ఈ యుగాంతంలో దేవుని ముద్ర పడబోయే “దేవుని దాసులు” (వ 3) ఇస్రాయేల్ జాతివారే. ఇక్కడ ఇస్రాయేల్ గోత్రాల జాబితా ఉంది. బైబిల్లో ఇదివరకు ఆ గోత్రాల జాబితాలు దాదాపు 30 ఉన్నాయి. అవన్నీ అక్షరాలా ఇస్రాయేల్ జాతిని సూచిస్తున్నాయి. ఈ ఒక్క జాబితాలోని వారు మాత్రం ఇస్రాయేల్వారు కాదు అని ఎవరైనా ఎలా అనగలరు? దేవుని వాక్కును బట్టి చూస్తే ఇస్రాయేల్ ప్రజలు ఒక జాతిగా ఈ యుగాంతంలో దేవుని వైపుకు తిరిగి, క్రీస్తును అంగీకరిస్తారని కనిపిస్తుంది. ఇప్పుడు వారు క్రీస్తును తమ అభిషిక్తుడుగా రక్షకుడుగా నిరాకరిస్తూ అపనమ్మకంతో ఉన్నారు. కానీ యుగాంతంలో అదంతా మారిపోతుంది. రోమీయులకు 11:11, రోమీయులకు 11:25-32; యిర్మియా 25:5-8; యిర్మియా 31:31-37; యిర్మియా 32:37-40; యెహెఙ్కేలు 20:40-44; యెహెఙ్కేలు 37:21-28; దానియేలు 12:1; హోషేయ 3:4-5; జెకర్యా 10:10-12; జెకర్యా 12:9-14; జెకర్యా 13:1, జెకర్యా 13:9 చూడండి. 144,000 అనే సంఖ్య (వ 4) బహుశా సంపూర్ణతను సూచించే సంకేత సంఖ్య కావచ్చు. 144,000 అంటే 12×12×1000. బైబిల్లో 12 సంపూర్ణతను సూచించే సంఖ్య – పన్నెండు గోత్రాలు, పన్నెండుమంది క్రీస్తురాయబారులు, పన్నెండు ద్వారాలు (ప్రకటన గ్రంథం 21:12), పన్నెండు పునాదులు (ప్రకటన గ్రంథం 21:14), పన్నెండు కాపులు (ప్రకటన గ్రంథం 22:2). 1000 అంటే 10×10×10 – మూడు పరిమాణాలు సమానంగా ఉన్నది. ఇది కూడా సంపూర్ణతను సూచించవచ్చు. 144,000 యూదులంటే సంపూర్ణమైన ఇస్రాయేల్ జాతిని సూచించవచ్చు. లేదా, 144,000 – మితంగా ఉన్న కొంచెం పెద్ద సమూహాన్ని సూచించవచ్చు. ఇలాంటి సంఖ్యల విషయాల్లో సందేహానికి తావుంది. వీటిని గురించి బల్లగుద్ది చెప్పడం తగదు.