Lamentations - విలాపవాక్యములు 3 | View All

1. నేను ఆయన ఆగ్రహదండముచేత బాధ ననుభవించిన నరుడను.

2. ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు.

3. మాటి మాటికి దినమెల్ల ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు

4. ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింప జేయుచున్నాడు. నా యెముకలను విరుగగొట్టుచున్నాడు

5. నాకు అడ్డముగా కంచె వేసియున్నాడు విషమును మాచిపత్రిని నా చుట్టు మొలిపించి యున్నాడు

6. పూర్వకాలమున చనిపోయినవారు నివసించునట్లు ఆయన చీకటిగల స్థలములలో నన్ను నివసింపజేసి యున్నాడు

7. ఆయన నా చుట్టు కంచె వేసియున్నాడు నేను బయలు వెళ్లకుండునట్లు బరువైన సంకెళ్లు నాకు వేసియున్నాడు

8. నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండ తన చెవి మూసికొని యున్నాడు.

9. ఆయన నా మార్గములకు అడ్డముగా చెక్కుడురాళ్లు కట్టియున్నాడు నేను పోజాలకుండ నా త్రోవలను కట్టివేసి యున్నాడు

10. నా ప్రాణమునకు ఆయన పొంచియున్న ఎలుగుబంటి వలె ఉన్నాడు చాటైన చోటులలోనుండు సింహమువలె ఉన్నాడు

11. నాకు త్రోవలేకుండచేసి నా యవయవములను విడదీసి యున్నాడు నాకు దిక్కు లేకుండ చేసియున్నాడు

12. విల్లు ఎక్కుపెట్టి బాణమునకు గురిగా ఆయన నన్ను నిలువబెట్టియున్నాడు

13. తన అంబులపొదిలోని బాణములన్నియు ఆయన నా ఆంత్రములగుండ దూసిపోజేసెను.

14. నావారికందరికి నేను అపహాస్యాస్పదముగా ఉన్నాను దినమెల్ల వారు పాడునట్టి పాటలకు నేను ఆస్పదుడ నైతిని.

15. చేదువస్తువులు ఆయన నాకు తినిపించెను మాచిపత్రి ద్రావకముచేత నన్ను మత్తునిగా చేసెను
అపో. కార్యములు 8:23

16. రాళ్లచేత నా పండ్లు ఊడగొట్టెను బుగ్గిలో నన్ను పొర్లించెను.

17. నెమ్మదికిని నాకును ఆయన బహు దూరము చేసి యున్నాడు మేలు ఎట్టిదో నేను మరచియున్నాను.

18. నాకు బలము ఉడిగెను అనుకొంటిని యెహోవాయందు నాకిక ఆశలు లేవనుకొంటిని.

19. నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచి పత్రిని చేదును జ్ఞాపకము చేసికొనుము.

20. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసికొని నాలో క్రుంగియున్నది అది నీకింకను జ్ఞాపకమున్నది గదా.

21. నేను దీని జ్ఞాపకము చేసికొనగా నాకు ఆశ పుట్టుచున్నది.

22. యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము.

23. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైన నమ్మదగినవాడవు.

24. యెహోవా నా భాగమని నేననుకొనుచున్నాను ఆయనయందు నేను నమ్మిక యుంచుకొనుచున్నాను.

25. తన్ను ఆశ్రయించువారియెడల యెహోవా దయాళుడు తన్ను వెదకువారియెడల ఆయన దయచూపువాడు.

26. నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది.

27. యౌవనకాలమున కాడి మోయుట నరునికి మేలు.

28. అతనిమీద దానిని మోపినవాడు యెహోవాయే. గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండ వలెను.

29. నిరీక్షణాధారము కలుగునేమోయని అతడు బూడిదెలో మూతి పెట్టుకొనవలెను.

30. అతడు తన్ను కొట్టువానితట్టు తన చెంపను త్రిప్ప వలెను. అతడు నిందతో నింపబడవలెను

31. ప్రభువు సర్వకాలము విడనాడడు.

32. ఆయన బాధపెట్టినను తన కృపాసమృద్ధినిబట్టి జాలిపడును.

33. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు.

34. దేశమునందు చెరపట్టబడినవారినందరిని కాళ్లక్రింద త్రొక్కుటయు

35. మహోన్నతుని సన్నిధిని నరులకు న్యాయము తొలగించుటయు

36. ఒకనితో వ్యాజ్యెమాడి వానిని పాడుచేయుటయు ప్రభువు మెచ్చుకార్యములు కావు.

37. ప్రభువు సెలవులేనిది మాట యిచ్చి నెరవేర్చగలవాడెవడు?

38. మహోన్నతుడైన దేవుని నోటనుండి కీడును మేలును బయలు వెళ్లునుగదా?

39. సజీవులేల మూల్గుదురు? నరులు తమ పాపశిక్షనుబట్టి ఏల మూల్గుదురు?

40. మన మార్గములను పరిశోధించి తెలిసికొని మనము యెహోవాతట్టు తిరుగుదము.

41. ఆకాశమందున్న దేవునితట్టు మన హృదయమును మన చేతులను ఎత్తికొందము.

42. మేము తిరుగుబాటు చేసినవారము ద్రోహులము నీవు మమ్మును క్షమింపలేదు.

43. కోపము ధరించుకొనినవాడవై నీవు మమ్మును తరుముచున్నావు దయ తలచక మమ్మును చంపుచున్నావు.

44. మా ప్రార్థన నీయొద్ద చేరకుండ నీవు మేఘముచేత నిన్ను కప్పుకొనియున్నావు.

45. జనముల మధ్య మమ్మును మష్టుగాను చెత్తగాను పెట్టియున్నావు.
1 కోరింథీయులకు 4:13

46. మా శత్రువులందరు మమ్మును చూచి యెగతాళి చేసెదరు.

47. భయమును గుంటయు పాడును నాశనమును మాకు తటస్థించినవి.

48. నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది.

49. యెహోవా దృష్టియుంచి ఆకాశమునుండి చూచు వరకు

50. నా కన్నీరు ఎడతెగక కారుచుండును.

51. నా పట్టణపు కుమార్తెలనందరిని చూచుచు నేను దుఃఖాక్రాంతుడనైతిని.

52. ఒకడు పక్షిని తరుమునట్లు శత్రువులు నిర్నిమిత్తముగా నన్ను వెనువెంట తరుముదురు.
యోహాను 15:25

53. వారు చెరసాలలో నా ప్రాణము తీసివేసిరి నాపైన రాయి యుంచిరి

54. నీళ్లు నా తలమీదుగా పారెను నాశనమైతినని నేననుకొంటిని.

55. యెహోవా, అగాధమైన బందీగృహములోనుండి నేను నీ నామమునుబట్టి మొరలిడగా

56. నీవు నా శబ్దము ఆలకించితివి సహాయముకొరకు నేను మొఱ్ఱపెట్టగా చెవిని మూసికొనకుము.

57. నేను నీకు మొరలిడిన దినమున నీవు నాయొద్దకు వచ్చితివి భయపడకుమి అని నీవు చెప్పితివి.

58. ప్రభువా, నీవు నా ప్రాణవిషయమైన వ్యాజ్యెములను వాదించితివి నా జీవమును విమోచించితివి.

59. యెహోవా, నాకు కలిగిన అన్యాయము నీవు చూచి యున్నావు నా వ్యాజ్యెము తీర్చుము.

60. పగతీర్చుకొనవలెనని వారు నామీద చేయు ఆలోచనలన్నియు నీవెరుగుదువు.

61. యెహోవా, వారి దూషణయు వారు నామీద చేయు ఆలోచనలన్నిటిని

62. నామీదికి లేచినవారు పలుకు మాటలును దినమెల్ల వారు నామీద చేయు ఆలోచనయు నీవు వినియున్నావు.

63. వారు కూర్చుండుటను వారు లేచుటను నీవు కనిపెట్టుము నేను వారి పాటలకు ఆస్పదమైతిని.

64. యెహోవా, వారి చేతిక్రియనుబట్టి నీవు వారికి ప్రతీ కారము చేయుదువు.

65. వారికి హృదయకాఠిన్యము నిత్తువు వారిని శపించుదువు.

66. నీవు కోపావేశుడవై వారిని తరిమి యెహోవాయొక్క ఆకాశము క్రింద నుండకుండ వారిని నశింపజేయుదువు.బైబిల్ అధ్యయనం - Study Bible
3:1 ఇక్కడ ఆయన ఆగ్రహదండము బబులోను. దేవుడు తన ప్రజలకు వ్యతిరేకంగా బబులోనును తన శిక్ష సాధనంగా ఉపయోగించుకున్నాడు (యోబు 9:34; 21:9; కీర్తన 89:32; సామె 22:8; యెషయా 10:5 తో పోల్చండి. అష్నూరు “నా దుడ్డుకట్టు, నా ఉగ్రత" అని వర్ణించబడింది). 

3:2 దారి తీసి (హెబ్రీ నహాగ్) అనే పదాన్ని హెబ్రీలో సాధారణంగా పశువుల మందల్ని మంచి స్థలాలకు నడిపించడాన్ని తెలియజేయడాని కుపయోగిస్తారు (నిర్గమ 3:1), అయితే ఇక్కడ వ్యతిరేకార్థంలో కనబడుతున్నది.

3:3 తప్పు చేస్తున్న తన ప్రజలకు దేవుని హస్తం వ్యతిరేకంగా ఉంది (మాటిమాటికి... ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు), దేవుడు తనకు వ్యతిరేకంగా తన ప్రజలు చేస్తున్న ప్రతి ఆలోచనను ప్రతి కోరికను విఫలం చేస్తున్నాడు. 

3:4-6 దేవునికి వ్యతిరేకంగా ఆయన ప్రజలు తిరుగుబాటు చేయడం యిర్మీయాను క్షీణింపజేసి, అతణ్ణి మృతతుల్యునిగా చేసింది. తన ప్రజలలాగే తాను కూడా కొన ఊపిరితో ఉన్నానని యిర్మీయా అనుభూతి చెందుతున్నాడు. 

3:5 దేవుడు విషమును యిర్మీయా చుట్టు ఆవరించేలా చేశాడు. 

3:6 చీకటిగల స్థలములలో నివసింప జేయడం - యిర్మీయా చుట్టూ ఆవరించి ఉన్న మరణాన్నీ, ప్రతికూలతనూ సూచిస్తుంది (యోబు 12:25; ఆమోసు 5:18). 

3:7-9 దేవుడు తన ప్రతినిధియైన యిర్మీయా చుట్టు కంచె వేసి, అతను కదలకుండా అతనికి బరువైన సంకెళ్ళు వేశాడు. యిర్మీయా బయటికి వెళ్లే దారి లేక చిక్కులలోబడి నడుస్తున్నట్టుగా అనుభూతి చెందుతున్నాడు.

3:10-11 యిర్మీయా మరొక బరువైన అలంకారిక వర్ణనలో దేవుడు పొంచియున్న ఎలుగుబంటివలె, చాటైన చోటులలో ఉండు సింహమువలె (హోషేయ 13:8; ఆమోసు 5:19) ఉన్నాడని చెబుతున్నాడు. ఇక్కడ అలంకారిక వర్ణనలు ఒకదానితో ఒకటి మిళితమై ఉన్నాయి. యిర్మీయా ఇదివరకే ఇశ్రాయేలు. శత్రువుల్ని సింహాలతో పోల్చాడు (యిర్మీయా 5:6; 49:19; 50:44). ఆ విధంగా, దేవుడు ఇశ్రాయేలును ఏం చేయడానికి శత్రువుల్ని అనుమతించాడో అదే వర్ణనను ఇక్కడ దేవునికి ఆపాదించాడు.

3:12 దేవుడు తన ఎరమీద సూటిగా బాణం ఎక్కుపెట్టి సంధించే విలుకానిలాగా వర్ణించబడ్డాడు (యోబు 16:12-13).

3:13-14 దేవుని బాణాలు తన శరీరంలో దూసికొని పోతున్నట్టుగా యిర్మీయా బాధ తీవ్రంగాను బలంగాను ఉంది. యిర్మీయాను అతని స్వంత ప్రజలే అపహాస్యమునకు, హేళనకు ఆస్పదముగా చేసి యున్నారు (యిర్మీయా 20:7).

3:15-16 అపహాస్యపు నవ్వులెంత క్రూరంగా ఉన్నాయంటే చేదు వస్తువులు మాచిపత్రి కలిపిన ఆహారాన్ని భుజిస్తున్నట్టుగా ఉంది. జీవాహారమైన దేవుని వాక్యాన్ని భుజిస్తున్నట్టు కాక, బయలు దేవతారాధన రాళ్లను తినినట్టుగా ఉంది. 

3:17-18 ఇది దేవుని శాపం యిర్మీయా మీద నిలిచిందనే వర్ణన (యిర్మీయా 16:5). యిర్మీయా తనకిక భవిష్యత్తు లేదనుకున్నాడు (నాకు బలము ఉడిగెను), తనకిక యెహోవా యందు ఏ ఆశలు లేవనుకొన్నాడు. 

3:19 యిర్మీయా దుఃఖమెంత లోతుగా ఉన్నదో నాలుగు పదాలు తెలియజేస్తున్నాయి. శ్రమ... దురవస్థ... మాచిపత్రి... చేదు. గతాన్ని గుర్తుచేసుకోవడం యిర్మీయాకు బహు చేదుగా ఉంది.

3:20-24 చేదైన ఆలోచనలు యిర్మీయాను శోధించడం మొదలు పెట్టిన వెంటనే, అతను తన ఆలోచనా సరణిని మార్చుకున్నాడు. వేదనలో విచారంలో మునిగిపోవడానికి బదులు, యెహోవా కృపావాత్సల్యతల్లో తన నిరీక్షణ నుంచుకున్నాడు. ఎందుకంటే ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది. దేవుని కృప యెడతెగకుండా ఉన్నదనడానికి రుజువు యిర్మీయా సజీవుడుగా ఉండడమే. గ్రంథంలోని కీలకమైన అంశం ఇక్కడ కనబడుతుంది. నీవు ఎంతైన నమ్మదగినవాడవు. యెహోవాయే తన భాగమని యిర్మీయా అనుకుంటున్నాడు (కీర్తన 16:5; 73:26; 119:57; 142:5). 

3:25-39 ఈ విభాగంలోని ప్రధాన భావన: యెహోవా దయాళుడు. హెబ్రీలో ఈ విభాగంలోని ఐదు త్రిపదులు (వ. 25-27, 28-30, 31-33, 34-36, 37-39) హెబ్రీ - అక్షరమాలలోని ఒకే అక్షరంతో ప్రారంభం కావడంతో బాటు ప్రతి పంక్తి ఒకే పదంతో ప్రారంభమౌతాయి. 

3:25-27 దేవుని దయాళుత్వం మూడు రూపాల్లో కనబడుతుంది: (1) దేవుడు తన స్వభావంలోను తన అస్తిత్వంలోను దయాగుణం గలవాడు, (2) ఓపికతో మౌనంగా వేచియుండి శ్రమలో నేర్చుకొనేవారికి దేవుడు దయ చూపిస్తాడు, (3) దేవుని ఏర్పాటుకు మనఃపూర్వకంగా లోబడేవారిపై ఆయన దయచూపిస్తాడు. 

3:28-30 మనిషి శ్రమనెలా ఓర్చుకోవాలో ఈ త్రిపది. తెలియజేస్తుంది. (1) దైవిక తలంపులు స్పురించేటట్లు, ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. (2)- కోపంతో మాట్లాడకుండా ఉండడం కోసం బూడిదెలో మూతి పెట్టుకొనవలెను. (3) దీనత్వాన్ని తెలియజేస్తూ తనను కొడుతున్నవాని వైపు తన చెంపను త్రిప్పవలెను. ఒకదానికంటె మరొకటి కష్టసాధ్యమైన పని, ఒక్కొక్కటి దేవుడు తన ప్రజలను శ్రమ నుండి విడిపించగలడనే నిరీక్షణ నింకా ఎక్కువ చేస్తుంది. 

3:31-33 నిరీక్షణాస్పదమైన మూడు కారణాలు. (1) తన ప్రజల్ని ప్రభువు సర్వకాలము విడనాడడు. (2) దేవుడు అనుమతించే బాధలకంటె ఆయన జాలి అధికమైంది. (3) హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధ నైనను కలుగజేయడు, మనుషులు శ్రమపడడం ఆయనకు సంతోషాన్నివ్వదు.

3:34-36 మానవ సమాజంలో క్రూరత్వాన్ని, అన్యాయాన్ని దేవుడు అంగీకరించడు (కీర్తన 22:18, సామె 23:31, యెషయా 53:2). మనుషుల అన్యాయపు క్రియలు దేవుని దృష్టికి మరుగైనవి కావు, ఆయన . ఆధిపత్య పరిధికి వెలుపల ఉన్నవి కావు. ఆయన అన్నిటినీ చూస్తున్నాడు, అన్నిటినీ సరిగ్గా లెక్కిస్తున్నాడు. కాబట్టి దేవుని యెదుట న్యాయము తొలగించుట, మానవహక్కుల్ని ఉల్లంఘించడం ఆయన నుండి తీర్పును ఆహ్వానించడమే (కీర్తన 113:5-6).

3:37. ఈ వచనానికి నేపథ్యం కీర్తన 33:9 లో కనబడుతుంది: “ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకార మాయెను.

3:38 అన్నీ, అంటే కీడును మేలును దేవుని నుండి కలుగుతాయి. కొన్నిసార్లు దేవుడు తన జ్ఞానం చొప్పున కీడును సైతం అనుమతిస్తాడు. 

3:39 ఈ వచనం వ.22లోని అంశాన్ని తెలియజేస్తుంది. సజీవులేల మూల్గుదురు (సణుగుదురు), మనిషి సజీవుడుగా ఉన్నాడనే వాస్తవమే దేవుని కృపాప్రేమలకు ఆయన కనికరానికి ప్రత్యక్ష సాక్ష్యం.. 

3:40-47 యిర్మీయా ఈ వచనం నుండి ఈ అధ్యాయంలోని తక్కిన భాగాన్నంతా ఉత్తమ పురుష బహువచనంలో (మనము, మనకి తెలియజేస్తు న్నాడు. యిర్మీయా ఈ వచనాల్లో తన ప్రజల పక్షాన దేవుని ముందు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రజలు తమ పాపాలను ఒప్పుకొనేలా, వారు యెహోవా తట్టు మళ్లుకొనేలా యిర్మీయా వారిని ప్రేరేపిస్తున్నాడు.

3:40 మనము యెహోవా తట్టు తిరుగుదము (యిర్మీయా 3:1 చూడండి) అనే పదజాలం కంటే మరేదీ ఇంతకంటె మిన్నగా ప్రవక్తల సహజ లక్షణాల్ని వర్ణించలేదేమో. పాత నిబంధనలో ఈ పదజాలం పశ్చాత్తాపాన్ని వెల్లడిపరుస్తుంది. ఇది మనుషులు తమ మార్గములను పరిశోధించి తెలిసికొని, దేవుని వైపు మళ్లాలనే పిలుపు మోసకరమైన వారి హృదయాలకు, వారి కన్నులకు కనబడని అనేక పాపాలు వారి హృదయాల్లో దాగి ఉన్నాయని ఇది సూచిస్తుంది (యిర్మీయా 17:9). 

3:41 దేవుని తట్టు చేతులను ఎత్తడం ప్రార్థించాలనే విజ్ఞప్తిని సూచిస్తుంది (2:19). 

3:42 ఈ వచనం ప్రార్ధనాంశాన్ని తెలియజేస్తుంది. మేము, నీవు (యెహోవా) అనే పదాల మధ్య వ్యత్యాసం స్పష్టంగా, విలక్షణంగా కనబడుతుంది. వారు 

3:43-45 మనుషుల జీవితాల్లో పాపం తిష్టవేసికొని ఉన్నంత కాలం, దేవుడు వారి ప్రార్థనలకు జవాబివ్వడం అసాధ్యం . దేవుని ఉగ్రత అనేది, ప్రార్థన దేవుని యొద్దకు చేరకుండా అడ్డుకొనే మబ్బు లాంటిది. 

3:46-48 ఈ త్రిపదిలోని మూడవ పంక్తి ఉన్నట్టుండి (వ.40 లాగా) నేను చూడగా అని ఉత్తమ పురుష ఏక వచనంలోకి మారుతుంది, ఇశ్రాయేలు శత్రువులకు వ్యతిరేకంగా ఉన్న ఈ విలాపం వ.49 లోను కొనసాగుతుంది.

3:49-51 పట్టణపు స్త్రీలకు (కుమార్తెలందరికి) పట్టిన దుర్గతి యిర్మీయా బహుగా దుఃఖించడానికి గల కారణాన్ని, యెరూషలేముకు కలిగిన సమూల నాశనాన్ని సూచిస్తుంది.

3:52-54 తాను గుంటలో పడిపోయినట్టుగా ఉందని యిర్మీయా తన శ్రమానుభవాన్ని తెలియజేస్తున్నాడు. (యిర్మీయా 38:4-6). తన స్వంత ప్రజలు దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నందుకు, బబులోను వారి చేతిలో వారు అనుభవించే బాధల పట్ల యిర్మీయా తన వేదననూ ఆందోళనను వ్యక్తం చేస్తున్నాడు. నీళ్లు నా తల మీదుగా పారెను అనే పదజాలం అన్నిరకాల కష్టాలను, బాధలను తెలియజేసే అలంకారిక వర్ణన (యోబు 27:20; కీర్తన 42:7; 66:12; 88:7; 124:4; యెషయా 43:2). ప్రజల పక్షాన ప్రతినిధిగా శ్రమనోర్చుకుంటున్న యిర్మీయా తనను పక్షిని తరుముతున్నట్లు... నిర్నిమిత్తముగా తరుముతున్నారని చెబుతున్నాడు. ఈ విధంగా, అతడు మానవులందరి నిమిత్తం వారికి బదులుగా శ్రమననుభవించిన యేసును పోలి ఉన్నాడు (యోహాను 15:21). 

3:55-56 ఈ అధ్యాయంలోని చివరి పన్నెండు వచనాలు విడుదల కోసమైన ప్రార్థనను కలిగి ఉన్నాయి, 1, 2 అధ్యాయాలు ముగిసిన రీతిగా.

3:55 కీర్తనకారుడి లాగా, యిర్మీయా అగాధమైన బందీగృహము నుండి దేవుని నామంలో ప్రార్థిస్తున్నాడు (కీర్తన 130:1).

3:56-57 దేవుడు . యిర్మీయా విజ్ఞాపన విన్నాడు. (నీవు నా శబ్దము ఆలకించితివి). దేవుడు అతనికి అభయాన్నిస్తూ భయపడకుమి అని పలికాడు. 

3:58-60 యిర్మీయా విషయంలో యెహోవాను మించిన న్యాయాధిపతి ఎవరూ లేరు, ఆయన అన్నీ చూచిన వాడు, ప్రవక్త ప్రాణ విషయంలో వ్యాజ్యెమాడ గలవాడు, అతని జీవమును విమోచించ గలవాడు. 

3:61-63 సర్వజ్ఞుడైన యెహోవా అన్నిటినీ విన్నాడు. అంతా చూశాడు. యిర్మీయా మరియు ఇశ్రాయేలు ఆయన మంచి హస్తాల్లో ఉన్నారు. కాబట్టి వారు ధైర్యంగా ఉండవచ్చు.

3:64-66 శ్రమననుభవిస్తున్నవారు ప్రతీకారాన్ని యెహోవాకు అప్పగించాలి (వారికి ప్రతీకారము చేయుదువు). యిర్మీయా తనను శ్రమపెట్టినవారి మీద వ్యక్తిగతంగా ప్రతీకారం తీర్చుకోడానికి ఎప్పుడూ తన చేతిని పైకెత్తలేదు. 


Shortcut Links
విలాపవాక్యములు - Lamentations : 1 | 2 | 3 | 4 | 5 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |