John - యోహాను సువార్త 1 | View All

1. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
సామెతలు 8:22-25

“ఆదిలో”– యోహాను 17:5; ఆదికాండము 1:1; 1 యోహాను 1:1-2. దేవుడు ఈ విశ్వాన్ని చేసినప్పుడు వాక్కు అంతకు ముందునుంచే ఉన్నాడు. విశ్వానికి ఆరంభం ఉంది గానీ వాక్కు శాశ్వతుడు, అన్నిటినీ సృష్టించినవానితో సంపూర్ణ ఐక్యత ఉన్నవాడు. తరువాత వస్తున్న వచనాలు, ముఖ్యంగా 14వ వచనం, వాక్కు అంటే ప్రభువైన యేసు క్రీస్తు అని స్పష్టం చేస్తున్నాయి. వాక్కు అనే మాట సూచించేదేమంటే ఒక భావాన్ని ఇతరులకు చెప్పడం, మాట్లాడడం, సందేశాన్ని తెలియజేయడం. దేవుని మనసులో ఏమున్నదో అది వాక్కుగా యేసు క్రీస్తు మూలంగా ప్రత్యక్షం అయింది. ఆయన తన వ్యక్తిత్వంలో దేవుని హృదయం, స్వభావం బహిరంగంగా వెల్లడి చేసినవాడు (వ 18; యోహాను 10:30; యోహాను 14:9; హెబ్రీయులకు 1:3). ఈ వచనాల్లో దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు అని అర్థం (వ 18 చూడండి). తండ్రిని గురించి నోట్ మత్తయి 5:16. త్రిత్వం గురించి నోట్స్ యోహాను 5:30; మత్తయి 3:16-17; మత్తయి 28:19; 2 కోరింథీయులకు 13:14. “వాక్కు దేవునితో ఉన్నాడు” అంటే వాక్కు, తండ్రి ఒకటే వ్యక్తి కాదన్నమాట. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. “వాక్కు దేవుడే” అంటే ఆయనకు దేవుని స్వభావంలో సంపూర్ణమైన భాగస్వామ్యం ఉన్నదని అర్థం. ఈ సత్యం గురించి ఇతర రిఫరెన్సులు ఫిలిప్పీయులకు 2:6; లూకా 2:11 నోట్స్‌లో ఉన్నాయి. దేవుని “తోకూడా” అనేదాన్ని “ముఖాముఖిగా” అని అనువదించవచ్చు. ఇది సంపూర్ణ సహవాసాన్నీ సూచిస్తున్నది. 1వ వచనం “వాక్కు ఒక దేవుడు” అని చెప్పడం లేదు. లేక “వాక్కు కొంతవరకు దైవ లక్షణాలు ఉన్నవాడు” అనడం లేదు. ఇలా చెప్పే అనువాదం ఏదైనా మూల భాషకు ద్రోహం చేస్తున్నది. మూలభాష గ్రీకులో స్పష్టంగా “వాక్కు దేవుడే” అని రాసి వుంది.

2. ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను,
సామెతలు 8:22-25

3. కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.

ఆది 1వ అధ్యాయం; 1 కోరింథీయులకు 8:6; కొలొస్సయులకు 1:16; హెబ్రీయులకు 1:2. విశ్వాన్ని సృష్టించడానికి తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవునితో, ఆయన ద్వారా పని చేశాడు. ఈ లోకం ఎవరో ఒక ఉపదేవుడు, ఒక చిల్లర దేవుడు చేసిన పని కాదు. ఇది ఏకైక దేవుని సృష్టి.

4. ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను.

వాక్కు కేవలం దేవుని మనసులోని ఒక భావం కాదు. దేవుని చర్యల్లో కనిపించే ఒక సూత్రమూ కాదు. వాక్కు సజీవుడైన ఒక వ్యక్తి. ఆయన ద్వారానే ఈ విశ్వమంతా, అందులో ఉన్నదంతా ఉనికిలోకి వచ్చాయి. యోహాను 5:26; యోహాను 6:57; యోహాను 11:25 చూడండి. ఇప్పుడు ఆయన ద్వారానే మనుషులు నూతన, ఆధ్యాత్మిక, శాశ్వత జీవాన్ని పొందగలరు. – వ 12,13; యోహాను 3:16; యోహాను 5:24; యోహాను 20:31. యోహాను శుభవార్త అంతటా కనిపిస్తూ ఉండే ముఖ్యాంశాల్లో “జీవం” ఒకటి. ఈ పదం 36 సార్లు ఈ పుస్తకంలో కనిపిస్తుంది. యోహానుకు ఇష్టమైన మరో మాట “వెలుగు”. వెలుగు అంటే యోహాను ఉద్దేశం సత్యం, ఆధ్యాత్మిక వాస్తవికత. దేవుని వెలుగును మనుష్యులకు తెచ్చినది యేసు ప్రభువే (యోహాను 8:12; యోహాను 9:5; యోహాను 12:36, యోహాను 12:46). ఆయన దేవుణ్ణి గురించిన సత్యాన్నీ మన గురించి, పాపవిముక్తి గురించిన సత్యాలనూ ఆధ్యాత్మిక జీవనం గురించిన ప్రాముఖ్య సత్యాలన్నిటినీ మనం గ్రహించేలా చేస్తాడు.

5. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను.

దేవుని వెలుగు ఎడతెగక ప్రసరిస్తూనే ఉంటుంది. మనుషులు దాన్ని అర్థం చేసుకోలేకపోవడానికి కారణం యోహాను 3:19; రోమీయులకు 1:18-21; 2 కోరింథీయులకు 4:4 లో ఉంది.

6. దేవునియొద్దనుండి పంపబడిన యొక మనుష్యుడు ఉండెను; అతని పేరు యోహాను.

ఈ యోహాను ఈ శుభవార్త రచయిత యోహాను కాదు. బాప్తిసమిచ్చే యోహాను. మత్తయి 3:1; మత్తయి 11:1 నోట్స్ చూడండి

7. అతని మూలముగా అందరు విశ్వసించునట్లు అతడు ఆ వెలుగునుగూర్చి సాక్ష్య మిచ్చుటకు సాక్షిగా వచ్చెను.

8. అతడు ఆ వెలుగైయుండ లేదు గాని ఆ వెలుగునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను.

9. నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది.

వ 4 – యేసుప్రభువు నిజమైన వెలుగు. అంటే ఆయనకూ, వెలుగు కాకపోయినా తాము వెలుగని చెప్పుకున్నవారికీ ఇతరుల దృష్టిలో వెలుగుగా చెలామణి అయినవారికీ ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయి. దేవుణ్ణి గురించిన సత్యం మొదలైనవాటిని మనుషులకు కనిపించేలా చెయ్యగలడు కాబట్టి యేసు నిజమైన వెలుగు. ఆయన అందరిమీదా, లోకమంతటిమీదా (యోహాను 8:12) వెలుగును ప్రసరింపజేస్తాడు. అయితే అందరూ ఆ వెలుగును స్వీకరించరు.

10. ఆయన లోకములో ఉండెను, లోక మాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు.

“లోకంలో”అనే మాటలు ఈ లోకంలో ఆయన జననం, జీవితాలను సూచించేవి. మనుషులు తమ సృష్టికర్తను గుర్తించలేదు. పాపం వారి మనసులు బండబారిపోయేలా చేసింది. వారి ఆధ్యాత్మిక వివేచనను చంపేసి దేవుని నుంచీ, ఆయన విధానాల నుంచీ వారిని వేరు చేసింది. యెషయా 1:2-3; ఎఫెసీయులకు 4:18; కొలొస్సయులకు 1:21 పోల్చి చూడండి.

11. ఆయన తన స్వకీ యులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు.

“తన స్వజనం”అంటే ఇస్రాయేల్‌వారు, యూదులు. లోకం ఆయన్ను గుర్తించలేకపోవడం మాత్రమే కాదు చాలావరకు ఆయన సొంత జాతే ఆయన్ను ఒప్పుకోలేదు (యోహాను 5:18, యోహాను 5:40; యోహాను 7:47; యోహాను 8:59; యోహాను 19:6-15). అయితే తరువాతి వచనం స్పష్టం చేస్తున్న విధంగా వారిలో కొందరు ఆయన్ను స్వీకరించారు.

12. తన్ను ఎందరంగీకరించిరో వారికంద రికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.

బైబిలంతటిలోని గొప్ప వాగ్దానాల్లో ఇది ఒకటి. ఇందులో కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలున్నాయి. మనుషులు సహజంగా దేవుని పిల్లలు కారు. వారు ఆయన పిల్లలుగా కావలసి ఉంది. యోహాను 3:6; యోహాను 8:44; ఎఫెసీయులకు 2:1-2; మొ।। పోల్చి చూడండి. స్వభావ రీత్యా వారు తమ సృష్టికర్తపై తిరగబడి, దేవునికి వేరైన జీవులు (యిర్మియా 17:9; ఆదికాండము 8:21; యెషయా 24:5; యెషయా 59:1-2; రోమీయులకు 3:9-19). దేవుడు మనుషుల దగ్గరికి పంపిన వెలుగు, వాక్కు, రక్షకుడు, ముక్తిదాత అయిన యేసుప్రభువును స్వీకరించడం ద్వారానే వారు దేవుని పిల్లలు కాగలరు. ఆయన్ను స్వీకరించడం అంటే ఆయన మీద నమ్మకం ఉంచడం. “నమ్మకం” ఈ శుభవార్తలో అతి ప్రాముఖ్యమైన పదాల్లో ఒకటి. “నమ్మకం అని తర్జుమా చేసిన గ్రీకు పదం రకరకాల ప్రయోగాలు ఈ శుభవార్తలో సుమారు 100 సార్లు కనిపిస్తాయి. బైబిలులో మరి ఏ పుస్తకంలోనూ ఇన్ని సార్లు ఈ మాట కన్పించదు. మనం ఆయన్ను నమ్మకం ద్వారానే స్వీకరిస్తాం, నమ్మకం ద్వారానే దేవుని పిల్లలమౌతాం (యోహాను 3:15-16, యోహాను 3:36; యోహాను 5:24; యోహాను 6:47; అపో. కార్యములు 16:31; రోమీయులకు 10:9; గలతియులకు 3:26). ఆయన పేరు మీద నమ్మకం ఉంచడమంటే ఆయన పై నమ్మకం ఉంచడమే, బైబిల్లో వెల్లడి అయిన ఆయన గుణశీలాలపై, లక్షణాలపై నమ్మకం ఉంచడమే. “అధికారమిచ్చాడు”– మొదటి నుంచి చివరివరకు పాపవిముక్తి దేవుడు ఉచితంగా ఇచ్చినదే. యోహాను 4:10; రోమీయులకు 3:24; రోమీయులకు 4:4-5; రోమీయులకు 6:23; ఎఫెసీయులకు 2:8 చూడండి.

13. వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.

“పుట్టినవారు”– దీని అర్థం కొత్త జన్మ, దేవుని నుంచి నూతన ఆధ్యాత్మిక జీవం పొందడం. యోహాను 3:3; యోహాను 5:21, యోహాను 5:24; ఎఫెసీయులకు 2:1-5; యాకోబు 1:18; 1 పేతురు 1:23; 1 పేతురు 2:2; 1 యోహాను 3:9. ఇది వంశ పారంపర్యంగా వచ్చేది కాదు. ఒక వ్యక్తి తల్లిదండ్రులు లేక పూర్వీకులు దేవుని పిల్లలు కాబట్టి అతడు కూడా దేవుని సంతానమని అనుకోరాదు (3:6). ప్రతి మనిషీ వ్యక్తిగతంగా క్రీస్తును ప్రభువుగా రక్షకుడుగా స్వీకరించి దేవుని నుంచి కొత్త జీవాన్ని పొందాలి (మత్తయి 3:9 పోల్చి చూడండి). ఆధ్యాత్మిక జీవం శారీరకమైన పద్ధతి ద్వారా ఎవరికీ రాదు. ఏ వ్యక్తీ కూడా తన సంకల్పం చేత మరో వ్యక్తిని దేవుని సంతానంగా చెయ్యలేడు. దేవుడొక్కడే అలా చేయగలడు. యేసు ప్రభువును మనుషులు స్వీకరిస్తేనే అలా చేస్తాడు (వ 12). ఆధ్యాత్మిక సంతానాన్ని దేవుడు మాత్రమే పుట్టించగలడు. మానవజాతి అంతా రెండు గుంపులుగా ఉంది – దేవుని మూలంగా పుట్టినవారు, ఆ విధంగా పుట్టనివారు.

14. ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి
కీర్తనల గ్రంథము 45:2, యెషయా 4:2, యెషయా 33:17, యెషయా 60:1-2, హగ్గయి 2:7, జెకర్యా 9:17

“వాక్కు”– వ 1. దేవుడు మనిషి అయ్యాడు. రక్తమాంసాలు, నిజమైన మానవ స్వభావం కలిగినవాడయ్యాడు. ఆయన పేరు యేసు. క్రీస్తులో రెండు స్వభావాలు ఉన్నాయి. ఆ ఒకే వ్యక్తిలో దేవుని స్వభావం, మానవ స్వభావం పరిపూర్ణమైన విధంగా ఏకమయ్యాయి (మత్తయి 1:18-23; లూకా 1:26-35; గలతియులకు 4:4; హెబ్రీయులకు 2:14, హెబ్రీయులకు 2:17). క్రీస్తు వ్యక్తిత్వం దేవుడు వెల్లడి చేసిన గొప్ప రహస్య సత్యం. అందువల్ల దాని గురించి మనం ఎక్కువగా అర్థం చేసుకోలేకపోయినప్పటికీ మనం నమ్మకంద్వారా ఆ సత్యాన్ని స్వీకరించాలి. “కృప”– రోమీయులకు 1:7 నోట్. ఇది కొత్త ఒడంబడిక గ్రంథంలోని గొప్ప మాటల్లో ఒకటి. దేవుని కృప, అనుగ్రహం గురించి 100 కన్నా ఎక్కువ సార్లు కనిపిస్తుంది. కృప అంటే అర్హత లేని పాపులకు దేవుడు పాపవిముక్తినీ కొత్త జన్మనూ ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన అన్నిటినీ ఉచితంగా ఇవ్వడమే. మన కోసం చనిపోయేందుకు తన కుమారుణ్ణి ఇవ్వడమూ, మనలో జీవించేందుకు తన ఆత్మను ఇవ్వడమూ కృప. దేవుని కృప ఎంతో తేటతెల్లంగా యేసు క్రీస్తులో వెల్లడి అయింది. 2 కోరింథీయులకు 8:9 చూడండి. కృప గురించి కొన్ని ప్రాముఖ్యమైన రిఫరెన్సులు వ 17; అపో. కార్యములు 15:11; అపో. కార్యములు 18:27; అపో. కార్యములు 20:24; రోమీయులకు 1:7; రోమీయులకు 3:24; రోమీయులకు 5:2, రోమీయులకు 5:15, రోమీయులకు 5:20-21; రోమీయులకు 6:1, రోమీయులకు 6:14; 2 కోరింథీయులకు 8:9; గలతియులకు 1:6; ఎఫెసీయులకు 1:6; ఎఫెసీయులకు 2:5-10; 2 థెస్సలొనీకయులకు 2:16; తీతుకు 2:11; తీతుకు 3:7; హెబ్రీయులకు 2:9; హెబ్రీయులకు 4:16; యాకోబు 4:6; 2 పేతురు 3:18. “మహాత్యం”– అంటే బహుశా క్రీస్తు స్వరూపం మారిపోయిన సందర్భాన్నీ (2 పేతురు 2:16-17; మత్తయి 17:1-2), మొదటి నుంచి చివరిదాకా కృప, సత్యాలతో నిండి వున్న ఆయన జీవితం, పరిచర్యలను రెంటినీ సూచిస్తున్నది. “సత్యం”– క్రీస్తు అవతారం అంటే సత్యాన్ని వెల్లడి చేయడమే. యోహాను ఒక్కడే సత్యం అనే మాట దాదాపు 25 సార్లు ఉపయోగించాడు (యోహాను 4:24; యోహాను 8:31-32; యోహాను 14:6, యోహాను 14:17; యోహాను 16:13; యోహాను 18:37 చూడండి). పాత ఒడంబడిక గ్రంథంలో కూడా దేవుడు సత్యస్వరూపి అయిన దేవుడు – కీర్తనల గ్రంథము 31:5. యేసు ఆయన అవతారం. “ఒకే ఒక”– క్రీస్తు ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని గట్టిగా నొక్కి చెప్పే విధానం ఇది. తండ్రి అయిన దేవునికి ఆయన దైవస్వభావంలో, శాశ్వతమైన ఉనికిలో పాల్గొన్న ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. ఈ శుభవార్తలో దేవుణ్ణి 122 సార్లు “తండ్రి” అనడం జరిగింది. ఇతర శుభవార్తల్లో కంటే ఇది చాలా ఎక్కువ సార్లు. మత్తయి 5:16 నోట్ చూడండి.

15. యోహాను ఆయననుగూర్చి సాక్ష్య మిచ్చుచు నా వెనుక వచ్చువాడు నాకంటె ప్రముఖుడు గనుక ఆయన నాకంటె ముందటివాడాయెననియు, నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను.

వ 6,30 యోహాను యేసుకన్నా ముందు జన్మించాడు. అతని పరిచర్య కూడా ముందే ఆరంభం అయింది. ఇక్కడ యేసు ఈ లోకంలోకి రాకముందే ఆయన ఉన్నాడని చెప్తున్నాడు రచయిత.

16. ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితివిు.

ఈ వచనం గ్రీకు మూలం అస్తమానం ప్రవహించే కృపను సూచిస్తూ ఉంది. సముద్రం అలల్లాగా ఒక కృప చర్య తరువాత మరో కృప చర్య వస్తూ ఉండడమన్నమాట. ఈ కృప ప్రవహించే మార్గం యేసు క్రీస్తు.

17. ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను; కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను.
నిర్గమకాండము 31:18, నిర్గమకాండము 34:28

ధర్మశాస్త్రం అంటే దేవుడు మోషే ద్వారా సీనాయి పర్వతం పై చేసిన పాత ఒడంబడిక. అది దాదాపు పాత ఒడంబడిక గ్రంథమంతటికీ పునాది. నిర్గమ 19 అధ్యాయం నోట్స్ చూడండి. మోషే రచనల్లో దేవుని కృప, సత్యం బొత్తిగా వెల్లడి కాలేదని కాదు యోహాను ఉద్దేశం. క్రీస్తులో కృప, సత్యం రూపు దిద్దుకున్నాయనీ, ఆధ్యాత్మిక వెలుగు ప్రకాశమానంగా కనిపించిందనీ, కృప ప్రదర్శన అయిందనీ అతని భావం. క్రీస్తు శుభవార్త, మోషే ధర్మశాస్త్రం అనే ఈ రెండు మార్గాలకున్న తేడాను అతడు ఎత్తిచూపుతున్నాడు. ధర్మశాస్త్రం మనుషులకు పాపవిముక్తి కలిగించలేకపోయింది. మనుషులకు అవసరమైన సత్యమంతటినీ అది వెల్లడి చేయలేకపోయింది.

18. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలు పరచెను.

కొందరు వ్యక్తులు అప్పుడప్పుడు దేవుని మహిమ ప్రత్యక్షాన్నీ, మానవ రూపంలో ఆయన స్వరూపాన్నీ చూశారు (నిర్గమకాండము 24:9-11; నిర్గమకాండము 33:22-23; యెషయా 6:1). అయితే ఆత్మ స్వరూపిగా ఉన్న దేవుణ్ణి, మిరుమిట్లు గొలిపే ఆయన మహిమాన్విత తేజోరూపమైన తత్వాన్ని ఎవరూ చూడలేదు (1 తిమోతికి 6:16). “తండ్రి రొమ్మున”– ఇది తండ్రి కుమారుల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని, ప్రేమను సూచిస్తున్నది. వీరిద్దరూ వేరువేరు ప్రత్యేక వ్యక్తులని కూడా గమనించండి. మనుషులు దేవుణ్ణి చూడలేరు. కానీ యేసుప్రభు జీవితం, చర్యలు, మాటల్లో దేవుని లక్షణాలు మనకు సంపూర్ణంగా వెల్లడి అయ్యాయి. ఆయన ఈ లోకానికి రావడంలో ఆయనకున్న గొప్ప ఉద్దేశాల్లో ఒకటి తండ్రి అయిన దేవుడు ఎలాంటివాడో వెల్లడించడమే (యోహాను 8:19; యోహాను 10:30; యోహాను 14:9; యోహాను 17:6).

19. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహానునొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యమిదే.

యోహాను కీర్తి వ్యాపిస్తున్నది. అందువల్ల విషయమేమిటో తెలుసుకోదలిచారు నాటి ఇస్రాయేల్ మతాధిపతులు. యాజుల గురించి నోట్ నిర్గమకాండము 28:1. “లేవీ గోత్రికులు”– సంఖ్యాకాండము 1:47-50.

20. అతడు ఎరుగననక ఒప్పుకొనెను; క్రీస్తును కానని ఒప్పుకొనెను.

“క్రీస్తు” గురించి నోట్ మత్తయి 1:1. తాను ఆ వ్యక్తిని కాదని యోహానుకు తెలుసు. అలాంటి గౌరవం తనదని చెప్పడానికి అతడు ప్రయత్నించలేదు.

21. కాగా వారు మరి నీవెవరవు, నీవు ఏలీయావా అని అడుగగా అతడు కాననెను.
ద్వితీయోపదేశకాండము 18:15, ద్వితీయోపదేశకాండము 18:18

క్రీస్తు రాకడకు ముందు ఏలీయా మరో సారి వస్తాడని యూదులు నమ్మారు (మలాకీ 4:5). మత్తయి 11:14; మత్తయి 17:10-12 నోట్ చూడండి. “ప్రవక్త” గురించిన ఈ ప్రశ్నను యూదులు ద్వితీయోపదేశకాండము 18:15-19 ను ఆధారం చేసుకుని అడిగారు.

22. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగాకానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారునీవెవరవు? మమ్ము పంపినవారికి మేము ఉత్తరమియ్యవలెను గనుక నిన్నుగూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతని నడిగిరి

23. అందు కతడు ప్రవక్తయైన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరాళముచేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పెను.
యెషయా 40:3

యెషయా 40:3; మత్తయి 3:3. అందరి దృష్టి తనవైపు మరలించుకోవాలని గానీ గొప్ప వాణ్ణనిపించుకోవాలని గానీ యోహాను ఉద్దేశం కాదు. యేసుప్రభువు కోసం దారి సిద్ధం చేసే ఒక స్వరంగా కేవలం ఉండడానికి అతనికి సమ్మతమే. మనుషుల పాలిట యేసు క్రీస్తు అన్నీ అయితే తాను వారికి ఏమీ కానివాడుగా ఉండడం అతనికి సంతోషమే (వ 27; యోహాను 3:30). ఇందులో ఇతడు మనందరికీ ఆదర్శం. దేవుడు మనలో చూడాలనుకునేది అణకువే గాని గొప్పవాళ్ళం కావాలనీ, కీర్తి ప్రతిష్ఠలు కలగాలనీ తాపత్రయం కాదు.

24. పంపబడినవారు పరిసయ్యులకు చెందిన వారు

పరిసయ్యుల గురించి నోట్ మత్తయి 3:7.

25. వారు నీవు క్రీస్తువైనను ఏలీయావైనను ఆ ప్రవక్త వైనను కానియెడల ఎందుకు బాప్తిస్మమిచ్చుచున్నావని అతనిని అడుగగా

బాప్తిసం గురించి నోట్ మత్తయి 3:6.

26. యోహాను నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు;

ఈయన యేసుప్రభువు అని అతని ఉద్దేశం. ఇంతవరకు ఎవరూ ఆయన్ను అభిషిక్తుడుగా, దేవుని కుమారుడుగా గుర్తించలేదు. వ 10,11 పోల్చి చూడండి.

27. మీరాయన నెరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను.

మత్తయి 3:11 చూడండి.

28. యోహాను బాప్తిస్మమిచ్చుచున్న యొర్దానునదికి ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగెను.

జెరుసలం దగ్గర మరో బేతనీ ఉంది.

29. మరువాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచి ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల.
ఆదికాండము 22:8, యెషయా 53:6-7

పాత ఒడంబడిక గ్రంథంలో వర్ణించిన బలులను “గొర్రెపిల్ల” అనేమాట గుర్తుకు తెస్తూవుంది. లేవీయకాండము 1:2, లేవీయకాండము 1:10-14; లేవీయకాండము 3:6-8; లేవీయకాండము 14:12, లేవీయకాండము 14:21, లేవీయకాండము 14:24; నిర్గమకాండము 12:3-13; ఆదికాండము 22:7-14. తండ్రి అయిన దేవుడు పాపాలను తీసివేసేందుకు యేసుప్రభువును బలిగా చేస్తాడని యోహాను ఉద్దేశం. రోమీయులకు 3:25; 1 కోరింథీయులకు 5:7; ఎఫెసీయులకు 5:2; హెబ్రీయులకు 9:26; హెబ్రీయులకు 10:12; 1 పేతురు 1:19 పోల్చి చూడండి. ఈ బలి పాత ఒడంబడిక బలుల్లాగా ఇస్రాయేల్‌లోని వ్యక్తుల కోసమో, ఆ జాతి అంతటి కోసమో కాదు. ఇది మానవ జాతి అంతటికోసం. యేసుప్రభువు మానవ పాపాన్నీ, దేవునికి మనిషి చెల్లించవలసిన రుణాల భారమంతటినీ తీసివేశాడు. అంటే మనుషులంతా పాపవిముక్తి పొందారని కాదు. రక్షణ మార్గం, పరిపూర్ణ క్షమాపణ మనుషులందరికీ అందుబాటులోకి వచ్చింది అని అర్థం.

30. నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు; ఆయన నాకంటె ప్రముఖుడు గనుక నాకంటె ముందటి వాడాయెనని నేనెవరినిగూర్చి చెప్పితినో ఆయనే యీయన.

వ 15.

31. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలొ బాప్తిస్మ మిచ్చుచు వచ్చితినని చెప్పెను.

దేవుడు అతనికి వెల్లడి చేసేంతవరకు యోహాను యేసును అభిషిక్తునిగా గుర్తించలేదు. కానీ తన పని ఏమిటో అతనికి తెలుసు – వ 23.

32. మరియయోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురమువలె ఆకాశమునుండి దిగివచ్చుట చూచితిని; ఆ ఆత్మ ఆయనమీద నిలిచెను.

మత్తయి 3:16. దేవుని ఆత్మను గురించి యోహాను 14:16-17 నోట్స్.

33. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలొ బాప్తిస్మ మిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవనిమీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మ మిచ్చువాడని నాతో చెప్పెను.

34. ఈయనే దేవుని కుమారుడని నేను తెలిసికొని సాక్ష్యమిచ్చి తిననెను.

దేవుని కుమారుని గురించి యోహాను 3:16; యోహాను 5:18-23 నోట్స్; మత్తయి 3:16-17; మత్తయి 11:27.

35. మరునాడు మరల యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా

“శిష్యులు” అని తర్జుమా చేసిన గ్రీకు పదానికి “నేర్చుకునేవారు” అని అర్థం. మత్తయి 10:1 నోట్ చూడండి. యోహాను తనకు శిష్యుల గుంపును ఏర్పరచుకుందాం అనుకోలేదు. మనుషులు యేసు శిష్యులు కావాలని అతని ఆశ. యోహాను 3:26-30 చూడండి. ఇందులో కూడా మనం అనుసరించదగిన ఆదర్శాన్ని ఇతడు చూపిస్తున్నాడు.

36. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొఱ్ఱపిల్ల అని చెప్పెను.
యెషయా 53:7

37. అతడు చెప్పిన మాట ఆ యిద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి.

38. యేసు వెనుకకు తిరిగి, వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెదకుచున్నారని వారినడుగగా వారురబ్బీ, నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బియను మాటకు బోధకుడని అర్థము.

సరైన కారణం లేకుండా ఎవరైనా తనను అనుసరించడం యేసుప్రభువుకు ఇష్టం లేదు. ఏదో విచిత్రాన్ని చూద్దాం అనే మనస్తత్వం నిజమైన శిష్యుణ్ణి చేయదు. లూకా 9:57-62; లూకా 14:25-27 పోల్చి చూడండి. “రబ్బీ”– ఒక గురువును సంబోధించడానికి యూదులు సాధారణంగా ఉపయోగించే పదం. ‘నా ఉపదేశకుడు’ అని దీనికి అర్థం. తమ మాటల ద్వారా ఈ ఇద్దరూ ఆయనతో ఉండి, ఆయన దగ్గర నేర్చుకోవాలన్న అభిలాష కనపరచుకున్నారు. ఇది అందరికీ ఉండాలి గాని కొద్దిమందిలోనే కనిపిస్తుంది.

39. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్లి, ఆయన కాపురమున్న స్థలము చూచి, ఆ దినము ఆయన యొద్ద బసచేసిరి. అప్పుడు పగలు రమారమి నాలుగు గంటల వేళ ఆయెను.

ఈ ఇద్దరికీ అందిన దయామయమైన ఆహ్వానం వేరే మాటల్లో ఇప్పుడు అందరికీ అందుతున్నది (యోహాను 7:37; మత్తయి 11:28; ప్రకటన గ్రంథం 22:17). ఈ ఆహ్వానాన్ని అంగీకరించడం ద్వారా ఆయన శాశ్వత నివాసం తండ్రి ప్రక్కన (వ 18) అని మనం తెలుసుకుంటాం, ఆయనతో అనంత కాలం అక్కడ జీవిస్తాం.

40. యోహాను మాట విని ఆయనను వెంబడించిన యిద్దరిలో ఒకడు సీమోను పేతురుయొక్క సహోదరుడైన అంద్రెయ.

41. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచిమేము మెస్సీయను కనుగొంటి మని అతనితో చెప్పి
దానియేలు 9:25

సత్యం ఈ భూమిపై ఇప్పటికీ వ్యాపిస్తున్న విధానం ఒకరు మరొకరికి చెప్పడం ద్వారా. వ 45; యోహాను 4:28-30; యోహాను 15:27 చూడండి.

42. యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సీయ అను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతనివైపు చూచినీవు యోహాను కుమారుడవైన సీమోనువు; నీవు కేఫా అనబడుదువని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము.

అరమేయిక్ భాషలో కేఫా అంటే రాయి. గ్రీకులో పేతురు (పెట్రొస్‌) అన్నా అదే అర్థం.

43. మరునాడు ఆయన గలిలయకు వెళ్లగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను.

మత్తయి 4:19-22; మత్తయి 9:9 పోల్చి చూడండి.

44. ఫిలిప్పు బేత్సయిదావాడు,అనగా అంద్రెయ పేతురు అనువారి పట్టణపు కాపురస్థుడు.

గలలీ సరస్సుకు ఉత్తరాన ఉన్న ఊరు బేత్సయిదా.

45. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలును ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి; ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను.
యెషయా 7:14, యెషయా 9:6, యెహెఙ్కేలు 34:23, ద్వితీయోపదేశకాండము 18:18

ఇలా మాట్లాడేందుకు పాత ఒడంబడిక గ్రంథంతో బాగా పరిచయం అవసరం. లూకా 24:27, లూకా 24:44 పోల్చి చూడండి. ఇతడు యోసేపును యేసు తండ్రిగా చెప్తున్నాడు. ఆయన అసలైన తండ్రి దేవుడు (యోహాను 5:17-18; లూకా 1:35). యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు యోసేపు ఆయనకు చట్టబద్ధమైన తండ్రి.

46. అందుకు నతనయేలునజ రేతులోనుండి మంచిదేదైన రాగలదా అని అతని నడుగగా వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను.

నతనియేలు ప్రశ్నను బట్టి నజరేతు ఊరికి ఏమాత్రం మంచి పేరు లేదనీ, బొత్తిగా గుర్తింపులేని అల్పమైన ఊరనీ అర్థం అవుతున్నది. “వచ్చి చూడు”– క్రీస్తును గురించి సందేహాలున్న వారందరికీ చెప్పదగిన మంచి మాట. వారంతా వచ్చి రుచిచూస్తే ఆయన గొప్పతనం, మంచితనం అర్థం అవుతుంది (కీర్తనల గ్రంథము 34:8).

47. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి ఇదిగో యితడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటమును లేదని అతనిగూర్చి చెప్పెను.

అసలైన ఇస్రాయేల్‌వాడు అంటే హృదయంలోనూ, జీవిత విధానంలోను ఇస్రాయేల్‌వాడు ఎలా కపటం లేకుండా ఉండాలో అలా ఉండేవాడు అని అర్థం. రోమీయులకు 2:28-29; మత్తయి 3:9-10 పోల్చి చూడండి.

48. నన్ను నీవు ఏలాగు ఎరుగుదు వని నతనయేలు ఆయనను అడుగగా యేసు ఫిలిప్పు నిన్ను పిలువకమునుపే, నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్న ప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను.

మనుషులకు సహజంగా లేని శక్తి యేసుకు ఉంటే తప్ప నతనియేలును చూడడం గానీ అతని మాటలు వినడం గానీ సాధ్యం కానంత దూరంలో అంజూరు చెట్టు ఉన్నట్టుంది. నతనియేలు దీన్ని వెంటనే అర్థం చేసుకుని యేసును “దేవుని కుమారుడు” అన్నాడు.

49. నతన యేలుబోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజవు అని ఆయనకు ఉత్తరమిచ్చెను.
కీర్తనల గ్రంథము 2:7, యెషయా 32:1, జెఫన్యా 3:15

“ఇస్రాయేల్ రాజు”– మత్తయి 1:1; కీర్తనల గ్రంథము 2:6; యెషయా 9:6-7 నోట్స్.

50. అందుకు యేసు ఆ అంజూరపు చెట్టుక్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటె గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను.

నతనియేలు మాటలను నిజమేనని అంగీకరిస్తూ, అవి సత్యమేననడానికి మరింత గొప్ప రుజువులు చూపుతానని యేసు అన్నాడని గమనించండి. యోహాను 20:28-29 పోల్చి చూడండి.

51. మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్యకుమారునిపైగా ఎక్కుటయును దిగుట యును చూతురని మీతో నిశ్చయముగా చెప్పు చున్నాననెను.
ఆదికాండము 28:12

“మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” – (“నిశ్చయముగా చెప్పుచున్నాను” - పాత అనువాదం) అనే మాటలను యేసు యోహాను శుభవార్తలో 25 సార్లు ఉపయోగించాడు. ఇవి చాలా గంబీరంగా నొక్కి చెప్పేందుకు వాడే మాటలు. వింతగానూ, నమ్మడానికి కష్టసాధ్యంగానూ అనిపించే సత్యాన్ని ఆయన చెప్పినప్పుడు ఈ మాటలు పలికేవాడు. ఇక్కడ యేసు ఆదికాండము 29:12 లో రాసి ఉన్న యాకోబు కల గురించి మాట్లాడుతున్నాడు. ఆ కలలో పరలోకానికి, భూమికీ ఒక నిచ్చెన వేసి ఉంది. ఆ నిచ్చెన తానే అని యేసు అంటున్నాడు. దేవుడు మనుషులకు చెప్పదలచుకున్న సందేశాలూ, ఇవ్వదలచుకున్న దీవెనలూ వారికి చేరే మార్గం క్రీస్తే అన్నమాట. మనుషులు దేవుని సన్నిధికి ఎక్కివెళ్ళే మార్గం కూడా ఆయనే. నతనియేలు (క్రీస్తు శిష్యులందరూ కూడా) కాలక్రమేణ దీన్ని గ్రహిస్తారు అంటున్నాడు. దేవదూతల గురించి ఆదికాండము 16:7 నోట్. “మానవ పుత్రుడు” గురించి మత్తయి 8:20 నోట్.Shortcut Links
యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |