7. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, నన్ను నలగగొట్టుటకు సాతానుయొక్క దూతగా ఉంచబడెను.
యోబు 2:6
వ 2-5లో పౌలు తన గురించే చెప్పుకుంటున్నట్టు ఇది రుజువు చేస్తున్నది. పౌలు చూచిన దర్శనాలకంటే అతి తక్కువ స్థాయి దర్శనాలు, ప్రత్యక్షతలు చూశామని అనుకున్న మనుషులు కొందరు గర్వంతో దురహంకారంతో నిండిపోయారు. దేవుడు పౌలుకు చూపించిన ప్రత్యక్షతలను బట్టి అతనిలో గర్వం ఏర్పడే అవకాశం ఉందని ఆయనకు తెలుసు. తన రాయబారిని, తన ప్రజల్లో ఎవరినైనా తనకు అసహ్యమైన గర్వంలో పడకుండా ఎలా కాపాడుకోవాలో దేవునికి తెలుసు.
పౌలు శరీరంలోని “ముల్లు” ఏమిటి? దీని గురించి మనకు తెలిసినదల్లా ఇక్కడ అతడు చెప్పినదే. ఈ భాష కూడా గూఢంగా కష్టంగా ఉంది. గ్రీకులో “శరీరం” అని తర్జుమా చేసిన మాటకు అర్థం భౌతిక దేహం కావచ్చు. అలాగైతే “ముల్లు” అంటే ఏదైనా వ్యాధి కావచ్చు. కానీ మనుషులందరిలోనూ ఉండే భ్రష్ట స్వభావం అని కూడా ఈ గ్రీకు పదానికి అర్థం కావచ్చు. ఈ పదం (సార్క్స్ – రోమీయులకు 7:5, రోమీయులకు 7:18 చూడండి) “శరీర స్వభావం” అని కూడా అనువదించవచ్చు. అలాగైతే “ముల్లు” అంటే అతని భ్రష్ట స్వభావానికి సంబంధించినదేదో అయి ఉండాలి. బహుశా బలమైన ఒక విషమ పరీక్ష, లేక దుష్ప్రేరేపణ, సైతాను పదే పదే అతని మనసులో చొప్పించడానికి ప్రయత్నిస్తున్న ఒక చెడు తలంపు లేక ఇలాంటిది మరేదైనా కావచ్చు. ఈ విధంగా ఇది పౌలుకు తన భ్రష్ట స్వభావాన్నీ బలహీనమైన స్థితినీ అస్తమానం జ్ఞాపకం చేస్తూ ఉండేది కావచ్చు. ఈ ముల్లేమిటో మనకు తెలియదు. తెలుసుకోవలసిన అవసరం కూడా లేదు. అయితే దాని గురించిన విషయాలు మాత్రం కొన్ని తెలుసు. అది అతని శరీరంలో “ఉంచడం జరిగింది”. అంటే అది తాను అనుభవించేలా దేవుడు ఏర్పాటు చేశాడని పౌలు భావం. కానీ అది “సైతాను దూత”. అంటే పౌలును అంతగా పీడించినది, అది శారీరకమైనా ఆధ్యాత్మికమైనా, సైతాను పంపినదే అని అర్థం. లేక అది సైతాను పంపిన దయ్యం కావచ్చు – అడుగడుక్కూ అతణ్ణి వేధిస్తూ, అస్తమానం అతణ్ణి అణచివేస్తూ, ఎదిరిస్తూ ఉన్న పిశాచం. ఏది ఏమైనా ఈ “ముల్లు” వల్ల పౌలుకు చాలా బాధ కలిగింది. అది ఎలాంటి బాధో, అది శారీరికంగానా, మానసికంగానా, ఆధ్యాత్మికంగానా లేక ఈ మూడు రకాలుగానా అనేది ఇక్కడ అతడు చెప్పలేదు. పౌలు అనుభవంతో యోబు 1:6-22 ను పోల్చి చూడండి.