“విముక్తి...వస్తుంది”– దేవుడు లోకానికి తన గురించి వెల్లడించడానికీ, తాను సిద్ధం చేసిన పాపవిముక్తిని తేవడానికి యూద జాతే కాలువలాంటిది. యేసుప్రభువు యూదుడుగా జన్మించాడు. దేవుడు కోరుతున్న ఆరాధనకు భౌతిక వస్తువులు, గుడులు, స్థలాలు, ప్రదేశాలతో ఎలాంటి సంబంధమూ లేదు (వ 23,24; అపో. కార్యములు 17:24-25). నిజమైన ఆరాధన ఆత్మలో చెయ్యవలసినదే. దేవుని ఆత్మమూలంగా తిరిగి జన్మించినవారి హృదయాల్లో నుండే అది రావాలి (3:5. దేవునికి అర్పించదగ్గ నిజమైన ఆరాధన ఏదో వేరెవరికీ తెలియదు). దేవుడు ఆత్మ గనుక భౌతిక వస్తువులేవీ నిజంగా ఆయనకు ప్రతినిధులుగా ఉండలేవు. ఏకైక శాశ్వతాత్మ దేవుణ్ణి ఆత్మ ద్వారా మాత్రమే నిజంగా ఆరాధించడం సాధ్యం. అలాంటి ఆరాధన సత్యానికి అనుగుణంగా ఉండాలి. అంటే దేవుడు తన గురించి వెల్లడి చేసిన దానికి అనుగుణంగా ఉండాలి. మనఃపూర్వకంగా, వాస్తవంగా కపటం లేకుండా అది ఉండాలి. దేవుడు ఇలాంటి ఆరాధకుల కోసమే చూస్తున్నాడు. దేవుడు ప్రేమామయుడు గనుకే ఇలా వెదకుతున్నాడు (1 యోహాను 4:8). ఆయన మనుషుల్ని ప్రేమిస్తూ వారి ప్రేమను ఆశిస్తున్నాడు. వారికి ఉన్నతమైన మేలు జరగాలనే ఆయన కోరిక. నిజ దేవుని నిజ ఆరాధకులయితేనే ఇది సాధ్యం. లోకంలో అంతటా కనిపించే ఆచారపరమైన శూన్య ఆరాధనకంటే మరింత శ్రేష్ఠమైన ఆరాధనను ఆయన కోరుతున్నాడు. కీర్తనల గ్రంథము 50:8-15; యెషయా 1:11-17 పోల్చి చూడండి.