విశ్వాసులు తమ మాటలు, చర్యలు అవిశ్వాసులపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయోనని ఎప్పుడూ గమనించి మెలుగుతూ ఉండాలి. ఇతరులు మనలో చూస్తున్నదీ వింటున్నదీ తప్ప క్రైస్తవం గురించి మరేదీ వారికి తెలిసి ఉండకపోవచ్చు. మనం జ్ఞానంతో ప్రవర్తించకపోతే అనవసరంగా వారికి ఆటంకం కలిగించినవారం అవుతామేమో. వారితో క్రీస్తును గురించి మాట్లాడేందుకు దేవుడు మనకిచ్చిన అవకాశాలను ఉపయోగించు కోకపోతే, వారు నశిస్తే ఆ దోషం మనమీదికి వస్తుంది – అపో. కార్యములు 20:25-27. వారితో మాట్లాడే సమయంలో దయగా, మర్యాదగా, ఇంపుగా మాట్లాడాలి. వారికి మనం ఇచ్చే సందేశంలో దేవుని కృపకే ఎక్కువ ప్రాధాన్యత ఉండాలి. కీర్తనల గ్రంథము 45:2; లూకా 4:22 పోల్చి చూడండి.