Mark - మార్కు సువార్త 9 | View All

1. మరియు ఆయన ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు దేవునిరాజ్యము బలముతో వచ్చుట చూచువరకు మరణము రుచిచూడరని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాననెను.

మత్తయి 16:28.

2. ఆరుదినములైన తరువాత, యేసు పేతురును యాకోబును యోహానును మాత్రము వెంటబెట్టుకొని, యెత్తయిన యొక కొండమీదికి ఏకాంతముగా వారిని తోడుకొనిపోయి, వారియెదుట రూపాంతరము పొందెను.

మత్తయి 17:1-13.

3. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయెను; లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువచేయలేడు.

4. మరియమోషేయు ఏలీయాయు వారికి కనబడి యేసుతో మాటలాడుచుండిరి.

5. అప్పుడు పేతురు బోధకుడా, మనమిక్కడ ఉండుట మంచిది; మేము నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదుమని చెప్పెను;

6. వారు మిగుల భయపడిరి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు.

లూకా 9:33. ఏం మాట్లాడాలో తెలియనప్పుడు ఏమీ మాట్లాడకుండా ఉంటే మంచిది. అయినా పేతురు తొందరపడి పలికిన మాటను బట్టి శిష్యులు మోషేనూ ఏలీయానూ (వీరిద్దరూ కొన్ని శతాబ్దాలక్రితమే లోకంనుంచి వెళ్ళిపోయారు) గుర్తుపట్టారని అర్థం అవుతున్నది.

7. మేఘమొకటి వచ్చి వారిని కమ్మగా ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను.
ద్వితీయోపదేశకాండము 18:15, కీర్తనల గ్రంథము 2:7

8. వెంటనే వారు చుట్టు చూచినప్పుడు, తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు.

9. వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలోనుండి లేచినప్పుడే గాని, అంతకు ముందు మీరు చూచినవాటిని ఎవనితోను చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించెను.

10. మృతులలోనుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొనిరి.

11. వారు ఏలీయా ముందుగా రావలెనని శాస్త్రులు చెప్పుచున్నారే, యిదేమని ఆయన నడిగిరి.

12. అందుకాయన ఏలీయా ముందుగా వచ్చి సమస్తమును చక్క పెట్టునను మాట నిజమే; అయినను మనుష్యకుమారుడు అనేక శ్రమలుపడి, తృణీకరింపబడ వలెనని వ్రాయబడుట ఏమి?
కీర్తనల గ్రంథము 22:1-18, యెషయా 53:3, మలాకీ 4:5

ప్రభువు పాత ఒడంబడిక గ్రంథంవైపు వారి దృష్టి మళ్ళిస్తున్నాడు. యెషయా 53, కీర్తన 22 అధ్యాయాలు చూడండి.

13. ఏలీయా వచ్చెననియు అతనిగూర్చి వ్రాయబడిన ప్రకారము వారు తమకిష్టము వచ్చినట్టు అతనియెడల చేసిరనియు మీతో చెప్పు చున్నానని వారితో అనెను.

14. వారు శిష్యులయొద్దకు వచ్చి, వారి చుట్టు బహు జనులు కూడియుండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి.

మత్తయి 17:14-23 లో ఉన్నదే ఇక్కడ మరింత వివరంగా ఉంది. మత్తయి ఈ వాగ్వాదాన్ని రాయలేదు. దయ్యం పట్టిన బాలుణ్ణి శిష్యులు బాగుచేయలేకపోయారు కాబట్టి ఈ వాదం బహుశా దాన్ని గురించి అయి ఉండవచ్చు. అంతేగాక యేసుకున్న అద్భుతాలు చేయగల శక్తి గురించి అయి ఉండవచ్చు. మార్కు 3:22 పోల్చి చూడండి.

15. వెంటనే జనసమూహమంతయు ఆయనను చూచి, మిగుల విభ్రాంతినొంది ఆయనయొద్దకు పరుగెత్తి కొనివచ్చి ఆయనకు వందనముచేసిరి.

“ఆశ్చర్యపడిపోతూ”– బహుశా యేసు అకస్మాత్తుగా అక్కడికి రావడం బట్టి అయి ఉండవచ్చు.

