“సిలువ”– విశ్వాసికి మహిమకు, అతిశయానికి నిజమైన ఆధారం ఇదే. తనలో గానీ తాను చేసిన దానిలో గానీ కాక, పాపులకోసం క్రీస్తు మరణించిన విషయంలోనే అతడు అతిశయించాలి. రోమీయులకు 3:27; 1 కోరింథీయులకు 1:29-31; ఎఫెసీయులకు 2:9. ఈ విషయంలో పౌలు ఆదర్శాన్ని అనుసరించకుండా తాము చేసినవాటిని గురించి గొప్పలు చెప్పుకునేవారి విషయం మనం జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. ఒక మనిషి దేని గురించి అతిశయపడతాడన్నది అతని గుణశీలాలను చక్కగా చూపిస్తుంది.
“మరణం చెందినట్టే”– గలతియులకు 2:20; గలతియులకు 5:24. “లోకానికి” అంటే “ఇప్పటి చెడ్డ లోకానికి” (గలతియులకు 1:4) అని పౌలు భావం. మనుషులు కోరేవాటన్నిటికీ, అతిశయించేవాటన్నిటికీ అని అర్థం. యోహాను 1:10; యోహాను 7:7; యోహాను 17:14; రోమీయులకు 12:2; 1 యోహాను 2:15-17; 1 యోహాను 5:19. పౌలు దానికి చెందినది దేన్నీ కోరలేదు. అతనికి సంబంధించినంత వరకు అది హీనమైనది, నిర్జీవమైనది. లోకానికి అతడు సిలువ వేయబడ్డాడు. లోకం అతణ్ణి మతి తప్పినవాడుగా ఎంచి అతణ్ణి దూరంగా ఉంచింది. క్రీస్తు మరణం లోకానికీ, అతనికీ మధ్య పెద్ద అగాధాన్ని సృష్టించింది. లోకం క్రీస్తును సిలువ వేసింది. క్రీస్తును హత్య చేసిన వారితో పౌలుకు పనేమిటి?