ఎస్తేరు


  • Author: Sajeeva Vahini
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini

ఎస్తేరు యొక్క హెబ్రీ పేరు హదస్సా అనబడును (ఎస్తేరు 2:7) పారసీక మాటయైన ఎస్తేరు అనగా నక్షత్రము అని అర్థమునిచ్చును స్టారా అను పారసీక మాటలో నుండి ఉద్భవించినది. గ్రీకు భాషలో గ్రంథము యొక్క పేరు ఎస్తేరు అని యుండగా లాటిన్ భాషలో హెష్టర్ అనియున్నది.

ఉద్దేశము : తన ప్రజలను గూర్చిన దేవుని అధికారము, ప్రేమ, బాధ్యత అనునవి బయలుపరచుట.

గ్రంథకర్త : మొర్దెకై గా (ఎస్తేరు 9:29) (రచనా శైలిని తీసికొని యీ పుస్తకమును ఎజ్రాయో, నెహెమ్యానో వ్రాసియుండవచ్చు అని అభిప్రాయపడువారున్నారు.)

కాలము : అహష్వేరోషు యొక్క పరిపాలనా కాలము క్రీపూ 486 నుండి క్రీపూ 464 వరకు. రాజు ఏర్పాటు చేసిన విందు ఆయన పాలన యొక్క మూడవ సంవత్సరము (ఎస్తేరు 1:3) గ్రంథము యొక్క 3 నుండి 10 వరకు గల అధ్యాయములలో వివరించు కార్యక్రమములు జరిగినవి క్రీపూ 483 నుండి 473 వరకు గల 10 సంవత్సరముల కాలపరిమితిలో జరిగినవి. (ఎస్తేరు 3:7-12) అహష్వరోషు చనిపోయిన సంవత్సరమైన క్రీ.పూ. 464 తరువాత దానికి సమీప కాలములో ఎస్తేరు గ్రంథము మొర్దకై ద్వారా వ్రాయబడియుండవచ్చును. తమ స్వదేశమునకు తిరగి వెళ్లక, పారసీక దేశములో జీవించుచున్న యూదుల ఉపయోగము కొరకై వ్రాయబడిన గ్రంథము ఇది. దైవభక్తులైన యూదులందరు పాలస్తీనమునకు తిరిగి వెళ్లలేదు. ఈ రీతిగా చెరనివాసము కొనసాగించ తీర్మానించి జీవించిన వారికొరకు దేవుడు వారియందు దృష్టించియున్నాడు. వారిని కూడా పరామర్శించువానిగా యున్నాడనునది. ఈ గ్రంథము తెలుపుచున్నది.

పూర్వ చరిత్ర : పరిశుద్ధ గ్రంథములో నెహెమ్యా తర్వాత ఎస్తేరు గ్రంధము వచ్చినప్పటికిని నెహెమ్యా కార్య క్రమములకు 30 సంవత్సరములకు ముందే ఎస్తేరు కార్య క్రమములు జరిగినవి. ఈ కార్యములు జరిగిన స్థలము పారసీక సామ్రాజ్యము యొక్క రాజధానియైన షూషనులోను, చక్రవర్తి అంతఃపురములోను జరిగినవి.

ముఖ్య మనుష్యులు : ఎస్తేరు, మొర్దకై, అహష్వరోషురాజు, హామాను.

ముఖ్య స్థలము : పారసీక షూషను అంతఃపురము

విశేషము: స్త్రీల పేర్లలో కనబడు రెండు గ్రంథములలో ఇది యొక్కటి. (రూతు మరియొక గ్రంథము) ఈ గ్రంథములో దేవుడు అనుమాట ఏమాత్రము ఉపయోగించబడలేదు. అయినను వీటి చర్యలన్నిటిలో దేవుని సన్నిధి ఎంతో తేటగా కనబడుచున్నది.

ముఖ్య మాటలు : దేవుని దృష్టి

ముఖ్యవచనములు : ఎస్తేరు 4:14; ఎస్తేరు 8:17

గ్రంథ విభజన : గ్రంథమును రెండు భాగములుగా విభజింపవచ్చును.

  1. అధ్యాయము 1 నుండి 4 వరకు యూదులను భయపెట్టుట.
  2. అధ్యాయము 5 నుండి 10 వరకు యూదులు పొందిన ఆశ్చర్యమైన విజయము.

     మొర్దెకై దేశములో రెండవ మానవుడుగా హెచ్చింపబడుటను, ఆయన యూదులు యొక్క సంరక్షకునిగా మార్చబడుట చెప్పుచూనే ఈ గ్రంథము ముగియుచున్నది. తెలియని రీతిగా జరిగినవని భావించు అనేక సంఘటనలు ఒక దండవలె ఐక్యపరచబడిన రీతిగా ఇచ్చుటయే ఈ గ్రంథము యొక్క విశేషిత వష్తి రాణి యొక్క మొండితనము ద్వారా ఆమె పదవి తొలగించబడినది. రాజు యొద్దకు తీసుకొని రాబడిన అనేక కన్యకలలో ఎస్తేరు రాణిగా ఎన్నుకొనబడుట, ఒక రాత్రి రాజు నిద్రలేక బాధపడుట ఆ రాత్రి రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని ఆజ్ఞాపించుట, మొర్దెకై రాజును కాపాడిన సంఘటన చదువుట తటస్థించుట, అదే సమయములో హామాను అచ్చటికి రావడము జరుగుట అను కార్యములన్నియు మానవదృష్టిలో తెలియని రీతిగా జరిగిన సంఘటనలు. దేవుని ప్రజల యొక్క జీవమంతయు దేవుని ఆధీనములోనున్నది. వారి జీవితములో ఏదియు తెలియని రీతిగా జరిగినవి కావు. హామాను నుండి హిట్లర్ వరకు పగ తీర్చుకొను మనస్సు కలిగిన నాయకుల యొక్క ద్వేషమునకు గురియైన యూదుల వలె మరియొక ప్రజలు లోకములో వేరేలేరు. వేరే ఏ జనసమూహము ఆపధలను అతిజీవించుటకు ఇంత గొప్ప శక్తిని పొందలేదు.

కొన్ని ముఖ్య వివరములు : పరిశుద్ధ గ్రంథము యొక్క 17వ గ్రంథము; అధ్యాయములు 10; వచనములు 167; ఆజ్ఞలు 11; ప్రశ్నలు 21; ప్రవచనములు లేవు; వాగ్దానములు లేవు, దేవుని యొద్ద నుండి విశేషమైన వర్తమానము లేదు.