విశ్వాసులు తమ శత్రువులు నాశనం కావాలనీ ప్రార్థన చెయ్యడం యుక్తమా? పాత ఒడంబడిక రాసిన కాలంలో ఇది యుక్తమే. కీర్తనల్లోలాగా ఇలా ప్రార్థన చేసినవారు దేవుని ఉద్దేశాలకు అనుగుణంగా, పవిత్రాత్మ మూలంగా ప్రార్థన చేస్తే ఇది తగినదే. ఇలాంటి ప్రార్థనలు చాలా కీర్తనల్లో కనిపిస్తాయి – 5, 7, 9, 17, 28, 31, 35, 40, 54, 55, 56, 58, 59, 69, 74, 79, 83, 109, 129, 140. ఇలా ప్రార్థన చేసినప్పుడు అందుకు కారణాలు కూడా అక్కడక్కడా ఇవ్వడం కనిపిస్తూ ఉంది. కీర్తనల గ్రంథము 7:6; కీర్తనల గ్రంథము 9:19-20; కీర్తనల గ్రంథము 28:4; కీర్తనల గ్రంథము 59:13; కీర్తనల గ్రంథము 74:22; కీర్తనల గ్రంథము 83:16 కీర్తనల గ్రంథము 83:18.
కీర్తనలను వ్రాసినవారు వ్యక్తిగతమైన పగ వల్ల కాదు ఇవి రాసినది. న్యాయం జరగాలనే వారి కోరిక. తన సేవకులపై శత్రుత్వం వహించిన దుర్మార్గులపై దేవుడు ప్రతీకారం చేస్తాడనీ, మనుషులు ఏ విత్తనాలు చల్లుతారో ఆ పంటనే కోస్తారన్న సత్యాన్ని వారు తరచుగా నొక్కి చెప్పారు. మనుషులు మరచిపోయే తన న్యాయన్ని ప్రదర్శించడానికీ, తన పవిత్ర స్వభావాన్ని తెలియజేయడానికీ దేవుడు తీర్పుకోసం లేవాలని వీరు ఆశించారు. మనుషులు ఆయనంటే భయం కలిగి ఆయన్ను వెదకి తెలుసుకోవాలని వారి ఉద్దేశం. పేదలు, అవసరతల్లో ఉన్నవారు దుర్మార్గుల దౌర్జన్యం నుంచి తప్పించుకోవాలని వారు కోరారు.
ఈ రచయితలు మోషే ధర్మశాస్త్రం క్రింద బ్రతికారని గుర్తుంచుకోవాలి. ధర్మశాస్త్ర సారం కృప కాదు. సంపూర్ణ న్యాయ సిద్ధే (నిర్గమకాండము 19:21-25 చూడండి). ద్వితీయోపదేశకాండము 27:15-26 లో దేవుడు తానే స్వయంగా ఇస్రాయేల్వారికి ఉపదేశించినవాటికి అనుగుణంగానే దావీదు మనోభావం ఉంది. దేవుని న్యాయమైన తీర్పులు వెల్లడి కావడం మూలంగా ఆయనకు మహిమ కలగడం చూడాలన్న తీవ్రమైన కోరికే ఈ కీర్తనల్లో కనిపిస్తున్నది. దేవుడు తాను చేస్తానని చెప్పినదాన్నే చెయ్యాలని కీర్తనల రచయితలు ప్రార్థించారు అంతే.
ఇప్పుడైతే మనం దేవుని కృపయుగంలో ఉన్నాం. దుర్మార్గులు తమ పాపాలకు తగిన శిక్ష పొందాలని దేవుడు తన ధర్మశాస్త్రంలో నొక్కి చెప్పాడు. ఇప్పుడు, ఈ యుగంలోనైతే పాపంలో పడ్డ మనుషుల పట్ల తన ప్రేమ సువార్తనూ, పాపుల విషయంలో తన ఓపికనూ ఎత్తి చూపిస్తున్నాడు. దేవుని కుమారుడు మనుషులను నాశనం చేసేందుకు రాలేదు గాని రక్షించేందుకే వచ్చాడు (లూకా 19:10; లూకా 9:54-55; యోహాను 3:17). ఇప్పుడు విశ్వాసులు వారి శత్రువుల మేలుకోసం ప్రార్థించాలని దేవుడు వారికి చెప్తున్నాడు (మత్తయి 5:43-44; లూకా 6:27-28; రోమీయులకు 12:19-20; 1 తిమోతికి 2:1-4). మనకు తెలిసినంత వరకు తార్సు పట్టణవాసి పౌలు లాగా వారు కూడా క్రీస్తువైపు తిరిగి స్నేహితులుగా మారతారేమో. ఏది ఏమైనా విశ్వాసులు తమ శత్రువులను ప్రేమిస్తూ వారి విమోచనను కోరాలి. ఈ యుగాంతంలో దేవుడు దుర్మార్గులకు శిక్ష విధిస్తాడు. ఆ సమయంలో దేవదూతలూ, పవిత్రులూ అంతా ఆయన నిర్ణయాలకు ఐకమత్యంగా సమ్మతిస్తారు (ప్రకటన గ్రంథం 6:9-11; ప్రకటన గ్రంథం 16:5-7; ప్రకటన గ్రంథం 19:1-4). కీర్తనల గ్రంథము 109:1 నోట్ కూడా చూడండి.