ఈ ఆహారం, ద్రాక్షమద్యం అపవిత్ర పరచేవని దానియేలు ఎందువల్ల భావించాడంటే వాటిని విగ్రహాలకు ముందుగా అర్పించి తీసుకువచ్చారు. అంతేగాక బబులోనువారు ఇస్రాయేల్కు దేవుడిచ్చిన చట్టాల ప్రకారం ఆ మాంసాన్ని సిద్ధం చేసేవారు కాదు (లేవీయకాండము 11:4-20; ద్వితీయోపదేశకాండము 12:23-24). దానియేలు కుర్రాడు, మాతృభూమికి దూరంగా ఉన్నవాడు. దేవునికి కోపం తెప్పించడమా? రాజుకు కోపం తెప్పించడమా? ఈ సమస్య అతనికి ఎదురైంది. ఏమైతేనేం రాజుకే కోపం కలిగితే కలగనియ్యి అని అచంచలమైన ధైర్యంతో నిర్ణయించుకున్నాడు. శారీరికమైన సౌకర్యాలు, భద్రత కంటే అతనికి పవిత్రతే ముఖ్యం. క్రైస్తవులు ఒక్కోసారి ఇతరులు కోపం తెచ్చుకుంటారేమోననీ, లేక తమ స్థానానికీ భద్రతకూ భంగం కలుగుతుందేమోననీ పాపం చెయ్యడానికి సిద్ధపడతారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే వారి జీవితాలకు మార్గదర్శిగా ఉండేది దేవుని పట్ల భయభక్తులు కాదు.