దేవుని విశ్రాంతిలో ప్రవేశించడం అనేది ఈ భాగంలోని అంశం – వ 1. క్రీస్తు విశ్వాసులు అందులో ప్రవేశిస్తారు. కానీ నమ్మకం లేని ఇస్రాయేల్ అలా ప్రవేశించలేదు – వ 2,3. ఈ విశ్రాంతి ఇస్రాయేల్‌వారి కాలంలో ఉంది, దానిలో వారు ప్రవేశించే అవకాశం ఉంది – వ 4-6. అయితే వారలా చేరలేదు గనుక, కొందరు అందులో చేరాలని దేవుని ఉద్దేశం గనుక, దేవుడు మరో దినాన్నీ సమయాన్నీ నియమించాడు – వ 6-8. చివరికి తేలినది: ఇప్పుడు మనుషులు ప్రవేశించగల విశ్రాంతి ఉంది – వ 9,10. హెచ్చరిక: అందులో ప్రవేశించేందుకు అవసరమైన ప్రయత్నాలన్నీ చేయాలి – వ 11, ఎందుకంటే అవిశ్వాసిని దేవుని వాక్కు కనిపెట్టి ప్రవేశించనీయ కుండా అడ్డగించగలదు – వ 12,13.
“ఆయన విశ్రాంతి”– అంటే ఆధ్యాత్మిక విశ్రాంతి, మత్తయి 11:28 లో యేసు చెప్పిన విశ్రాంతి. ఇది క్రీస్తులో రక్షణను సూచిస్తున్నది. కనాను దేశం ఈ విశ్రాంతికి చిహ్నం లేక సాదృశ్యం మాత్రమే (యెహోషువ 1:18 నోట్).
“మీలో ఎవరైనా”– “మనలో ఎవరైనా” అనడం లేదు రచయిత. విశ్వాసులు తమకు పాపవిముక్తి, రక్షణ ఉందో లేదో తెలుసుకోలేరని రచయిత చెప్పడం లేదు. తాము చివరికి నాశనం అవుతామేమోనన్న భయంతోనే జీవితం గడపాలని చెప్పడం లేదు (హెబ్రీయులకు 2:15; లూకా 12:32; రోమీయులకు 8:15; 1 యోహాను 5:13 చూడండి). రచయిత తన రక్షణ గురించి భయపడడం లేదు గానీ హీబ్రూవారిలో కొందరి రక్షణ గురించి భయపడుతున్నాడు. క్రైస్తవులమని చెప్పుకునేవారు అపనమ్మకం, అవిధేయత సూచనలు కనపరిస్తే మనందరం కంగారు పడవలసిందే. వారిని హెచ్చరించి ప్రోత్సహించడంలో జాగ్రత్త వహించాలి కూడా – హెబ్రీయులకు 3:13; 1 తిమోతికి 5:20.