16. అప్పుడాయనమీరు దేనిగూర్చి వారితో తర్కించుచున్నారని వారి నడుగగా

వారి వాగ్వాదానికి కారణం యేసుకు తెలియకపోలేదు (మత్తయి 9:4; యోహాను 1:47-49; యోహాను 12:24-25; యోహాను 21:17) గాని ఆ బాలుడి తండ్రి నోరు విప్పి మాట్లాడడానికి ప్రోత్సహించేందుకు ఇలా అడిగాడు.

17. జనసమూహములో ఒకడుబోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీయొద్దకు తీసికొని వచ్చితిని;

దయ్యాలు పట్టిన కొందరిలో కనిపించే లక్షణాలు కొన్ని ఇక్కడ చూడండి. వ 20,22,26 కూడా చూడండి.

18. అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును; అప్పుడు వాడు నురుగు కార్చుకొని, పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును; దానిని వెళ్లగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారిచేత కాలేదని ఆయనతో చెప్పెను.

19. అందుకాయన విశ్వాసములేని తరమువారలారా, నేను ఎంతకాలము మీతో నుందును? ఎంతవరకు మిమ్మును సహింతును? వానిని నాయొద్దకు తీసికొని రండని వారితో చెప్పగా

20. వారాయనయొద్దకు వానిని తీసికొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడ గానే, వాని విలవిల లాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను.

21. అప్పుడాయన ఇది వీనికి సంభవించి యెంతకాలమైనదని వాని తండ్రి నడుగగా అతడు బాల్యమునుండియే;

22. అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీవలననైతే మామీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను.

ఈ మనిషి యేసు శక్తిని శంకిస్తున్నాడు. ఒకవేళ యేసు ప్రతినిధులు (అంటే శిష్యులు) ఏమీ చెయ్యలేకపోయారు కాబట్టి యేసు కూడా ఏమీ చెయ్యలేడనుకున్నాడేమో. క్రైస్తవుల్లో కనిపించే బలహీనతలను చూచి మనుషులు యేసుకున్న శక్తి, అధికారాల గురించి పొరపాటుగా అంచనా వేసుకునే ప్రమాదం ఉంది.

23. అందుకు యేసు (నమ్ముట) నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమే యని అతనితో చెప్పెను.

దేవుడు పని చెయ్యడానికి మార్గం తెరిచేది మన నమ్మకమేననీ, మన అపనమ్మకం ఆయన్ను పని చేయనియ్య కుండా అడ్డగిస్తుందని మరొక సారి బైబిలు బోధిస్తున్నది (మార్కు 6:5). దేవుని శక్తి ప్రవహించేందుకు మన నమ్మకం దారిని చేస్తుంది. దేవుని సర్వాతీత శక్తిని అందిపట్టుకొనే హస్తమే నమ్మకం.

24. వెంటనే ఆ చిన్నవాని తండ్రినమ్ముచున్నాను, నాకు అపనమ్మకముండకుండ సహాయము చేయుమని బిగ్గరగా చెప్పెను.

తన నమ్మకంలోని బలహీనతను ఈ మనిషి గుర్తించాడు. తన హృదయంలో నమ్మకం, అపనమ్మకం రెండూ కలిసి ఉన్నాయని అతనికి తెలుసు. ఈ విషయంలోకూడా తనకు సహాయం చేయవలసిందని యేసుకు మొరపెట్టాడు (వ 21). యేసు ఈ రెండు ప్రార్థనలకూ జవాబిచ్చాడు. విశ్వాసులందరికీ కూడా ఈ మనిషికున్నట్టే అపనమ్మకంతో పోరాటం ఉంది గదా. ఆ మనిషికి సహాయం చేసినవానినుంచే మనకు సహాయం లభిస్తుంది (హెబ్రీయులకు 12:2).

25. జనులు గుంపుకూడి తనయొద్దకు పరు గెత్తికొనివచ్చుట యేసు చూచి మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలోప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను.

తన నమ్మకంలోని బలహీనతను ఈ మనిషి గుర్తించాడు. తన హృదయంలో నమ్మకం, అపనమ్మకం రెండూ కలిసి ఉన్నాయని అతనికి తెలుసు. ఈ విషయంలోకూడా తనకు సహాయం చేయవలసిందని యేసుకు మొరపెట్టాడు (వ 21). యేసు ఈ రెండు ప్రార్థనలకూ జవాబిచ్చాడు. విశ్వాసులందరికీ కూడా ఈ మనిషికున్నట్టే అపనమ్మకంతో పోరాటం ఉంది గదా. ఆ మనిషికి సహాయం చేసినవానినుంచే మనకు సహాయం లభిస్తుంది (హెబ్రీయులకు 12:2).

