Luke - లూకా సువార్త 9 | View All

1. ఆయన తన పండ్రెండుమంది (శిష్యులను) పిలిచి, సమస్తమైన దయ్యములమీద శక్తిని అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికనుగ్రహించి

2. దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారి నంపెను.

3. మరియు ఆయనమీరు ప్రయాణము కొరకు చేతికఱ్ఱనైనను జాలెనైనను రొట్టెనైనను వెండినైనను మరి దేనినైనను తీసికొని పోవద్దు; రెండు అంగీలు ఉంచు కొనవద్దు.

4. మీరు ఏ యింట ప్రవేశింతురో ఆ యింటనే బసచేసి అక్కడనుండి బయలుదేరుడి.

5. మిమ్మును ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణములోనుండి బయలుదేరునప్పుడు వారిమీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళి దులిపివేయుడని వారితో చెప్పెను.

6. వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు, (రోగులను) స్వస్థపరచుచు గ్రామములలో సంచారము చేసిరి.

7. చతుర్థాధిపతియైన హేరోదు జరిగిన కార్యము లన్నిటిని గూర్చి విని, యెటుతోచక యుండెను. ఏలయనగా కొందరు యోహాను మృతులలోనుండి లేచెననియు,

8. కొందరు ఏలీయా కనబడెననియు; కొందరు పూర్వ కాలపు ప్రవక్తయొకడు లేచెననియు చెప్పుకొనుచుండిరి.

9. అప్పుడు హేరోదు నేను యోహానును తల గొట్టించితిని గదా; యెవనిగూర్చి యిట్టి సంగతులు వినుచున్నానో అతడెవడో అని చెప్పి ఆయనను చూడగోరెను.

10. అపొస్తలులు తిరిగి వచ్చి, తాము చేసినవన్నియు ఆయనకు తెలియజేయగా, ఆయన వారిని వెంట బెట్టుకొని బేత్సయిదా అను ఊరికి ఏకాంతముగా వెళ్లెను.

11. జన సమూహములు అది తెలిసికొని ఆయనను వెంబడింపగా, ఆయన వారిని చేర్చుకొని, దేవుని రాజ్యమునుగూర్చి వారితో మాటలాడుచు, స్వస్థత కావలసినవారిని స్వస్థ పరచెను.

12. ప్రొద్దు గ్రుంక నారంభించినప్పుడు పండ్రెండుగురు శిష్యులు వచ్చి మనమీ అరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపట్లనున్న గ్రామములకును పల్లెలకును వెళ్లి బస చూచుకొని, ఆహారము సంపాదించు కొనునట్లు జనసమూహ మును పంపివేయుమని ఆయనతో చెప్పిరి.

13. ఆయనమీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారుమనయొద్ద అయిదు రొట్టెలును రెండు చేపలును తప్ప మరేమియు లేదు; మేము వెళ్లి యీ ప్రజలందరికొరకు భోజనపదార్థములను కొని తెత్తుమా అని చెప్పిరి.

14. వచ్చినవారు ఇంచుమించు అయిదువేల మంది పురుషులు. ఆయనవారిని ఏబదేసిమంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా,

15. వారాలాగు చేసి అందరిని కూర్చుండబెట్టిరి.

16. అంతట ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను ఎత్తికొని, ఆకాశము వైపు కన్ను లెత్తి వాటిని ఆశీర్వదించి, విరిచి, జనసమూహము నకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను.

17. వారందరు తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు పండ్రెండు గంపెళ్లెత్తిరి.
2 రాజులు 4:44

18. ఒకప్పుడాయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయనయొద్ద ఉండిరి. నేనెవడనని జనసమూహములు చెప్పుకొనుచున్నారని ఆయన వారి నడుగగా

19. వారు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలీయాయనియు, కొందరుపూర్వకాలపు ప్రవక్త యొకడు లేచెననియు చెప్పు కొనుచున్నారనిరి.

20. అందుకాయన మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారినడుగగా పేతురునీవు దేవుని క్రీస్తువనెను.

21. ఆయన ఇది ఎవనితోను చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి

22. మనుష్యకుమారుడు బహు శ్రమలు పొంది, పెద్దల చేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను విసర్జింపబడి, చంపబడి, మూడవ దినమున లేచుట అగత్య మని చెప్పెను.

23. మరియు ఆయన అందరితో ఇట్లనెను ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను.

24. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పొగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించు కొనును.

25. ఒకడు లోకమంతయు సంపాదించి, తన్ను తాను పోగొట్టు కొనినయెడల, లేక నష్టపరచుకొనినయెడల వానికేమి ప్రయోజనము?

26. నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు, తనకును తన తండ్రికిని పరిశుద్ద దూతలకును కలిగియున్న మహిమతో వచ్చునప్పుడు సిగ్గుపడును.

27. ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచువరకు మరణము రుచిచూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాననెను.

28. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి యెని మిది దినములైన తరువాత, ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని, ప్రార్థనచేయుటకు ఒక కొండ యెక్కెను.

29. ఆయన ప్రార్థించు చుండగా ఆయన ముఖరూపము మారెను; ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగ మెరిసెను.

30. మరియు ఇద్దరు పురుషులు ఆయ నతో మాటలాడుచుండిరి, వారు మోషే ఏలీయా అను వారు.

31. వారు మహిమతో అగపడి, ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమునుగూర్చి మాటలాడు చుండిరి.

32. పేతురును అతనితో కూడ ఉన్నవారును నిద్ర మత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు, ఆయన మహిమను ఆయనతో కూడ నిలిచియున్న యిద్దరు పురు షులను చూచిరి.

33. (ఆ యిద్దరు పురుషులు) ఆయనయొద్ద నుండి వెళ్లిపోవుచుండగా పేతురు యేసుతో ఏలినవాడా, మనమిక్కడ ఉండుట మంచిది, నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణ శాలలు మేముకట్టుదుమని, తాను చెప్పినది తానెరుగకయే చెప్పెను.

34. అతడీలాగు మాటలాడుచుండగా మేఘమొకటి వచ్చి వారిని కమ్మెను; వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి.

35. మరియు ఈయన నే నేర్పరచుకొనిన నా కుమారుడు,ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను.
ద్వితీయోపదేశకాండము 18:15, కీర్తనల గ్రంథము 2:7, యెషయా 42:1

36. ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగపడెను. తాము చూచిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికిని తెలియ జేయక వారు ఊరకుండిరి.

37. మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహు జనసమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను.

38. ఇదిగో ఆ జనసమూహములో ఒకడు బోధకుడా, నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను. వాడు నా కొక్కడే కుమారుడు.

39. ఇదిగో ఒక దయ్యము వాని పట్టును, పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును; నురుగు కారునట్లు అది వానిని విలవిలలాడిం చుచు గాయపరచుచు వానిని వదలి వదల కుండును.

40. దానిని వెళ్లగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారిచేత కాలేదని మొఱ్ఱపెట్టుకొనెను.

41. అందుకు యేసు విశ్వాసములేని మూర్ఖతరము వారలారా, నేనెంతకాలము మీతో కూడ ఉండి మిమ్మును సహింతును? నీ కుమారుని ఇక్కడికి తీసికొని రమ్మని చెప్పెను.

42. వాడు వచ్చు చుండగా ఆ దయ్యము వానిని పడద్రోసి, విలవిలలాడిం చెను; యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థ పరచి వాని తండ్రి కప్పగించెను.

43. గనుక అందరు దేవుని మహాత్మ్యమును చూచి ఆశ్చర్యపడిరి.

44. ఆయన చేసిన కార్యములన్నిటిని చూచి అందరు ఆశ్చర్య పడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనియ్యుడి. మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోవుచున్నాడని తన శిష్యులతో చెప్పెను.

45. అయితే వారామాట గ్రహింప కుండునట్లు అది వారికి మరుగు చేయబడెను గనుక వారు దానిని తెలిసికొనలేదు; మరియు ఆ మాటనుగూర్చి వారు ఆయనను అడుగ వెరచిరి.

46. తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా

47. యేసు వారి హృదయాలోచన ఎరిగి, ఒక చిన్న బిడ్డను తీసికొని తనయొద్ద నిలువబెట్టి.

48. ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవానిని చేర్చుకొనును, మీ అందరిలో ఎవడు అత్యల్పుడై యుండునో వాడే గొప్ప వాడని వారితో

49. యోహానుఏలినవాడా, యెవడో యొకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టగా మేము చూచితివిు; వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంక పరచితిమని చెప్పెను.

