6. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీర మునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకముచేత చిచ్చు పెట్టబడును.
అదుపు లేని నాలుక గురించి యాకోబు మాట్లాడుతున్నాడు. అంటే నాలుక సహజ స్వభావం ఇది. నాలుక అంటే మాట్లాడే శక్తి, మనసులో హృదయంలో ఉన్నదాన్ని ఇతరులకు చెప్పగల సామర్థ్యమన్నమాట.
“నిప్పు”– నాలుక గొప్ప వినాశనాన్ని తెచ్చిపెట్టగలదు (కీర్తనల గ్రంథము 52:2). దానినుండి ఎగిరే ఒక నిప్పురవ్వ చాలు, అనేకమందిని తగలబెట్టగలిగిన మంట చెలరేగుతుంది. నాలుక ఒక ప్రపంచం. సహజంగా ఆ ప్రపంచం దుర్మార్గమైనది – కీర్తనల గ్రంథము 58:3. కోరికలతో, పాపంతో అది మండుతూ ఉంది. ఆ మంటలు నరకంనుంచి వచ్చాయి. అబద్ధాలు, మోసం మాటలు, కొండేలు చెప్పడం, దేవదూషణ, శాపవచనాలు సైతానే మనుషులకు నేర్పించాడు. జీవితాలను నాశనం చేసే మాటలివి.