44. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగములవరకు నిలుచును.
1 కోరింథీయులకు 15:24, ప్రకటన గ్రంథం 11:15, మత్తయి 21:44
“రాజులు”– ఇది పాదాలు, కాలి వ్రేళ్ళ గురించి వివరిస్తున్న సందర్భం గాని రాజుల గురించి కాదు. అయితే ఈ కాలివేళ్ళు రాజులకు సూచనలని ఇది రుజువుగా ఉంది. ఈ రాజుల కాలంలో దేవుడు తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఇంతకుముందు వచనాల్లో చెప్పిన రాజ్యాల రాజులు (అంటే నెబుకద్నెజరు, కోరెషు, అలెగ్జాండరు) కారు ఈ రాజులు. ఎందుకంటే ఆ కాలాల్లో దేవుడు తన రాజ్యాన్ని స్థాపించలేదు. వ 34 ప్రకారం ఆ రాయి పాదాలను కొడుతుంది. ఇవి రోమ్ సామ్రాజ్యానికి అంతిమ స్వరూపానికి గుర్తుగా ఉంది. ఈ క్రింద ఇవ్వబడిన కారణాలవల్ల ఈ విషయాలు క్రీస్తు మొదటి సారి ఈ లోకంలోకి వచ్చినప్పుడు నెరవేరలేదనీ, ఈ యుగాంత సమయం లోనే ఇవన్నీ నెరవేరుతాయనీ చెప్పవచ్చు. క్రీస్తు మొదటి సారి వచ్చినప్పుడు రోమ్ సామ్రాజ్యం హఠాత్తుగా చిన్నాభిన్నం అయిపోలేదు; అలానే అప్పుడు రోమ్ సామ్రాజ్యం, ఆ ఇతర సామ్రాజ్యాలూ జాడ కనబడకుండా పోలేదు, ప్రపంచమంతా దేవుని రాజ్యం వ్యాపించలేదు (వ 34,35); 7వ అధ్యాయంలోను, ప్రకటన 17వ అధ్యాయంలోను కనిపించే పది కొమ్ములు, ఇక్కడ కనిపించే పది వ్రేళ్ళు సూచిస్తూవున్న పది రాజులు క్రీస్తూ మొదటి రాకడ సమయంలో ఉనికిలో లేవు (ప్రకటన 17;12 – రాయి విగ్రహాన్ని చిన్నాభిన్నం చేయడం అంటే క్రీస్తు తన మొదటి రాకడ సమయంలో దేవుని రాజ్యాన్ని స్థాపించాడని అనుకోకపోవడానికి ఇది ముఖ్యమైన ఆధారాలలో ఒకటి). మరైతే ఇంతకుముందు దేవుని రాజ్యం రాలేదా? గూఢమైన రీతిగా ఆధ్యాత్మికమైన భావంలో వచ్చేసింది. క్రీస్తు విశ్వాసులంతా దాన్లో ఉన్నారు. అయితే అది బహిరంగంగా, ప్రత్యక్షంగా ఇంకా రాలేదు. దాని రాకకోసం విశ్వాసులు ఎదురుచూస్తూ ఉన్నారు (మత్తయి 6:10; లూకా 21:31; అపో. కార్యములు 1:6; ప్రకటన గ్రంథం 11:5). దేవుని రాజ్యం గురించి నోట్స్ మత్తయి 4:17 మొదలైనవి.