Ephesians - ఎఫెసీయులకు 4 | View All

1. కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,

2. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,

3. ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను.

4. శరీర మొక్కటే, ఆత్మయు ఒక్కడే; ఆ ప్రకారమే మీ పిలుపువిషయమై యొక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి.

5. ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తిస్మ మొక్కటే,

6. అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలోఉన్నాడు.

7. అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణముచొప్పున కృప యియ్యబడెను.

8. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, చెరను చెరగా పట్టుకొనిపోయి మనష్యులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడియున్నది.
కీర్తనల గ్రంథము 68:18

9. ఆరోహణమాయెననగా ఆయన భూమియొక్క క్రింది భాగములకు దిగెననియు అర్థమిచ్చు చున్నదిగదా.
కీర్తనల గ్రంథము 47:5

10. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలము లన్నిటికంటె మరి పైకి ఆరోహణమైన వాడునై యున్నాడు.

11. మనమందరము విశ్వాసవిషయములోను దేవుని కుమారునిగూర్చిన జ్ఞానవిషయములోను ఏకత్వముపొంది సంపూర్ణపురుషులమగువరకు,

12. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమించెను.

13. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను.

14. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయో పాయములచేత వంచనతోను, తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడినవారమైనట్లుండక

15. ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము.

16. ఆయన శిరస్సయి యున్నాడు, ఆయననుండి సర్వశరీరము చక్కగా అమర్చ బడి, తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలువలన గలిగిన బలముచేత అతుకబడి, ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసికొనుచున్నది.

17. కాబట్టి అన్యజనులు నడుచుకొనునట్లు మీరికమీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను.

18. వారైతే అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయ కాఠిన్యమువలన తమలోనున్న అజ్ఞానముచేత దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడినవారై, తమ మనస్సు నకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు.

19. వారు సిగ్గులేనివారైయుండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మునుతామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి.

20. అయితే మీరు యేసునుగూర్చి విని,

21. ఆయనయందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడినవారైనయెడల, మీరాలాగు క్రీస్తును నేర్చుకొన్నవారుకారు.

22. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశవలన చెడిపోవు మీ ప్రాచీనస్వభావమును వదలుకొని

23. మీ చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై,

24. నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింప బడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను.
ఆదికాండము 1:26

25. మనము ఒకరికొకరము అవయవములై యున్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను.
జెకర్యా 8:16

26. కోపపడుడి గాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపమునిలిచియుండకూడదు.
కీర్తనల గ్రంథము 4:4

27. అపవాదికి చోటియ్యకుడి;

28. దొంగిలువాడు ఇకమీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తన చేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను.

29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అను కూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడి.

30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచనదినమువరకు ఆయనయందు మీరు ముద్రింపబడి యున్నారు.
యెషయా 63:10

31. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.

32. ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.



బైబిల్ అధ్యయనం - Study Bible
4:1 ఈ హెచ్చరిక పత్రికలో అతి పెద్ద పరివర్తనా వస్తువుగా పనిచేసింది. ఎందుకంటే ఇది సంఘ విశ్వాస ప్రకటనను దాటి సంఘ పరిచర్య ప్రకటనకు మారింది. ఒక విశ్వాసి ప్రవర్తన అతని దైవిక పిలుపుకు తగినట్లుగా ఉండాలని పౌలు నొక్కి చెబుతున్నాడు.

4:2 ఐక్యత కొనసాగాలంటే దీర్ఘశాంతము, సంపూర్ణ వినయము, సాత్వికము తప్పనిసరి. 

4:3-6 క్రీస్తు శరీరంలో ఐక్యతను కాపాడడంలో విశ్వాసులకు బాధ్యత ఉంది. ఈ వచనాల్లో ఏడుసార్లు చెప్పబడిన “ఒక్కటే” అనే విషయాలు, త్రిత్వదేవుడు సంఘంలో ఏకత్వాన్ని సృష్టించే పునాదిని విశదీకరిస్తున్నాయి. ఒక్క శరీరాన్ని సృష్టించడంలో ఒక్క ఆత్మ కార్యం, ఒక్కటే నిరీక్షణ, విశ్వాసం, బాప్తిస్మాన్ని కలిగించిన ఒక్క ప్రభువైన యేసు క్రీస్తు: ఒక్క దైవిక జనాంగాన్ని వెలుపలికి తెచ్చిన ఒక్క తండ్రి దేవుడు అనే అంశాల దృష్టిలో పౌలు ప్రణాళికను మనం గ్రహించవచ్చు. 

4:6 అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే అనే మాటలు దేవునిలోని ఏకత్వమే సంఘపు ఏకత్వాన్ని నిర్వచిస్తున్నదని విశ్వాసులకు జ్ఞాపకం చేస్తున్నాయి.

4:7 పౌలు సంఘ ఐక్యతలోనే ఒక భిన్నత్వాన్ని స్థాపిస్తున్నాడు. ప్రతి విశ్వాసికి ఒక్కొక్క పరిమాణం చొప్పున దేవుడు కృప అనుగ్రహించాడు. 

4:8 ఈ వచనం కీర్తన 68:18 ని మనకు గుర్తుచేస్తుంది. ఆ కీర్తన సారం ఏమిటంటే, ఒక సైనిక విజేత తాను జయించి, ఇప్పుడు తన ఆధీనంలో ఉన్న ప్రజల నుండి బహుమానాలు స్వీకరించే హక్కు కలిగి వుంటాడు. క్రీస్తు తన శత్రువులను జయించి, వారికి బహుమతులు ఇచ్చాడు అని పౌలు ఇక్కడ సూచిస్తున్నాడు. అలా బహుమతులు తీసుకున్నవారిలో పౌలు కూడా ఒక మంచి ఉదాహరణ. పాపాన్ని, మరణాన్ని జయించినవాడుగా, క్రీస్తు తన బందీలైన, కొత్తగా సమర్పించుకున్న అనుచరులకు బహుమతులు ఇస్తున్నాడు. 

4:9-10 పునరుత్థానుడై, హెచ్చింపబడిన క్రీస్తు ఇప్పుడు తన సంఘానికీ, ఈ విశ్వానికి తన పరిపూర్ణ ఆశీర్వాదాలన్నిటినీ అనుగ్రహిస్తున్నాడని పౌలు నొక్కి చెబుతున్నాడు (1:10, 19-23; 3:20-21). 

4:11-13 ఇక్కడున్న వర్ణన ఆత్మ వరములకన్నా ఎక్కువగా ప్రజలు కలిగి ఉన్న వివిధ సామర్థ్యాలను (మెరుగుపెట్టి దేవుని రాజ్యం కోసం వినియోగించగలిగిన ప్రాకృతిక వరాలు) గురించింది. (రోమా 12; 1కొరింథీ 12-14లోని పౌలు భావంతో వ్యత్యాసపరచి చూడండి). వరాలున్న వారిని పౌలు ఐదు గుంపులుగా చేశాడు. అపొస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. అపొస్తలులు, ప్రవక్తలు సంఘపనికి పునాదుల వంటివారు (ఎఫెసీ 3:5; 2:20 నోట్సు చూడండి). అపొస్తలులు అనే మాట ప్రాథమికంగా దేవుని పని కోసం పంపబడిన వారిని సూచిస్తుంది. వారు దేవుని పక్షాన మాట్లాడేవారిగా, సంఘానికి కొత్త ప్రత్యక్షత అవగాహనలు తెచ్చేవారుగా ఉంటారు. ప్రవక్తలు విశ్వాసుల వర్తమాన కాలానికి దేవుని చిత్తాన్ని వెల్లడి చేస్తూ (ముందే చెప్పడం), భవిష్యత్తును (ప్రవచనాత్మకంగా చెప్పడం) గూర్చి చెప్పేవారు. అపొస్తలులందరూ ప్రవక్తలే కాని, ప్రవక్తలందరూ అపొస్తలులు కారు.
సువార్తికులు సువార్తను ప్రకటించి, సంఘాలను స్థాపించే వరాన్ని కలిగి వున్నవారు. వీరు మాటలో, క్రియలో సువార్తను - ప్రకటించి, ఇతరులకు సువార్త పరిచర్యలో సూచనలిస్తారు. కాపరులు, ఉపదేశకులు ఒకే విధమైన బాధ్యతలు గలవారు. కాపరులు సంఘాన్ని పర్యవేక్షించి, ఆదరించి, నడిపించే వారుగా ఉంటారు. (అపొ.కా.20:28; 1పేతురు 5:1-4). ఉపదేశకులు దేవుని ప్రత్యక్షతను బోధించి సంఘ జీవితానికి అన్వయించి సూచించేవారు. ఉపదేశకులు ప్రవక్తల్లాగా కొత్త ప్రేరణ కలిగించే ఆలోచనలు కాక, అప్పటికే బయల్పరచబడిన సంఘోపదేశాలను తమ తరువాతి తరానికి అందించే పని చేసేవారు (1కొరింథీ 15:3-4). సంఘాన్ని కట్టడానికి ఉపదేశకులు కావాలి. విశ్వాసులు సరైన బోధకు, అసత్య బోధకు ఉన్న తేడాను పసికట్టేలా చేయడంలో వారు అత్యవసరం.
వరములున్నవారి లక్ష్యం ఇతరులను పరిచర్య చేయడానికి సిద్ధపరచేదిగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉన్న అనేక దీర్ఘ వాక్యాల్లాగా వ.11-16 మూలభాష (గ్రీకు)లో ఏక వాక్యంగా ఉంది. సంపూర్ణులగునట్లు అని అనువదించిన మాట కొన్నిసార్లు పునరుద్ధరించడాన్నీ, బాగుచేయడాన్నీ సూచించడానికి వాడతారు... అపరిచర్య ఉద్దేశం ఏమిటంటే, విశ్వాసులు ఈ మూడు లక్ష్యాలను సాధించడం: (1) విశ్వాస విషయంలో, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఐక్యత పొందడం; (2) సంపూర్ణులవ్వడం (పరిణతి చెందడం), (3) క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత పొందడం. పరిపక్వత, ఐక్యత అనేవి క్రీస్తు అనే శిరస్సుతో శరీరానికున్న అనుబంధాన్ని బట్టి కొలవబడతాయి.

4:14 వరములు గలవారు సంఘాన్ని బలోపేతం చేసినపుడు, విశ్వాస సమాజం కట్టడలోను, ఆచరణలోను స్థిరత్వాన్ని కనపరుస్తుంది. 

4:15 ప్రేమ గలిగి సత్యము చెప్పుచు: ఒక సంఘం ప్రేమతో సత్యాన్ని చెప్పడంలో నమ్మకంగా ఉన్నపుడు, అది సంబంధాలలో పారదర్శకంగా ఉండి, ప్రజలు ఒకరికొకరు క్షేమాభివృద్ధి, మేలు కలుగజేసుకుంటారు. 

4:16 చివరికి సంఘం అన్ని విషయాల్లో క్రీస్తులాగా ఎదిగి, ప్రతి అవయవము చక్కగా కుదురుకొని ఒకదానితో ఒకటి సహాయపడుతూ ఉంటాయి. శరీరం ఎదగాలంటే శరీరంలోని ప్రతి అవయవమూ సరిగ్గా పని చేయాలి. చక్కగా అమర్చబడి అని అనువదించిన గ్రీకు పదం నుండి "సామరస్యము" అనే మాట వస్తుంది.

4:17-19 పత్రికలోని ఈ భాగం, వ.1ని ఆచరించడానికి సహాయం చేస్తుంది. పౌలు హెచ్చరికలు పాఠకుల గతకాలపు -జీవిత విధానాన్ని నిరసిస్తాయి. ఈ హెచ్చరికల సారం ఆది క్రైస్తవ బాప్తిస్మ ఆచారంలో ఉన్నట్లు, బాప్తిస్మపు నీళ్ళలో ప్రవేశించడానికి కొత్త బట్టలు వేసుకోడానికి ముందు పాత బట్టలు తీసివేయడానికి సమానంగా ఉంది. ఇది పరలోక, ఇహలోక జీవితాలను భేదపరచడం మినహాయించి, కొలస్సీ 3:5-11 లో కనిపించే దృశ్యంలాగా ఉంది. ఎఫెసీయుల పత్రికలో ఉన్న వాక్యభాగం, ఒకని పాత జీవిత విధానాన్ని, క్రీస్తులో కొత్త జీవితంతో భేదపరుస్తుంది.

4:20-21 సత్యాన్ని పౌలు పూర్తిగా మార్గం, సత్యం, జీవమై ఉన్న (యోహాను 14:6) మెస్సీయ దృక్కోణంలో చిత్రీకరించాడు.

4:22-24 విశ్వాసులు అప్పటికే ఏమై ఉన్నారో అపొస్తలుడు తరచూ వివరించాడు. అదే సమయంలో వారు ఏమవ్వడానికి ప్రయాసపడాలో కూడా తెలిపాడు. ఆచరణాత్మక వైరుధ్య విషయం ఏమంటే, ఇప్పటికే పాపపు నిత్యశిక్షనుండి విడుదల మనదైనప్పటికీ, మునుపటి ప్రవర్తన (పాప జీవితం) నుండి విడుదల మన అనుదిన విధేయత, పరిశుద్ధత కోసమైన అనుదిన పోరాటం ద్వారానే వస్తుంది. ఇవి ప్రతి విశ్వాసి తీసుకోవాల్సిన జీవనవిధాన నిర్ణయాలు. 

4:25-32 ఇతరులతో సంబంధంలో కొత్త జీవితాన్ని జీవించడానికి పౌలు ఐదు ఉదాహరణలు ఇచ్చాడు. అన్ని ఉదాహరణలలో ఒక ప్రతికూల ఆజ్ఞ, ఒక అనుకూల ఆజ్ఞ, ఆ ఆజ్ఞలు ఆధారపడిన ఒక ఆత్మీయ సూత్రం ఉన్నాయి. పౌలు ఆజ్ఞలన్నిటికీ ఆధారంగా దైవకేంద్రిత ఆధ్యాత్మిక పునాది ఉంటుంది....

4:32 తాను చెప్పబోయేదాన్ని వివరించడానికి పౌలు ఒక చమత్కార పద. ప్రయోగం చేశాడు. క్రీస్తును బట్టి (గ్రీకు. "క్రిస్టోస్") విశ్వాసులు దయగా (గ్రీకు. "క్రిస్టోస్") ఉండాలని అతడు ఆజ్ఞాపించాడు. 


Shortcut Links
ఎఫెసీయులకు - Ephesians : 1 | 2 | 3 | 4 | 5 | 6 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |