నహూము


  • Author: Sajeeva Vahini
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini

ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వాని యొద్ద ఎక్కువగా తీయ జూతురు; మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. లూకా 12:48. ఏకైక సత్యదేవుని తెలిసికొనే మంచి అవకాశము నీనెవెకు లభించినది. యోనా సందేశమును వినిన ఈ మహా పట్టణము మారు మనస్సు పొందినది. అందువలన దేవుడు తన అత్యంత కృపచేత దాని మీదికి రావలసిన శిక్షను నిలిపివేసెను. అయితే 100 సంవత్సరముల తరువాత ప్రవక్తయైన నహూము అదే పట్టణమునకు కలుగబోవు దుర్గతిని గూర్చి తన గ్రంథములో ప్రవచించుట చూడగలము. అష్హూరీయులు తమ ఆత్మీయ ఔన్నత్యము నుండి దిగజారిన తరువాత, వారు మరల తమ అక్రమములను, విగ్రహారాధనలను, దుష్టకర్మములను అనుసరించి. ఆ హేతువు చేతనే ఈ పట్టణమును బబులోను సర్వనాశనము చేయునని భూమిపై దీని పేరు చెరిపివేయబడునని నహూము ప్రవచించెను. ఈ ప్రవచనము మిక్కిలి భయంకరముగా అక్షరాలా నెరవేరెను. హెబ్రీ నామమైన నహూము నెహెమ్యా అను పేరుకు సంక్షిప్త రూపము. నహూము అనగా యెహోవా యొక్క ఆదరణ అని అర్ధము. అష్హూరు రాజధానియైన నీనెవె పతనమును గూర్చిన ప్రవచన వర్తమానము, నీనెవె చేతిలో శ్రమలు అనుభవించిన యూదాకును, ఇతర ప్రజలందరికిని మిక్కిలి ఆదరణ కరముగా నుండెను.

గ్రంథకర్త : నహూము, పాతనిబంధనలో నహూము 1:1 లో మాత్రమే ప్రవక్తయైన నహూమును గూర్చి లిఖింపబడియున్నది. అందు ఆయన ఎల్కోషు వాడు అని పిలువబడుచున్నాడు. ఎల్కోషు అను పేరుగల స్థలము ఎక్కడ ఉన్నది? దీనిని గూర్చి నాలుగు అభిప్రాయములు గలవు. (1). 16వ శతాబ్దములో నున్న ఒక సంప్రదాయమును బటి ఇరాక్ లోని అల్ కూస్ పటణమే ఈ ఎల్కొషు. ఈ పట్టణము ఇరాక్ లో, నేనెవేకు ఉతరమున టెగ్రీస్ నదీతీరమున గలదు. (2). గలలీయలోని రామా పట్టణమునకు సమీపమున నున్నట్టియు, ఎల్కెషి అని పిలువబడుచున్నట్టియు పట్టణమే ఎల్కోషు అని ఆది సంఘ పితరులలో ఒకరైన జరోము తలంచెను. (3). కప్నెహూము అనగా నహూము యొక్క నగరము అని అర్ధము. పూర్వము ఎల్కోషు అని పిలువబడిన పట్టణమే, నహూము జ్ఞాపకార్థముగా కపెర్నహూముగా మార్చబడినది అని కొందరు నమ్ముచున్నారు. (4). ఎల్కోషు అనునది దక్షిణ యూదాలో యెరూషలేమునకును, గాజాకును మధ్యలో ఉన్నదనియు, కాలక్రమములో ఎల్కేషేయి అని పిలువబడినదనియు బైబిలు పండితులలో అధిక సంఖ్యాకులు అభిప్రాయపడుచున్నారు. ఆఖరున చెప్పబడిన అభిప్రాయము ననుసరించి నహూము ప్రవక్త దక్షిణ దేశమైన యూదాకు జెందినవాడు. ఆయన యూదా విజయమును సంతోషముగా ప్రవచించుటను బట్టి ఆయన యూదా ప్రాంతమునకు జెందిన వాడని విశదమగుచున్నది (నహూము 1:15; నహూము 2:2)

నహూము కాలము : బబులోను దండయాత్ర ఫలితముగా నీనెవె క్రీ.పూ 612లో నాశనము చేయబడినది. నహూము 3:8-10 వచనములలో వ్రాయబడిన దానిని బట్టి నైలు నదీతీరమున నున్న తేబేసు (నో అమ్మోను) నాశనము నగరము యొక్క నాశనము సమీపకాల సంభవము తెలుపుచున్నది. తేబేసు నగరము

క్రీ.పూ. 663వ సంవత్సరములలో పతనమాయెను. కావున నహూము కాలము క్రీ.పూ. 663 కును, క్రీ.పూ. 612కును మధ్య కాలమనునది స్పష్టము. తేబేసు పట్టణము పతనమైన తరువాత పది సంవత్సరములకు, క్రీ.పూ. 693లో మరల నిర్మింపబడినదని చరిత్ర పుటలు వివరించుచున్నవి. నహూము తన గ్రంథమును

క్రీపూ 663కును, క్రీ.పూ. 654 కును మధ్య కాలములో వ్రాసియుండవచ్చునని తలంచవచ్చును. గ్రంథ ప్రారంభములో రాజులలో ఎవరి పేరైనను ప్రస్తావింపబడక పోవుటను బట్టి రాజైన మనష్హే (క్రీ.పూ. 697 – 642) దేవుని దృష్టికి చెడ్డవాడైయుండుటయే కారణమని తలంచవచ్చును.

     యోనా ప్రవచన వర్తమానము విని నీనెవె ప్రజలు పశ్చాత్తాపబడిన సంఘటన క్రీ.పూ. 759లో జరిగినది. ఈ పశ్చాత్తాపము, మారుమనస్సు తాత్కాలికమైనదిగా నుండెను. అష్హూరీయులు అనతి కాలములోనే తిరిగి తమ క్రూరత్వమునకు మరలిరి. క్రీ.పూ 722 లో అష్హూరు రాజైన రెండవ షార్గోను ఉత్తర రాజ్య ( ఇశ్రాయేలు) రాజదానియైన షోమ్రోనును నాశనము చేసి, పది గోత్రముల వారిని చెదరగొట్టి వారిని బానిసలుగా అష్హూరునకు తీసికొని పోయెను. క్రీపూ 701లో అష్హూరు రాజైన సేన్హరీబు మహా గొప్ప సైన్యము యూదాను జయించుటకు విఫలయత్నము చేసెను. క్రీ.పూ 669 - 633 వరకు రాజ్యమేలిన అషూర్ పాని పాల్ కాలములో కీర్తి ఔన్నత్యము నొందియున్నది. నీనెవె పట్టణము దానికి రాజధాని.

భూమి మీద మిక్కిలి ప్రఖ్యాతిగాంచిన ఈ నీనెవె పట్టణము చుట్టూ 100 అడుగుల ఎత్తును, ఏక కాలములో మూడు రథములను ఒకదాని ప్రక్క మరొకదానిని ఉంచి నడుపుటకు తగినంత వెడల్పును గల కోటయున్నవి. కోటలోపల పలు ప్రాంతములలో కనబడు మేడమిద్దెలు ఇంకను 100 అడుగుల ఎక్కువ ఎత్తుగలవై యుండెను. వీటి అన్నింటి కంటె మిన్నగా కోట చుట్టూ 150 అడుగుల వెడల్పును 60 అడుగుల లోతును గల కందకము గలదు. ఇంత గొప్ప నీనెవె పట్టణము సర్వనాశనము చేయబడునని నహూము ప్రవచనము చెప్పుచుండెను. ఆ కాలములో ఈ ప్రవచనము నమ్మశక్యము కానిదిగా నుండెను.

     క్రీ.పూ 663 తరువాత అషూరును పాలించిన రాజులకాలములో ఆమహా సామ్రాజ్యపు కీర్తి పతనమగుట ప్రారంభించెను. నహూము 1:8 లో నీనెవె పట్టణము ఒక మహా నది ప్రవాహము ద్వారా నాశనమగునని చెప్పబడియున్నది. అది అక్షరాలా నెరవేరెను. టైగ్రీస్ నది పొర్లి ప్రవహించి నీనెవె కోటగోడలో కొంత భాగమును పడగొట్టెను. కోట పడిపోయిన భాగము ద్వారా బబులోను సైన్యందండెత్తి క్రీ.పూ 612లో నగరమును స్వాధీనం చేసికొనిన పిదప దానిని అగ్నికి ఆహుతిచేసెను. నహూము 3:11 లో నీవును మత్తురాలవై దాగుకొందువు, శత్రువు వచ్చుట చూచి ఆశ్రయ దుర్గము వెదకుదువు అని వ్రాయబడిన ప్రకారముగానే క్రీ.పూ. 612లో నశించిపోయిన నీనెవె స్థానం మరువబడెను. 2500 సంవత్సరముల కాలము వరకు లోకములో అజ్ఞాతముగా నుండెను. అలెగ్జాండరు, నెపోలియనులు సమీపమున స్థావరమేరుపరచుకొని విశ్రమించెను. కాని వీరికి ఇక్కడ ఒక కాలమున ప్రసిద్ధి చెందిన పట్టణమున్నదను సూచన ఎలాంటిది లభించలేదు. అస్థలము మొత్తం గొర్రెల మేపు ప్రదేశమని పిలువబడెను. నీనెవె సర్వనాశనమాయెను. క్రీ.శ. 1542లో భూశాస్త్ర పరిశోధనలో ఇప్పుడున్న ఇరాక్ లో నున్న టైగ్రీసు నది తీరమున ఇది ఉన్నదని కనుగొనిరి.

ముఖ్య వర్తమానము : నీనెవె న్యాయతీర్పు.

ముఖ్యవచనములు : నహూము 1:7-8 నహూము 3:5-7

ముఖ్య అధ్యాయము : నహూము 1. ఈ అధ్యాయము ఒక ప్రక్క దేవుని ప్రతిదండనయు, కోపమును వర్ణించుటయు, మరో ప్రక్క తమ భక్తులకు శ్రమలకాములో యిచ్చు ఆశ్రయమైన దేవకారుణ్యమును హెచ్చించి చూపుచున్నది. “ఇదిగో సమాధానమును చాటించు సువార్తకుని పాదములు పర్వతముల మీద వచ్చుచున్నవి” అని ప్రారంభించు 15వ వచనము దేవుని బిడ్డలకు దేవుడిచ్చు బద్రతయు, సమాధానమును చెప్పుచున్నది.

గ్రంథ విభజన : మూడు అధ్యాయములు గల ఈ గ్రంథము నీనెవె మీదికి రాబోవు న్యాయ తీర్పును గూర్చి మూడు ముఖ్య కార్యములను రమ్యముగా తెలియ జేయుచున్నది.

  1. నీనెవె నాశనమును చెప్పుచున్నవి : 1 అధ్యాయము (a). న్యాయ తీర్పు జరుగు విధము : నహూము 1:1-8 (b). నీనెవె నాశనము , యూదా విడుదల : నహూము 1:9-15.  2. నీనెవె నాశనము - వివరణ : 2 అధ్యాయములు. (a). యుద్ధమునకు ఆహ్వానము నహూము 2:1-2 (b). నీనెవె నాశనమగుచున్నది నహూము 2:3-13.  3. నీనెవె నాశనము కాబోవుచున్నది. 3 అధ్యాయము (a). నాశనమునకు కారణములు నహూము 3:1-11  (b). నీనెవె నాశనము - ఆగదు నహూము 3:16-19

సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో ఇది 34వ గ్రంథము. అధ్యాయములు 3; వచనములు 47; ప్రశ్నలు 8; ఆజ్ఞలు 5; వాగ్దానములు లేవు; హెచ్చరికలు 72; ప్రవచనములు 46; నెరవేరినవి 40; నెరవేరనివి 6; దేవుని నుండి వచ్చిన ప్రత్యేక వర్తమానములు 2; (నహూము 1:2; నహూము 2:1)

 


Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2023. info@sajeevavahini.com
Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: , . Whatsapp: 8898 318 318 or call us: +918898318318
Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.