26. అప్పుడు అది కేకవేసి, వానినెంతో విలవిల లాడించి వదలిపోయెను. అంతట వాడు చచ్చినవానివలె ఉండెను గనుక అనేకులువాడు చనిపోయెననిరి.

27. అయితే యేసు వాని చెయ్యి పట్టివాని లేవనెత్తగా వాడు నిలువబడెను.

28. ఆయన ఇంటి లోనికి వెళ్లిన తరువాత ఆయన శిష్యులుమే మెందుకు ఆ దయ్యమును వెళ్లగొట్టలేక పోతిమని ఏకాంతమున ఆయన నడిగిరి.

29. అందుకాయన ప్రార్థనవలననే గాని మరి దేనివలననైనను ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను.

30. వారక్కడనుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్లు చుండిరి; అది ఎవనికిని తెలియుట ఆయనకిష్టములేక పోయెను;

ఈ ఉపదేశం లోకం మొత్తానికీ వర్తించే సమయం ఇంకా రాలేదు. ఇది కేవలం యేసు శిష్యులకు మాత్రమే. ఇప్పుడు ఆయన శిష్యులు లోకమంతటికీ ప్రకటించవలసిన సందేశానికి ఆయువుపట్టు ఇదే (లూకా 24:45; 1 కోరింథీయులకు 15:3-4).

31. ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడు చున్నాడు, వారాయనను చంపెదరు; చంపబడిన మూడు దినములకు ఆయన లేచునని వారితో చెప్పెను.

32. వారు ఆ మాట గ్రహింపలేదు గాని ఆయన నడుగ భయపడిరి.

వ 10; మార్కు 8:31-33. వారు ఆయన శిష్యులైనప్పటికీ ఆధ్యాత్మిక విషయాల్లో వారి బుద్ధి మందంగానే ఉంది. యేసు శిష్యులనేకమంది ఈనాడు ఇలాంటివారే. ఎఫెసీయులకు 1:17-19 లో పౌలు చేసిన ప్రార్థనను పోల్చి చూడండి.

33. అంతట వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక

34. ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనినిగూర్చి వాదించుచుంటిరని వారినడుగగా

లూకా 22:14. యిర్మియా 45:5 పోల్చి చూడండి.

35. వారు ఊరకుండిరి. అప్పుడాయన కూర్చుండి పండ్రెండుమందిని పిలిచిఎవడైనను మొదటి వాడైయుండ గోరినయెడల, వాడందరిలో కడపటివాడును అందరికి పరిచారకుడునై యుండవలెనని చెప్పి

మత్తయి 18:4; మత్తయి 20:26-28.

36. యొక చిన్న బిడ్డను తీసికొని వారి మధ్యను నిలువబెట్టి, వానిని ఎత్తి కౌగిలించుకొని

37. ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను గాక నన్ను పంపినవానిని చేర్చు కొనునని వారితో చెప్పెను.

మత్తయి 18:5; మత్తయి 10:40.

38. అంతట యోహానుబోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టుట చూచితివిు; వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరచితిమని చెప్పెను.

యేసు శిష్యుల్లో సంకుచిత మనసు, ఇతర క్రైస్తవుల దగ్గరనుంచి వేరుగా ఉందామనే ఆలోచన కలిగే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. కొందరు తమ గుంపే నిజమైన దేవుని గుంపు అనీ దేవుని పని చేసేందుకు తమకు మాత్రమే హక్కు ఉందనీ అనుకోవచ్చు. ఇలా ఇతర విశ్వాసులను వేరుచేసి వారిని అనర్హులుగా ఎంచే మనస్తత్వమే అసలు ఒక విశ్వాసి హృదయంలో ఉండేందుకు అనర్హం. సంఖ్యాకాండము 11:25-29; 1 కోరింథీయులకు 1:10-13 పోల్చి చూడండి.

39. అందుకు యేసువానిని ఆటంకపరచకుడి; నాపేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగల వాడెవడును లేడు;

40. మనకు విరోధికానివాడు మన పక్షముగా నున్నవాడే.

ఇది మత్తయి 12:30 నే వేరొక విధంగా చెప్పడం.

41. మీరు క్రీస్తువారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు, తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతోనిశ్చయముగా చెప్పు చున్నాను.

మత్తయి 10:40-42.

42. నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో నొకని అభ్యంతరపరచువాడెవడో, వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు.

మత్తయి 18:6-9; మత్తయి 5:29-30.

43. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన యెడల దానిని నరికివేయుము;

44. నీవు రెండు చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుటకంటె అంగ హీనుడవై జీవములో ప్రవేశించుట మేలు.

45. నీ పాదము నిన్ను అభ్యంతరపరచినయెడల దానిని నరికివేయుము;

46. రెండు పాదములు కలిగి నరకములో పడవేయబడుటకంటె, కుంటివాడవై (నిత్య) జీవములో ప్రవేశించుటమేలు.

47. నీకన్ను నిన్ను అభ్యంతరపరచినయెడల దాని తీసిపార వేయుము; రెండు కన్నులు కలిగి నరకములో పడవేయ బడుటకంటె ఒంటికన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు.

48. నరకమున వారి పురుగు చావదు;అగ్ని ఆరదు.
యెషయా 66:24

యెషయా 66:24. నరకాన్ని ఒక బ్రహ్మాండమైన ఘోరమైన చెత్తకుప్పతో పోల్చవచ్చు. అది అస్తమానం మండుతూనే ఉంటుంది. చనిపోయిన వాటిని పురుగులు ఎప్పుడూ పీకుతూనే ఉంటాయి. జెరుసలం ప్రాకారం బయట గెహెన్నా లోయలో ఇలాంటి చెత్తకుప్ప ఒకటి ఉండేది. క్రొత్త ఒడంబడిక గ్రంథంలో ముఖ్యంగా మత్తయి, మార్కు శుభవార్తల్లో 12 చోట్ల గెహెన్నా అనే పదాన్నే “నరకం” అని అనువదించడం జరిగింది. పాపభరితులైన మానవులకు పట్టబోయే గతి గురించి యేసు భయంకరమైన వర్ణన ఇచ్చాడు. దీన్ని అలక్ష్యం చెయ్యడం కేవలం తెలివితక్కువతనం. మత్తయి 5:22; లూకా 16:2, లూకా 16:24; ప్రకటన గ్రంథం 20:14-15 కూడా చూడండి. ఈ లోకానికి చెందిన మురికినీ, చెత్తనూ కోరుకుని (ఫిలిప్పీయులకు 3:8), క్రీస్తు మూలంగా లభించే రక్షణను తిరస్కరించేవారు తమను తాము నీచులను, వ్యర్థులను, చెత్తతో సమానంగా చేసుకుంటున్నారు. అలాంటివారు జగత్తు యొక్క చెత్తకుప్పకు వెళ్ళిపోవలసి వస్తుంది.

49. ప్రతివానికి ఉప్పుసారము అగ్నివలన కలుగును.

ఈ వచనం అర్థం, ముందూ వెనుకా వచనాలతో దీని సంబంధం ఏమిటో గ్రహించడం కష్టం. మనుషులకు సంభవించేదాన్ని గురించి వర్ణిస్తూ అగ్నినీ, ఉప్పునూ కలుపుతున్నాడు యేసు. పదార్థాలను ఉప్పు నిలవచేస్తుంది, అగ్ని దహిస్తుంది. అంటే నరకంలోని శాశ్వత అగ్ని జ్వాలలు అందులోని వారిని అస్తమానం దహిస్తూ ఉంటాయి గాని వారు పూర్తిగా దహనమైపోకుండా నిలవచేయబడతారు అని కొందరు పండితులు అభిప్రాయపడ్డారు. “ప్రతిఒక్కరూ” అంటే అక్షరాలా “మనుషులందరూ” అని అర్థం అయితే గనుక ఈ వచనాన్ని మరొక విధంగా అర్థం చేసుకోవాలి. పాపవిముక్తి పొందనివారు నరకంలోని అగ్నిలోకి పోతారు, రక్షించబడినవారు ఇప్పుడే అగ్నిమూలంగా శుద్ధీకరించబడతారు (కీర్తనల గ్రంథము 66:12; మలాకీ 3:2; 1 పేతురు 1:7) అని వ్యాఖ్యానించవచ్చు.

50. ఉప్పు మంచిదేగాని ఉప్పు నిస్సారమైన యెడల దేనివలన మీరు దానికి సారము కలుగుజేతురు? మీలో మీరు ఉప్పుసారము గలవారై యుండి యొకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పెను.

మత్తయి 5:13. యేసు క్రీస్తు వద్ద శిష్యరికం చేయడానికి ఇక్కడ ఉప్పు సూచనగా ఉంది. లూకా 14:34 ను ఈ సందర్భంతో పోల్చండి. నిజ శిష్యులను వారనుభవించే శాంతి సమాధానాలను బట్టి గుర్తించవచ్చు మత్తయి 5:9 పోల్చి చూడండి.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Mark - మార్కు సువార్త 9 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

రూపాంతరము. (1-13) 
క్రీస్తు రాజ్యం యొక్క ఆసన్న రాక గురించి ఇక్కడ ఒక సూచన ఉంది. క్రీస్తు రూపాంతరం సమయంలో ఆ రాజ్యం యొక్క సంగ్రహావలోకనం వెల్లడైంది. ప్రాపంచిక ఆందోళనల నుండి విడిచిపెట్టి, క్రీస్తుతో ఒంటరిగా గడపడం నిజంగా అద్భుతమైనది మరియు పరిశుద్ధులందరితో పాటు పరలోకంలో మహిమపరచబడిన క్రీస్తుతో కలిసి ఉండటం మరింత అద్భుతమైనది. అయినప్పటికీ, మనం తృప్తి స్థితిలో ఉన్నప్పుడు, మనం తరచుగా మన తోటి జీవుల అవసరాలను పట్టించుకోకుండా ఉంటాము. దేవుడు యేసును గుర్తించి, ఆయనను తన ప్రియ కుమారునిగా స్వాగతించాడు, ఆయన ద్వారా మనలను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి, మనం ఆయనను మన ప్రియమైన రక్షకునిగా గుర్తించి ఆలింగనం చేసుకోవాలి మరియు ఆయన మార్గదర్శకత్వానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఆనందం మరియు ఓదార్పు దూరం అనిపించినప్పుడు కూడా క్రీస్తు ఆత్మతో ఉంటాడు. యేసు తన శిష్యులకు ఎలిజా గురించిన ప్రవచనం యొక్క వివరణను కూడా అందించాడు, ఇది జాన్ ది బాప్టిస్ట్ యొక్క దుర్వినియోగానికి సంబంధించినది.

ఒక దుష్టాత్మ తరిమివేయబడింది. (14-29) 
బాధపడుతున్న యువకుడి తండ్రి శిష్యుల శక్తి లేకపోవడాన్ని గురించి ఆలోచించాడు, కాని వారి విశ్వాసం లేకపోవడమే నిరాశకు కారణమని యేసు కోరుకున్నాడు. విశ్వసించిన వారికి చాలా వాగ్దానం చేయబడింది. మీరు విశ్వాసాన్ని కలిగి ఉండగలిగితే, మీ గట్టిపడిన హృదయాన్ని మృదువుగా చేసే అవకాశం ఉంది, మీ ఆధ్యాత్మిక రుగ్మతలను నయం చేయవచ్చు మరియు మీ బలహీనత ఉన్నప్పటికీ, మీరు చివరి వరకు పట్టుదలతో ఉండవచ్చు. అవిశ్వాసంతో పోరాడే వారు దానిని అధిగమించడానికి అవసరమైన కృప కోసం క్రీస్తు వైపు తిరగాలి మరియు అతని దయ సరిపోతుంది. క్రీస్తు స్వస్థత చేసినప్పుడు, అతను పూర్తిగా చేస్తాడు. అయినప్పటికీ, సాతాను చాలాకాలంగా తన ఆధీనంలో ఉన్నవారిని విడుదల చేయడానికి ఇష్టపడడు, మరియు అతను పాపిని మోసగించలేనప్పుడు లేదా నాశనం చేయలేనప్పుడు, అతను వీలైనంత ఎక్కువ భయాన్ని కలిగిస్తాడు. శిష్యులు అర్థం చేసుకోవాలి, అన్ని పనులు ఒకే విధంగా సులభంగా సాధించబడవు; కొన్ని బాధ్యతలు సాధారణ ప్రయత్నం కంటే ఎక్కువ డిమాండ్ చేస్తాయి.

అపొస్తలులు మందలించారు. (30-40) 
క్రీస్తు రాబోయే బాధల సమయం ఆసన్నమైంది. ఆయనను ఈ విధంగా ప్రవర్తించిన రాక్షసులకు అప్పగిస్తే ఆశ్చర్యం కలుగక మానదు, కానీ తమను రక్షించడానికి వచ్చిన మనుష్యకుమారుని ప్రజలు అవమానకరంగా ప్రవర్తించడం నిజంగా విశేషమైనది. క్రీస్తు తన మరణం గురించి మాట్లాడినప్పుడల్లా, అతను తన పునరుత్థానాన్ని కూడా ప్రస్తావించాడు, తద్వారా తన నుండి అవమానాన్ని తొలగించాడు మరియు అతని శిష్యుల దుఃఖాన్ని తగ్గించాడు. అవగాహన కోసం చాలా ఇబ్బంది పడుతున్నందున చాలామందికి సమాచారం లేదు. రక్షకుడు తన ప్రేమ మరియు కృపకు సంబంధించిన విషయాల గురించి స్పష్టంగా బోధిస్తున్నప్పుడు, ప్రజలు అతని బోధలను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యేంతగా గ్రుడ్డితనం కలిగి ఉండటం నిరుత్సాహపరుస్తుంది. మన సంభాషణలు మరియు చర్చలకు, ముఖ్యంగా ఇతరులపై ఆధిపత్యానికి సంబంధించిన వాటికి మేము జవాబుదారీగా ఉంటాము. అత్యంత వినయం మరియు స్వీయ-తిరస్కరణను ప్రదర్శించే వారు క్రీస్తును చాలా దగ్గరగా పోలి ఉంటారు మరియు అతని వెచ్చని గుర్తింపును పొందుతారు. యేసు ఒక సంకేతం ద్వారా వారికి ఈ సందేశాన్ని తెలియజేశాడు: "ఈ బిడ్డ వంటి వ్యక్తిని స్వీకరించేవాడు నన్ను స్వీకరిస్తాడు." అనేకమంది, శిష్యులవలె, క్రీస్తు నామంలో పశ్చాత్తాపాన్ని విజయవంతంగా బోధించేవారిని త్వరగా నిశ్శబ్దం చేస్తారు, ఎందుకంటే వారు అనుసరించరు. మన ప్రభువు అపొస్తలులను మందలించాడు, అతని పేరు మీద అద్భుతాలు చేసిన వ్యక్తి తన కారణానికి హాని కలిగించలేడని వారికి గుర్తు చేశాడు. పాపులు పశ్చాత్తాపపడేలా, రక్షకునిపై విశ్వాసం ఉంచి, నిగ్రహం, నీతి మరియు దైవభక్తితో కూడిన జీవితాలను నడిపించినప్పుడు, ప్రభువు బోధకుని ద్వారా పని చేస్తున్నాడని స్పష్టమవుతుంది.

పాపానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన నొప్పి. (41-50)
దుర్మార్గులు తరచుగా "వారి పురుగు చావదు" మరియు "అగ్ని ఎప్పుడూ చల్లారదు" అని వర్ణించబడతారు. నిస్సందేహంగా, ఈ ఎడతెగని పురుగు మనస్సాక్షి యొక్క పశ్చాత్తాపాన్ని మరియు స్వీయ ప్రతిబింబం యొక్క పదునైన బాధలను సూచిస్తుంది. నిస్సందేహంగా, క్లుప్త క్షణాలు ప్రాపంచిక సుఖాలలో మునిగి శాశ్వతమైన దుఃఖాన్ని అనుభవించడం కంటే, ఈ జీవితంలో ఎలాంటి బాధను, కష్టాలను మరియు ఆత్మనిరాకరణను భరించడం మరియు ఇకపై శాశ్వతమైన ఆనందాన్ని పొందడం చాలా ఉత్తమం. ఉప్పుతో త్యాగాలు ఎలా భద్రపరచబడతాయో, అలాగే మనం కూడా కృప యొక్క ఉప్పుతో మసాలా చేయాలి. పరిశుద్ధాత్మ మన అవినీతి కోరికలను అణచివేయాలి మరియు పాడుచేయాలి. ఉప్పు యొక్క దయను కలిగి ఉన్నవారు తమ హృదయాలలో కృప యొక్క సజీవ సూత్రాన్ని కలిగి ఉన్నారని నిరూపించాలి, ఇది ఆత్మ నుండి భ్రష్టమైన వంపులను చురుకుగా ప్రక్షాళన చేస్తుంది, లేకపోతే దేవునికి లేదా మన స్వంత మనస్సాక్షికి అసంతృప్తి కలిగించే వంపులు.



Shortcut Links
మార్కు - Mark : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |