కీర్తన-24. సీయోను నగరంలోకి యెహోవా దేవుని ప్రవేశం (దావీదు యెహోవా మందసాన్ని యెరూషలేముకు తెచ్చిన సందర్భం) సమయంలో ప్రజలు ఊరేగింపుగా వెళుతూ పాడిన స్తుతి కీర్తన లేక ఆ సందర్భంగా జరుపుకున్న పండుగలో గానం చేసిన కీర్తన. క్రీస్తు పరలోకానికి ఆరోహణమైన సందర్భాన్ని సూచిస్తూ క్రైస్తవ సంఘంలో సుదీర్ఘకాలం పాటు ఈ కీర్తనను గానం చేసేవారు.
24:1-2 భూమ్మీద ఉన్నవన్నీ యెహోవావే, ఎందుకంటే వాటిని సృష్టించింది ఆయనే (ద్వితీ 10:14). లోకము (హెబ్రీ. టెవెల్) భూమి మీద నివసిస్తున్న మనుషుల్ని సూచిస్తుంది (19:4-6 నోట్సు చూడండి). భూమి నీళ్ల మీద నిలిచి ఉందని ప్రాచీన ఇశ్రాయేలు భావన (136:6; నిర్గమ 20:4); సముద్రముల మీద... ప్రవాహజలముల మీద అనే మాటలు పై భావనను తెలియజేస్తున్నాయి. దేవుడు భూమి స్థిరంగా ఉండేలా దానికి పునాది వేసెను కాబట్టి అది కదలకుండా ఉందని వారి నమ్మకం (104:5; యెషయా 51:13)
24:4 దేవుని ఆరాధించి, సేవించి ఆయన దీవెనలు పొందాలని కోరుకొనే వారు నిర్దోషమైన చేతులును, శుద్ధమైన హృదయమును కలిగి ఆయనను అనుసరించాలని దావీదు నొక్కి చెబుతున్నాడు. నిర్దోషమైన చేతులు అంటే, బహిరంగంగా పాపపు క్రియలు చేయని చేతులు అని అర్థం (యెషయా 1:15; 33:15; 1తిమోతి 2:8 చూడండి). శుద్ధమైన హృదయం అంటే అంతరంగ పవిత్రత, సరైన ఉద్దేశాలు, లక్ష్యాలు కలిగి ఉండడమని అర్థం. హృదయశుద్ధి గలవారు మాత్రమే దేవుని చూడగలరు (మత్తయి 5:8).
24:5 నిర్దోషమైన చేతులు గలిగి, శుద్ధమైన హృదయంతో (వ.4) ఎవరైతే ఆయనను వెదకుతారో (వ.6) వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. ఈ సత్యాన్ని మనం ప్రార్ధనలో దేవునికి మొర్రపెట్టేటప్పుడు, ఆయన మందిరంలో ఆయనను ఆరాధించేటప్పుడు, ప్రభురాత్రి భోజనం తీసుకొనే ప్రతిసారీ జ్ఞాపకం చేసుకోవాలి (1కొరింథీ 11:23-27; 2 కొరింథీ 6:14-18; హెబ్రీ 12:14-15 చూడండి).
24:7-10 గుమ్మాల ఎత్తు ఇంకా ఎక్కువగా ఉండాలనే కవితాత్మక వర్ణన మీ తలలు పైకెత్తికొనుడి అనే మాటల్లో కనిపిస్తుంది. పురాతనమైన తలుపులు పరలోకపు ద్వారాలను సూచిస్తున్నాయని కొందరి అభిప్రాయం (ఆది 28:17). యెరూషలేము నగర ద్వారాలు వీటికి ప్రతీకలుగా ఉన్నాయి. పరలోకంలో దేవుని నివాసస్థలానికీ లేక ఆయన సింహాసనానికీ, భూమ్మీద ఆయన ప్రజల మధ్య ఆయన నివాసస్థలమైన దేవాలయానికి సంబంధం ఉంది కాబట్టి, ఈ భావనలో ఔచిత్యం ఉంది. సైన్యముల కధిపతియగు యెహోవాయే యుద్ధంలో విజయం సాధించి వస్తున్న యుద్దశూరుడు, రాజు (1సమూ 17:45). యెహోవా సైన్యాలు బహుశా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వంటి ఆకాశమండంలోని శక్తులు కావచ్చు (ద్వితీ 4:19), లేదా ఇశ్రాయేలు సేనలు కావచ్చు (నిర్గమ 7:4).