Jeremiah - యిర్మియా 22 | View All

1. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీవు యూదారాజు నగరు దిగిపోయి అక్కడ ఈ మాట ప్రకటింపుము

2. దావీదు సింహాసనముమీద కూర్చుండు యూదా రాజా, నీవును ఈ గుమ్మములద్వారా ప్రవేశించు నీ ఉద్యోగస్థులును నీ జనులును యెహోవా మాట వినుడని ప్రకటింపుము.

3. యెహోవా ఈలాగు ఆజ్ఞనిచ్చుచున్నాడు మీరు నీతి న్యాయముల ననుసరించి నడుచుకొనుడి, దోచుకొనబడినవానిని బాధపెట్టువాని చేతిలోనుండి విడిపించుడి, పరదేశులనైనను తండ్రిలేనివారినైనను విధవ రాండ్రనైనను బాధింపకుడి వారికి ఉపద్రవము కలుగజేయకుడి, ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి.

4. మీరు నిశ్చయముగా ఈలాగున చేసినయెడల దావీదు సింహాసనముమీద కూర్చుండు రాజులు రథములను గుఱ్ఱములను ఎక్కి తిరుగుచు, ఉద్యోగస్థుల సమేతముగాను జనుల సమేతముగాను ఈ నగరు ద్వారములగుండ ప్రవేశింతురు.

5. మీరు ఈ మాటలు విననియెడల ఈ నగరుపాడై పోవును, నా తోడని ప్రమాణము చేయుచున్నాను; ఇదే యెహోవా వాక్కు.
మత్తయి 23:38, లూకా 13:35

6. యూదారాజు వంశస్థులనుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా యెన్నికలో నీవు గిలాదువలెనున్నావు, లెబానోను శిఖరమువలె ఉన్నావు; అయినను నిశ్చయముగా ఎడారిగాను నివాసులు లేని పట్టణములుగాను నేను నిన్ను చేయుదును.

7. నీమీదికి వచ్చుటకై యొక్కొక్కడు తన ఆయుధములను పట్టుకొను సంహారకులను నేను ప్రతిష్టించుచున్నాను, వారు నీ దేవదారు చెట్లలో శ్రేష్ఠమైనవాటిని నరికి అగ్నిలో పడవేతురు.

8. అనేక జనులు ఈ పట్టణపు మార్గమున పోవుచు యెహోవా యెందు నిమిత్తము ఈ గొప్పపట్టణమును ఈలాగు చేసెనని యొకని నొకడు అడుగగా

9. అచ్చటి వారువీరు తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాకరించి అన్యదేవతలను పూజించి వాటికి నమస్కారము చేసినందున ఆయన ఈలాగున చేసియున్నాడని చెప్పుదురు.

10. చనిపోయినవానిగూర్చి యేడవవద్దు, వానిగూర్చి అంగ లార్చవద్దు; వెళ్లిపోవుచున్నవానిగూర్చి బహు రోదనము చేయుడి. వాడు ఇకను తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు.

11. తన తండ్రియైన యోషీయాకు ప్రతిగా ఏలిన వాడై యీ స్థలములోనుండి వెళ్లిపోయిన యూదారాజైన యోషీయా కుమారుడగు షల్లూమునుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అతడు ఇక్కడికి తిరిగి రాడు;

12. ఈ దేశము నిక చూడక వారు అతని తీసికొని పోయిన స్థలమునందే అతడు చచ్చును.

13. నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ; న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు, జీతమియ్యక తన పొరుగువానిచేత ఊరకయే కొలువు చేయించుకొనువానికి శ్రమ.

14. వాడు విశాలమైన మేడ గదులుగల గొప్ప మందిరమును కట్టించుకొందుననుకొని, విస్తారమైన కిటికీలు చేసికొనుచు, దేవదారు పలకలను దానికి సరంబీవేయుచు, ఇంగిలీకముతో రంగువేయుచు నున్నాడే;

15. నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొనుటచేత రాజవగుదువా? నీ తండ్రి అన్న పానములు కలిగి నీతిన్యాయముల ననుసరించుచు క్షేమముగా ఉండలేదా?

16. అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రదికెను, ఆలాగున చేయుటే నన్ను తెలిసి కొనుట కాదా? యిదే యెహోవా వాక్కు.

17. అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుటయందే, నిరపదాధుల రక్తము ఒలికించుటయందే నిలిచియున్నవి. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలాత్కారము చేయుచున్నావు.

18. కావున యోషీయా కుమారుడగు యెహోయాకీమను యూదారాజునుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరీ, అని అతని గూర్చి అంగలార్చరు; అయ్యో నా యేలినవాడా, అయ్యో, శోభావంతుడా; అని అతనికొరకు అంగ లార్చరు.

19. అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడువబడి పారవేయబడి గాడిద పాతిపెట్టబడురీతిగా పాతిపెట్టబడును.

20. నీ విటకాండ్రు నాశనమైరి. లెబానోనును ఎక్కి కేకలువేయుము; బాషానులో బిగ్గరగా అరువుము, అబారీమునుండి కేకలువేయుము.

21. నీ క్షేమకాలములలో నీతో మాటలాడితిని గానినేను విననని నీవంటివి; నామాట వినకపోవుటే నీ బాల్యమునుండి నీకు వాడుక.

22. నీ కాపరులందరు గాలి పీల్చుదురు, నీ విటకాండ్రు చెరలోనికి పోవుదురు, నీ చెడుతనమంతటినిబట్టి నీవు అవమానమునొంది సిగ్గుపడుదువు.

23. లెబానోను నివాసినీ, దేవదారు వృక్షములలో గూడు కట్టుకొనినదానా, ప్రసవించు స్త్రీకి కలుగు వేదనవంటి కష్టము నీకు వచ్చునప్పుడు నీవు బహుగా కేకలువేయుదువు గదా!

24. యెహోవా సెలవిచ్చునదేమనగా యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు కొన్యా నా కుడిచేతికి శిఖా ఉంగరముగా ఉండినను దానిమీద నుండియు నిన్ను ఊడదీసివేసెదనని నాతోడని ప్రమాణముచేయుచున్నాను.

25. నీ ప్రాణమును ఎవరు తీయజూచుచున్నారో నీవెవరికి భయపడు చున్నావో వారి చేతికి, అనగా బబులోనురాజైన నెబుకద్రెజరు చేతికిని కల్దీయుల చేతికిని నిన్ను అప్పగించు చున్నాను.

26. నిన్నును నిన్ను కనిన నీ తల్లిని మీ జన్మ భూమికాని పరదేశములోనికి విసరివేసెదను, మీరు అక్కడనే చచ్చెదరు.

27. వారు తిరిగి రావలెనని బహుగా ఆశపడు దేశమునకు వారు తిరిగి రారు.

28. కొన్యా అను ఇతడు హేయమైన ఓటికుండ వంటివాడా? పనికిమాలిన ఘటమా? అతడును అతని సంతానమును విసరివేయబడి, తామెరుగని దేశములోనికి ఏల త్రోయబడిరి?

29. దేశమా, దేశమా, దేశమా, యెహోవా మాట వినుము.

30. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు సంతానహీనుడనియు, తన దినములలో వర్ధిల్లనివాడనియు ఈ మనుష్యునిగూర్చి వ్రాయుడి; అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండడు; ఇక మీదట ఎవడును యూదాలో రాజుగా నుండడు.



బైబిల్ అధ్యయనం - Study Bible
22:1-2 యిర్మీయా దేవాలయం నుండి లేదా సీయోనుకొండ మీదనుండి దిగిపోయి రాజు నివాసముండే రాజ నగరుకు వెళ్ళాలి, ఇది దేవాలయానికి దక్షిణ దిశలో ఉంది (26:10; 36:12) 

22:3 ఈ వచనంలోని పాపాలు అప్పటి యూదా రాజులందరి పరిపాలనా కాలానికి, మరీ ముఖ్యంగా యెహోయాకీము పరిపాలనా కాలానికి (2రాజులు 23:35) వర్తించేవే. ఇవన్నీ ధర్మశాస్త్రంలో పలుచోట్ల కనబడేవే, మరీ ముఖ్యంగా నిర్గమ 22:21-24; ద్వితీ 10:18-19; 24:17-22; 27:19. 

22:4 దీవెనకు, క్షేమాభివృద్ధికి ఉన్న షరతులు రాజుకు మళ్ళీ ఇవ్వబడు తున్నాయి. మీరు నిశ్చయముగా ఈలాగున చేసినయెడల. ఇలా జరిగినప్పుడు దావీదు వంశం రాజ్యాధికారంలో కొనసాగుతుంది, దేవుడు దావీదుకు వాగ్దానం చేసినట్టుగా దేశంలో ప్రజలు సుఖశాంతులతో జీవిస్తారు (2సమూ 7). 

22:5 యిర్మీయా మాటలకు బలమైన ప్రామాణికతనిస్తూ ఈ సందేశమెంత గంభీరమైనదో నొక్కి చెబుతూ నా తోడని ప్రమాణము చేయుచున్నాను అని యెహోవా ప్రకటించాడు. 

22:6-9 ఈ వచనాలు దావీదు వంశాన్ని కాక, రాజప్రాసాదాన్ని సూచిస్తు న్నాయి. గిలాదు, లెబానోను ప్రాంతాలు దేవదారు వృక్షాలకు ప్రసిద్ధి (1రాజులు 5:6,8-10; 7:2-5; 10:27). అయితే, యెరూషలేము శత్రువు లకు చిక్కినప్పుడు రాజభవనాల్లో దేవదారు కలపతో చేసిన ఎత్తైన స్తంభాల్ని అగ్నిలో కాల్చివేయబోతున్నారు.

22:9 వీరు తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాకరించి అనే పదజాలం ఇక్కడ, ద్వితీ 29:25 లో మాత్రమే కనబడుతుంది. ఇది దేవుడు దావీదుతో చేసిన నిబంధనను కాక (2సమూ 7) సీనాయి నిబంధనను సూచిస్తుంది.

22:10-12 క్రీ.పూ. 609 లో మెగిప్ట్ దగ్గర జరిగిన యుద్ధంలో చనిపోయిన యోషీయా రాజు గురించి విలపించడానికి బదులుగా (2రాజులు 23:29-35; 2దిన 35:24-25), ప్రజలు తమ కన్నీళ్లను యోషీయా కుమారుడైన షల్లూము కోసం నిలువచేసుకోవాలని యిర్మీయా వారితో చెప్పాడు. షల్లూముకు యెహోయాహాజు అనే మారు పేరు కూడా ఉంది. కేవలం మూడు నెలల కాలం మాత్రమే పరిపాలించిన తర్వాత యెహోయాహాజు ఐగుప్తు చెరలోకి వెళ్లడం, అక్కడనే మరణించడం జరుగుతాయి (2రాజులు 23:34). ఈ విషయంలో యోషీయా తన కుమారునికంటే అదృష్టవంతుడే. చెరలో మరణించబోయే మొదటి యూదా రాజు యెహోయాహాజు.

22:13-16 యిర్మీయా క్రీ.పూ. 609-598 మధ్య కాలంలో పరిపాలించిన రాజైన యెహోయాకీముకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఇంతవరకూ అంత తీవ్రంగా యిర్మీయా ఏ రాజునీ వ్యతిరేకించలేదు. ప్రాచీన పశ్చిమాసియాలో రాజులకుండే భవననిర్మాణ పిచ్చి యెహోయాకీముకు కూడా ఉంది, ఈ పిచ్చిలో పడి అతడు మోషే ధర్మశాస్త్రాన్ని సైతం ఉల్లంఘించాడు (లేవీ 19:13; ద్వితీ 24:14-15), యూదాలోని శ్రామిక జనానికి కూలి కూడా ఇవ్వకుండా వారిచేత వెట్టిచాకిరీ చేయించి రాజభవనాలకు మరమ్మత్తులు చేయించాడు. అదే సమయంలో, ఐగుప్తు రాజైన ఫరో నెకోకు భారీ మొత్తంలో కప్పం చెల్లించాడు. యెహోయాకీము విలాస జీవితాన్ని ప్రేమించడంలోను, యూదాను నిరంకుశంగా పరిపాలించడంలోను రాజైన మనషేను అనుకరించాడు (2రాజులు 24:3-4). పూర్వచరిత్ర నుండి అతడు పెద్దగా పాఠాలేమీ నేర్చుకోలేదు. 

22:15 విలాసవంతమైన భవనాలు ఒక వ్యక్తిని రాజును చేస్తాయని యెహోయాకీము ఆలోచన.
అయితే, నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొనుట

చేత రాజవగుదువా అని యిర్మీయా వ్యంగ్యంగా అడుగుతున్నాడు.

22:16 యెహోవాను తెలిసికొనుట అంటే దీనుల దరిద్రుల పట్ల ఆలోచన కలిగి ఉండడం. దీనికి మేధస్సు అక్కర్లేదు. అందరిపట్ల నీతిన్యాయాల్ని జరిగించడానికి దేవునితో వ్యక్తిగత సంబంధం కావాలి. ఈ ప్రకారంగా దేవుణ్ణి తెలుసుకోవడమే ఆయన చిత్రాన్ని జరిగించడం. 

22:17 యెహోయాకీము నిరంకుశుడు, దురాశాపరుడు, దౌర్జన్యకారుడు మాత్రమే కాదు, నిరపరాధుల రక్తము ఒలికించిన అపరాధి కూడా. ఉదాహరణకు, ఊరియా ప్రవక్త తనకు వ్యతిరేకంగా ప్రవచించాడన్న కారణంతో యెహోయాకీము : అతణ్ణి ఐగుప్తునుండి పిలిపించి దారుణంగా చంపించాడు (26:20-23). 

22:18-19 దుష్ట రాజైన యెహోయాకీముకు అవమానకరమైన మరణం రాబోతుంది. అతని స్వంత కుటుంబం (సహోదరుడా... సహోదరీ), స్నేహితులు అతడు మరణించినప్పుడు అంగలార్చి రోదించరు. అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడువబడి పారవేయబడి గాడిద పాతి పెట్టబడురీతిగా పాతిపెట్టబడతాడు.
సరైన రీతిలో సమాధి చేయబడకపోవడం శాపగ్రస్తంగా పరిగణించబడు తుంది (ద్వితీ 28:26). కొంతమంది ఈ ప్రవచనం నెరవేర్పును ప్రశ్నిస్తున్నారు, కారణం “యెహోయాకీము తన పితరులతో కూడ నిద్రించగా” అని 2రాజులు 24:6 తెలియజేయడం. అయితే తన పితరులతో “నిద్రించడం" అనే వర్ణన వేరు, "పాతి పెట్ట బడడం” అనే వర్ణన వేరు (2రాజులు 15:38; 16:20 చూడండి). ఈ ప్రవచనంలోని తరువాయి భాగం నెరవేర్పు లేఖనంలో వివరించబడకపోవడం ఇది జరగలేదని సూచిస్తునట్టుగా భావించకూడదు. 2రాజులు 24:6 వచనం ఈ ప్రవచనానికి భిన్నంగా లేదు. ఎందుకంటే 1రాజులు 21:19; 22:30-38,40 ఇలాగే అవమానకరంగా మరణించిన ఆహాజు రాజు గురించి సైతం ఈ పదాలే వున్నాయి.

22:18 ఈ అంగలార్పు పిలుపు బహుశా క్రీ.పూ. 597 లో నెబుకద్నెజరు యెరూషలేము మీద దాడి చేసిన సందర్భంలో అయ్యుండవచ్చు.

