ఈ ముఖ్యమైన సత్యాన్ని పౌలు ఇక్కడ విశదపరుస్తున్నాడు: క్రీస్తులోని విశ్వాసులు దేవుని ప్రత్యేక ప్రజ. దానికి తగినట్టుగానే వారు నడుచుకోవాలి. ద్వితీయోపదేశకాండము 7:3-6; 1 పేతురు 2:9-12; యోహాను 17:6-10, యోహాను 17:17-19. వ 14లో అన్ని కాలాల్లో అన్ని చోట్లా అందరు విశ్వాసులకూ వర్తించే సూత్రాన్ని పౌలు తెలుపుతున్నాడు. అవిశ్వాసులతో వారెలాంటి దగ్గర సంబంధమూ పెట్టుకోరాదు. “జతగా” ఉండడమంటే ఒకే ఉద్దేశంతో కలిసి ఒక పనిలో పాల్గొనడం. ద్వితీయోపదేశకాండము 22:10 చూడండి. విశ్వాసులు క్రీస్తుతో జతపడ్డారు (మత్తయి 11:28-29). కాబట్టి క్రీస్తును తిరస్కరించిన వారితో జత కట్టకూడదు. విశ్వాసికీ, అవిశ్వాసికీ మధ్య వివాహాన్ని ఇది ఖచ్చితంగా నిషేధిస్తున్నది (1 కోరింథీయులకు 7:39; ఎజ్రా 9:1-2; నెహెమ్యా 13:23-27; మలాకీ 2:12 కూడా చూడండి). అబద్ధమైన శుభవార్తను బోధించేవారితో, బైబిల్లోని ఏదో ఒక మూల సత్యాన్ని కాదనే దుర్బోధకులతో సహవాసాన్ని కూడా ఇది నిషేధిస్తున్నది. అవిశ్వాసులు పని చేస్తున్న చోట విశ్వాసులు పని చేయకూడదని పౌలు అనడం లేదు, లేక తమ పని చేసేందుకు అవిశ్వాసులను జీతానికి పెట్టుకోవద్దనడం లేదు. అవిశ్వాసులతో ఎలాంటి సంబంధం లేకుండా దూరంగా ఉండాలని దీని అర్థం కాదు (1 కోరింథీయులకు 5:9-10). అవిశ్వాసులను క్రీస్తుదగ్గరికి నడిపించాలని పౌలు స్వయంగా వారితో కలిసిమెలిసి ఉన్నాడు (1 కోరింథీయులకు 9:19-23). కానీ ఇక్కడ వారితో దగ్గర సంబంధం, ఒకటే గమ్యం ఉండకూడదనీ, బైబిలు సూత్రాల విషయంలో రాజీపడేలా చేసే సంబంధం, క్రీస్తుతో వారి సహవాసాన్ని చెరపగల ఎలాంటి సంబంధం వారితో ఉండకూడదనీ చెప్తున్నాడు. ఈ నియమానికి వ్యతిరేకంగా ప్రవర్తించే ఏ విశ్వాసి అయినా కష్టాలను కొనితెచ్చుకుంటున్నాడు.
14-16 వచనాల్లో విశ్వాసులు అవిశ్వాసులతో కలవడం ఎంత పొరపాటో, ఎంత తెలివితక్కువతనమో చూపించే ఐదు ప్రశ్నలు అడుగుతున్నాడు. ఎక్కడా పొంతన లేని విషయాలను గానీ వ్యక్తులను గానీ ఒకటిగా చూడకూడదు. దుర్మార్గమంతటి నుంచీ, దుర్మార్గులందరినుంచీ వేరుపడడమన్నది తన ప్రజలకు దేవుని ఆదేశం.
2 కోరింథీయులకు 6:14 “వెలుగు”– విశ్వాసులు వెలుగులో ఉన్నారు, వెలుగంటే వారికి ప్రీతి. వారు వెలుగు సంతానం (మత్తయి 5:14; యోహాను 3:21; యోహాను 8:12; ఎఫెసీయులకు 5:8; 1 థెస్సలొనీకయులకు 5:5). అవిశ్వాసుల పరిస్థితి దీనంతటికీ పూర్తిగా వ్యతిరేకం (యోహాను 3:19; 1 యోహాను 2:9, 1 యోహాను 2:11).