Matthew - మత్తయి సువార్త 3 | View All

1. ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి

2. పరలోకరాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను.

3. ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయు నొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడినవాడితడే.
యెషయా 40:3

4. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును, మొలచుట్టు తోలుదట్టియు ధరించుకొనువాడు; మిడతలును అడవి తేనెయు అతనికి ఆహారము.
2 రాజులు 1:8

5. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యొర్దాను నదీప్రాంతముల వారందరును, అతనియొద్దకు వచ్చి,

6. తమ పాపములు ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి.

7. అతడు పరిసయ్యులలోను, సద్దూకయ్యులలోను, అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు? మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి.

8. అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచ వద్దు;

9. దేవుడు ఈ రాళ్లవలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను.

10. ఇప్పుడే గొడ్డలి చెట్లవేరున ఉంచబడియున్నది గనుక మంచి ఫలము ఫలిం పని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును.

11. మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మ మిచ్చుచున్నాను; అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటె శక్తిమంతుడు; ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మలోను2 అగ్ని తోను మీకు బాప్తిస్మమిచ్చును.

12. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులోపోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను.

13. ఆ సమయమున యోహానుచేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయనుండి యొర్దాను దగ్గర నున్న అతనియొద్దకు వచ్చెను.

14. అందుకు యోహాను నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నాయొద్దకు వచ్చు చున్నావా? అని ఆయనను నివారింపజూచెను గాని

15. యేసుఇప్పటికి కానిమ్ము; నీతి యావత్తు ఈలాగు నెర వేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను.

16. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను.

17. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనానందించు చున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
ఆదికాండము 22:2, కీర్తనల గ్రంథము 2:7, యెషయా 42:1బైబిల్ అధ్యయనం - Study Bible
3:1 ఆ దినములయందు అంటే “అర్కెలాయు పరిపాలనలో” అని కాక, “యేసు నజరేతులో ఉన్న కాలంలో” అని అర్థం. అర్కెలాయు క్రీ.పూ. 4 నుండి క్రీ.శ. 6వరకు పరిపాలించాడు. కాబట్టి బాప్తిస్మమిచ్చు యోహాను అప్పటికింకా 12 సంవత్సరాల లోపు వయస్సు గలవానిగా తన పరిచర్య ఆరంభించి వుండే అవకాశం లేదు. “ఆ దినములలో” అని పా.ని.లో వాడినప్పుడు, అది తరచూ ప్రవచనాత్మక నెరవేర్పులను సూచించింది (యెషయా 10:20; ఆమోసు 9:11; జెఫన్యా 1:15; జెకర్యా 12:3-4). యేసు ద్వారా, మెస్సీయకు దూతగా ముందుగా వచ్చిన బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా దేవుని వాగ్దానాలు నెరవేరుతున్నాయని నొక్కి చెప్పడానికి మత్తయి నెరవేరిన ప్రవచనాలను పేర్కొంటూ ఆ రెండింటినీ కలపడానికి ఈ మాటను వాడి వుంటాడు. యోహాను పరిచర్య చేసిన ప్రాంతం (యూదయ అరణ్యము) ఏలీయా పరిచర్యచేసిన ప్రాంతాన్ని జప్తికి తెస్తున్నది (1రాజులు 17:3; 19:8-18; 2రాజులు 2:1-12). ఈ ఏలీయా మెస్సీయకు మార్గం సిద్ధపరచడానికి మరలా ప్రత్యక్షమౌతాడని యూదులు అనేకులు నమ్ముతారు (మత్తయి 17:10-13). యోహాను పరిచర్యను, సువార్త వృత్తాంతాలకు చాలా దగ్గరగా ఉన్నట్టుగా జోసీఫస్ వర్ణించాడు. 

3:2 యోహాను సందేశం మారుమనస్సు మీద, రానున్న పరలోక రాజ్యము మీద దృష్టి సారించింది. తన పరిచర్య ఆరంభం నుండి యేసు కూడా ఇదే విషయాన్ని నొక్కిచెప్పాడు (4:17 నోట్సు చూడండి). యేసు బోధలు, పని, వ్యక్తిత్వం ద్వారా దేవుడు జరిగించే పరిపాలననే రాజ్యము అని నిర్వచించవచ్చు. మారుమనస్సు కోసం పిలుపు అంటే మనం పాపపూరితమైన జీవితవిధానాలను విడిచి పెట్టి, పాపముల నిమిత్తం దుఃఖపడాలి.

3:3 యెషయా 40:3ను మత్తయి బాప్తిస్మమిచ్చే యోహానుకు ఆపాదించడం, అది యోహాను గురించి చెప్పినంతగానే యేసును గురించి కూడా మనకు చెబుతుంది. ఎందుకంటే దాని అసలు నేపథ్యంలో ఆ ప్రవచనం రానున్న ప్రభువు (అంటే దేవుడే) రాకకోసం మార్గాన్ని సిద్ధపరచేవాని గురించి చెబుతుంది. యేసు రాకను వర్ణించడానికి, ప్రభువు రాక గురించి చెప్పిన లేఖనాన్ని పేర్కొనడంలో, మత్తయి యేసును దైవమని ప్రకటించినట్లయింది. 

3:4 యోహాను వస్త్రము ఏలీయా వస్త్రం లాంటిదిగానే ఉంది. (2రాజులు 1:8). అతని పరిచర్య విధానం, జీవితశైలి కూడా ఏలీయా పరిచర్య విధానంలాగానే అతడు యూదయ అరణ్యంలో నివసించడం, అతని చిత్రమైన ఆహారపు అలవాట్లు, ఇశ్రాయేలీయులను మారుమనస్సు పొందడానికి పిలుపునివ్వడం, దుష్టుడైన రాజును అతని భార్యను ఎదుర్కొన్న విధానం అంతా ఏలీయా జీవితాన్ని పోలి ఉంది. ఈ సమాంతరాల ప్రాముఖ్యతను యేసు మత్తయి 11:14; 17:12-13లో వివరించాడు. 

3:5-6 అన్యమతాలనుండి యూదా మతానికి మారడానికి అన్యజనులు నీళ్ళలో మునగాలని యూదులు అడిగేవారు. అయితే యోహాను మారుమనస్సు పొందిన యూదులు కూడా బాప్తిస్మము పొందాలని చెప్పాడు. యూదులు అబ్రాహాము సంతానం అయినంత మాత్రాన (వ.7-9 నోట్సు చూడండి) వారు దేవునికి చెందినవారు కాదనే భావనను ఇది ధైర్యంగా చెప్పినట్లయింది. రానున్న రాజ్యంలో ప్రవేశించడానికి యూదా జాతివారు కూడా మిగిలినవారిలాగా మారుమనస్సు పొందాలి. మిగిలిన మతాలవలె, ఆచారపరంగా పదే పదే చేయాల్సిన శుద్ధీకరణల్లాగా కాక, యోహాను బాప్తిస్మం శాశ్వతమైన మారుమనస్సు, మార్పుచెందిన జీవితానికి చెందిన ఒకేసారి జరిగే సంఘటనగా కనిపిస్తుంది. 

3:7-9 మత్తయి 2:4లో క్రీస్తు పుట్టే స్థలాన్ని ప్రధాన యాజకులు, శాస్త్రులు గుర్తించారు. కానీ ఆయనను దర్శించడానికి ఏ ప్రయత్నమూ చేయలేదు. దానికి బదులు వారి దృష్టి ఈ లోకసంబంధమైన అధికారం మీదే ఉంది. ఈ ప్రతికూల దృక్కోణమే, యూదులను నడిపిస్తున్న యాజకులు, రాబోవు దేవుని ఉగ్రతనుండి పారిపోతున్న సర్పసంతానము (12:34; 23:33 చూడండి) అని యోహాను పిలిచేలా చేసింది. పరిసయ్యులు యూదుల మతంలోని అత్యంత ఎక్కువైన, అత్యంత ముఖ్యమైన వర్గం. వారు సమాజమందిరాన్ని అదుపుచేస్తూ, ప్రజలమీద గొప్ప అధికారం చెలాయించేవారు. సద్దూకయ్యులు ప్రధాన యాజకుల కుటుంబాల్లోని ఉన్నతవర్గీయులు. వారు దేవాలయం మీద ఆధిపత్యం కలిగి ఉండి, కేవలం పంచకాండాలను (పా.ని.లోని మొదటి ఐదుపుస్తకాలను) మాత్రమే ప్రామాణికమని ఎంచేవారు. రానున్న రాజ్యం దేవుని ప్రజలకు ఆశీర్వాదాలను, మారుమనస్సు పొందనివారికి శిక్షను తెస్తుందని యోహాను నొక్కి చెప్పాడు. పరిసయ్యులు, సద్దూకయ్యులకు తమ పాపాలను ఒప్పుకొనే ఉద్దేశం లేదని యోహానుకు తెలుసు. ఎందుకంటే అబ్రాహాము సంతానంగా పుట్టడమే తమను దేవుని ఉగ్రతనుండి తప్పిస్తుందనే హామీనిస్తుందని వారు భావించేవారు. “రానున్న ప్రపంచంలో ఇశ్రాయేలీయులంతా పాలు పొందుతారు” అని రాసి వున్న మిష్నాలో ఈ నమ్మకం ప్రతిబింబిస్తుంది. ఈ రాళ్ళవలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడు అన్న యోహాను మాటలలో, అరామిక్ భాషలో పదప్రయోగం ఉంది. “పిల్లలు" ("బెన్") అనే పదం “రాళ్ళు” (“ఏబెన్") అనే పదంవలెనే ఉంది. రాతికి అంతర్గత విలువేమీ లేదు. కానీ సర్వశక్తిగల దేవుడు తాను ఎంచుకుంటే పనికిరాని రాయిని తీసుకుని వ్యక్తిగా మార్చి, తన నిబంధనా ప్రజలో చేర్చగలడు (యెషయా 51:1-2). కాబట్టి, అబ్రహాము సంతానంగా పుట్టడంలో యూదులకు ఎలాంటి అతిశయకారణమూ లేదు. విశ్వసించే అన్యజనులు, దేవుని ప్రజగా మార్చబడతారనే మత్తయి సువార్తలోని ప్రాముఖ్యమైన అంశానికి యోహాను హెచ్చరిక ఒక ముంగుర్తుగా ఉంది. 

3:10 ఫలించని చెట్లను కొట్టివేయడానికి పండ్లతోట యజమాని గొడ్డలి ఎత్తినట్లే, “మారుమనస్సుకు తగిన ఫలములు - ఫలించని” (వ.8) వారిని దేవుడు శిక్షిస్తాడు. యోహాను, యేసు బోధల్లో ఫలములు, అద్భుతమైన అంతరంగ రూపాంతరం జరగడం వల్ల వచ్చిన సర్రియలను సూచిస్తాయి (7:15-20; 12:33; 13:23). తరువాత, అంజూరపు చెట్టును శపించడం, చెడ్డవారైన కాపులను గూర్చిన ఉపమానాలు, మంచి ఫలములు ఫలించకపోతే వచ్చే పరిణామాలను ఉదహరిస్తున్నాయి (21:18-22,33-43). 

3:11 యజమానుని చెప్పులు విప్పడం అనేది చాలా హీనమైన పని. తమ హెబ్రీ బానిసలచేత సైతం హెబ్రీ యజమానులు ఆ పని చేయించేవారు కారు. అయితే బానిసలు కూడా చేయని పనిని యేసుకోసం చేయడానికి తాను యోగ్యుడను కానని యోహాను తనను గూర్చి తాను చెప్పుకుంటు న్నాడు. యేసు తనకంటె శక్తిమంతుడు కాబట్టి, ఈ గొప్ప శక్తి, యోహాను బాప్తిస్మంకన్నా చాలా ఉన్నతమైన కొత్త బాప్తిస్మం ద్వారా బయల్పరచబడింది కాబట్టి యోహాను ఈ లోతైన దీనత్వాన్ని ప్రకటించాడు. యోహాను బాప్తిస్మం బహిరంగంగా వ్యక్తపరచిన మారుమనస్సు, కానీ అతని బాప్తిస్మం ఒక వ్యక్తి హృదయాన్ని మార్చగలిగేది కాదు. అయితే యేసు మారుమనస్సు పొందినవానికి పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇవ్వడం ద్వారా వానిని అంతరం గంలోనుండి రూపాంతరపరచి పరిశుద్ధపరుస్తాడు. మత్తయి 2:18లో మత్తయి పేర్కొన్న యిర్మీయా 31:15, అతని పాఠకులకు కొత్త నిబంధన గూర్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేయడానికి ఉద్దేశించబడి వుండవచ్చు (యిర్మీయా 31:31-34), పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని గూర్చి చెప్పడం, దేవుడు యెహె 36:27లో ప్రకటించిన “నా ఆత్మను మీయందుంచి, నా కట్టడలననుసరించువారినిగాను, నా విధులను గైకొనువారినిగాను మిమ్మును చేసెదను” అనే వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తుంది. పరిశుద్ధాత్మ చేసే ఈ కార్యం యేసు బాప్తిస్మం దగ్గర (3:16) మరలా ఎత్తి చూపబడుతుంది. యోహాను మార్చలేని విధంగా మానవ స్వభావాన్ని మార్చగలిగే శక్తి యేసుకు ఉంది. యేసు ప్రజలకు అగ్నితో బాప్తిస్మమిస్తాడు. అంటే మారుమనస్సు పొందని పాపులకు వచ్చే దైవిక శిక్షను ఇది చూపుతుంది. 

3:12 గింజలను గాలిలోకి ఎగురవేసి చెరగడానికి చేటను వాడతారు. పొట్టు అని పిలిచే గింజలపై పొర గాలికి ఎగిరిపోయి, బరువైన గింజలు కళ్ళములో పడతాయి. తరువాత పొట్టు అంతటినీ కూర్చి కాల్చివేస్తారు. ఈ విధంగా
యోహాను ఉపమానం రాబోయే ...దైవికతీర్పును, అంటే దేవుడు ప్రజలను శుభ్రం చేసి, క్రీస్తు అనుచరులను కాపాడి, మారుమనస్సు పొందనివారిని శిక్షకోసం సమకూర్చుతాడు అని వివరిస్తుంది. పొట్టు త్వరగా అంటుకుని కాలిపోతుంది అనే విషయం దైవిక తీర్పు తాత్కాలికమే అనే భావనను కలిగిస్తుందేమోనని తలంచి, మారుమనస్సు పొందని వారిపైకి వచ్చే అగ్ని ఎన్నటికీ ఆరిపోదని యోహాను స్పష్టం చేస్తున్నాడు. మారుమనస్సు పొందని పాపులపై దేవుని శిక్ష నిత్యము నిలిచి ఉంటుంది.

3:13 ఈ సమయం వరకు, యేసు, ఆయన కుటుంబం గలిలయలోని నజరేతులోనే నివసించేవారు అనేది స్పష్టం. 

3:14 యేసు ఔన్నత్యం తనకు తెలుసు కాబట్టి యోహాను ఆయనను నివారింపజూచెను. తాను సమ్మతించకపోవడం ద్వారా, తన వెనుక వచ్చువాడు యేసే అని యోహాను గుర్తించినట్టయింది (వ.11). తనకు యేసు ఇచ్చే ఆత్మ బాప్తిస్మము అవసరమని యోహానుకు తెలుసు, కానీ పాపం లేని
యేసు నీటి బాప్తిస్మాన్ని కోరడం తన మారుమనస్సును సూచించేందుకు కాదని కూడా అతడు అర్థం చేసుకున్నాడు.

3:15 బాప్తిస్మం అవసరమని యేసు వివరించాడు. ప్రవక్తల ఆజ్ఞలకు (యోహాను ప్రవక్తలందరిలో గొప్పవాడు, 11:9-13) విధేయత చూపడం, ప్రజల మధ్య దేవుని నీతి ఉద్దేశాన్ని గుర్తించడం ద్వారా యేసు తన తండ్రిని సంతోషపెట్టాలని ఆశపడ్డాడు. యోహాను బాప్తిస్మంలో ఆయన పాలుపొందడానికి నిరాకరిస్తే, యేసు నీతి యావత్తు... నెరవేర్చుట కోసం వచ్చినట్లుకాక, తిరుగుబాటు చేసినవానిగా కనిపించేవాడు.

3:16. ఆకాశము తెరవబడుట అనేది వినిపించిన స్వరము, దిగివచ్చిన ఆత్మ రెండూ ఆకాశమునుండి వచ్చినవి కాబట్టి దైవికమైనవని చూపుతుంది. ఆది 1:2లో పరిశుద్దాత్మ ప్రథమంగా నీళ్ళపై అల్లాడుచుండడాన్ని వర్ణిస్తున్నందువల్ల, మొదటి శతాబ్దపు యూదులు పావురమును ఆత్మకు సంబంధించినదిగా భావించేవారు. “అల్లాడుచుండెను” అని అనువదించబడిన హెబ్రీ క్రియాపదం, ఒక పక్షి తన రెక్కలను వేగంగా ఆడించడాన్ని కూడా వర్ణిస్తుంది. అందువల్ల ఖుమ్రాన్ గ్రంథపుచుట్టలతో పాటు, తాల్ముద్ కూడా ఆది 1:2లోని దేవుని ఆత్మను పావురముతో సంబంధింప చేస్తాయి. ఆ విధంగా, ఆత్మ దిగిరావడం ఆది 1ని సూచిస్తూ, యేసును ఆత్మతో బలపరచబడినవానిగా మాత్రమే కాక, కొత్త సృష్టిని తెచ్చేవానిగా గుర్తిస్తుంది (2 కొరింథీ 5:17; గలతీ 6:15). 

3:17 మత్తయిలో తండ్రి నేరుగా మాట్లాడింది రెండుసార్లే- ఇక్కడ యేసు బాప్తిస్మం దగ్గర, తరువాత రూపాంతరం దగ్గర. రెండు సందర్భాల్లోనూ ఆయన యేసును తన కుమారుడు అని గుర్తిస్తూ, తన ఆమోదాన్ని వ్యక్తం చేశాడు. (17:5 చూడండి). యేసు బాప్తిస్మం దగ్గర తండ్రి మాట్లాడిన మాటల్లో రెండు ప్రాముఖ్యమైన పా.ని. లేఖనాలు కలిసి ఉన్నాయి: కీర్తన 2:7; యెషయా 42:1. ఇశ్రాయేలులో రాజుల పట్టాభిషేకం సమయంలో పాడే పాట కీర్తన 2. ఈ వాక్యభాగాన్ని తండ్రి యేసుకు అన్వయించడం, ఆయనను భూమ్యంతముల వరకు రాజ్యమును విస్తరింపజేసి (కీర్తన 2:1-12), దైవిక అధికారంతో ఏలే దైవికరాజుగా గుర్తించినట్లయింది. యెషయా 42ను సూచించడం యేసును యెషయా 53:5లో, "మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను" అని వాగ్దాన పూర్వకంగా చెప్పబడిన సేవకుడైన మెస్సీయగా గుర్తిస్తుంది. యెషయా 42ను మత్తయి 12:18-21, యెషయా 53ను మత్తయి 8:17 స్పష్టంగా యేసుకు వర్తింపచేస్తాయి. ఈ పా.ని. నేపథ్యాన్ని మనస్సులో ఉంచుకొని, తండ్రి మాటలు యేసును రాజుగా, రక్షకునిగా గుర్తిస్తున్నాయని మనం చూస్తాం.

Shortcut Links
మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |