Ephesians - ఎఫెసీయులకు 2 | View All

1. మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను.

2. మీరు వాటిని చేయుచు, వాయు మండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పున మునుపు నడుచుకొంటిరి.

3. వారితో కలిసి మనమందరమును శరీరముయొక్కయు మనస్సుయొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి.

4. అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీస్తుతోకూడ బ్రదికించెను.

5. కృపచేత మీరు రక్షింపబడియున్నారు.

6. క్రీస్తుయేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచునిమిత్తము,

7. క్రీస్తుయేసునందు మనలను ఆయనతోకూడ లేపి, పరలోకమందు ఆయనతోకూడ కూర్చుండబెట్టెను.

8. మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.

9. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు.

10. మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము.

11. కాబట్టి మునుపు శరీరవిషయములో అన్యజనులైయుండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారిచేత సున్నతిలేనివారనబడిన మీరు

12. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును, వాగ్దాన నిబంధనలు లేని పరజనులును, నిరీక్షణలేనివారును, లోక మందు దేవుడులేనివారునైయుండి, క్రీస్తుకు దూరస్థులై యుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి.

13. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు.
యెషయా 52:7, యెషయా 57:19

14. ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుటచేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకముచేసెను.
యెషయా 9:6

15. ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి,
దానియేలు 12:3

16. తన సిలువవలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధానపరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు.

17. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను.
జెకర్యా 9:10, యెషయా 57:19

18. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రిసన్నిధికి చేరగలిగియున్నాము.

19. కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునై యున్నారు.

20. క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.
యెషయా 28:16

21. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధిపొందుచున్నది.

22. ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమై యుండుటకు కట్టబడుచున్నారు.బైబిల్ అధ్యయనం - Study Bible
2:1-6 ఈ వచనాల్లో పౌలు అంశం వ.1-3 లోని మానవ స్థితికీ, వ.4-6 లోని నూతన జీవితానికి ఉన్న వైరుధ్యాన్ని వివరించడం. 
పాత జీవితం (వ.1-3) కొత్త జీవితం (వ.4-6) 
ఒకప్పుడు మృతులం ఇప్పుడు సజీవులం 
ఒకప్పుడు దాసులం ఇప్పుడు సింహాసనాసీనులం 
ఒకప్పుడు ఉగ్రతకు పాత్రులం ఇప్పుడు కృపకు పాత్రులం 
అవిధేయుల మధ్య సంచరించేవాళ్ళం క్రీస్తుతో సహవసిస్తున్నాం 
సాతాను అధికారం కింద ఉండేవారం క్రీస్తుతో ఏకమై ఉన్నాం

2:1 అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారై: క్రీస్తుకు వేరుగా ప్రజల ఆధ్యాత్మిక జీవితానికి ఒక ప్రామాణికత ఉండదు. ఈ స్థితిలో మానవ వ్యక్తిత్వంలోని కీలకమైన భాగం చచ్చిపోయి ఉంది; కాబట్టి ప్రజలు తమ స్వంత ప్రయత్నాల వల్లా, తెలివితేటల వల్లా దేవునితో సహవాసాన్ని అనుభవించలేరు లేక ఆయన షరతులను నెరవేర్చలేరు. 

2:2 యీ ప్రపంచధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి: "ఈ ప్రపంచం” సాతాను పాలనకు సంబంధించింది. క్రీస్తు లేని జీవితం, సాతాను మారాల ననుసరించి ఉంటుంది.

2:3 మనమందరమును శరీరము యొక్కయు... కోరికలను నెరవేర్చుకొనుచు: "నెరవేర్చుకొనుచు” అంటే వెనక్కీ ముందుకూ ఊగిసలాడుతూ, కొన్ని నిర్దిష్టమైన సూత్రాల ప్రకారం నడుచుకోవడం అని అర్థం. క్రీస్తుకు వేరుగా ప్రజలు. “శరీరాశల"చే నియంత్రించ బడ్డారు. అంటే దేవునికి దూరంగా స్వార్థప్రయోజనాల కోసం తిరిగారు. దీని బహువచన రూపం క్రీస్తు లేని మన జీవితంలోని విమోచించబడని అసంఖ్యాకమైన కోరికలను సూచిస్తుంది. విమోచన పొందని వ్యక్తి, పూర్తిగా స్వప్రయోజనమైన కోరికల క్రూర ప్రేరణల చేత అణచబడతాడు. స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులము: దేవుణ్ణి తిరస్కరించి, ఆయన నుండి ముఖం తిప్పుకున్న ఆది 3 అధ్యా. లోని పతనం, కేవలం నైతిక పతనం కాదు. పాపం ప్రవేశించడం మానవాళి అంతటికీ పాపస్వభావాన్ని తెచ్చింది. స్త్రీ పురుషులు “స్వభావసిద్ధముగా” దేవునికి విరోధులై, ఆయన నుండి వేరైపోయారు. మనుషులు నైతిక స్వేచ్ఛకు ప్రతినిధులుగా జీవిస్తుండగా పాపం ఎల్లప్పుడూ మానవ నిర్ణయాలు, క్రియలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దైవికమైన ప్రేరణ లేకపోతే ప్రజలు యథార్థంగా పశ్చాత్తాపం పొందడం లేక దేవుని వైపు తిరగడం సాధ్యం కాదు (ఎఫెసీ 2:5). 

2:4-5 అయినను దేవుడు: మానవుడు దేవుణ్ణి తిరస్కరించిన దానికి వ్యతిరేకంగా క్రీస్తును బట్టి దేవుడు పాపులను తన కృపతో అంగీకరించడంలో వెల్లడైన నూతన జీవం గురించి పౌలు చిత్రీకరించాడు. ఈ బలమైన వైరుధ్యం ప్రజల భయానకమైన పరిస్థితికి దేవుడిచ్చిన జవాబును ఎత్తి చూపుతుంది. కరుణాసంపన్నుడై: "కరుణ" అనేది నిస్సహాయుల పరిస్థితులను బాగుచేయడానికి దేవుడు వారిపై చూపిన దయ. కృప అంటే పొందడానికి యోగ్యత లేని విశ్వాసులకు దేవుడు అనుగ్రహించడం అయితే, కరుణ అంటే వారు పొందవలసిన దానిని వారికి ఇవ్వకుండా ఉండడం. మనము... చచ్చినవారమై యుండినప్పుడు... బ్రతికించెను అనేది వ.1లోని పౌలు ఆలోచనలకు కొనసాగింపు. వీటిని విమోచనా చరిత్ర యొక్క సింహావలోకన దృక్పధంలో చూశాడు. దేవుని గొప్ప ప్రేమ కారణంగా ఆయన మనలను క్రీస్తుతో “బ్రతికించెను". 

2:6-7 ఆయనతో కూడ దేవుని కరుణ నూతన జీవితాన్ని సాధ్యపరచడమే కాక, దాని ద్వారా దేవుడు మనలను బ్రతికించి, లేపి క్రీస్తుతో మనలను కూర్చుండబెట్టి- పునరుత్థానుడైన క్రీస్తు దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడినట్లు, దేవుని గొప్ప శక్తి మనల్ని కూడా పరలోకంలో క్రీస్తుతో సింహాసనంపై కూర్చుండబెట్టింది. 

2:7-10 ఈ వచనాల్లో సమాధానపరచడం - అనే కార్యాన్ని నాలుగు కీలకమైన పదాలతో వర్ణించాడు.

(1) ఉపకారము మృదువైన దేవుని ప్రేమపూర్వక చర్య 
(2) కృప ఏమాత్రం అర్హత లేని ప్రజలపట్ల దేవుని ఉచిత కటాక్షం (పౌలుకిష్టమైన ఈ పదం అతని పత్రికలలో వందసార్లకు పైగా వాడబడింది). 
(3) విశ్వాసం మనల్ని రిక్తహస్తాలతో దేవుని వద్దకు తెచ్చే సాధనం (రోమా 10:12 చూడండి) 
(4) రక్షించబడితిమి పాపక్షమాపణ, వ. 1-3 లో వర్ణించబడిన దుస్థితి నుండి విడుదల, స్వాతంత్ర్యం, పునరుత్థానాలతో కూడిన కొత్త జీవితం 

2:7 స్త్రీ పురుషుల రక్షణ దైవకృపకు ఒక ప్రదర్శనం. దీనంతటినీ దేవుడు
క్రీస్తులో ఒక ఏకైక లక్ష్యంతో చేశాడు. తన కృపా మహదైశ్వర్యమును... కనుపరచు నిమిత్తము, అంటే తన దైవకృపను మానవులు, దేవదూతలతో సహా చరిత్ర అంతటిలో కనపరచడానికి చేశాడు (1 పేతురు 1:10-12). 

2:8-9 రక్షణ కార్యం దేవుని మహిమ కోసమే గాని మానవక్రియల ద్వారా దానిని సాధించలేము. రక్షణ ప్రక్రియ అంతటిలో మానవుడు సాధించిందేమీ లేదు, అది దేవుని దయాపూర్వక కార్యమే. ఇక్కడ దృష్టి అంతా విశ్వాస పరిమాణం మీద కాదు, ఎల్లప్పుడూ విశ్వాసానికి ఆధారమైన క్రీస్తు పైనే ఉంచాలి. రక్షణ పూర్తిగా అయోగ్యులకు దేవుడిచ్చే కృప ద్వారానే సాధ్యం. గ్రీకులో కూడా విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు అనే మాటల వ్యాకరణ నిర్మాణం, ఇది... దేవుని వరమే అనే మాటలకు పూర్వపదంగా వచ్చింది. "రక్షణలో దేవుని పాత్ర కృప అయితే, మన పాత్ర విశ్వాసం" అని చెప్పడానికి లేదు. ఎందుకంటే రక్షణ "అంతా" పూర్తిగా దేవుని వరమే. సమాధానపరచబడడం అనేది మీ వలన కలిగినది కాదు, మీ క్రియలవలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు. ఇది విశ్వాసిలో ఏమాత్రం స్వాతిశయం లేకుండా చేస్తుంది. రక్షణను ఇచ్చేది దేవుడు మాత్రమే. 

2:10 సర్రియలు చేయుటకై... క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై: రక్షణ కార్యం దేవుని చేతిపనికి ఒక ప్రదర్శన లాంటిది. సత్కియలు మన రక్షణకు - ఫలమే "గాని, అవి మన రక్షణ కారకాలు కావు. అంతేకాక, సర్రియలు దేవుని ప్రణాళికలో అనుకోకుండా వచ్చినవి కావు. తద్విరుద్ధంగా అవి ప్రతి విశ్వాసి విమోచన ప్రణాళికలో ఆవశ్యకమైన భాగాలు. సత్రియలు మన కృతజ్ఞత, వ్యక్తిత్వం, క్రియల ద్వారా వెల్లడిచేయబడతాయి.

2:11-22 పౌలు పత్రికలోని ఈ భాగం దీని పాఠకుల మూడు స్థితులను స్పృశిస్తుంది: (1) క్రీస్తుకు వేరుగా వారి గత జీవితం (వ.11-13), (2) క్రీస్తులో వారు సామూహికంగా పొందిన సమాధానం (వ.14-18), (3) దేవుని కొత్త మానవాళిలో సభ్యులుగా వారి నూతన స్థాయి (వ. 19-22). ఈ వాక్యభాగపు ముఖ్యాంశం సమాధానపరచడం- అంటే పతనమై బహిష్పతులైన మానవాళిని దేవునితో సమాధాన స్థితిలోకి తేవడం. పాపం మూలంగా తెగిపోయి, విచ్చిన్నమైన స్థితిని సమాధానపరచేవానిగా యేసు బాగుచేసి దేవునికి, ప్రజలకు మధ్య సహవాసాన్ని పునరుద్ధరించాడు. సమాధాపరచడం అంటే ప్రజలు క్రమ క్రమంగా దేవుని అంగీకారాన్ని పొందేలా చేసే ఒక ప్రక్రియ కాదు. దేవునితో గతంలో వేరైపోయిన మానవులు విడుదల పొంది విశ్వాసులుగా ఆయన సహవాసంలోనికి రావడం అనే ఒక నిర్ణయాత్మక క్రియ (ఉదా. ఒక చట్టబద్ధమైన తీర్పు). 

2:11-12 శరీర విషయములో అన్యజనులు: అన్యజనులు నైతికంగా దేవునికి దూరమవ్వడమే కాక (వ.1-3) వారు దేవుని నిబంధన జనుల నుండి కూడా వేరుగా ఉన్నవారు. వారికి క్రీస్తును గురించిన జ్ఞానం ఏ మాత్రం లేదు. వారికి దేవుని కుటుంబంలో ఏ హక్కులూ లేవు, వారు దేవుని నిబంధనలు పొందినవారు కారు. వారు నిరీక్షణ లేనివారుగా, చివరికి దేవుడు లేనివారుగా ఉన్నారు. ఇక్కడ పౌలు వారి దుస్థితిని బట్టి అన్యజనులను గర్షించడం లేదు. వారి విషాదకరమైన పరిస్థితిని నివేదించాడంతే. 

2:13 అయినను... క్రీస్తు యేసునందు అనే బలమైన మాటలతో పౌలు క్రీస్తులో అన్యజనుల కొత్త సంబంధాన్ని చూపుతున్నాడు. విశ్వాసులైన అన్యజనులు ఇక వేరైపోయిన స్థితిలో లేరు. వారు క్రీస్తును ఎరిగి, దేవుని నిబంధనా ఆశీర్వాదాలలో పాలుపొంది, నిరీక్షణ పొందినవారై దేవుని
సహవాసంలోకి వచ్చారు. ఈ అద్భుతమైన మార్పు “క్రీస్తుయేసులో " జరిగింది. ఆయన యందు విశ్వాసముంచిన వారికి ప్రస్తుతం రక్షణ, భవిష్యత్తును గురించిన నిరీక్షణ ఉన్నాయి. 

2:14-16 ఉభయులను ఏకము చేసెను. ఈ వచనాలు అన్యజనులను, యూదులను ఒకచోటికి తేవడంలోనే కాక వారిని దేవునికి దగ్గరగా తేవడంలో యేసు క్రీస్తు ఆవశ్యకతను నొక్కి చెబుతున్నాయి. క్రీస్తు మన సమాధానము, మన సమాధానకర్త కూడా. సిలువపై ఆయన సమాధానపరచే మరణం, యూదులను, అన్యజనులను ఏకం చేసింది. అన్యజనులు యూదులుగా మారరు, కానీ జాతిపరంగా కంటే మరింత లోతుగా క్రీస్తు సంఘంగా ఏర్పడటంలో వారు ఏకమయ్యారు. కొత్త మానవాళి పాత మానవాళికంటే గొప్పది. దేవుడు విరోధం అనే మధ్యగోడను పడగొట్టి ద్వేషాన్ని ఎన్నటికీ లేకుండా తీసివేశాడు. “మధ్యగోడ" అనే మాటలు రాసినప్పుడు యెరూషలేము దేవాలయంలో అన్యజనుల ఆవరణాన్ని వేరు చేసే గోడ పౌలు మనసులో ఉండి వుండవచ్చు. దేవాలయం ఎత్తు చేయబడిన చోట కట్టారు. దాని చుట్టూ యాజకుల ఆవరణం ఉంది. దీనికి తూర్పుగా ఇశ్రాయేలీయుల ఆవరణం ఉంది. దానికి ఇంకా తూర్పుగా స్త్రీల ఆవరణం ఉంది. ఈ మూడు ఆవరణలు దేవాలయం ఉన్నంత ఎత్తులోనే ఉన్నాయి. దాని నుండి ఐదుమెట్ల దూరంలో గోడ కట్టి, ఎత్తుచేయబడిన ప్రాంతం ఉంది. పధ్నాలుగు మెట్ల అవతల మరొక గోడ ఉంది, అదే అన్యజనుల బయటి ఆవరణం. ఈ గోడ మీద దేవాలయం చుట్టూ ఉన్న గోడ దాటి లోపలికి ప్రవేశిస్తే మరణం తప్పదని అన్యజనులకు ఒక హెచ్చరిక రాసి ఉంటుంది. క్రీస్తులో ఈ మధ్య గోడ పడగొట్టబడి, అన్యజనులు యూదుల ధర్మశాస్త్రాన్ని పాటించరనే కారణం చేత వారిని యూదుల నుండి అన్యజనులను వేరు చేసిన నిర్దిష్టమైన ఆజ్ఞలు కొట్టివేయబడ్డాయి. సిలువపై ఉన్న మన ప్రభువు శరీరంలో ఆ ఆజ్ఞల భారం తొలగించ బడింది. 

2:16 వీరిద్దరినీ... దేవునితో సమాధానపరచవలెనని: ఈ మాటల్లో "సమాధానం" అనే ఆలోచన కొనసాగుతుండగా, ఐక్యతను పునరుద్ధరించడం అనే ఆలోచన దానికి కలపబడింది. దీని లక్ష్యం రెండు గుంపులను కలపడం మాత్రమే కాదు, వారిద్దరినీ దేవునితో సమాధానపరచడం. ఏక శరీరము అంటే కొత్త మానవాళి, సంఘం, సమాధాన స్థలం. అనైక్యతకు కారణమైనవన్నీ సిలువలో నాశనం చేయబడ్డాయి. 

2:17 దూరస్థులు... సమీపస్థులు అనే మాటలు యెషయా 57:19 నుండి తీసుకోబడి అన్యజనులు, యూదులను సూచిస్తున్నాయి. 

2:18 తండ్రి సన్నిధికి చేరగలిగి అనే స్థితి క్రీస్తు దగ్గరకు వచ్చిన వారందరికీ అందుబాటులో ఉంది. రాజు సన్నిధికి సందర్శకులను నడిపించే అధికారులను పోలిన దృశ్యంగా దీనిని ఊహించవచ్చు. క్రీస్తు సమాధానపరచు పరిచర్య ద్వారా మనం దేవుని సన్నిధిలోకి ప్రవేశించగలం. 

2:19 పరదేశులు అంటే కొద్దికాలం ఉండి వెళ్ళిపోయేవారు, ఏ హక్కులూ లేని తాత్కాలిక నివాసులు. పరజనులు అనేది కూడా అలాంటి మాటే కానీ ఇది వారి ఇష్ట ప్రకారం శాశ్వతంగా స్థిరపడి, పరిమితమైన హక్కులతో నివాసమున్న పరదేశులను సూచిస్తుంది. ఈ మాటలు క్రీస్తు రాక ముందు అన్యజనుల స్థానాన్ని వర్ణిస్తున్నాయి. ఏక పట్టణస్థులును దేవుని యింటివారు అనే మాటలు అన్యజనుల కొత్త స్థానాన్ని చూపుతున్నాయి. ఇప్పుడు వారు దేవుని యింటివారి ఆధిక్యతలన్నీ పొందుతారు. “యింటివారు” అనే మాటలు వారు కలసి వుండడాన్ని, కలిసిపోవడాన్ని వర్ణిస్తుంది. విశ్వాసులు దేవుని కుటుంబం లోనికి దత్తత పొంది, -వర్తమాన, భూత, భవిష్యత్తులో ప్రతి తరంలోని పరిశుద్ధులతో ఐక్యపరచబడ్డారు. 

2:20 దేవుని కొత్త కుటుంబం కొత్త దేశం మాత్రమే కాదు, విశిష్టమైన పునాదితో కూడిన కొత్త భవనం. క్రీస్తుతో విశిష్టమైన అనుబంధంలో ఉన్న అపొస్తలులు, ప్రవక్తలు సంఘానికి మాదిరిగా ఇచ్చిన అధికారపూర్వకమైన బోధలే పునాది. ఆ పునాదికి మూలరాయి క్రీస్తే అని పౌలు ప్రకటించాడు.
ఈ “మూలరాయి” కట్టడాన్నంతటినీ పట్టి ఉంచుతుంది. పురాతన కట్టడాలలో దానిని రెండు గోడలు కలిసే చోట సమకోణంలో ఉంచేవారు. దానిపై ఆ కట్టడాన్ని నిలబెట్టడానికి కారణమైన నాయకుని పేరును చెక్కి రాజముద్ర వేసేవారు. 

2:21 "ప్రభువైన యేసు క్రీస్తును మూలరాయిగా కలిగిన యోగ్యత చేత సార్వత్రిక సంఘం దేవునికి నివాసంగా ఉండే పరిశుద్ధమైన దేవాలయంగా కట్టబడే ప్రక్రియలో ఉంది. అమర్చబడి అనే నకర్మక క్రియ, ఇది. మనవల్ల జరిగేది కాక, దేవుడు తానే చేస్తున్నాడని సూచిస్తుంది" (పీటర్ టి. ఓట్రైన్, దలెటర్ టు ద ఎఫీషియన్స్). 

2:22 మీరు కూడా... కట్టబడుచున్నారు. నిర్మాణంలో ఉన్న ఒక కట్టడపు వర్ణనను "వృద్ధిపొందుచున్నది” (వ.21) అనే మాట సూచిస్తుంది. ఇది విస్తరణ అనే ప్రక్రియలో ఉన్న ఒక చురుకైన సంఘాన్ని తెలియజేస్తుంది. క్రీస్తుతో ఐక్యమవ్వడమనే ముఖ్యాంశాన్ని ఈ అధ్యాయం ముగింపులో పౌలు మళ్ళీ ప్రస్తావించాడు. దేవుని నివాసం యెరూషలేము మందిరంలో కాక విశ్వాసుల సమాజంలో నివసించే పరిశుద్దాత్మ శక్తి ద్వారా సంఘంలో ఉందని పౌలు ప్రకటించాడు. 


Shortcut Links
ఎఫెసీయులకు - Ephesians : 1 | 2 | 3 | 4 | 5 | 6 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |