Matthew - మత్తయి సువార్త 5 | View All

1. ఆయన ఆ జనసమూహములను చూచి కొండయెక్కి కూర్చుండగా ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చిరి.

2. అప్పుడాయన నోరు తెరచి యీలాగు బోధింపసాగెను

3. ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది.
యెషయా 61:1

4. దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు.
యెషయా 61:2

5. సాత్వికులు ధన్యులు ; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.
కీర్తనల గ్రంథము 37:11

6. నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారుతృప్తిపరచబడుదురు.

7. కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు.

8. హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు.
కీర్తనల గ్రంథము 24:2

9. సమాధానపరచువారు ధన్యులు ; వారు దేవుని కుమారులనబడుదురు.

10. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.

11. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.

12. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.
2 దినవృత్తాంతములు 36:16

13. మీరు లోకమునకు ఉప్పయి యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యులచేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు.

14. మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగైయుండనేరదు.

15. మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండు వారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభముమీదనే పెట్టుదురు.

16. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి.

17. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టి వేయుటకు నేను రాలేదు.
యెషయా 42:21

18. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పి పోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
యెషయా 42:21

19. కాబట్టి యీ యాజ్ఞలలో మిగుల అల్పమైన యొకదానినైనను మీరి, మనుష్యులకు ఆలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో మిగుల అల్పుడనబడును; అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును.

20. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోకరాజ్యములో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచున్నాను.

21. నరహత్య చేయవద్దు; నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వికులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా.
నిర్గమకాండము 20:13, నిర్గమకాండము 21:12, లేవీయకాండము 24:17, ద్వితీయోపదేశకాండము 5:17

22. నేను మీతో చెప్పునదేమనగా తన సహోదరునిమీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పు వాడు మహాసభకు లోనగును; ద్రోహీ అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును.

23. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధ మేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల

24. అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము.

25. నీ ప్రతి వాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము; లేనియెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతట నీవు చెరసాలలో వేయబడుదువు.

26. కడపటి కాసు చెల్లించువరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

27. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారుగదా;
నిర్గమకాండము 20:14, ద్వితీయోపదేశకాండము 5:18

28. నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.

29. నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహ మంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవము లలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరముగదా.

30. నీ కుడిచెయ్యి నిన్నభ్యంతర పరచినయెడల దాని నరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరక ములో పడకుండ నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా.

31. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక యియ్యవలెనని చెప్ప బడియున్నది గదా;
ద్వితీయోపదేశకాండము 24:1-3

32. నేను మీతో చెప్పునదేమనగా వ్యభిచారకారణమునుబట్టి గాక, తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు; విడనాడబడినదానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు.

33. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వికులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా,
నిర్గమకాండము 20:7, లేవీయకాండము 19:12, సంఖ్యాకాండము 30:2, ద్వితీయోపదేశకాండము 5:11, ద్వితీయోపదేశకాండము 23:21

34. నేను మీతో చెప్పునదేమనగా ఎంతమాత్రము ఒట్టుపెట్టుకొనవద్దు; ఆకాశము తోడన వద్దు; అది దేవుని సింహాసనము,భూమి తోడన వద్దు,
యెషయా 66:1

35. అది ఆయన పాదపీఠము, యెరూషలేముతోడన వద్దు; అది మహారాజు పట్టణము
కీర్తనల గ్రంథము 48:2, యెషయా 66:1

36. నీ తల తోడని ఒట్టుపెట్టుకొనవద్దు, నీవు ఒక వెండ్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు.

37. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను; వీటికి మించునది దుష్టునినుండి పుట్టునది.

38. కంటికి కన్ను, పంటికి పల్లు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా.
నిర్గమకాండము 21:24, లేవీయకాండము 24:20, ద్వితీయోపదేశకాండము 19:21

39. నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంపకూడ త్రిప్పుము.

40. ఎవడైన నీమీద వ్యాజ్యెము వేసి నీ అంగీ తీసికొనగోరిన యెడల వానికి నీ పైవస్త్రముకూడ ఇచ్చివేయుము.

41. ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసినయెడల, వానితో కూడ రెండు మైళ్లు వెళ్లుము.

42. నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగ గోరువానినుండి నీ ముఖము త్రిప్పు కొనవద్దు.

43. నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా;
లేవీయకాండము 19:18

44. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.
నిర్గమకాండము 23:4-5, సామెతలు 25:21-22

45. ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతి మంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.

46. మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినయెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును ఆలాగు చేయుచున్నారు గదా.

47. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారు గదా.

48. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.
లేవీయకాండము 19:2, ద్వితీయోపదేశకాండము 18:13బైబిల్ అధ్యయనం - Study Bible
5:1-2 ఆయన జనసమూహములను చూచి కొండయెక్కాడు, ఎందుకంటే ఒక పెద్ద గుంపుకు బోధించడానికి కొండప్రాంతం మెరుగైనదిగా ఆయన భావించాడు. కొత్త మోషేలా, దేవుని సందేశాన్ని ఆయన ఒక కొండకొనమీద ప్రకటించడం, పురాతన మోషేతో మరొక సమాంతరంగా ఉంది. కొండయెక్కి కూర్చుండగా అని అనువదించిన గ్రీకు పదాలు, గ్రీకు పా.ని.లో మూడుసార్లు ఉపయోగించబడ్డాయి (నిర్గమ 19:3; 24:18; 34:42), ఆ మూడుసార్లు అవి మోషే సీనాయి కొండ ఎక్కడాన్ని వర్ణించిన భాగాల్లోనే ఉంటాయి. మోషేకు, యేసుకు మధ్య సమాంతరాలు తీసుకురావాలనే మత్తయి అంశానికి ఇది సరిగ్గా సరిపోతుంది. ఉదాహరణకు, యేసు జననం, మోషే జనన సమయంలో ఉన్న అనేక సంఘటనలకు సమాంతరంగా ఉంది. బేల్లెహేము లోని మగపిల్లలను చంపమని ఆజ్ఞాపించడం ద్వారా (మత్తయి 2:16-18)
హేరోదు శిశువైన క్రీస్తును చంపడానికి ప్రయత్నించాడు. అలాగే ఫరో కూడా ఇశ్రాయేలీయులకు పుట్టిన మగ శిశువులను చంపించమని ఆజ్ఞాపించాడు (నిర్గమ 1:15-18,22). అంతేకాక, అపాయం తప్పిపోయిందని దేవదూత చెప్పడం (“శిశువును చంపగోరినవారు చనిపోయిరని” (మత్తయి 2:21)), “నీ ప్రాణమును వెదకిన మనుష్యులందరు చనిపోయిరి” అన్న నిర్గమ 4:19లోని మాటలకు స్పష్టమైన ప్రతిధ్వనిలా ఉంది. (మత్తయి 2:14-15 నోట్సు చూడండి). 

5:3 యేసుకు, మోషేకు మధ్య ఉన్న సంబంధాన్ని ఎత్తి చూపుతూ మత్తయి పర్వత ప్రసంగాన్ని పరిచయం చేస్తున్నందున, ధన్యతలను (మత్తయి 5:3-12) మోషే బోధనల నేపథ్యంలో మనం చదవాల్సి ఉంది. సెప్టువజింట్ (పా.ని. గ్రీకు తర్జుమా) “ధన్యత” (గ్రీకు "మకారియోస్") అనే విశేషణాన్ని 


మోషే మాటలలో అనువదించినది, అది అతడు ఇశ్రాయేలును ఆశీర్వదించిన ఒకే ఒక్క సందర్భం (ద్వితీ. 33:29). “ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది (నీ వెంత ధన్యుడవు లేదా నీవు ఎంత సంతోషం గలవాడవు). యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము. నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు. నీవు వారి ఉన్నత స్థలములను తొక్కుదువు.” ఇశ్రాయేలు ఆశీర్వాదానికి చారిత్రక దృష్టి, భవిష్యత్ దృష్టి రెండూ ఉన్నాయి. “యెహోవా రక్షించిన” అనేది ఐగుప్తునుండి ఇశ్రాయేలీయుల నిర్గమనాన్ని సూచిస్తుంది. మిగిలిన ఆశీర్వాదం, తాము వాగ్దానదేశాన్ని జయించడంలో విజయం పొందుతామని ఇశ్రాయేలీయులకు నిశ్చయతను ఇస్తుంది. ఈ నేపథ్యానికి విరుద్ధంగా, కొత్త మోషే ఆశీర్వాదాలు ఆయన (యేసు) శిష్యులను కొత్త నిర్గమనం, విజయాన్ని పొందబోయే కొత్త ఇశ్రాయేలుగా గుర్తిస్తుంది. ఈ కొత్త మోషే రాజకీయ విమోచకుడు కాదు, ఆయన వారి ఆధ్యాత్మిక విమోచకుడు, కాబట్టి ఆయన వాగ్దానాలను ఆ వెలుగులోనే అర్థం చేసుకోవాలి. ధన్యతలలో, కొత్త మోషే ఆత్మ రక్షణను (పాపపు దాస్యత్వం నుండి నిర్గమం) ప్రకటిస్తూ, కొత్త ఇశ్రాయేలుకు ఆధ్యాత్మిక విజయాన్ని వాగ్దానం చేస్తున్నాడు (కొత్త వాగ్దాన భూమిని జయించి స్వాధీనం చేసుకోవడం). ఇశ్రాయేలీయుల నిర్గమనానికి సంబంధించిన ఈ నేపథ్యం సాత్వికులు “భూమిని స్వతంత్రించుకొందురు” (5:5) అనే వాగ్దానం ద్వారా స్థాపించబడుతుంది.
ఆపా.ని.లో దీనులు అంటే సహాయానికై దేవునికి మొఱ్ఱపెట్టి, తమ అవసరాలకై ఆయనపై సంపూర్ణంగా ఆధారపడి, దీనమైన, నలిగిన ఆత్మను కలిగి, ఆయన దయాపూర్వక విమోచనను అనుభవించినవారు. (కీర్తన 86:1-5). ఈ నేపథ్యపు వెలుగులో యేసు తన శిష్యులను రక్షణకోసమై దేవుని కృపపై ఆధారపడిన అయోగ్యులైన పాపులుగా వర్ణిస్తున్నాడు. మత్తయి 5:4-9 లోని వాగ్దానాలు భవిష్యత్కాల పదాలలో చెప్పినా, పరలోకరాజ్యము వారిది అనే ధృవీకరణ ప్రస్తుతంలోనే ఉంది. (5:3,10). యేసు రాకద్వారా రాజ్యము ఇప్పటికే వచ్చిందని ఇది సూచిస్తుంది కానీ రాజ్యపు వాగ్దానాల నెరవేర్పు భవిష్యత్తులో మాత్రమే జరుగుతుంది. ఈ భవిష్యత్ నెరవేర్పు క్రీస్తు రెండవరాకడ కోసం ఎదురుచూస్తుంది. “పరలోక రాజ్యము వారిది” అనే వ్యాఖ్య, ధన్యతల ఆరంభం, ముగింపులో కనిపిస్తుంది (5:3,10). ఈ ధన్యతలు రాజ్యముకు చెందినవారికి మాత్రమే వర్తిస్తాయని ఈ శైలి సూచిస్తుంది. యెషయా 61:1లో మెస్సీయ బీదలకు సువార్తను తెస్తుందనే వాగ్దానం ఇచ్చింది. ఈ ధన్యత ఆ ప్రవచనానికి నెరవేర్పులా పనిచేస్తుంది (లూకా 4:16-21) 

