యోహాను శుభవార్తలో యేసుప్రభువు చేసిన అద్భుతాలను “సూచనకోసమైన అద్భుతాలు” అనడం 11 సార్లు కనిపిస్తుంది. ఎందుకంటే అవి చాలా అంతరార్థంతో నిండి ఉన్నాయి. ఆధ్యాత్మిక సత్యాలను అవి చూపిస్తున్నాయి. యేసుప్రభువు ద్వారా దేవుడే పని చేస్తున్నాడనీ, యేసుప్రభువు ఇస్రాయేల్వారి అభిషిక్తుడనీ, దేవుని కుమారుడనీ, పరలోకం నుంచి వచ్చినరాజు అనీ అవి తెలియజేస్తున్నాయి. అవి ఆయన ప్రభావాన్నీ, కృపనూ, ప్రేమనూ వెల్లడి చేస్తున్నాయి. క్రీస్తు ఎవరో మనుషులు అర్థం చేసుకోగలిగేలా సహాయం చేయడమే వీటి ఉద్దేశం. వ 23; యోహాను 3:2; యోహాను 20:30-31 చూడండి. అవి ఉదాహరణలు – మాటల్లో కాదు, చేతల్లో. తండ్రి అయిన దేవుణ్ణి యేసుప్రభువు వెల్లడి చేసిన పద్ధతుల్లో ఇదొకటి (యోహాను 1:17-18). అద్భుతాల గురించి మత్తయి 8:1 నోట్ చూడండి.
“మహాత్యం”– యోహాను 1:14. ఆయన శిష్యులు ఇప్పటికే నమ్మడం మొదలు పెట్టారు. ఈ సూచన మూలంగా వారి నమ్మకం ఎక్కువై స్థిరపడింది.