ప్రకటన గ్రంథము


  • Author: Sajeeva Vahini
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini

ఆదికాండము ప్రారంభ గ్రంథముగానున్నట్లు ప్రకటన గ్రంథము చివరి గ్రంథముగానున్నది. ఇందులో దేవుని యొక్క విమోచనా ఉద్దేశము సంపూర్తిస్థానము నధిష్టించుచున్నది. సువార్త పుస్తకములును, పత్రికలును అనేక ప్రవచనములతో యిమిడియున్నప్పటికిని ప్రవచన సందర్భములను కేంద్రము చేసికొని వ్రాయబడిన ఒకే క్రొత్త నిబంధన గ్రంథము, ప్రకటన గ్రంథమే. దాని శీర్షిక “తెరను వివరించి చూపుట” (బయలుపరచి చూపుట) అనునది దీని భావము. ఆ విధముగా ఈ గ్రంథము దేవుని గుణగణమును, సూచక క్రియలను, ఆధారము చేసికొని ఇది వ్రాయబడినది. ఇహలోక న్యాయమునకు న్యాయము తీర్చుటకును, దానిని నూతనపరచుటకును, నీతితో పరిపాలించుటకును ఆ క్రీస్తుకు మాత్రమే అధికారము గలదు.

     గ్రీకు పరిశుద్ధ గ్రంథములో దీని శీర్షిక “యోహానుకు కలిగిన ప్రత్యక్షత " అనునదైయున్నది. ప్రత్యక్షత అని మాత్రమే ఒక పేరు దీనికి ఉన్నది. మరుగైయున్న ఒక దానిని ప్రత్యక్ష పరచి చూపునది ఈ గ్రంధమైయున్నది. ఈ పుస్తకమును కొంచెము అధిక శ్రేష్టమైన ఒక శీర్షిక ప్రకటన గ్రంథం 1:1లో కనిపించుచున్నది. “యేసుక్రీస్తు... ప్రత్యక్షత ” అనునదే ఆ శీర్షిక. క్రీస్తులో నుండి ఉద్భవించిన ప్రత్యక్షత అనియో, క్రీస్తును గూర్చిన ప్రత్యేకత అనియో దీని భావముగా చెప్పవచ్చును. రెండును సరియైనవే.

ఉద్దేశము:- క్రీస్తు యొక్క పరిపాలనను సంపూర్ణముగా ప్రత్యక్షపరచబడుట, విశ్వాసులకు హెచ్చరికయు నమ్మకత్వమును ఇచ్చుట.

గ్రంథకర్త:- అపొస్తలుడైన యోహాను.

ఎవరికి వ్రాసెను?:- ఆసియలోని ఏడు సంఘములకును ప్రపంచమంతటిలో నున్న విశ్వాసులకును.

వ్రాయబడిన కాలము:- సుమారు క్రీ.శ.95. పత్మాసు దీవిలో నుండి.

ఆంతర్యము:- డొమీషియన్ చక్రవర్తి క్రింద (క్రీ.శ. 90-95) ఉపద్రవములననుభవించుచుండిన ఆసియలోని ఏడు సంఘములకును ఈ పుస్తకమును యోహాను వ్రాసెను. ఆసియలో నుండి చాలా దూరముగానున్న పత్మాసు దీవికి రోమా అధికారులు యోహానును దేశదిమ్మరిగా కొనిపోయిరి. క్రీస్తు యొక్క మానవావతారమునకు సూటియైన సాక్షిగా నున్న యోహాను ఇప్పుడు, మహిమపరచబడిన క్రీస్తును దర్శించుచున్నాడు. రాబోవు కాలములలో దుష్టత్వమునకు వచ్చు న్యాయ తీర్పును దేవుని యొక్క పరిపూర్ణమైన విజయమును యోహానుకు దేవుడు ప్రత్యక్ష పరచెను.

ముఖ్య వ్యక్తులు:- యేసు, యోహాను.

ముఖ్య స్థలములు:- పత్మాసు, ఆసియలోని ఏడు సంఘములు, నూతన యెరూషలేము.

ముఖ్య పదజాలము:- క్రీస్తు యొక్క రాకడను గూర్చిన ప్రత్యక్షత.

ముఖ్య వచనములు:- ప్రకటన గ్రంథం 1:19; ప్రకటన గ్రంథం 11:15.

గ్రంధ విశిష్టత:- ఈ పుస్తకము ఒక స్వరూపములోనున్న ఒక ప్రవచన గ్రంథము. శ్రమల మార్గమున వెళ్లువారికి నమ్మకమునిచ్చు పోలికలు ఇందులో వర్ణించబడుచున్నవి.

ముఖ్య అధ్యాయములు:- అధ్యాయము 19-22 వరకు.

     ఈ అధ్యాయములలో ప్రపంచపు చివరిదినములను, నిత్యత్వమును గూర్చిన దేవుని తీర్మానమును అర్ధసహితమైన భాషలో వ్రాయబడియున్నది. దీనిని జాగ్రత్తగా నేర్చుకొని లోబడువారికి దేవుడు వాగ్దానము చేసిన ఆశీర్వాదములు లభించును (ప్రకటన గ్రంథం 1:13) ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అను యేసు యొక్క వాక్కులు మన హృదయాంతరంగములో భద్రముగా వదిలపరచుకొనవలసినవి.

గ్రంథ విభజన:- దానియేలు, జెకర్యాలాంటివారి ప్రవచనములవలె ప్రత్యక్ష భాష క్రియాపూర్వకముగా ఒక ప్రవక్త ద్వారా వ్రాయబడిన ఒక పుస్తకము ఇదియే. (ప్రకటన గ్రంథం 10:11; ప్రకటన గ్రంథం 22:9). ఇది ఒక ప్రవచన గ్రంథమని వ్రాయబడియున్నది. (ప్రకటన గ్రంథం 1:3; ప్రకటన గ్రంథం 22:7; ప్రకటన గ్రంథం 22:10; ప్రకటన గ్రంథం 22:18-19). దీనియొక్క మహాత్మ్యమైన ప్రత్యక్ష సంభవములో మూడు గొప్ప సంఘటనలు యిమిడియున్నట్లు ప్రకటన గ్రంథం 1:19 లో చెప్పబడుచున్నది. అవియే ఈ గ్రంథము యొక్క మూడు భాగములు.

  1. యోహాను చూచినవి - అధ్యాయము 1
  2. ఇప్పుడు ఉన్నవి - అధ్యాయము 2, 3
  3. రానైయున్న సంభవములు - అధ్యాయములు 4-22 వరకు.

కొన్ని గుర్తింపు వివరములు:- పరిశుద్ధ గ్రంథమందలి 66వ గ్రంథము; అధ్యాయములు 22; వచనములు 404; ప్రశ్నలు 9; చారి|తక వచనములు 53; నెరవేరిన ప్రవచనములు 10; నెరవేరని ప్రవచనములు 341.