లేవీయకాండము


  • Author: Sajeeva Vahini
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini

ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశమును విడిచి సాగిపొమ్మని దేవుడు వారికి ఆజ్ఞాపించిన తరువాత, విడుదల పొందిన ఆ జనులను దేవునిలో కేంక్రరింపబడే ఒక జనసమూహముగా చేయుట అవశ్యకమై యున్నది. వారిని ఎల్లప్పుడు సేవించు ప్రజలుగా ఆయన నియమించెను. ఈ విధముగా వారు దేవుని ఎలా సేవించాలి? ఎలా ఆరాధించాలి? ఆయనకు లోబడి ఎలా జీవించాలి? అని మోషే ద్వారా యెహోవా దేవుడు ఆజ్ఞలను వివరించి చెప్పెను. ఈ ఆజ్ఞల సంపుటియే లేవీయకాండము. ఈ ఆజ్ఞలను గైకొనుటయే దీని యొక్క ప్రాముఖ్యాంశము. ఇశ్రాయేలీలు ప్రజలకు అనగా తన జనులకు దేవుడు దయచేసిన ఒక చరిత్రాత్మిక పుస్తకమే ఈ లేవీయకాండము.

     ఒక యూదబాలుడు తన జీవితములో మొట్టమొదటిగా నేర్చుకొనవలసిన పుస్తకమే ఈ లేవీయకాండము. ఇందులోనున్న ఒక్కొక్క దృశ్యభాగము రాబోవు కాలములో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు చేయదలచిన మానవాళి రక్షణ కొరకైన కార్యమును వ్రేలెత్తి చూపిస్తున్నది. ఆదికాండము, నిర్గమకాండము, లేవీయకాండమను ఈ మూడు పుస్తకములు మానవుని క్రమశిక్షణ, దైవికమైన మూడు పద్ధతులను వివరించుచున్నవి. ఆదికాండములో - నశించిపోయెడి మానవుని గురించి, నిర్గమకాండములో - రక్షింపబడిన మానవుడు, లేవీయకాండములో - ఆరాధించునట్టియు, గైకొనునట్టియునైన మానవుని గురించి మనము చూడగలము.

ఉద్దేశ్యము : యాజకులకు ఆరాధన సంబంధమైన కర్తవ్యములు, హెబ్రీయులకు పరిశుద్ధ జీవితమును జీవించు మార్గములను నిర్దేసిస్తున్నది.

గ్రంథకర్త : మోషే

కాలము : క్రీ.పూ 1446 – 1445

గతచరిత్ర : సీనాయి పర్వతము. ఇశ్రాయేలు జనాంగము ఏవిధముగా ఒక పరిశుద్ధమైన ప్రజలుగా జీవితమును జీవించుటను గురించి దేవుడు వారికి నేర్పించిన విధము.

ప్రాముఖ్యమైన వచనములు : లేవీయకాండము 19:2; 17 11; 20 7-8.

ప్రాముఖ్యులు : మోషే, అహరోను, నాదాబు, ఎలియాజరు, ఈతామారు.

ముఖ్యస్థలములు : సీనాయి పర్వతము.

గ్రంథ విశిష్టత : పరిశుద్ధతను గురించి ఏ పుస్తకములో లేని విధముగా ఈ పుస్తకమందు అతిపరిశుద్ధతను గురించి 152 సార్లు చెప్పబడినది. పాత నిబంధన గ్రంథకాలములో వేరే దేశములతో ఉన్న నియమ నిబంధనలతో పోల్చి చూచినట్లయితే దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞల యొక్క సత్య విలువను గ్రహించగలము. ప్రత్యక్ష సాక్ష్యముగా నిర్గమకాండము 20వ అధ్యాయములో చూడగలము. “దొంగిలింపబడిన దాని విషయం" అనే ఆజ్ఞను గమనించినట్లయితే దొంగ దొంగిలింపబడిన వస్తువును బట్టి శిక్షింపవలెనన్న నియమము నియమించెను. ఒకవేళ వాడు పరిహారము చెల్లించలేకపోయినట్లయితే వానిని చంపవలెనన్న నియమములేదు. అయినప్పటికి 300 సంవత్సరములకు ముందు కాలములో జీవించిన బబులోను రాజైన హమ్మురాబ్బుని చట్ట ప్రకారము దొంగ దొంగిలింపబడిన వస్తువు యొక్క విలువను అచ్చుకొనవలయును, లేనియెడల వానిని చంపవలెనన్న నియమము కలదు. నేరస్థుని స్థానము ఏదైనప్పటికిని ఆ నేరస్థునికి ఒకే శిక్ష విధింపవలెను, “ అదే కంటికి కన్ను పంటికి పన్ను చెల్లింపవలెను” ఇదే ఈ ఆజ్ఞయొక్క పరమార్ధం. (లేవీయకాండము 24:20) విదేశీయులు (పరదేశి) చేసినట్లు పక్షపాతము లేక తీర్పు తీర్చవలెను, లేనట్లయితే దేవుడు వారికి కఠిన శిక్ష విధించును. దేవుని శాసనములో అనాధలకు, గ్రుడ్డివారికి, బీదలకు, చెవిటివారికి, సంరక్షణ కలదు. దేవుని దృష్టిలో ధనికుని సమృద్ధిలో నుండి పొందే అవకాశము వీరికి కలదు. స్వంతగా జీవించలేని బీదల (వారి కాళ్ళమీద వారు నిలబడలేని వారి) యెడల దేవుడు అక్కర కలిగియున్నాడు. లేవీయకాండము 19:9; లేవీయకాండము 19:13-14; లేవీయకాండము 15:32-37 పొరుగు వారితో నీవు నడవవలసిన విధులు వారి అక్కరలలో వారిని పరామర్శించు విధానమును గూర్చిన హెచ్చరికలు : నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను (లేవీయకాండము 19:18) అనే ఆజ్ఞనువారికి వివరించెను.

గ్రంథ విభజన : 1. అనేక ఆజ్ఞల వివరములు 1 - 17 అధ్యాయములు, 2. పరిశుద్ధతకై అనుసరించవలసిన ఆజ్ఞలు 18 - 27 అధ్యాయములు వీటి యందు మొదటి భాగములో దేవుని జనాంగము పాటించవలసిన ఐదు రకములైన బలులు వాటి యొక్క వివరములు, రెండవ భాగము నందు వారందులో చేయదగిన, పాటించదగిన విశ్రాంతి దినమును, సంవత్సరమంతయు ఆచరింపవలసిన ఏడుపండుగలను గురించిన వివరములు మనము చూడగలము.

కొన్ని సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో మూడవ గ్రంథము; అధ్యాయములు 27; వచనములు 859 ; ప్రశ్నలు 3 ; నెరవేరిన ప్రవచనములు 58 ; నెరవేరని ప్రవచనములు 6; చరిత్రాత్మిక వచనములు 799;  ఆజ్ఞలు 795 ; వాగ్దానములు 26 ; హెచ్చరికలు 125; దేవుని యొద్ద నుండి ప్రాముఖ్యమైన అంశములు 35.

లేవీయకాండములో ప్రాముఖ్యమైన వచనములు : లేవీయకాండము 17:11; లేవీయకాండము 20:7-8

ముఖ్యాంశములను పొదిగించిన అధ్యాయము : 16 వ అధ్యాయము.