5:4 ఈ ధన్యత కూడా యెషయా 61 పై ఆధారపడిందే: "...నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును... దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకును, సీయోనులో దుఃఖించువారికి ఉల్లాసవస్త్రములు ధరింపజేయుటకును, బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు” (వ.1-3). యెషయా 61 నేపథ్యం, వారి పాపములవల్ల చెరగొని పోబడుతున్నవారి కోసం ఇశ్రాయేలీయులు దుఃఖించడాన్ని 
 
చిత్రిస్తుంది. దీని వెలుగులో, తమ పాపఫలితాలను బట్టి శ్రమపడుతున్నవారి వేదనను మత్తయి 5:4 చూపిస్తుంది. అది వారి పశ్చాత్తాప వైఖరి

5.5 ముందున్న ధన్యతల్లాగా ఇది కూడా యెషయా 61 కి సమాంతరంగా ఉంది. ఆ యెషయా 61:7 (సెప్టువజింట్)లో “దేశములో... కర్తలగుదురు" అనే మత్తయి 5:5 లోని మాటలకు సమాంతరమైన మాటలు ఉపయోగించ బడ్డాయి. ఆ విధంగా, మొదటి మూడు ధన్యతలు యేసు యెషయా 61 లోని సేవకుడనే గుర్తింపును నిర్ధారిస్తున్నాయి. యెషయా 52:11-53:12 వచనాలు- పాపులు పొందాల్సిన - శిక్షను సేవకుడు సహిస్తున్నట్లుగా చూపిస్తున్నందున, ఈ గుర్తింపు యేసు మరణపు బల్యర్పణ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రాముఖ్యం (యెషయా 53:4; 42:1-4 సూచించే మత్తయి 8:17; 12:17-21 చూడండి). ఈ ధన్యత, పరిస్థితులు తమకు అర్థం కాకపోయినప్పటికీ, దేవునిలో నమ్మకముంచి ఆయన అధికారానికి అప్పగించుకున్న కీర్తన - 37:11లోని దీనులను ప్రతిబింబిస్తుంది. భూలోకమును స్వతంత్రించుకొందురు అనే మాట పా.ని.ను సూచిస్తూ, వాగ్దాన దేశమైన కనానును స్వతంత్రించుకోవడాన్ని చెబుతుంది. అలా యేసు మాటలను వినేవారిలో అనేకులు, ఆయన శిష్యులు నూతన ఇశ్రాయేలుగా అబ్రాహాముకు వాగ్దానం చేయబడిన దేశాన్ని స్వతంత్రించుకుంటారని గుర్తించారు. పర్వత ప్రసంగం నేపథ్యంలో, మత్తయి సువార్త అంతటిలోను, “భూమిని స్వతంత్రించుకొనుట” అనే మాట పాలస్తీనాలో నివసించడం అనే వాగ్దానంకంటే మించినది అనిపిస్తుంది. క్రీస్తు నిత్యము ఏలబోయే, పునఃసృష్టి చేసిన భూమిపై జీవించడాన్ని అది సూచిస్తుంది. భూమి నూతనపరచబడడం గూర్చి మత్తయి 19:28 చెబుతూ, నిత్యరాజ్యంలో వారు గొప్ప బహుమతులు పొందుతారని యేసు శిష్యులకు రూఢిపరుస్తున్నది.

5:6 ఆకలిదప్పులు అనేవి శిష్యుడు. నీతి కొరకై తీవ్రమైన వాంఛ కలిగివుండ డాన్ని సూచించే అలంకారపు మాటలు. వారు తృప్తి పరచబడుదురు అనే
మాటలలోని “బడు" ప్రయోగం నీతి అనేది శిష్యులు తమ సొంత ప్రయత్నాలతో సాధించేది కాదుగాని వారికి ఆపాదించబడేది అనే భావాన్నిస్తుంది. ఇక్కడున్న
క్రియాపదం, వ.4,6-7 లోని వాగ్దానాలలోవలె (వ.9 కూడా), దేవుడు చేసే కార్యంగా వర్ణించబడింది. శిష్యులు ఆకలి, దప్పికగొనే నీతిని ఆయన మాత్రమే వారికి ఆపాదించగలడు. పర్వత ప్రసంగంలోని వేదాంతాన్ని అర్థం చేసుకోవడానికి ఇది కీలకం, ఎందుకంటే యేసు తన శిష్యులను ఆజ్ఞలలో అల్పమైనవాటిని పాటించమనీ (వ. 19), వారి నీతి శాస్త్రులు, పరిసయ్యుల నీతిని అధిగమించాలనీ (వ.20), "మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా" ఉండాలని (వ.48) ఆశిస్తున్నాడు. ఇలాంటి మాటలను ఉపయోగించి, క్రియల ద్వారా నీతి సాధ్యం అనే తప్పుడు వేదాంతానికి ఆపాదించే ప్రమాదం ఉంది. కానీ యేసు మననుండి ఆశించే నీతి, నిజానికి ఆయన అనుచరులకు అనుగ్రహించబడే దైవికవరం. 

5:7 కనికరము గలవారు అంటే ఇతరుల పట్ల క్షమాపణ, దయగల ఆత్మతో వ్యవహరించేవారు (6:2-4; 18:21-35). కనికరం గలవారిపై దేవుడు కనికరం చూపుతాడు. ఆ 5:8 హృదయశుద్ధి అనే మాటలు, అంతరంగంలో యథార్ధమైన నీతిగలవారిని సూచిస్తున్నాయి. పరిసయ్యుల్లాగా నీతిమంతుల వలె వటించవచ్చు (23:25-28). నిజమైన పవిత్రత కోసం ఆకలిదప్పులు గలవానికి దేవుడు దానిని అనుగ్రహించినపుడే అది ఒనగూరుతుందని యేసు చెప్పాడు. యేసు మళ్లీ వచ్చినపుడు ఈ దైవికవాగ్దాన నెరవేర్పు సంపూర్ణమౌతుంది. కానీ ఆయన శిష్యులను అప్పటికే పవిత్రత పొందినవారిగా గుర్తించడం అనేది, ఈ జీవిత కాలంలోనే ఈ నాటకీయమైన రూపాంతరత జరుగుతుందని చూపిస్తుంది. యేసు శిష్యులు దేవుని చూచెదరు అనే వాగ్దానం, వారు దేవుణ్ణి ఆయన మహిమంతటితో చూసే కాలాన్ని సూచిస్తుంది. ఈ మాటలను వారికి దేవుని స్వభావంలోనికి ప్రత్యేకంగా చూచే అవకాశం ఉందనే విధంగా, లేక ఒక దర్శనానుభవానికి సంబంధించినదిగా అలంకారరీతిలో చెప్పినట్టు వ్యాఖ్యానించకూడదు. పాత మోషేకు కూడా లేని దేవుని సమీపించే అనుభవాన్ని కొత్త మోషే తన అనుచరులకు వాగ్దానం చేస్తున్నాడు (నిర్గమ 33:12-23)... 

5:9 సమాధానపరిచే పరిచర్య, సరైన సమయంలో క్షమాపణ చెప్పి, పగతీర్చుకోవడానికి ఏమాత్రం ఇష్టపడకుండా, బంధాలను పునరుద్దరించి, దీనత్వంతో సేవచేస్తూ, ఒకడు తన శత్రువులను ప్రేమించడం అనే విషయాలతో కూడినది. (వ.21-26,38-41,43-48), సమధానపరచువారు... దేవుని కుమారులనబడుదురు అనే వాగ్దానం, అధికారికంగా యేసు శిష్యులైనవారు, సమాధానపరిచే పరిచర్యను స్వీకరించి, దేవుని అనుకరించేవారుగా మారడం అని అర్థం కావచ్చు. అలా అంతిమ తీర్పులో వారు దేవుని కుమారులు (కుమార్తెలు)గా స్వీకరించబడతారు. 

5:10 తమ సత్రియలు గొప్ప త్యాగాన్ని కోరతాయని, అవి. సత్వర బహుమానాన్ని కాక బాధను ఇస్తాయి అని ఎరిగిన శిష్యులు వెంబడించే నీతి బహు శుద్ధమైనదిగా ఉంటుంది. పర్వత ప్రసంగం ఆశించే రాజ్యపునీతికి ఇది ఒక మంచి ఉదాహరణ. నీతి నిమిత్తమై శ్రమపడేవారిదే పరలోకరాజ్యం అని యేసు చెప్పాడు. గ్రీకులో, వారిది అనే మాటను, వాక్యానికి చివర ఉండాల్సిన దాని సాధారణ స్థానం నుండి, ముందుకు మార్చాడు. ఇలా చేయడం ఆ సర్వనామాన్ని ప్రత్యేకంగా నొక్కిచెబుతూ, ఆ రాజ్యం నీతికోసం శ్రమపడేవారిదనీ, అది కేవలం వారికే చెందుతుందనే భావాన్నిస్తుంది. హింసను తప్పించుకోవడానికే ఎల్లప్పుడూ ప్రయత్నించేవారు నిజమైన శిష్యులు కారు, వారికి రాజ్యంలో పాలుండదు. ఎందుకంటే నిజమైన శిష్యులు ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చినా యేసునే వెంబడిస్తారు (16:24-27). పరలోకరాజ్యము అనేది యేసు క్రీస్తు వ్యక్తిత్వం ద్వారా స్థాపించబడే దేవుని పరిపాలన. యేసు అధికారానికి లోబడడం ద్వారా, నీతికోసం హింసింపబడే వారు దేవుని పాలనలోని ప్రజలౌతారు. తన పరిచర్య కాలంలో యేసు ఈ రాజ్యాన్ని ఆరంభించాడు. కానీ అంత్యకాలంలో అది సంపూర్ణమౌతుంది. 

5:11-12 హింస మాటల రూపంలో, లేక దెబ్బల రూపంలో రావచ్చు అన్నట్లుగా యేసు మాటలు చూపుతున్నాయి. మాటల రూపంలో హింస అవమానాలు, నిందలతో ఉంటుంది. "హింస" అనే మాటలో భౌతికమైన హింస.. అంటే మత్తయి 5:39 వంటి చెంపదెబ్బలు ఉంటాయి. శిష్యత్వపు
వెల పరలోకములో - శిష్యులు అనుభవించే అపారమైన ఫలముతో సరిచేయబడుతుంది. యూదా నాయకులు పా.ని. ప్రవక్తలను తిరస్కరించి, తీవ్రంగా హింసించిరి. యేసు ఈ హింసను అనేకసార్లు ఖండించాడు (21:34-36; 23:29-37). ప్రవక్తలతో వ్యవహరించిన విధానంలోనే యేసు అనుచరులతో కూడా వ్యవహరించడం ద్వారా ఆ యూదులు తమకు తెలియకుండానే వారికి ప్రవక్తలయొక్క ఘనతను ఆపాదించినట్లయింది.

5:13 ఉప్పుతో చాలా ఉపయోగాలున్నాయి, కానీ పా.ని.లో అది తరచుగా శుద్దీకరణకు ప్రాతినిధ్యం (నిర్గమ 30:35; లేవీ 2:13; 2రాజులు 2:21; యెహె 16:4) వహిస్తుంది. లోకమునకు ఉప్పుగా, యేసు శిష్యులు చెడిపోయిన లోకాన్ని తమ నీతియుక్తమైన జీవితపు మాదిరి ద్వారా, సువార్త ప్రకటనద్వారా శుద్ధి చేస్తారు. అయితే కలుషితమైన ఉప్పు శుద్ధిచేయలేదు. నిస్సారమైతే అని అనువాదం చేసిన క్రియాపదం, బుద్దిహీనమైన, నీతిరహితమైన ప్రవర్తనను సూచిస్తుంది. అది శిష్యుడనని చెప్పుకుంటూ అవినీతి జీవితాన్ని జీవిస్తూ శుద్దీకరణను కాక సాశనాన్ని ప్రోత్సహిస్తున్నవానిని సూచిస్తుంది. అలాంటి ఉప్పు, మీరు మొక్కలను చంపాలనుకుంటున్న నేలమీద ఉప్పును పరచినట్లు పరచడానికి ఉపయోగపడుతుంది. అనీతిమంతుడైన శిష్యుని జీవిత విధానం అలాంటి మరణాంతకమైన ప్రభావాన్నే తెస్తుంది. వారు వెళ్ళినదగ్గర. ఏదీ పెరగదు. బయట పారవేయబడి అనే క్రియాపదం, పనికిరాని దానిని విసరివేయడాన్ని వర్ణిస్తుంది. అలాగే తొక్కబడుటకే అనే క్రియాపదం, అవినీతిపరుడైన శిష్యుడు లోకంనుండి పొందే తిరస్కారాన్ని కనపరుస్తుంది. 

5:14-16 మీరు లోకమునకు వెలుగైయున్నారు అనే మాటలు, యెహోవాసేవకుడైన మెస్సీయ పరిచర్యను వర్ణించే యెషయా 9:1-2; 42:6; 49:6 లోని మాటలను ప్రస్తావిస్తున్నట్లున్నాయి. యేసు శిష్యులు, భూదిగంతముల వరకు రక్షణను తీసుకువెళుతూ ఆయన పరిచర్యకు కొనసాగింపుగా ఉన్నారని ఇవి సూచిస్తున్నాయి. అట్టి పరిచర్య నిజమైన శిష్యత్వానికి స్వాభావికమైనది. వెలుగుతున్న పట్టణము చీకటిలో తన కాంతిని ఎలా దాచి పెట్టలేదో, అలాగే శిష్యుడు తన నీతిని లేక సువార్త సందేశాన్ని దాచిపెట్టకూడదు. అందరికీ వెలుగునివ్వడం అని పేర్కొనడం, క్రీస్తు పరిచర్య ప్రజలందరి కోసం
ఆ ఉద్దేశించబడిందని "లోకము"ను కలుపుతూ మత్తయి 28:18-20 లోని గొప్ప ఆజ్ఞను ముందుగానే ప్రస్తావిస్తుంది. తన సల్షియలకు అసలైన కర్త శిష్యుడు కాదని యేసు మాటలు స్పష్టం చేస్తున్నాయి. శిష్యుడు తన సత్రియలకు తానే కర్త అయితే, అతడు మెప్పును పొందడం న్యాయమే. అయితే, శిష్యుని సల్షియల ద్వారా పరలోకమందున్న తండ్రి మహిమపరచబడాలని యేసు బోధించాడు. ఎందుకంటే అలాంటి క్రియలకు ఆయనే మూలం (వ.6 నోట్సు చూడండి), దీనిని మనం పట్టించుకోకుండా ఉండకూడదు. పర్వత ప్రసంగం కోరిన నీతి, దేవుడు యేసు అనుచరులకు అనుగ్రహించే దైవిక వరం. 

5:17-20 తాను ధర్మశాస్త్రాన్ని ధిక్కరిస్తున్నాననే ఆరోపణలను (9:3,11,14; 12:2,10; 15:1-2; 17:24; 19:3; 22-34-36) ఖండిస్తూ, పూర్తి పా.ని. సారమైన ధర్మశాస్త్రమును, ప్రవక్తల మాటలను నెరవేర్చుటకే తాను వచ్చానని నొక్కి చెప్పాడు. "నెరవేర్చుట" అనే మాట పా.ని. ప్రవచనాల నెరవేర్పును సూచిస్తుండవచ్చు. (1:22; 2:15,17,23: 4:14; 8:17; 12:17; 13:35; 21:4; 26:54,56; 27:9), ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు అనే మాటలు దీనినే సూచిస్తాయి. అయితే అది దేవుని ఆజ్ఞలకు విధేయతను కూడా సూచిస్తుంది (3:15). "యీ యాజ్ఞలలో గైకొనుటను పేర్కొనడం ద్వారా ఈ అదనపు భావం గోచరిస్తుంది. తత్ఫలితంగా, యేసు పా.ని. వాగ్దానాలన్నీ నెరవేర్చి, దాని ఆజ్ఞలన్నిటికీ విధేయత చూపుతాడని ఆయన మాటలు సూచిస్తున్నాయి. హెబ్రీ భాషలోని అతి చిన్న అక్షరం (పొల్లు) "యోద్", ఇది అక్షరం తలమీద పెట్టే చిన్న గీతలాంటిది. యేసు మాటలు, ఆయన పా.ని.ను అతిచిన్న వివరంతో సహా ఖచ్చితమైనదని భావించాడని చూపుతున్నాయి. ఈ ఒప్పుదలను దృష్టిలో పెట్టుకునే, పా.ని. సాక్ష్యం పట్ల ఉన్న విశ్వసనీయతే దేవుని రాజ్యంలో ఒక శిష్యుని స్థాయిని నిర్ణయిస్తుందని యేసు నేర్పించాడు. దేవుని ఆజ్ఞలకు నిజమైన విశ్వసనీయత, శిష్యుని హృదయంలో దేవుని అద్భుతకార్యాన్ని బట్టి సాధ్యమౌతుంది. (వ.6 నోట్సు చూడండి).


5:21-22 మత్తయి 5:21, పర్వత ప్రసంగంలో “ఆరు ప్రతివాదాలు" అని సామాన్యంగా పిలిచే భాగాన్ని ఆరంభిస్తుంది. యేసు పా.ని.ను కొంతైనా వ్యతిరేకిస్తున్నాడు అన్నట్లు ఈ శీర్షిక కనిపిస్తుంది. గాని ఆయన ఎల్లప్పుడూ దాని అధికారాన్ని సమర్థించాడు. పా.ని. బోధలను ఖండించడం లేక తారుమారు చేయడం కాకుండా, తప్పుదారి పట్టించే శాస్త్రులు, పరిసయ్యుల వ్యాఖ్యానాలను యేసు వ్యతిరేకించాడు. వీరు కేవలం పైపై విషయాలకే ప్రాధాన్యతనిచ్చేవారు, కానీ యేసు లోతుగా చెప్పేవాడు. ధర్మశాస్త్రం కేవలం నిజమైన హత్యగురించే కాదుగాని హత్యా సాదృశ్యమైన వైఖరులను కూడా నిషేధిస్తుందని ఆయన వాదించాడు. అలాగే హింసాత్మక స్వభావాన్ని కూడా హింసాత్మక క్రియలతో సమానంగా ఖండించాడు.

5:23-24 ఒక సహోదరుడు లేక సహోదరికి నీమీద విరోధమేమైనను ఉంటే, అది ఎంత ముఖ్యమైన పనిని ఆటంకపరచినా సరే, సాధ్యమైనంత త్వరగా వారితో సమాధాన పడడానికి శిష్యులు ప్రయత్నించాలి. తనకాలంలో పరిస్థితులను బట్టి మాట్లాడుతూ, శిష్యులైనవారు యెరూషలేము మందిరంలో అర్హణ మధ్యలో ఆపాల్సివచ్చినా సరే, సమాధానపడడం ముఖ్యమని యేసు చెప్పాడు. ఆరోజుల్లో యేసు మాటలు వింటున్నవారు (యెరూషలేముకు దూరంగా నివసించేవారు) బలిపీఠముమీద తమ అర్పణ విడిచి పెట్టి, ఎన్నో రోజులు ప్రయాణం చేసి గలిలయకు వెళ్ళి, సమాధానపడి, తరువాత మరలా యూదయకు ప్రయాణం చేసి వచ్చి, అర్పణను పూర్తిచేయాలి అని చెప్పడం చాలా ప్రత్యేకం. ఎందుకంటే సమాధానపడడానికి అంత ప్రాధాన్యత ఉంది. 

5:25-26 న్యాయస్థానం బయట సమస్యకు పరిష్కారం కోసం ప్రయత్నిస్తే, న్యాయస్థానంలో కట్టాల్సినదానికన్నా తక్కువ జరిమానాతో సరిపోతుంది. సమాధానపడడం త్వరితంగా చేయాల్సిన పని. ఎందుకంటే ఎంతకాలం దాన్ని ఆపితే, అంత ఎక్కువ తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఇది చూపుతుంది. 

5:27-28 అక్రమసంబంధం పెట్టుకునే కోరికతో ఇతరులవైపు తేరిచూ డడం, హృదయములో చేసే వ్యభిచారము అని యేసు అన్నాడు. మోహపుటా లోచనలు, వ్యభిచారం చేసిన పాపపు పనితో సమానం అని దీని అర్థం కాదు. ధర్మశాస్త్రం వ్యభిచార కార్యాలను నిషేధించినట్లే, వ్యభిచారపు కోరికలను కూడా నిషేధించిందని దీని అర్థం. పాపం క్రియగా బయటపడడానికి ముందు ఆలోచనలలో ఆరంభమౌతుంది. కాబట్టి నిజమైన నీతి కేవలం వ్యభిచారపు క్రియలనే కాక వ్యభిచారపు ఆలోచనలను కూడా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది.


5:29-30 పాపాన్ని జయించడానికి స్వంత అవయవాలను నరుక్కోవడం సరైన మార్గం కాదు. ఎందుకంటే పాపం ఎముకలు, మాంసం నుండి కాక చెడిపోయిన హృదయం నుండి వస్తుంది కదా (15:19). శిష్యత్వానికి కావలసిన కీలకమైన వాటిని గూర్చి చెప్పేందుకు యేసు ఇక్కడ అతిశయోక్తి అలంకారాన్ని విషయం అర్థం కావడం కోసం కావాలని ఉన్నదాన్ని ఎక్కువ చేసి మాట్లాడటం), రూపకాన్ని (ఇందులో కన్ను మోహపు దృష్టికోణానికి తార్కాణం కాగా, చెయ్యి అనైతికమైన క్రియకు సూచన) ఉపయోగిస్తున్నాడు. శిష్యులైనవారు అనైతిక ఆలోచనలకు, ప్రవర్తనలకు ముగింపు పలకాలి.

5:31-32 ద్వితీ. 24:1 లోని అసలైన అర్థాన్ని చెరిపివేసి, రబ్బీలు ఆపాదించిన తేలికైన వ్యాఖ్యానాన్ని యేసు సవాలు చేశాడు. రబ్బీల చేతుల్లో ద్వితీ 24:1, విడాకులను సమర్ధించే అనేకమైన అభ్యంతరాలను పెంచేసింది. ఉదాహరణకు, ద్వితీ 24పై రబ్బీల వ్యాఖ్యానాల్లో, భార్య అందం తగ్గిపోవడం, లేక వంటలు మాడిపోవడం వంటి చిన్నచిన్న కారణాలు కూడా విడాకులకు న్యాయమైన ఆధారాలుగా చెప్పారు. అయితే వ్యభిచార కారణం మాత్రమే విడాకులకు న్యాయమైన ఆధారం అనే ద్వితీ 24:1 అసలు అర్థాన్ని యేసు నొక్కిచెప్పాడు. అల్పమైన కారణాలకు విడాకులు తీసుకుని పునర్వివాహం చేసుకునేవారు వ్యభిచార పాపం విషయమై అపరాధులౌతారు, ఎందుకంటే వారి అసలైన వివాహ నిబంధన యథార్థంగా తొలగించబడలేదు. 

5:33-37 ప్రమాణములు (అంటే “దేవుని మీద ఒట్టు") అనేవి చెల్లించాల్సిన విగా భావించేవారు, కానీ యూదులు దేవుని వ్యక్తిగత నామానికి బదులుగా గౌరవప్రదమైన ఇతర పేర్లను ఉపయోగించినందున, తెలివిగా అబద్దాలు చెప్పేవారు దేవుని పేరును బట్టి అన్నట్లుగా కనిపించే ప్రమాణాలు చేసేవారు, నిజానికి అవి లెక్కలోనికి వచ్చేవి కావు (23:16-22). ప్రమాణాలు చేయడం తప్పు, ఎందుకంటే ఆ ప్రమాణం నిలబెట్టుకోకపోతే, ఆ ప్రమాణం చేసిన వ్యక్తి లేక వస్తువు నాశనమయ్యే అవకాశం ఉంటుంది అని యేసు బోధించాడు. కాబట్టి ఆకాశము... భూమి ... యెరూషలేము తోడని లేక తన తల తోడని ఒట్టుపెట్టుకోవడం సరైనది కాదు. ఎందుకంటే దేవునికి మాత్రమే నాశనం చేసే అధికారం ఉన్నవాటిపై మనం అధికారం చెలాయించ కూడదు. దేవుని తోడని లేక ఆయనకు సంబంధించిన వాటి తోడని చెప్పడం, విశ్వపాలకునిగా ఉన్న దేవుని స్థానాన్ని కలిగి వున్నట్లుగా ప్రవర్తించిన దుష్టునితో మనలను సమానం చేస్తాయి. 

5:38-39 కంటికి కన్ను (నిర్గమ 21:24; లేవీ 24:20; ద్వితీ 19:21) అనేది వ్యక్తిగత ప్రతీకారం కోసం ఇచ్చినవి కాక సరైన శిక్షలు విధించడానికి న్యాయస్థానాలకు మార్గదర్శకంగా చెప్పిన మాటలని యేసు వివరించాడు.
నీ కుడిచెంపమీద కొట్టడం అంటే చేతిని వెనక్కి తిప్పి కొట్టడం, అది అవమానకరమైనదిగా, హానికరమైనదిగా భావించేవారు. దీనికి యూదుల ధర్మశాస్త్రంలో ఎడమచెంపపై అరచేతితో కొట్టినదానికి వేసే జరిమానాకు రెట్టింపు విధించేవారు. తన శిష్యులు అత్యంత అభ్యంతరకరమైన దెబ్బతిన్నప్పుడు కూడా ప్రతీకారం తీర్చుకోకూడదని యేసు తన శిష్యులను కోరాడు. దుష్టుని ఎదిరింపక అనే మాటలు, శారీరకంగా గొప్ప హాని చేస్తామని మనలను భయపెట్టినప్పటికీ మనల్ని మనం కాచుకోకూడదనీ లేక న్యాయం కోసం ప్రయత్నం చేయకూడదనీ సూచించడం లేదు. 

5:40 మొదటి శతాబ్దపు ఇశ్రాయేలులో చిన్న చిన్న చిలిపి వ్యాజ్యాలు అరుదుగా ఉండేవి. కాబట్టి ఇక్కడ వివరించిన వ్యాజ్యం వాది గెలిచే అవకాశాలు మెండుగా ఉన్న న్యాయమైన వ్యాజ్యం కావచ్చు. సాధారణంగా తమకు విరోధంగా తీర్పు వస్తే ప్రతివాదులు క్రుంగిపోయేవారు. అయితే చట్టపరమైన అవసరాలను దాటి, తమ ప్రతివాదులతో సమాధానపడాలని యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. యూదుల చట్టప్రకారం వాది. తన ప్రతివాదికి చెందిన లోపలి వస్త్రం, అంగీలను పొందే విధంగా దావా వేయడానికి అనుమతి ఉంది. అది ఉన్ని లేక నారతో తయారుచేసి, చీలమండల వరకు ఉండే చేతులున్న చొక్కాయివంటిది. ఇవి చాలా విలువైనవిగా ఉండి, తరచుగా వస్తుమార్పిడికి, వెల చెల్లించడానికి వాడేవారు. పైవస్త్రము పైన వేసుకునే లేక చుట్టుకునే వస్త్రం. అది మరింత అవసరమైన వస్త్రం. ఎందుకంటే అది వెచ్చదనాన్ని కలిగించి, పేదలకు దుప్పటిలాగా కూడా పనికి వచ్చేది. పా.ని.లోని నిర్గమ 22:26-27; ద్వితీ 24:12-13వంటి కొన్ని వాక్యభాగాల ఆధారంగా యూదుల చట్టప్రకారం, పైవస్త్రాన్ని తీసుకోకుండా న్యాయస్థానాలు అడ్డుకునేవి. పైవసం తీసుకుపోవడం మరీ తీవ్రమైన శిక్ష. ప్రతివాదితో సమాధానం కోసం, న్యాయస్థానాలు అడిగేదానికన్నా ఎక్కువ చేయమని యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. 


5:41 రోమా అధికారులు తమ బరువులను మోయడం లాంటి తక్కువస్థాయి పనులు చేయడానికి తమ పాలనకింద ఉన్న ప్రజలను బలవంతం చేసేవారు (27:32), ప్రజలు ఎక్కువగా వ్యతిరేకత చూపే ఈ విషయమే యేసు మనసులో ఉంది. సైనికులు చట్టప్రకారం ఒక నిచేత ఒక మైలు దూరం బరువు
మోయమని బలవంతం చేయవచ్చు అని చెప్పబడేది కానీ ఈ నియమాన్ని స్థిరపరచే లేఖనమేదీ లేదు. సాధారణంగా బరువు మోయడాన్ని ఒక మైలు దూరం వరకు మాత్రమే పరిమితం చేయడం ఇంగిత జ్ఞానానికి చెందింది; ఒక మైలు బరువు లాగేసరికి ప్రజలు అలసిపోయేవారు, దానికంటే ఎక్కువ లాగమని బలవంతం చేసే సైనికుల మీద ప్రజలు ఆగ్రహంతో తిరగబడే ప్రమాదం ఉండేది. దీనికి విరుద్ధంగా, యేసు తన శిష్యులు బాధ్యతగా మొదటి మైలు వెళ్ళడమే కాక ప్రేమ, సేవా ధర్మంతో, వారి అంచనాలకు మించి రెండవ మైలు కూడా వెళ్ళాలని అన్నాడు. 

5:42 ఈ పేరా అంతా ప్రతీకారానికి విరోధంగా యేసుచేసిన బోధకు అంకితం చేయబడినందున, బహుశా ఈ వచనం శిష్యులు తమ విరోధులకు అవసరమైన సమయంలో సహాయ నిరాకరణ చేసి ప్రతీకారం తీర్చుకోవడాన్ని నిషేధిస్తుంది. శత్రువుకు జీవితావసరాలు ఇవ్వడం ద్వారా, శిష్యులు, తెగిపోయిన బంధాలను పునరుద్ధరించుకోవచ్చు (రోమా 12:19-21)." 

5:43 నీ పొరుగువాని ప్రేమించి అనే మాటలు లేవీ 19:18లో కనిపిస్తాయి. అయితే నీ శత్రువును ద్వేషించమనే ఆజ్ఞ పా.ని. లో ఎక్కడా కనిపించదు.
యేసు సమకాలికుల్లో కొందరు, నీ పొరుగువాని ప్రేమించుము అనే మాట, "నీ పొరుగువాడు కానివానిని ద్వేషించు" అనే భావం కూడా ఇస్తుందని వాదించేవారని ఇది స్పష్టంచేస్తుంది. 

5:44-45 శత్రువులను ప్రేమించడం, తమను హింసించేవారి కోసంప్రార్థించడం అనేవి ఒకనిని దేవుని బిడ్డగా చేయలేవు. నీవు దేవుని బిడ్డవు కావాలంటే తిరిగి జన్మించాల్సిందే. అయితే యేసు పేర్కొన్న క్షమాపూర్వకమైన ప్రేమ, నీ పరలోక తండ్రి కుటుంబ పోలికను వెల్లడిచేసి తద్వారా నీ నిజమైన గుర్తింపుకు చిహ్నంగా ఉంటుంది. దేవుడు మంచివారిని, చెడ్డవారిని దీవించి, సూర్యుని... వర్షమును ఇస్తున్నాడు.

5:46-47 సుంకరులు తరచూ చట్టపరమైన పన్నుకంటె ఎక్కువగా వసూలు చేసి, తమ తోటి అణగారిన యూదులను బాధించి రోమీయులకు సేవచేయ డాన్ని బట్టి ప్రజలలో తృణీకారం పొందేవారు. మిమ్మును ప్రేమించేవారిని మాత్రమే ప్రేమిస్తే, అది సుంకరుల, అన్యజనుల ప్రవర్తననే ప్రతిబింబిస్తుంది గాని పరలోకతండ్రి స్వభావాన్ని ప్రతిబింబింపజేయదు అని యేసు నేర్పించాడు. 

5:48 బిడ్డకు వానికి జన్మనిచ్చిన తల్లిదండ్రుల పోకలు వచ్చినట్లే, ఆధ్యాత్మిక సంతానం తమ పరలోకపు తండ్రి పోలికలతో ఉంటారు. అందువల్ల యేసు శిష్యులు నైతిక పరిపూర్ణతను చూపించేవారుగా ఉండాలని ఆజ్ఞ ఇవ్వబడింది. ఈ వచనానికి, ప్రేమను గురించి యేసు బోధలకు (వ.43-47) మధ్య ఉన్న సన్నిహిత సంబంధం, షరతులు లేని ప్రేమ దేవుని అనుసరించేవారి జీవితంలో ఉండాల్సిన అత్యంత కీలకమైన దైవ స్వభావపు వ్యక్తీకరణగా సూచిస్తుంది. . , 

Shortcut Links
మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |