శీర్షిక – దేవుని మనిషి ఎవరైనా ప్రార్థించే మనిషి అయి ఉండడం తప్పనిసరి. ఈ కీర్తనలు గ్రంథంలో మోషే రాశాడని చెప్పిన కీర్తన ఇదొక్కటే. ఇది దాదాపు, 3,400 సంవత్సరాల క్రితం రాయబడింది. ఉనికిలో ఉన్న కీర్తనలన్నిట్లోనూ గీతాలన్నిట్లోనూ అతి ప్రాచీనమైన వాటిలో ఇది ఒకటి, బహుశా అన్నిటికంటే ప్రాచీనమైనదే. మనకు తెలిసిన మోషే ఇతర రచనల్లాగానే పదాల కూర్పు, విషయం, ఈ రెంటిలోనూ ఇది గంబీరమైనది, భావగర్భితమైనది.
మోషే, ఇస్రాయేల్ ప్రజలు ఎడారిలో తిరుగుతూ, గుడారాల్లో నివసిస్తూ ఉన్నారు. వారిది కాని ఒక దేశాన్ని విడిచి, తామింకా స్వంతం చేసుకోని మరో దేశానికి బయలు దేరారు. భూమి పై వారు బాటసారుల్లాగా యాత్రికుల్లాగా పరదేశుల్లాగా ఉన్నారు. అయితే వారికి స్థిరమైన శాశ్వతమైన నివాస స్థలం ఒకటుంది. అది సాక్షాత్తూ యెహోవాదేవుడే. ఈ క్రొత్త ఒడంబడిక యుగంలోని విశ్వాసుల విషయంలో కూడా ఇది వాస్తవమే (యోహాను 17:21; కొలొస్సయులకు 3:3; 1 యోహాను 4:15). దేవుడే మన నివాసం అయినప్పుడు ధనికులపై వారి భవనాల గురించి, రాజుల పై వారి నగరుల గురించి అసూయ చెందవలసిన పని లేదు. ఆ భవనాలు, నగరులు నేలకూలి దుమ్ములో కలిసిపోయినప్పటికీ విశ్వాసుల నివాస గృహమైన సజీవ దేవుడు ఇంకా ఉంటాడు. ఇప్పుడు విశ్వాసులు పూరి గుడిసెల్లో ఉండవలసివచ్చినా, కొండ గుహల్లో తల దాచుకోవలసివచ్చినా (హెబ్రీయులకు 11:37-38) వారికి ఇప్పుడు, శాశ్వతంగానూ నివాసస్థలం దేవుడేనని ఎప్పుడూ మర్చిపోకూడదు.