22:20 ప్రజలు ఉత్తరాన ఉన్న లెబానోనును గానీ, మొర్దాను కవతల ఉత్తరంలో ఉన్న బాను లేదా అబారీమును గానీ, మృతసముద్రానికి తూర్పున ఉన్న మోయాబు పర్వతాలను గానీ ఎంచుకొని వాటి మీదనుండి జరగబోయే దాని గురించి అందరికీ వినబడేలాగా రోదించాలనే పిలుపు ఇవ్వబడింది.
నీ విటకాండ్రు అనే పదాలు యూదాలోని నమ్మకస్తులైన దేశభక్తుల్ని, జాతి నాయకుల్ని లేదా బబులోనుకు వ్యతిరేకంగా యెహోయాకీము సహాయం కోసం అర్థించిన ఐగుప్తును, ఇతర జాతుల్ని సూచిస్తుండవచ్చు. 

22:21 క్షేమకాలములలో అనే పదం "నిర్విచారంగా ఉండడం" అనే అర్థాన్ని కూడా ఇస్తుంది. 

22:22-23 నీ కాపరులందరు గాలి పీల్చుదురు అనే మాటలు శబ్దచమ త్కారంలో ఉన్నాయి. రాబోతున్న వినాశనం ప్రసవవేదనను పోలి ఉంటుంది. ప్రసవించు స్త్రీకి కలుగు వేదనవంటి కష్టము ప్రజలకు కలుగుతుంది. 

22:24-30 ఈ వచనాలు యెహోయాకీనును (యెహోయాకీము కుమా రుడు) ఆక్షేపిస్తున్నాయి. కేవలం మూడు నెలలు మాత్రమే పరిపాలించిన యెహోయాకీనుకున్న మరొక పేరు యెకొన్యా, ఈ పేరు యొక్క సంక్షిప్త రూపం కొన్యా (వ.24,28), 37:1 చూడండి. 

22:24 శిఖా ఉంగరము మీద రాజుయొక్క రాజముద్ర ఉంటుంది, రాజముద్ర ఉన్న పత్రాలు రాజు అధికారికంగా విడుదల చేసినవి (హగ్గయి 2:23). యెహోయాకీను పాపాల్ని బట్టి దేవుడు తన శిఖా ఉంగరం మీదనుండి అతనిని తొలగించివేస్తున్నానని అలంకారిక వర్ణనలో తెలియజేస్తున్నాడు, అంటే యెహోయాకీనుకు ఇక అధికారం ఉండదని అర్ధం. క్రీ.పూ. 597లో యెహోయాకీను బబులోను చెరలోకి వెళ్లాడు (2రాజులు 24:8-17; 25:27-30). 22:26 యెహోయాకీను తల్లి నెహుషా (2రాజులు 24:8).

22:29 దేశమా అనే పదం పలుసార్లు రావడం దేవుడు సెలవివ్వబోతున్న సందేశం గంభీరమైందని బలమైందని నొక్కి వక్కాణిస్తుంది. 

22:30 సంతానహీనుడనియు... ఈ మనుష్యుని గూర్చి రాయుడి అనే మాటలు యెహోయాకీనుకు బెదురు పుట్టించే మాటలు, అతనికి ఏడుగురు కుమారులున్నారు (1దిన 3:17). అతని సంతానములో ఎవడును సింహాస నాన్ని అధిష్టించడనే సూచన ఇది. హిజ్కియా వారసులు (యెహోయాకీను, అతని కుమారులు వారసుల లెక్కలోనే ఉన్నారు. “తీసికొని” పోబడి “బబులోను రాజు నగరునందు నపుంసకులగా” చేయబడుదురని యెషయా 39:7 వచనం ముందుగానే చెప్పింది. యెహోయాకీను, అతని కుమారులు బబులోను చెరలో నూనెను సైతం దినసరి భత్యంగా తీసుకున్నారని వీడ్నర్ శిలాఫలకాలు ఆధారపూర్వకంగా తెలియజేస్తున్నాయి. యెహోయాకీను తర్వాత అతని పినతండ్రి సిద్కియా పరిపాలించాడు. అయితే యెహోయాకీను బబులోనులో మరణించడానికి మునుపే సిద్కియా మరణించాడు. యూదాను పరిపాలించిన దావీదు వంశంలోని రాజుల్లో యెహోయాకీను చిట్టచివరిగా చనిపోయిన రాజు. 


Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |