“మన”– యోహాను విశ్వాసులకు రాస్తున్నాడు (1 యోహాను 2:1, 1 యోహాను 2:12-14). ఇప్పుడు చెప్తున్నదానిలో తనను కూడా వారితో కలుపుకుంటున్నాడు. విశ్వాసులంతా తమ పాపాలు ఒప్పుకోవలసిన అవసరత గురించి అతనికి తెలుసు – మత్తయి 6:12; లూకా 11:4.
“ఒప్పుకుంటే”– ఇలా అనువదించిన గ్రీకు పదానికి వేరొకడు ఏదో ఒక సంగతి గురించి చెప్పినదాన్ని చెప్పడం, సమ్మతించడం, తనపై వచ్చిన నేరారోపణను అంగీకరించడం అని అర్థాలున్నాయి. పాపాలను ఒప్పుకోవడమంటే దేవుడు వాటి గురించి చెప్తున్నదాన్నే మనమూ చెప్పడం, సమ్మతించడం. పొరపాట్లు, లేక తప్పు నిర్ణయాలు వంటి వేరే పేర్లు వాటికి పెట్టకూడదు. ఏ విధంగానైనా దేవుని పరిపూర్ణ నీతిన్యాయాలకూ పవిత్రతకూ వ్యతిరేకంగా మనసులో, మాటలో, క్రియలో ఉండేది ఏదైనా పాపమే. చేయవలసినది ఏదైనా చేయకుండా వదిలేయడం కూడా పాపమే. పాపం చేయడం మనల్ని దోషులుగా చేస్తుంది, అప్పుడు మనకు క్షమాపణ అవసరమౌతుంది. అందువల్ల మనం దేవునితో సమ్మతించి మన పాపాలను వాటికి తగిన పేర్లతో గుర్తించి దేవుణ్ణి క్షమాపణ కోరాలి. మన పాపాలను ఒప్పుకోవడం, వెలుగులో నడుచుకోవడం కలిసి ఉంటాయి. వెలుగు మన పాపాలను బయట పెడతుంది (ఎఫెసీయులకు 5:13-14). అవి అలా బయట పడినప్పుడు వాటిని మనం ఒప్పుకొని విడిచి పెట్టాలి. క్షమించగలిగినవాడు దేవుడే గనుక ఆయనవద్దే పాపాలు ఒప్పుకోవాలి.
“శుద్ధి చేస్తాడు”– వ 7. దేవుడు మన పాపాలు క్షమిస్తాడు, శాశ్వతంగా వాటిని తుడిచి పెట్టేస్తాడు, సమస్తమైన అన్యాయాన్నీ చెడుతనాన్నీ మన అంతర్వాణినుంచి కడిగివేస్తాడు (హెబ్రీయులకు 9:14).
“నమ్మతగినవాడు”– కీర్తనల గ్రంథము 33:4; కీర్తనల గ్రంథము 111:7-8; కీర్తనల గ్రంథము 145:13; కీర్తనల గ్రంథము 146:6; 1 కోరింథీయులకు 1:9; 2 తిమోతికి 2:13; హెబ్రీయులకు 10:23; హెబ్రీయులకు 11:11; 1 పేతురు 4:19. దేవుడెప్పుడూ తన మాటకు విశ్వసనీయంగా ఉంటాడు. మనుషులను రక్షించాలన్న తన ఏర్పాటుకూ, తన స్వభావానికీ విశ్వసనీయంగా ఉంటాడు. ఆయన క్షమించే దేవుడు – నిర్గమకాండము 34:7; సంఖ్యాకాండము 14:18; నెహెమ్యా 9:17; కీర్తనల గ్రంథము 86:5; కీర్తనల గ్రంథము 99:8; కీర్తనల గ్రంథము 103:3; దానియేలు 9:9; మీకా 7:18; మత్తయి 6:15; మత్తయి 9:2; రోమీయులకు 4:7-8; హెబ్రీయులకు 8:12; యాకోబు 5:12. మనుషుల పాపాలను క్షమించేలా ఆయన తన స్వంత కుమారుణ్ణి వారికోసం పరిహార బలిగా మరణించేందుకు పంపించాడని ఆయన వాక్కు (బైబిలు) చెప్తున్నది – యోహాను 1:29; యోహాను 3:14-16. అందువల్ల మనం పశ్చాత్తాపపడి నిజంగా క్షమాపణను, పాపాలనుంచి శుద్ధిని ఆశిస్తే ఆయన తప్పక క్షమిస్తాడన్నదాన్లో సందేహం లేదు.
“న్యాయవంతుడు”– ద్వితీయోపదేశకాండము 32:4; కీర్తనల గ్రంథము 9:16; కీర్తనల గ్రంథము 36:6; కీర్తనల గ్రంథము 89:14; కీర్తనల గ్రంథము 111:7. న్యాయం ఆధారంగా ఆయన మన పాపాలు క్షమిస్తాడు. క్రీస్తు మన పాపాలకు పరిహారం చెల్లించాడు. అందువల్ల మనం పశ్చాత్తాపపడి, వాటిని ఒప్పుకుంటే న్యాయంగా దేవుడు క్షమించగలడు. 1 యోహాను 2:2; రోమీయులకు 3:25-26 చూడండి.