“యెజ్రేల్”– గలలీ కొండలకు దక్షిణాన ఇస్రాయేల్ దేశం ఉత్తర దిక్కున ఉన్న విశాలమైన లోయ, లేక మైదానం. హోషేయ ఇస్రాయేల్‌వారికి సూచనగా తన కొడుకుకు యెజ్రేల్ అని పేరు పెట్టాలి. యెషయా 8:3, యెషయా 8:18 పోల్చిచూడండి. ఈ పేరుకు అర్థం “దేవుడు చెదరగొట్టివేస్తాడు”. తాను ఏమి చెయ్యబోతున్నాడో సూచిస్తున్నాడు దేవుడు.
“కొంత కాలానికి”– 2 రాజులు 17:1-23.
“యెహూ”– 1 రాజులు 19:16. ఇస్రాయేల్‌లో ఇతడు అధికారంలోకి వచ్చిన వైనం, యెజ్రేల్ లోయలో జరిగిన ఘోర వధ 2 రాజులు 9, 10 అధ్యాయాల్లో చూడవచ్చు. దుర్మార్గుడైన అహాబు రాజవంశాన్ని శిక్షించేందుకు దేవుడు వాడుకున్న సాధనం యెహూ. అయితే యెహూ వంశంవారి దుర్మార్గాన్ని బట్టి దేవుడు వారిని శిక్షించాడు. యెషయా 10:5-6, యెషయా 10:12; యిర్మియా 51:20-25.
“ఇస్రాయేల్ రాజ్యాన్ని”– యాకోబు (ఇస్రాయేల్) సంతానమైన పది గోత్రాలవల్ల ఏర్పడింది. యూదా రాజ్యం, ఇస్రాయేల్ రాజ్యం వేరు వేరు – వ 7. 1 రాజులు 12వ అధ్యాయంలో ఈ చీలిక ఎలా వచ్చింది చూడవచ్చు.