పౌలు ఉపదేశించిన “విశ్వాససంబంధమైన వాక్కు” ఇది (వ 8). క్రీస్తు పరలోకంనుంచి అంతకుముందే దిగివచ్చాడు. దేవుడు ఆయన్ను అంతకుముందే మరణ లోకంలోనుంచి సజీవంగా లేపాడు (రోమీయులకు 1:3-4; రోమీయులకు 4:24-25; రోమీయులకు 8:32, రోమీయులకు 8:34). ఇప్పుడిక దేవుడు ఉచితంగా ఇచ్చే నీతిన్యాయాలనూ నిర్దోషత్వాన్నీ స్వీకరించేందుకు మనుషులు చేయవలసినదల్లా క్రీస్తులో నమ్మకముంచి ఆయన్ను ఒప్పుకోవడమే. యేసు శారీరికంగా మరణంనుంచి సజీవంగా లేచాడని నమ్మడం పాపవిముక్తికి, రక్షణకు అవసరమని గమనించండి. రోమీయులకు 4:24-25; 1 కోరింథీయులకు 15:1-8 చూడండి. ఇది శుభవార్తలో ప్రాముఖ్యమైన మౌలిక సత్యం. అపొ కా గ్రంథంలో ఈ సత్యాన్ని ఎంత ప్రాముఖ్యంగా నొక్కి చెప్పడం జరిగిందో గమనించండి – రోమీయులకు 1:3; రోమీయులకు 2:24; మొ।।. ఈ సత్యాన్ని మనం నమ్మకపోతే దేవుడు తన కుమారుణ్ణి గురించి రాయించిన సంగతిని నమ్మడం లేదన్నమాట. క్రీస్తుపై నమ్మకం ఉంచడమంటే, మరణంనుంచి సజీవంగా లేచిన ఆయనమీద నమ్మకముంచడమే.
అంతేగాక యేసు “ప్రభువు” అన్న నమ్మకం కూడా అవసరమే. యోహాను 8:24; అపో. కార్యములు 2:36; 1 కోరింథీయులకు 8:6; 1 కోరింథీయులకు 12:3; ఎఫెసీయులకు 4:5 చూడండి. యేసు అనేకమంది ప్రభువుల్లో ఒక ప్రభువు కాదు, ఉన్న ఒకే ఒక ప్రభువు ఆయనే. పూర్తి అధికారం ఉన్నవాడు, అందరికీ యజమాని, స్వంతదారుడు క్రీస్తేనని పౌలు ఉద్దేశం. యేసే ప్రభువు అని చెప్పడమంటే ఆయన పాత ఒడంబడిక గ్రంథంలోని యెహోవాదేవుని అవతారమని చెప్పడమే (వ 13; లూకా 2:11; యోహాను 8:24, యోహాను 8:58. నిర్గమకాండము 3:14-15 నోట్స్ చూడండి).
ఒప్పుకోవడం అన్నది దేవునికి మనపై జాలి కలిగించి, మనల్ని రక్షించేలా చేసే మంచి పని కాదు. పాపవిముక్తి పొందేందుకు మనుషులకు ఉండవలసిన నమ్మకానికి జోడించవలసిన మరో అంశం కాదది. ఆ నమ్మకం వాస్తవమైనది అనేందుకు అది సాక్ష్యాధారం, రుజువు. హృదయంలో పని చేస్తున్న నమ్మకం నోటితో క్రీస్తును ఒప్పుకునేలా చేస్తుంది. మత్తయి 10:32-33 కూడా చూడండి. క్రీస్తును ఒప్పుకొనేందుకు సిగ్గు, భయం ఉన్నవారి నమ్మకం గురించి మనమెప్పుడూ సందేహంతో ఉండాలి. ఒప్పుకోవడం లేకుండా ఉన్న నమ్మకం లోపంతో కూడినది. నమ్మకం లేకుండా ఒప్పుకోవడం వ్యర్థమైనది.
ఒక విశ్వాసి మనస్ఫూర్తిగా “యేసే ప్రభువు” అని చెప్పడం యేసును అతడు తన జీవితానికి ప్రభువుగా స్వీకరించి ఆయనకు లోబడాలన్న సమ్మతికి గుర్తు (రోమీయులకు 14:9; మత్తయి 7:21; యోహాను 3:36; అపో. కార్యములు 5:32; యోహాను 2:3-4; యోహాను 3:24; హెబ్రీయులకు 5:9 చూడండి). అపో. కార్యములు 22:10 నోట్ చూడండి. ఒక విశ్వాసి యేసు ప్రభువే గానీ నా ప్రభువు కాదు అని అనగలగడం ఎలా సాధ్యం! మనుషులు క్రీస్తు చెంతకు వచ్చినప్పుడు వారు పశ్చాత్తాప పడవలసిన విషయాల్లో ఒకటి తమ జీవితాలకు తామే యజమానులుగా ఉండాలన్న మనస్తత్వం, క్రీస్తు ప్రభుత్వానికి లోబడని ధోరణి. అది పాపం.
నిర్దోషత్వాన్ని, నీతిన్యాయాలను గురించి ఈ లేఖలో పౌలు చెప్పినది చాలావరకు వ 10లో ముగింపుకు వస్తున్నది. పౌలు దేవుని ఆత్మావేశం మూలంగా తెలియజేసినది ఏమంటే,
మనుషులకు నిర్దోషత్వం ఏ మాత్రం లేదు (రోమీయులకు 1:18-32)
దేవుడు దాన్ని మనుషులకు ఇచ్చే విధానం వారికి తెలియదు (వ 2)
తెలియదు కాబట్టి తమ సొంతగా నిర్దోషత్వాన్ని స్థాపించుకునే ప్రయత్నం వారు చేస్తారు (వ 3)
అది అసాధ్యం (రోమీయులకు 3:20, రోమీయులకు 3:28; రోమీయులకు 8:3)
దేవుని దృష్టిలో నిర్దోషులు కావాలంటే ఏకైక మార్గం క్రీస్తు నిర్దోషత్వాన్ని కలిగి ఉండడమే (రోమీయులకు 3:22-26)
ఆయనలో నమ్మకం మూలంగా మాత్రమే ఇది సాధ్యం (రోమీయులకు 1:16; రోమీయులకు 4:5; రోమీయులకు 5:1)
ఆ విధంగా నిర్దోషులుగా తీర్చబడినవారు నీతిన్యాయాలతో కూడిన జీవితం ఆరంభిస్తారు (రోమీయులకు 6:17-18; రోమీయులకు 8:4).