రాజు, యాజి అయిన క్రీస్తుకు ఈ మెల్కీసెదెక్ సూచన, చిహ్నం – హెబ్రీయులకు 5:6, హెబ్రీయులకు 5:10; హెబ్రీయులకు 6:20. పాత ఒడంబడిక చరిత్రలో మెల్కీసెదెక్ ఒక్క సారి మాత్రమే కనిపిస్తాడు – ఆదికాండము 14:18-20. ఆ సందర్భంలో తప్ప, ఈ లేఖలో ఇతని పేరు కనిపించకముందు అది ఒక్క సారి మాత్రమే కనిపించింది – కీర్తనల గ్రంథము 110:4. ఇతని గురించి వేరే వివరాలేమీ మనకు తెలియదు. వ 3లో కనిపిస్తున్న మాటల అర్థం స్పష్టంగా లేదు. అందువల్ల ఇవి క్రీస్తును గురించి రాసినవేనని కొందరు పండితులు అన్నారు. కానీ మెల్కీసెదెక్ నిజంగా కనాను దేశంలో ఉన్న షాలేం రాజు అయి ఉంటే అతడు క్రీస్తు అయ్యే అవకాశం లేదు. అంతేగాక అతడు “దేవుని కుమారునిలాగా” ఉన్నాడని రచయిత చెప్తున్నాడు గాని దేవుని కుమారుడే అనడం లేదు. అలాగైతే అతడు తల్లి, తండ్రి, మొ।। లేనివాడు అంటే అర్థం ఏమిటి? అంటే బైబిల్లో వీరి గురించి ఎక్కడా రాసిలేదని అర్థం కావచ్చు. అతని తల్లిదండ్రులు, వంశవృక్షం, పుట్టుక, మరణం గురించి మనకేమీ తెలియదు. హఠాత్తుగా బైబిల్లో కనిపించాడు. ఎప్పుడూ మార్పు లేకుండా, రాజుగా, యాజిగా, క్రీస్తును సూచించే దృష్టాంతంగా అలానే ఉండిపోయాడు. ఈ దృష్టాంతం బాగానే ఉంది. క్రీస్తు నీతిన్యాయాలకు రాజు, శాంతికి రాజు, అబ్రాహాము కన్నా గొప్పవాడు, ఆది అంతాలు లేనివాడు (హెబ్రీయులకు 1:2-3, హెబ్రీయులకు 1:8, హెబ్రీయులకు 1:10-12), శాశ్వతంగా యాజిగా ఉన్నవాడు (హెబ్రీయులకు 5:6).