గ్రంథకర్త : హగ్గయి
హగ్గయి కాలము : క్రీ.పూ 538లో పారశీక రాజైన కోరెషు - యూదులు తమ స్వదేశమునకు తిరిగి వెళ్ల వలెననియు, యెరూషలేములోని దేవాలయమును పునర్నిర్మాణము గావించవలెననియు ఆజ్ఞాపించెను. స్వదేశమునకు వచ్చిన మొదటి గుంపు ప్రజలకు జెరుబ్బాబెలు నాయకుడుగా నుండెను. క్రీ.పూ 536లో దేవాలయ నిర్మాణము ప్రారంభమాయెను. ఎజ్రా 4 నుండి 6 అధ్యాయములు - హగ్గయి ప్రవచన కాలమును వివరించుచున్నవి. అక్కడ జీవించుచుండిన సమరయులు దేవాలయ నిర్మాణమును నిలిపివేయవలెనని కోరుచు పారసీక రాజ్యమునకు లేఖ వ్రాసియుండిరి.
ఈ ఆటంకములను చూచి యూదులు అధికముగా నిరుత్సాహపడిరి. స్వదేశమునకు తిరిగి వచ్చుచు వారికి ఉన్న మంచి విశ్వాసము సడలెను. దేశములోనున్న శిథిలస్థితి, పంటలు లేకపోవుట, పునర్నిర్మాణమునకు జెందిన కఠినమైన పని, సమరయుల ఆటంకములు వారి మనస్సులను బహుగా నిరుత్సాహపరచెను. విదేశీయులతో పోరాడుట కంటే, దేవాలయ నిర్మాణమును నిలిపి వేయుటయే మంచిదని వారికి తోచెను. ఈ విధముగా రెండు సంవత్సరములు జరిగిన తరువాత క్రీ.పూ 534లో వారు దేవాలయ నిర్మాణమును నిలిపివేసిరి. జనులలోని మానసిక నిరుత్సాహము వారిని ఆత్మీయముగా వెనుకంజ వేయించుకొనుటలోను నిమగ్నులైరి. వారి అవసరములకు ఇండ్లు కట్టుటకు మొదటి స్థానమిచ్చిరి. దేవాలయ విషయములో అశ్రద్ధచూపుటకు వారు పలు సాకులు వెదకసాగిరి. రాజకీయముగా ఎదురైన ఆటంకము, యెరూషలేము ప్రాకారమును కట్టకముందు దేవాలయమును నిర్మించకూడదను ఆలోచన మున్నగునవి వారు చూపుచున్న కొన్ని సాకులు.
ఇట్టి సమయములో దేవాలయ నిర్మాణమును పూర్తి చేయవలెనని ప్రజలను ప్రోత్సహించుటకును, వారిలో నూతనోత్సాహమును పుట్టింపవలెననియు, దేవుడు ప్రవక్తలైన హగ్గయిని, జెకర్యాను లేపాడు. ఈ రెండు గ్రంథములు వ్రాయబడిన కాలములను ఆ గ్రంథముల పుటల నుండియే తెలిసికొనగలము. హగ్గయి గ్రంథము క్రీ.పూ 520లోను, జెకర్యా గ్రంథము క్రీ.పూ 519 - 518 లో వ్రాయబడి యుండును. ఈ ప్రవచనముల ఫలితముగా - 14 సంవత్సర కాలము నిర్లక్ష్యము చేయబడిన దేవాలయ నిర్మాణము క్రీ.పూ 520లో మరల ప్రారంభింపబడి క్రీ.పూ 516లో ముగింపబడినది.
హగ్గయి జెకర్యాలు ప్రవచించిన కాలములో క్రీ. పూ521 - 486 మొదటి దర్యావేషు రాజు పారశీక రాజ్యమును పాలించుచుండెను. ఈతని పై విరోధముగా లేచిన అనేక దేశములను జయించి యూదా దేశమును బలపరచి రాజ్యపాలన గావించెను.
ముఖ్య పదజాలము : దేవాలయమును నూతనముగా నిర్మించుట
ముఖ్యవచనములు: హగ్గయి 1:7-8; హగ్గయి 2:7-9.
ముఖ్య అధ్యాయము- 2
పరిశుద్ధ గ్రంథములోనున్న వాగ్దానములలోని మనలను బలముగా ఆకర్షించి, నిలువబెట్టి యోచింపజేయగల కొన్ని వాగ్దానములను హగ్గయి 2:6-9 లో చూడగలము.
గ్రంథ విభజన : ఉపదేశ పూర్వకమైన హగ్గయి ప్రవచన గ్రంథమును నాలుగు ముఖ్య భాగములుగా విభజింప వచ్చును.
- దేవాలయ నిర్మాణమును పూర్తి చేయుట కొరకు ఉపదేశము : హగ్గయి 1:1-15.
2.దేవాలయము - దాని పూర్వ వైభవము హగ్గయి 2:1-9.
3.లోబడిన వెంటనే కలుగు ఆశీర్వాదములు హగ్గయి 2:10-19
4.భవిష్యత్తులో ఆశీర్వాదముల నిత్తునను వాగ్దానము హగ్గయి 2:20-23.
సంఖ్యా వివరములు: పరిశుద్ధ బైబిలులో ఇది 37వ పుస్తకము ; అధ్యాయములు 2; వచనములు 38; ప్రశ్నలు 8; ఆజ్ఞలు 9; వాగ్దానములు 3; ముందు జాగ్రత్తలుగా హెచ్చరికలు 14; ప్రవచన వాక్యములు 9; నెరవేరినవి 6; నెరవేరనున్నవి 3; దేవుని యొద్ద నుండి వచ్చిన ప్రత్యేక వర్తమానములు 5.