పోల్చండి). ఈ ఉత్తరం పంపించే సరికే తిమోతి బహుశా ఎఫెసు నుండి బయలుదేరి వెళ్ళి ఉంటాడు (16:10-11).
4:18-20 పౌలు వారి బోధను పరీక్షించడానికి శక్తితో, అంటే రక్షణార్ధమైన శక్తి ఉన్న ఒకే ఒక్క జ్ఞానమైన- సిలువవేయబడిన క్రీస్తు అనే వెర్రితనమును నిజంగా బోధిస్తూ ఉన్నవారి ప్రమాణికమైన శక్తితో వస్తాడు (1:18,22-24).
4:21 బెత్తము అవిధేయులైన పిల్లలను సరిచేస్తున్న ఒక నమ్మకమైన తండ్రిని చిత్రీకరిస్తుంది. కొరింథీ విశ్వాసులు పౌలు గద్దింపులను, మందలింపును నిర్లక్ష్యం చేస్తే అతడు వచ్చిన తర్వాత వారు బెత్తముతో శిక్షను పొందుతారు. అయితే వారు పశ్చాత్తాపపడితే అతడు ప్రేమతోను సాత్వికమైన మనస్సుతోను వస్తాడు.