ఈ కీర్తనలో రెండు ముఖ్యాంశాలు ఉన్నాయి. దేవుని అనుగ్రహం, దాని కారణంగా రచయిత ఆలోచించినదీ చేసినదీ. ప్రార్థన వినడంలోను (వ 1-4), తన చర్యల ద్వారా వెల్లడి అయిన ఆయన కృపాభరితమైన స్వభావంలోను (వ 5,6), తన ప్రజలకు విడుదల కలిగించిన పనిలోను (వ 8,9) దేవుని అనుగ్రహం కనిపిస్తున్నది. రచయిత ఆయన అనుగ్రహాన్ని అనుభవిస్తూ అయిదు తీర్మానాలు చేసుకుంటున్నాడు – తాను బ్రతికినంత కాలం ప్రార్థనాపరుడుగా ఉండాలని (వ 2), దేవుని సన్నిధిలో నడుచుకోవాలని (వ 9), రక్షణ పాత్ర చేతపట్టుకోవాలని (వ 13), దేవునికి తాను చేసిన మొక్కుబడి బహిరంగంగా తీర్చుకోవాలని (వ 14,18). కృతజ్ఞతార్పణలు అర్పించాలని (వ 17). ఈనాడు విశ్వాసులు క్రీస్తు సిలువ పై చేసిన బలి అర్పణను బట్టి ఈ కీర్తన రచయితకన్నా మరింత స్పష్టంగా దేవుని అనుగ్రహాన్ని చూడగలరు. అతడితో కలిసి ప్రేమ పూర్వకంగా “దేవుడు నా పట్ల చూపిన అనుగ్రహమంతటికి బదులుగా నేను ఏం ఇవ్వగలను?” అని అడగాలి. దేవుని పట్ల ప్రేమ గుణాలన్నిటిలోకి గొప్పది (ద్వితీయోపదేశకాండము 6:4-6; మత్తయి 22:36-38; 1 కోరింథీయులకు 1:13). దేవునికి మనపట్ల ఉన్న ప్రేమ ఫలితమే ఆయన పై మనకుండే ప్రేమ (1 యోహాను 4:10). ఆయన ప్రార్థనలు వింటాడు, ఇబ్బందులు తీరుస్తాడు, తన గొప్ప అనుగ్రహాన్ని మనపట్ల కనపరుస్తాడు. అందువల్ల మనం ఆయన్ను మరీ మరీ ప్రేమిస్తూ ఉంటాం.