“అనుమానమేమీ లేకుండా”– మన ప్రార్థనలకు జవాబు రావాలంటే అత్యంత అవసరమైనది ఇదే. హెబ్రీయులకు 11:6 చూడండి. నమ్మిక గల ప్రార్థన అన్నిటినీ సాధ్యం చేస్తుంది (మార్కు 9:23; మార్కు 11:23-24). అపనమ్మకం దేవుణ్ణి అబద్ధికుడు అనడం వంటిదే (1 యోహాను 5:9-10). సందేహించడమంటే దేవుని గుణశీలాల్లో, వాగ్దానాల్లో గట్టి నమ్మకం లేకుండా నమ్మకానికీ అపనమ్మకానికీ మధ్య కొట్టుమిట్టాడడమే. సందేహించేవాడు దేవుని గురించీ ఆయన వాక్కు గురించీ తన వ్యవహారాలన్నిటిలో నిలకడగా ఉండడు. అతనెప్పుడూ రెండు వైపులకు లాగబడుతూ ఉంటాడు. అతని ఆలోచనలు, ఉద్దేశాలు, లక్ష్యాలు స్థిరంగా ఉండవు. దేవుని సంకల్పం పట్ల అతనికున్న అంకిత భావం స్థిరంగా ఉండదు. అతనికి చపల హృదయం ఉండడమే అతనికున్న సందేహాలకు కారణం. కీర్తనల గ్రంథము 86:11 లో దావీదు ప్రార్థన చూడండి. యెహెఙ్కేలు 11:19 లో తన ప్రజలకు దేవుని వాగ్దానం చూడండి.
విశ్వాసులంతా ఎప్పుడో ఒక సారి సందేహించే పరిస్థితికి గురి అవుతారు. ఈ దుష్‌ప్రేరణను మనం ఎదిరించాలి. దేవుడు తాను చెప్పినది తప్పక చేస్తాడన్న సత్యాన్ని నమ్మి స్థిరంగా ఉండాలి – ఇందులో అబ్రాహాము మనకు గొప్ప ఆదర్శం – రోమీయులకు 4:18-21. మరి సందేహానికి మందేమిటి? దేవుని వాక్కే (రోమీయులకు 10:17), దేవుని వాగ్దానాలనూ ఆయన గుణశీలాలనూ ధ్యానిస్తూ ఉండడమే (కీర్తనల గ్రంథము 1:2-3), ఆయనకూ ఆయన సంకల్పానికీ పూర్తిగా కట్టుబడి ఉండడమే (రోమీయులకు 12:1-2).