“భయభక్తులు”– అసలైన విషయానికి వచ్చేశాడు సొలొమోను. దేవుని పట్ల గౌరవపూర్వకమైన భయం, భక్తి భావం లేకుండా నిజమైన జ్ఞానం అసాధ్యం. అలాంటి భయభక్తులు లేకపోతే దేవుని దృష్టిలో జ్ఞానం అనిపించుకొనేదాని కనుచూపు మేరకైనా చేరలేము. ఆదికాండము 20:11; కీర్తనల గ్రంథము 34:11-14; కీర్తనల గ్రంథము 111:10; కీర్తనల గ్రంథము 130:3-4 నోట్స్ చూడండి. ఇలాంటి భయభక్తులు లేనివారు విద్యావంతులై ఉండవచ్చు. మేధావులు, ఆరితేరినవారై ఉండవచ్చు. ఒకవేళ బైబిలు కూడా వారికి బాగా తెలిసి ఉండవచ్చు. అయితే వారికి జ్ఞానం ఉన్నట్లు కాదు. “యెహోవా మీది భయభక్తులు” అనే మాటలు, అలాంటి అర్థాన్నిచ్చే మాటలు సామెతలు గ్రంథంలో 14 సార్లు కనిపిస్తాయి. ఇది ఈ పుస్తకానికి కీలకమైన అంశం. తత్వశాస్త్రం, వేదాంతం, ముఖ్యంగా అద్వైత వేదాంతం వివరించే జ్ఞానానికి బైబిలు వివరించిన జ్ఞానానికి ఎంత వ్యత్యాసం ఉందో జాగ్రత్తగా గమనించండి.
“మూర్ఖులు”– కీర్తనల గ్రంథము 14:1 నోట్ చూడండి. దేవునిపై భయభక్తులను గానీ తద్వారా కలిగే జ్ఞానాన్ని గానీ మూర్ఖులు పట్టించుకోరు. తమ కోరికలను మాత్రం తీర్చుకొంటూ ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించాలని వారి ఆశ. సామెతలు గ్రంథంలో ఎక్కడికక్కడ మూర్ఖులకూ జ్ఞానులకూ తేడా చెప్తూవుండడం కనిపిస్తుంది. ఇక్కడ మూర్ఖులంటే దుర్మార్గులు, జ్ఞానులంటే న్యాయవంతులు. పాపం చేయడం మూర్ఖత్వం, నీతిన్యాయాలతో బ్రతకడం జ్ఞానయుక్తం.