2:1-2 బహుశా యేసు నతనయేలుని కలుసుకున్నప్పటి నుండి లెక్కిస్తే మూడవ దినము అవుతుంది. గలిలయలోని కానాలోనే తరువాతి కాలంలో యేసు రెండవ సూచక క్రియను చేశాడు. (“రెండవ సూచక క్రియ"ను కానాలో చేశాడు; 4:54). యూదుల పెళ్లి కార్యక్రమాల్లో వారి సమాజమంతా పాల్గొంటుంది; ఇటువంటి సమయాల్లో కేవలం వధూవరులపైనే కాకుండా వారి విస్తరించిన కుటుంబాలపై కూడా ప్రత్యేకమైన దృష్టి సారించడం జరుగుతుంది. యేసు తల్లి ఆ పెళ్లివారి కుటుంబస్టులకు స్నేహితురాలిగా, వారికి తెరవెనుక నుండి సహాయం చేస్తుండవచ్చు. 1:35-51 లో తెలిపిన ఐదుగురు యేసు శిష్యులు గుంపులో ఉండి ఉండవచ్చు.
2:3 పెళ్లి విందులో ద్రాక్షారసము అయిపోయిందనేది వ్యంగ్యంగా మొదటి శతాబ్దపు యూదా మతం ఆధ్యాత్మికంగా బీటలు వారిన స్థితిని గుర్తు చేస్తుంది.
2:4 నాతో నీకేమి పని? అని ఆయన అడిగిన ప్రశ్న ఆయన తన “తండ్రి పనుల" (లూకా 2:49) మీద కలిగియున్న శ్రద్దను గుర్తుచేస్తుంది. యేసు
సమయము ఇంకా రాలేదు అన్న మాటల గురించి, 7:6,8,30; 8:20 చూడండి. రాబోయే మెస్సీయ గురించి ఉన్న అపోహల కారణంగా యేసు తానెవరనేది బహిరంగంగా ఇశ్రాయేలుకి వెల్లడించకూడదని నిర్ణయించుకున్నాడు (ఆయనే
మెస్సీయ అని సూచించే సూచక క్రియలు అనేకం చేసినప్పటికీ; 2:11 నోట్సు చూడండి). యేసు అప్పుడప్పుడు వెనుకకు తగ్గిన తీరు (7:6-9; 10:40-41; 11:56-57), ప్రజల నిజమైన ఉద్దేశాల గురించిన వాస్తవాలు ఆయనకి తెలిసుండడం (2:23-25), ఆయన శత్రువులు దేవదూషణ చేస్తున్నాడన్న కారణాన్ని బట్టి ఆయనను అప్పగించాలని చూసినప్పుడు వారి నుండి తప్పించుకోగలగడం (7:44; 8:59; 10:39), వీటన్నింటి ద్వారా యోహాను యేసుని ఒక “అంతుచిక్కని క్రీస్తు”గా చిత్రీకరించాడు. చివరికి తన సమయం వచ్చేంతవరకు యేసు మరుగుగానే ఉండిపోయాడు (12:23,27;13:1;16:32;17:1).
2:5 ఆయన మీతో చెప్పునది చేయుడి అని మరియ ఆదేశించడం, ఆది 41:55 లోని ఫరో ఆదేశాలను గుర్తు చేస్తుంది.
2:6 ఏడు సంపూర్ణతను సూచిస్తుంది కాబట్టి. బానల సంఖ్య (ఆరు) అసంపూర్ణతను సూచిస్తూ ఉండవచ్చు. రెండేసి మూడేసి తూములు పట్టు బానలు మొత్తంగా ఎక్కువలో ఎక్కువ పద్దెనిమిది తూములు పట్టే సామర్థ్యం కలిగినవి. యూదుల శుద్ధీకరణ ఆచారంలో అతిథులు చేతులు కడుక్కోవడం, పెళ్ళికి ఉపయోగించే పాత్రలను శుభ్రం చేయడం లాంటివి చేస్తుండవచ్చు.
2:7 వాటిని అంచులమట్టుకు నింపిరి అనేది యేసు మెస్సీయగా అనుగ్రహించే సదుపాయాల సమృద్ధిని సూచిస్తుంది (3:34).
2:8-9 భోజనాలకు సంబంధించినంత వరకూ విందు ప్రధాని బాధ్యత వహించేవాడు. అతడు అనేకమంది పనివారిని నియమించి వారు ఆహారాన్ని పానీయాలను వడ్డిస్తున్న తీరును పర్యవేక్షించేవాడు. ... 2:10 యోహాను యేసుని కేవలం- అద్భుతంగా ద్రాక్షారసాన్ని తయారు చేసినవానిగా మాత్రమే కాకుండా మంచి శ్రేష్ఠమైన ద్రాక్షారసాన్ని తయారు చేసినవానిగా చూపించాడు.
2:11 గలిలయలోని కానాలో యేసు ఒక పెళ్ళిలో నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. దీనిని మొదటి సూచక క్రియగా చెప్పడం అనేది పాఠకులు ఆయన మరిన్ని సూచక క్రియలు చేయబోతున్నాడని ఊహించేలా చేస్తుంది.
ఈ సూచక క్రియలకు సంబంధించి 4:54 లో యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచక క్రియ అని చెప్పడం జరిగింది. యేసు మళ్ళీ కానా వచ్చి ప్రధాని కుమారుడిని స్వస్థపరచడమే రెండవ సూచక క్రియ. ఇవి మాత్రమే కాకుండా అద్భుతపరంగా కానప్పటికీ యేసు దేవాలయంలోని వ్యాపారులను తోలివేయడం ప్రవచన నెరవేర్పుగా జరిగింది. (2:13-22; యేసు యూదయలో చేసిన సూచక క్రియలలో ఒకటి; వ.23; 3:2), ఒక కుంటివానిని స్వస్థపరచడం (5:1-15), జన సమూహాలకు భోజనం పెట్టడం (6:1-15), పుట్టు గుడ్డివాడైన ఒక మనిషిని స్వస్థపరచడం (అధ్యా. 9), లాజరును తిరిగి బ్రతికించడం (అధ్యా. 11) వంటి సూచక క్రియలు చేశాడు. ప్రతి సందర్భంలో యేసు తన మెస్సీయ స్వభావాన్ని బయలుపరిచే విధంగా (12:37-40; 20:30-31) సూచక క్రియలు చేసిన విధానాన్ని అసాధారణ కార్యాల యొక్క అద్భుతమైన స్వభావాన్ని నొక్కి చెప్పడం జరిగింది. యేసు పెద్ద మొత్తంలో సృష్టించిన శ్రేష్ఠమైన ద్రాక్షారసమైనా (2:6, 10), తక్కువ వ్యవధిలోనే దేవాలయాన్ని తిరిగి కట్టడమైనా (వ. 19-20), చాలా దూర ప్రాంతం నుండే ప్రధాని కుమారుని స్వస్థపరచడమైనా (4:47,49-50), ముప్పయి ఎనిమిది సంవత్సరాలు కుంటివానిగా ఉన్నవాని విషయంలో జరిగినదైనా (5:5), యేసు సృష్టించిన సమృద్ధియైన ఆహారమైనా (6:13), పుట్టు గుడ్డివాని విషయంలో జరిగినదైనా (9:1-2), నాలుగు రోజుల పాటు సమాధిలో ఉండిన లాజరు విషయంలో జరిగినదైనా (11:17,39), ఈ సూచక క్రియలన్నీ నిశ్చయంగా యేసే మెస్సీయ అని సూచిస్తున్నాయి. యేసు... తన మహిమను బయలుపరచెను, అందువలన ఆయన శిష్యులు ఆయనయందు విశ్వాసముంచిరి అన్న మాటలు 1:14 వ వచనాన్ని సూచిస్తున్నాయి.
2:12 యేసు కానా (కొండ ప్రాంతం) నుండి కపెర్నహూముకి (గలిలయ సముద్రం దగ్గర) వెళ్లినట్లు రాయబడింది. కానాకి ఈశాన్యం వైపు పదిహేను మైళ్ళ దూరంలో కపెర్నహూము ఉంటుంది. ఒక రోజంతా ప్రయాణం చేస్తే చేరుకోవచ్చు. బాప్తిస్మమిచ్చే యోహాను ఖైదు చేయబడిన తరువాత యేసు కార్యకలాపాలన్నింటికీ కపెర్నహూము కేంద్రంగా ఉంది (మత్తయి 4:12-13; లూకా 4:28-31; మత్తయి 9:1).
2:13-22 పస్కా పండుగ దినాల్లో యెరూషలేము - దేవాలయం నుండి వ్యాపారులను తోలివేయడంతో యేసుకి యూదు నాయకులకి మధ్య ఘర్షణ జరిగింది. యోహాను సువార్తలో నమోదు చేసిన ఇటువంటి ప్రధాన ఘర్షణల్లో ఇది మొదటిది. సిలువ వేయబడటానికి ముందు మరోసారి దేవాలయం నుండి వ్యాపారులను ఖాళీ చేయించడాన్ని మూడు సమదృక్పథ సువార్తలు కూడా నమోదు చేశాయి (మార్కు 11:15-19), దేవాలయాన్ని ఖాళీ చేయించడంలో దేవుని ఇంటి పట్ల యేసు అమితమైన ఆసక్తిని కనపరిచాడు (యోహాను 2:17; కీర్తన 69:9), ఆరాధనను వ్యాపారంగా దిగజార్చడాన్ని యూదు నాయకులు అనుమతించారు. వారి పైకి వచ్చే తీర్పును సూచించే ఈ క్రియను యేసు చేశాడు. ఆయన చేసిన ఈ పని ప్రవచనాత్మకంగా తన సిలువ కార్యాన్ని పునరుత్థానాన్ని ముందుగానే సూచిస్తుంది, తద్వారా పాత దేవాలయానికి బదులుగా ఆయననే కొత్త ఆరాధనా విధానానికి కేంద్రంగా స్థాపించింది.
2:13 యోహాను సువార్తలో యూదుల పండుగ గురించి ప్రస్తావించిన మొదటి వచనమిది. అలాగే పస్కా పండుగ గురించి ఈ సువార్తలో ఇదే మొదటి ప్రస్తావన. తర్వాతి అధ్యాయాల్లో మరో రెండు పస్కాల గురించి యోహాను ప్రస్తావిస్తాడు, 6:4 (గలిలయలో యేసు), 11:55; 12:1 (యెరూషలేములో యేసుని చివరి పస్కా). ఇదిగాక యోహాను నమోదు చెయ్యని మరో పస్కా గురించే మత్తయి 12:1 లో ప్రస్తావించబడి ఉండవచ్చు. ఇదే నిజమైతే క్రీ.శ.29 నుండి 33 వరకూ మూడున్నర సంవత్సరాల పాటు సాగిన యేసు పరిచర్య కాలమంతటిలో నాలుగు పస్కాలు జరిగాయి (యోహాను 1:28 చూడండి). ఈ పస్కా పండుగలలో మాత్రమే కాకుండా 5:1 లో పేరు ప్రస్తావించబడని యూదుల పండుగలోనూ (బహుశా గుడారాలు), పర్ణశాలల పండుగలోనూ (లేదా 7:2 లో గుడారాలు), 10:22 లోని ఆలయ ప్రతిష్ఠ పండుగలోనూ (లేదా హనుక్కా) యేసు పాల్గొన్న సంగతుల గురించి యోహాను ప్రస్తావించాడు. గలిలయ కంటే యెరూషలేము ఎత్తైన ప్రదేశంలో ఉన్నందున ప్రజలు అక్కడికి ఎక్కి వెళ్లినట్లుగా వివరించబడింది.
2:14 బలులు అర్పించడం కోసం సరైన జంతువులనూ అర్పణల కోసం సరైన నాణేలనూ అందించడం ద్వారా దూరప్రాంతాల నుండి యెరూషలేముకు ప్రయాణించే యాత్రికులకు ప్రయాణ భారాన్ని తగ్గించేవారు. ఈ పనులన్నీ చెయ్యడం కోసం వ్యాపారులు (ఎడ్లను గొట్టెలను పావురములను అమ్మువారు), “రూకలు మార్చువారు” (అన్యదేవతల రూపాలు చెక్కి ఉన్న మలినమైన నాణేలను తీసుకొని వాటికి బదులుగా ఎటువంటి విగ్రహ రూపాలు లేని నాణేలను ఇచ్చేవారు) ఉండేవారు. వీరు దేవాలయంలోనే వారి వ్యాపారాలు చేసుకోవడం వల్ల ఆరాధనకు అంతరాయం కలుగుతూ ఉండేది (ముఖ్యంగా అన్యజనులకు). అలాగే “దేవాలయం" ఉద్దేశం నెరవేరకుండా అడ్డుకున్నవారయ్యారు.
2:17 యేసు దేవాలయం నుండి వ్యాపారులను తోలివేయడం అనేది శిష్యులకు కీర్తన 69:9 లో నీతిమంతుడైయుండి శ్రమననుభవించు వానిని గుర్తుచేసింది. మొదటి శతాబ్దపు యూదులు మెస్సీయ దేవాలయాన్ని ప్రక్షాళన చేసి పునరుద్ధరిస్తాడని అనుకున్నారు. అయితే యేసు దేవుని “ఇంటి” పవిత్రత, పరిశుద్ధతల గురించి ఎక్కువ ఆసక్తిని కనపరిచాడు.
2:20 ఈ దేవాలయము నలువదియారు సంవత్సరములు కట్టిరే అన్న మాటలు రెండవసారి మందిరాన్ని పునర్నిర్మించడానికి నలభై ఆరు సంవత్సరాలు పట్టిందని సూచిస్తున్నాయి. దీన్ని ఇలా కూడా చదవొచ్చు: “నలభై ఆరు సంవత్సరాల క్రితమే ఈ ఆలయ నిర్మాణం పూర్తయ్యింది (ఆనాటినుండి స్థిరంగా నిలబడి ఉంది). అసాధ్యం అనిపించేంత అతి తక్కువ సమయంలో అంటే మూడు దినములలో దానిని లేపుదునని యేసు చేసిన ప్రకటనకు యూదులు ఆశ్చర్యపోయారు. వారు అపార్థం చేసుకున్న ఈ విషయం గురించి వ.21 లో స్పష్టత ఇవ్వబడింది.
2:22 లేఖనము అంటే కీర్తన 69:9 అయ్యుండొచ్చు (యోహాను 2:17 లో ప్రస్తావించారు). యేసు చెప్పిన మాట అనేది 19వ వచనాన్ని సూచిస్తుంది.
2:23-25 ఆదిమ గ్రీకు భాషలో విశ్వాసముంచిరి... తన్ను వారి వశము చేసికొనలేదు అనే పదాలను నైపుణ్యంతో ప్రయోగించడం జరిగింది. నీకొదేమునీ సమరయ స్త్రీని కలిసినప్పుడు జరిగిన సంభాషణలలో యేసు ప్రజల హృదయాల గురించి తనకున్న జ్ఞానాన్ని కనపరిచాడు; వ.4 నోట్సు చూడండి.