50. అందుకు యేసు మీరు వాని నాటంకపరచకుడి? మీకు విరోధి కాని వాడు మీ పక్షమున నున్నవాడే అని అతనితో చెప్పెను.

51. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణ మగుచున్నప్పుడు

52. ఆయన యెరూషలేమునకు వెళ్లుటకు మనస్సు స్థిరపరచుకొని, తనకంటె ముందుగా దూతలను పంపెను. వారు వెళ్లి ఆయనకు బస సిద్ధము చేయవలె నని సమరయుల యొక గ్రామములో ప్రవేశించిరి గాని

53. ఆయన యెరూషలేమునకు వెళ్ల నభిముఖుడైనందున వా రాయనను చేర్చుకొనలేదు.

54. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి ప్రభువా, ఆకాశమునుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేమాజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా,
2 రాజులు 1:10

55. ఆయన వారితట్టు తిరిగి వారిని గద్దించెను.

56. అంతట వారు మరియొక గ్రామమునకు వెళ్లిరి.

57. వారు మార్గమున వెళ్లుచుండగా ఒకడునీ వెక్కడికి వెళ్లినను నీ వెంట వచ్చెదనని ఆయనతో చెప్పెను.

58. అందుకు యేసునక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చు కొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను.

59. ఆయన మరియొకనితో నా వెంటరమ్మని చెప్పెను. అతడు నేను వెళ్లి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను

60. అందుకాయన మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము; నీవు వెళ్లి దేవుని రాజ్య మును ప్రకటించుమని వానితో చెప్పెను.

61. మరియొకడు ప్రభువా, నీ వెంట వచ్చెదను గాని నా యింట నున్న వారియొద్ద సెలవు తీసికొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా
1 రాజులు 19:20

62. యేసునాగటి మీద చెయ్యిపెట్టి వెనుకతట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడుకాడని వానితో చెప్పెను.బైబిల్ అధ్యయనం - Study Bible
9:1-2 చాలా నెలలపాటు పండ్రెండుమంది యేసు చేస్తున్న పరిచర్యను గమనించారు. ఆ తర్వాత దయ్యములమీద శక్తిని, అధికారమును రోగములు స్వస్థపరచు వరమును ఆయన వాళ్లకు అనుగ్రహించాడు (6:12-13 నోట్సు చూడండి). దేవుని రాజ్యమును ప్రకటించుట వారికున్న మరొక బాధ్యత. మత్తయి 10వ అధ్యాయం ఈ వాక్యభాగానికి సమాంతర వాక్యభాగం. సమరయుల దగ్గరకూ అన్యజనుల దగ్గరకు కాకుండా “ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల దగ్గరకు మాత్రమే వెళ్లండని" మత్తయి సువార్తలో యేసు చెప్పినట్లు కనబడుతుంది (మత్తయి 10:6). అయితే లూకా ఈ విషయాన్ని తన గ్రంథంలో చేర్చలేదు. 

9:3-5 అపొస్తలులు తమకు ఆతిథ్యం ఇచ్చే వారిపైనే ఆధారపడాలి (దేనినైనను తీసికొని పోవద్దు. ఏ కుటుంబము, పట్టణస్తులు తమను చేర్చుకొనరో అక్కడ నుండి కదిలి ముందుకు వెళ్లిపోవాలి. మీ పాదధూళి దులిపి వేయుడనే మాట అపొస్తలులనూ, యేసు గురించి వారు చెబుతున్న సందేశాన్ని తృణీకరించిన వారికి వ్యతిరేకంగా తీర్పు తీర్చడానికి గుర్తు. పిసిదియలోని అంతియొకయలో పౌలు, బర్నబాలు దీన్ని అభ్యాసం చేశారు (అపొ.కా.13:51). 

9:6 ఇక్కడ సువార్త ప్రకటించడమనేది రెండవ వచనంలో “దేవుని రాజ్యా న్ని ప్రకటించడా”నికి సమాంతరంగా యేసు చెప్పాడు. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించే మార్గం యేసుక్రీస్తు సువార్త సందేశమే.

9:7-9 మృతుల్లో నుంచి బాప్తిస్మమిచ్చే యోహాను లేచాడా లేదా అని నిర్ధారించుకోడానికి హేరోదు అంతిప (3:1 నోట్సు చూడండి) యెటు తోచకయుండెను. యేసే పునరుత్థానుడైన యోహానని అతడు నిర్ధారించుకున్నా డని ఈ వాక్యభాగానికి సమాంతర వాక్యభాగాలు (మత్తయి 14:2; మార్కు 6:16) సూచిస్తున్నాయి. అయితే అంతిప చుట్టూ ఉన్నవాళ్లు యేసు ప్రవక్తయైన ఏలీయా అని అనుకున్నారు (మలాకీ 4:5 చూడండి). యోహాను పాక్షికంగా ఈ ప్రవచనాన్ని నెరవేర్చాడు (మత్తయి 11:14). పాత నిబంధన
ప్రవక్తల్లో ఎవరో ఒకరు తిరిగి వచ్చారని ఇతరులు నమ్మారు. హేరోదు అంతిప రాబోయే రోజుల్లో యేసును కలిసి విచారణ చేయబోతున్నాడు (23:6-12). అయితే యేసు అతనితో మాట్లాడడు.

9:10-11 అపొస్తలులు పరిచర్య నుంచి తిరిగి వచ్చి తాము చేసిన కార్యాలను యేసుకు తెలియజేసిరి. మరలా ప్రసంగించే, స్వస్థపరిచే పరిచర్యకు యేసే నాయకత్వం వహించాడు. బేత్సయిదా అనేది గలిలయ సముద్రతీరానికి ఈశాన్యంగా ఉన్న పట్టణం. ఆ రోజుల్లోనే హేరోదు ఫిలిప్పు దాన్ని నిర్మించాడు (3:1 నోట్సు చూడండి). అపొస్తలులు విశ్రాంతి తీసుకోవడానికి యేసుతో సమావేశమవడానికి బేత్సయిదాకు బయట ఏకాంత ప్రదేశాన్ని వెదకడానికి చేసిన ప్రయత్నం వాళ్లను అనుసరించిన జనసమూహాల మూలంగా బెడిసికొట్టింది. 9:12-17 యేసు పునరుత్థానం కాకుండా, నాలుగు సువార్త గ్రంథాల్లోనూ కనబడే అద్భుతం, 5 వేల మందికి ఆహారం పెట్టడం (మత్తయి 14:13-21; మారు 6:30-44; యోహాను 6:5-14). 

9:12-14 యోహాను సువార్త ప్రకారం, తాను చేయబోయే దానిని ముందే ఎరిగినప్పటికీ, ఆ సాయంత్రం వేళ జనసమూహాలకు బస... ఆహారము ఎలా అనే చింతను వ్యక్తపరచింది యేసే (యోహాను 6:5-6). ఇక్కడ లూకాలో, మీరే వారికి భోజనము పెట్టుడని తనను ప్రశ్నించిన 12 మందికి యేసు సవాలు విసిరాడు. అపొస్తలులు అప్పటికే జనసమూహాల దగ్గర వాకబు చేసి 5 వేల మంది పురుషులకూ (స్త్రీలు, పిల్లల్ని కలుపుకుంటే కనీసం 15 వేల మంది లేక ఇంకా ఎక్కువ కావచ్చు) భోజనం పెట్టడానికి 5 రొట్టెలు, 2 చేపలు మాత్రమే ఉన్నాయని కనుగొన్నారు. ఆహారాన్ని పంచిపెట్టడం తేలికగా చేయడానికి ఏబదేసిమంది చొప్పున గుంపులుగా కూర్చుండబెట్టమని యేసు తన శిష్యులకు చెప్పాడు. 

9:16-17 యేసు ఆకాశమువైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి, విరిచినప్పుడు, భోజన సమయంలో యూదులు చేసే ప్రార్ధననే చేసి ఉంటాడు. ఆ ప్రార్థన ఇలా ఉండేది: “ప్రభువైన మా దేవా, లోకానికి రాజా, భూమినుండి ఆహారాన్ని ఇచ్చేవాడా, నీకు స్తుతి కలుగును గాక”. రొట్టెలను విరుస్తూ, పంచి పెట్టడానికి వాటిని శిష్యులకు ఇచ్చుచుండగా యేసుని చేతుల్లోనే రొట్టెలు, చేపలు రెట్టింపు అవ్వడమనే అద్భుతం జరిగింది. వేలాదిమంది ప్రజలకు పంచిపెట్టిన తర్వాత చివరిలో మిగిలిన ముక్కలు ఒక్కొక్క అపొస్తలుడు ఒక్కొక్క గంపను ఎత్తినట్లు కనబడుతుంది. భోజన సమయంలో కిందపడిన ఆహార పదార్థాలను ఏరడమనేది యూదుల ఆచారం. 

9:18-20 ప్రార్థన గురించి లూకా నొక్కి చెప్పాడనడానికి ఈ వచనాలు మరొక ఉదాహరణగా ఉన్నాయి. తానెవరో అనే దాని గురించి యేసు అడిగిన ప్రశ్నకు జవాబులు నిరూపిస్తున్న విషయం: కేవలం హేరోదు అంతిప మాత్రమే కాదు ప్రజలంతా అదే అయోమయంలో ఉన్నారు (వ.7-9 నోట్సు చూడండి). శిష్యుల వ్యక్తిగత అభిప్రాయాన్ని యేసు అడిగినప్పుడు, ఆ 12 మందికి ప్రతినిధిగా పేతురు జవాబిచ్చాడు. యేసే దేవుని క్రీస్తు అని పేతురు చెప్పాడు. లూకా సువార్త గ్రంథంలో చూపించే ప్రతీదానికీ పేతురు చెప్పిన ఈ జవాబే ముగింపు.

9:21-22 తనను తాను మెస్సీయగా బహిరంగంగా కనబరచుకోడానికి యేసు సిద్ధంగా లేడు. మెస్సీయ అనే రాజు లేచి రోమీయుల సామ్రాజ్యాన్ని కూలగొడతాడనీ, ప్రజాదరణతో బలంతో ఇశ్రాయేలు రాజు అవుతాడనీ ఆనాడు యూదుల మనస్సుల్లో బలమైన అభిప్రాయముంది. దీనికి భిన్నంగా చంపబడి, మూడవ దినమున లేచుటకు ముందు యూదా నాయకులచే శ్రమలుపొంది... విసర్జింపబడడమే యేసు అసలైన పరిచర్య లక్ష్యం. తన మరణ పునరుత్థానాల గురించి యేసు చెప్పిన పలు ప్రవచనాల్లో ఇది మొదటిది (వ.44; 12:50; 17:25; 18:31-33). 

9:23 యేసుకు నిజమైన శిష్యునిగా ఉండాలనుకునే ఎవరైనా తనను తాను ఉపేక్షించుకోవాలి. రోమీయుల కాలంలో సిలువ శిక్ష అత్యంత
వేదనకరమైనది, అవమానకరమైనది. అందువల్ల ప్రతీవాడు ప్రతిదినము తన సిలువను ఎత్తుకోవడం అంటే క్రీస్తుకు కట్టుబడి ఉండడం వల్ల ప్రతీరోజూ బాధాకరమైన పరిస్థితులను ఎదుర్కోవడమే. 

9:24 తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకోవాలి అనే నియమం కేవలం ఈ లోకం కోసమే జీవించడానికి విరుద్ధమైంది. సువార్త గ్రంథాల్లో యేసు చాలా ఎక్కువగా వాడిన మాట ఇది (14:26-27; 17:33; మత్తయి 10:38-39; 16:24-25; మార్కు 8:34-35; యోహాను 12:25). ఈ లోకం యెడల మనకున్న ఇష్టాన్ని పణంగా పెట్టి క్రీస్తు కోసం, ఆయన పరిచర్య కోసం జీవించాలి. ఆయనను అనుసరించడానికి మనం చేయాల్సింది అదే! 

9:25 ఒక వ్యక్తి ఈ లోకంలో ఎంత ధనవంతుడైనా (లోకమంతయు సంపాదించి), క్రీస్తు లేకుండా అతడు మరణిస్తే అతడు తన నిత్యత్వాన్నే కాలదన్నుకున్నట్లవుతుంది. (వానికేమి ప్రయోజనము?). 

9:26 క్రీస్తు గురించీ ఆయన మాటల గురించీ సిగ్గుపడుటనేది అవిశ్వాసానికి సూచనగా ఉంది. అది ఆయన రెండవరాకడలో నిత్యశిక్షను తెస్తుంది (12:9; 2తిమోతి 2:12). అవిశ్వాసులైన స్నేహితులు చుట్టూ ఉన్నప్పుడు తాత్కాలికంగా భయపడడం, యేసు గురించి “సిగ్గుపడడం" విశ్వాసులకు సర్వసాధారణం. పేతురు క్రీస్తును తృణీకరించినప్పుడు జరిగింది. ఇదే! అలాంటి సందర్భాల్లో విశ్వాసి పరలోక బహుమానాన్ని కోల్పోతాడు (1 కొరింథీ 3:10-15; 2 కొరింథీ 5:10) కానీ నిత్యశిక్షను అనుభవించడు. 

9:27 మర్మయుక్తమైన ఈ మాట యేసు రూపాంతరం గురించి ప్రస్తావిస్తుంది. ఈ సంఘటన తర్వాత వచనాల్లో మనకు కనబడుతుంది (వ. 28-35). ఇక్కడ నిలిచియున్నవారిలో కొందరు అనే మాటలు, యేసు రూపాంతరం పొందినపుడు ఆయనతో ఉన్న పేతురు... యాకోబు... యోహానులను సూచిస్తుంది (వ.28). దేవుని రాజ్యమును చూచువరకు అనే మాట యేసు మహిమ ప్రత్యక్షతను సూచిస్తుంది. (వ.29,32). రాబోయే రాజ్యానికి ఈ ప్రత్యక్షత ముందస్తు ప్రదర్శనంగా ఉంది. 

9:28-29 పేతురు... యోహాను... యాకోబుల గురించి 8:51-53 నోట్సు చూడండి. ఈ వచనాలలో కొండ అనేది తాబోరు పర్వతం అని చరిత్ర చెబుతుంది. ఇది నజరేతుకు తూర్పుదిశలో ఆరుమైళ్ల దూరంలో, 1900 అడుగుల ఎత్తులో ఉంటుంది. అయితే ఈ కొండ హెర్మోను కొండ అవడానికి ఎక్కువ అవకాశముంది. ఈ హెర్మోను కొండ కైసరయ ఫిలిప్పుకూ దమస్కుకూ మధ్య, సముద్రమట్టానికి 9వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆయన ముఖరూపము ఏవిధంగా మారిందో లూకా తెలియచేయలేదు. మిరుమిట్లు గొలిపేంత తెల్లగా ఆయన వస్త్రాలు ధగధగ మెరిసెను. సీనాయి పర్వతంపై దేవునితో ఉన్నప్పుడు మోషే రూపంతోను (నిర్గమ 34:29-35), లేక ప్రక 1:13-16లోని మనుష్యకుమారుని దర్శనంతోనూ పోల్చాలన్నది లూకా ఉద్దేశమై ఉంటుంది. 

9:30-31 దేవుని రాజ్యం రావడానికి ముందు మోషే, ఏలీయా (మలాకీ 4:5-6 చూడండి) లు తిరిగి వస్తారని యూదుల సాంప్రదాయం చెబుతుంది.
యేసులాగానే, వాళ్లు కూడా మహిమరూపాలతో కనబడ్డారు. నిర్గమము (గ్రీకు. ఎక్సోడస్) అనే పదం పాత నిబంధనలో ఐగుప్తు నుంచి నిర్గమమును (బయటకు రావడాన్ని) సూచిస్తుంది. మోషే సమక్షము ఆ కొండపై ఉంది కాబట్టి లూకా ఈ పదాన్ని ఎంపిక చేసుకుని ఉంటాడు. యెరూషలేములో అనే మాట “నిర్గమము" అంటే సిలువపై యేసు మరణం అని స్పష్టం చేస్తుంది.

9:32-33 అర్ధరాత్రయినందుకు పేతురు, యాకోబు, యోహానులు నిద్రమత్తులో ఉన్నారో లేదా దేవదూతలు వచ్చినప్పుడు దానియేలు (దాని 8:18; 10:9) కు నిద్రమత్తు కలిగినట్లు వాళ్లకు కూడా నిద్రమత్తు వచ్చిందో అనే విషయం స్పష్టంగా లేదు. మోషే ఏలీయాలు వెళ్లిపోవుచుండగా పేతురు మాట్లాడాడు. బహుశా అది ఆ మహిమకరమైన దృశ్యాన్ని మరికొంత సేపు ఆస్వాదించాలనే ప్రయత్నమయ్యుంటుంది. అయితే అతడి ఆలోచన రెండు కారణాలను బట్టి దూరదృష్టి లేనిదని అర్థమవుతుంది: (1) యేసుతో పాటు మోషే ఏలీయాలకు సమానంగా మూడు పర్ణశాలలు (వసతి కోసం ఏర్పాటు చేసే తాత్కాలిక నివాసాలు) ఏర్పాటు చేస్తాననడం, యేసును ప్రత్యేకంగా ఆరాధించాలనే ఆలోచన లేకపోవడం (ప్రక 19:10; 22:8-9). (2) యెరూషలేములో తాను చేయబోయే నిర్గమము (లూకా 9:30-31 నోట్సు చూడండి) గురించిన యేసు చర్చకు అర్థం దేవుని విమోచన ప్రణాళికలో ఆలస్యానికి తావులేదు. 

9:34-35 ఈ సన్నివేశంలో మేఘము అరణ్యంలో ప్రత్యక్ష గుడారాన్ని కమ్ముకున్న మేఘాన్ని (నిర్గమ 40:34-35) గుర్తుచేస్తుంది. మేఘములో నుండి వచ్చిన శబ్దము (స్వరము) యేసు బాప్తిస్మ సమయంలో (3:22) తండ్రి పలికిన మాటను పోలి ఉంది. ఇది ద్వితీ 18:16ని పరోక్షంగా సూచిస్తుంది. ఆ భాగంలో రాబోతున్న మోషే లాంటి ప్రవక్త (మెస్సీయ) మాట వినుడని ఇశ్రాయేలును దేవుడు ఆజ్ఞాపించాడు. 

9:36 తన పునరుత్థానం వరకూ ఎవరితోనూ ఈ సంఘటన గురించి ఏమీ చెప్పవద్దని యేసు ఈ ముగ్గురికీ ఆజ్ఞాపించాడని మత్తయి 17:9 చెబుతుంది. అయితే లూకా మాత్రం ఈ ముగ్గురు అపొస్తలులు తమకు కలిగిన ఈ అనుభవం గురించి ఎందుకు తెలియజేయలేదో చెప్పలేదు. రూపాంతర సమయంలో తనకు కలిగిన అనుభవాన్ని పేతురు 2 పేతురు 1:16-18లో గుర్తు చేస్తున్నాడు. 

9:37-43 బాలుణ్ణి దయ్యం పట్టినందువల్ల అతనికి పక్షవాతం వస్తుండేది. ఆ బాలుణ్ణి స్వస్థపరచలేకపోయింది యేసు రూపాంతరం చూడని తొమ్మిదిమంది శిష్యులా లేక ఇతరులా అనేది స్పష్టంగా తెలియదు. విశ్వాసము లేనివారు అని యేసు కేవలం అక్కడున్న ప్రజలను అంటున్నాడా లేదా శిష్యుల్నా అనే విషయాన్ని లూకా వివరించలేదు. యేసు దయ్యమును గద్దించి ఆ బాలుణ్ణి వెంటనే స్వస్థపరచి పంపివేశాడు. 

9:44-45 యేసు ఆ దయ్యం పట్టిన బాలుణ్ణి స్వస్థపరచిన తర్వాత (వ.38-43), త్వరలోనే తాను అప్పగింపబడి బంధించ బడబోతున్నానని ప్రకటించాడు. యేసు మాటలు శిష్యుల్ని అయోమయానికి గురిచేశాయి. యేసు మరణ పునరుత్థానాల వరకు ఆ సంగతి వారికి మరుగుచేయబడెను అని లూకా తెలియచేస్తున్నాడు. అదే సమయంలో అప్పగించబడడం గురించీ మరణం గురించీ యేసు మాట్లాడిన దానికి భయపడి వారు ఆ మాటల ఉద్దేశాన్ని అడగడానికి సంశయించారు. 

9:46-48 తమలో ఎవరు గొప్పవాడో అనే ప్రశ్న అపొస్తలుల మధ్య ఒక్కసారి కంటే ఎక్కువగానే తలెత్తింది (22:24). ఈ వాదానికి వారిని పురికొల్పిన ఆ పోటీతత్వపు గర్వం గురించి యేసుకు తెలిసిన వెంటనే ఆధ్యాత్మికంగా ఎవడు అత్యల్పుడై (క్రీస్తు శిష్యునిగా నిజంగా దీనునిగా) ఉంటాడో వాడే గొప్పవాడని ఆయన జవాబు చెప్పాడు.

9:49-50 యేసు పేరట దయ్యములను వెళ్లగొడుతున్న వ్యక్తి ప్రతీ పట్టణంలో ఆయనను వెంబడించువాడు కాకపోయినా, నిజమైన శిష్యుడే అని తెలుస్తుంది. తీర్పు తీర్చడం గురించి జాగ్రత్తగా ఉండాలన్నదే ఇక్కడ ఆత్మీయ నియమం, ఎందుకంటే మీకు విరోధి కానివాడు మీ పక్షంగానే ఉండవచ్చు. దీనికి వ్యతిరేకమైన అంశం 11:23లో కనబడుతుంది.

9:51 ఆయన చేర్చుకొనబడు... దినములు అనే మాటలు. యేసు పరలోకానికి ఆరోహణమవడాన్ని, దానికి దారితీసే సంఘటనలనూ సూచిస్తున్నాయి. స్థిరపరచుకొని అంటే “దృఢనిశ్చయం చేసుకోవడం” అని అర్థం. అపాయమున్నప్పటికీ స్థిరమైన పట్టుదలను వ్యక్తపరిచే హెబీ వర్ణన ఇది. యెరూషలేముకు ప్రయాణం గురించిన ప్రస్తావన లూకా సువార్తలో 3వ ప్రధాన భాగానికి ప్రారంభం (9:51-19:44). 

9:52-56 యేసు సమరయులు ఆరాధించడానికి ఎంపిక చేసుకున్న గెరీజీము పర్వతానికి (యోహాను 4:20-21 చూడండి) కాకుండా యెరూషలేము దేవాలయంలో ఆరాధించడానికి వెళ్తున్నందువలన వాళ్లు ఆయనను చేర్చుకొనలేదు. మార్కు 3:17లో యేసు యాకోబు యోహానులకు “బోయనేసు” అనే మారు పేరు పెట్టాడు. ఆ పేరుకు “ఉరిమెడువారు” అని అర్ధం. ఈ పేరు వీళ్లిద్దరూ త్వరితంగా కోపించే వ్యక్తులని సూచిస్తున్నది. ఆకాశము నుండి అగ్నిని దింపడం 2రాజులు 1:9-16లో ఏలీయా చేసిన కార్యాన్ని గుర్తు చేస్తుంది. 

9:57-58 యేసు తనను వెంబడించడానికి తీర్మానించుకునే ముందు చెల్లించాల్సిన వెల గురించి ఆలోచించమని శిష్యుడు కావాలనుకుంటున్న ఈ వ్యక్తిని హెచ్చరించాడు. ఎందుకంటే విశ్రమించడానికి తనకే స్థలము లేదని ఆయన చెప్పాడు. క్రీస్తును వెంబడించడమంటే సాధారణంగా భౌతికమైన భావోద్వేగాలకు భద్రతను సమకూర్చే వాటిపైన మనకున్న ఆశలను వదలుకోవడమే. 

9:59-60 ఈ వ్యక్తి తండ్రి ఇప్పటికే మరణించాడనే విషయం సందేహమే. ఒకవేళ అతని తండ్రి మరణించాడన్నది వాస్తవమైతే, అతడు యేసుతో మాట్లాడుతూ ఉండే బదులు సమాధి చేసే కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండేవాడు. అందువల్ల యేసును వెంబడించడానికి దేవుని రాజ్యమును ప్రకటించుట అనే అతనికున్న బాధ్యతను నిర్వర్తించడంలో వీలైతే కొన్ని సంవత్సరాలపాటు ఆలస్యం చేయడానికి ఈ వ్యక్తి చెబుతున్న సాకులే ఈ మాటలు. 

9:61-62 ఒక శిష్యుని జీవితంలో అతని కుటుంబం కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత తనకు ఇవ్వాలని యేసు 14:26లో స్పష్టం చేశాడు. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకతట్టు చూడడం అంటే “భూమిని దున్నుతుండగా భుజాలపై నుండి వెనుకకు చూడడం” అని అర్థం. ఇలా వెనక్కి చూస్తూ ఉంటే నేలను తిన్నగా దున్నడం అసాధ్యమే. అలాగే వెనక్కి తిరిగి చూసే క్రైస్తవులు క్రీస్తును వెంబడించలేరు. ఆయన ఆజ్ఞను బట్టి ముందుకు సాగుతూ కేవలం ఆయనను సేవించడంపై మన దృష్టి సారించాలి. 


Shortcut Links
లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |