“ప్రత్యక్షం”– ఈ గ్రంథం మనుషులు కల్పించినది కాదు. ఇది దేవుడు పరలోకంనుంచి ఇచ్చినది – అంటే, దేవుడు దీన్ని రాయించాడు. దీనికి మూలాధారం దేవుడే గాని ఏ మనిషి మేధస్సూ కాదన్నమాట. యోహాను ఈ గ్రంథంలోని చిహ్నాలు, సూచనలు, సంకేతాలు, మాటలు వేటినీ మరే ఇతర సాహిత్యంలోనుంచి తీసుకోలేదు. యేసుప్రభువు దీనంతటినీ అతనికి వెల్లడి చేశాడు.
“త్వరగా”– ఈ మాటను బట్టి ఈ గ్రంథం యోహాను కాలంలో, లేక ఆ తరువాత కొద్ది కాలానికి నెరవేరిందని అనుకోనవసరం లేదు. అప్పుడు అది నెరవేరడం ఆరంభమైందని కూడా అనుకోనవసరం లేదు. ప్రకటన గ్రంథం 22:7, ప్రకటన గ్రంథం 22:12, ప్రకటన గ్రంథం 22:20 పోల్చి చూడండి – మూడు సార్లు యేసు తాను “త్వరగా” రాబోతున్నానని చెప్పాడు గానీ ఆయన యోహాను రోజుల్లో, లేక ఆ తరువాత కొద్ది కాలానికి రాలేదు. ఇలా అయితే ఇక్కడ “త్వరగా”అంటే అర్థం ఏమిటి? వ్యాఖ్యాన కర్తలు వేరువేరు విధాలుగా దీన్ని వివరించి రాస్తారు. ఉదాహరణగా, త్వరగా అంటే దేవుని దృష్టిలో త్వరగా అని అర్థం (2 పేతురు 3:8 చూడండి. దేవుని లెక్క ప్రకారం యోహాను కాలంనుంచి మన కాలం వరకు రెండు దినాలు మాత్రమే గడిచాయి). లేక త్వరగా అనే మాటకు హఠాత్తుగా అని అర్థం అంటున్నారు కొందరు. అంటే, ఈ విషయాలు జరగడం ఆరంభమయ్యేటప్పుడు హఠాత్తుగా నెరవేరుతాయి (1 థెస్సలొనీకయులకు 5:2 పోల్చి చూడండి). లేక, పవిత్రాత్మ యోహానును దర్శనంలో ఈ యుగాంతానికి తీసుకుపోయాడు – ఆ కాలంలో జరగవలసినవి త్వరగా జరిగాయి. లేక, ఈ గ్రంథంలోని విషయాలు నెరవేరడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాయనీ, ఏ క్షణంలో అయినా వీటి నెరవేర్పు ఆరంభం కావచ్చుననీ విశ్వాసులు సిద్ధంగా ఉంటూ మెళకువగా ప్రభువు రాకడకోసం చూస్తూ ఉండాలనీ సూచించేందుకు “త్వరగా” అనే మాటను దేవుడు ఇక్కడ ఉంచాడు (మత్తయి 24:36, మత్తయి 24:42-44 పోల్చి చూడండి). ఈ నోట్స్ రచయిత 4–22 అధ్యాయాల్లో వివరించబడిన సంఘటనలు ఈ యుగాంతంలోనే జరగ బోతున్నాయని నమ్ముతున్నాడు.
“తన దాసులకు”– రోమీయులకు 6:17-22 లో క్రీస్తు విశ్వాసులందరూ దేవుని దాసులని పౌలు చెప్పాడు. ఈ గ్రంథం వారందరి కోసం రాసి ఉంది.
“చూపించడానికి”– దేవుడు ఈ గ్రంథాన్ని ఇచ్చింది భవిష్యత్తును వెల్లడి చేయడం కోసమే గాని దాన్ని మరుగు చేయడం కోసం కాదు. మనం దీన్ని గ్రహించాలనే గానీ దీన్ని చదివి కలవరపడాలని కాదు.
“దూతను”– దూత, దూతలు, దేవదూత, దేవదూతలు అనే పదాలు ఈ గ్రంథంలో దాదాపు 80 సార్లు కనిపిస్తున్నాయి. బైబిలంతటిలో సుమారు 300సార్లు కనిపిస్తున్నాయి. దేవదూతలు ఆత్మ రూపులైన ప్రాణులు. సాధారణంగా మనుషులు వారిని చూడరు గాని అప్పుడప్పుడూ వారు మానవ రూపంతో కనబడుతారు. దేవదూతలు మనం లెక్క పెట్టలేనంతమంది (ప్రకటన గ్రంథం 5:11)