Jeremiah - యిర్మియా 50 | View All

1. బబులోనునుగూర్చియు కల్దీయుల దేశమునుగూర్చియు ప్రవక్తయైన యిర్మీయా ద్వారా యెహోవా సెలవిచ్చిన వాక్కు

యిర్మీయా పరిచర్య కాలంలో ఎక్కువ భాగం బబులోను సైనికంగా, రాజకీయంగా బలవత్తరమైన ముఖ్య సామ్రాజ్యం. బబులోను ఇలాంటి ఉన్నత స్థానానికి చేరుకోవడం చూచి దాని విజయాలను గురించి యిర్మీయా దేవుని వాక్కులను వినిపించాడు (యిర్మియా 20:4-6; యిర్మియా 27:3-7; యిర్మియా 46:24). ఈ అధ్యాయంలో, తరువాతి అధ్యాయంలో బబులోను ఓటమి, పతనం గురించి భవిష్యద్వాక్కులు పలుకుతున్నాడు. యిర్మియా 25:12-14, యిర్మియా 25:26; యెషయా 13 అధ్యాయం; యెషయా 21:1-9 కూడా చూడండి.

2. జనములలో ప్రకటించుడి సమాచారము తెలియ జేయుడి ధ్వజమునెత్తి మరుగుచేయక చాటించుడి బబులోను పట్టబడును బేలు అవమానము నొందును మెరోదకు నేల పడవేయబడును బబులోను విగ్రహములు అవమానము నొందును దాని బొమ్మలు బోర్లద్రోయబడును

“చాటించి”– బబులోనుకు దేవుడు ఏమి చెయ్యబోతున్నాడో జనాలన్నీ తెలుసుకోవాలి. యిర్మీయా ఈ రెండు అధ్యాయాల్లో కనిపించే విషయాలన్నీ బబులోనుకు పంపించాడు (యిర్మియా 51:59-64). బేల్ అంటే ప్రభువు అని అర్థం. ఇతడే బబులోనువారి జాతి దైవం మారోదాక్. ఇస్రాయేల్ పరిసరాల్లోని జనాలు, తమ చరిత్ర కాలంలో అడపా దడపా ఇస్రాయేల్‌వారు కూడా ఆరాధించిన బయల్ దేవుడిలాంటివాడే ఈ ‘బేల్’ (యిర్మియా 7:9; యిర్మియా 11:13; యిర్మియా 19:5; యిర్మియా 23:27). బబులోను ఆక్రమించుకొన్న దేశాల దేవతలు ఎంత బలహీనంగా ఎంత వ్యర్థంగా ఉన్నాయో బేల్ కూడా అలాంటివాడే అని నిజ దేవుడు చెప్తున్నాడు (యిర్మియా 48:7; యిర్మియా 49:3). బహుశా ఆ కాలంలో మిగతా దేశాలన్నిటికంటే బబులోనులో ఎక్కువ దేవతలు, విగ్రహాలు, విగ్రహ పూజలు ఉండేవి (వ 38). అయితే బబులోనును దండించడానికి యెహోవాదేవుడు లేచినప్పుడు అవన్నీ ఏకం అయినా ఏమీ చేయలేవు.

3. ఉత్తరదిక్కునుండి దానిమీదికి ఒక జనము వచ్చు చున్నది ఏ నివాసియు లేకుండ అది దాని దేశమును పాడు చేయును మనుష్యులేమి పశువులేమి అందరును పారిపోవుదురు అందరును తర్లిపోవుదురు.

“ఉత్తర దిక్కు”– యిర్మీయా గ్రంథంలో ఈ మాట అప్పుడప్పుడు మాదీయ, పారసీక రాజ్యాల కూటమిని సూచిస్తున్నది. వీరు క్రీ.పూ. 539లో బబులోనును పట్టుకున్నారు (దానియేలు 5:28-31).

4. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలువారును యూదా వారును కూడి వచ్చెదరు ఏడ్చుచు సాగుచు తమ దేవుడైన యెహోవాయొద్ద విచారించుటకై వచ్చెదరు

యిర్మియా 3:18; యిర్మియా 29:11-14; యిర్మియా 30:3; యెషయా 11:12; యెహెఙ్కేలు 37:19-23; హోషేయ 1:11.

5. ఎన్నటికిని మరువబడని నిత్యనిబంధన చేసికొని యెహోవాను కలిసికొందము రండని చెప్పుకొనుచు సీయోనుతట్టు అభిముఖులై ఆచ్చటికి వెళ్లు మార్గము ఏదని అడుగుచు వచ్చెదరు ఇదే యెహోవా వాక్కు.

6. నా ప్రజలు త్రోవతప్పిన గొఱ్ఱెలుగా ఉన్నారు వారి కాపరులు కొండలమీదికి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి జనులు కొండకొండకు వెళ్లుచు తాము దిగవలసిన చోటు మరచిపోయిరి.
మత్తయి 10:6

వ 17; యిర్మియా 23:1; యెషయా 53:6; లూకా 15:3-7. వారి నిజమైన విశ్రాంతి స్థలం దేవుడే (వ 7; కీర్తనల గ్రంథము 37:7; కీర్తనల గ్రంథము 90:1; కీర్తనల గ్రంథము 91:1; కీర్తనల గ్రంథము 116:7; మత్తయి 11:28-29).

7. కనుగొనినవారందరు వారిని భక్షించుచు వచ్చిరి వారి శత్రువులు మేము అపరాధులము కాము వీరు న్యాయమునకు నివాసమును తమ పితరులకు నిరీక్షణాధారమునగు యెహోవామీద తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించెనని చెప్పుదురు.

ఇస్రాయేల్ ప్రజల గురించి వారి శత్రువులు చెప్పినది నిజమే గాని వారిని దిగమింగివేసినందువల్ల ఆ శత్రువులు దోషులే. దేవుని తీర్పును వారు అనుభవించవలసి ఉంది. మనం ఇతరులపట్ల క్రూరంగా దౌర్జన్యంగా వ్యవహరిస్తే అందుకోసం మనం ఏ సాకు చెప్పినా దేవుడు ఒప్పుకోడు.

8. బబులోనులోనుండి పారిపోవుడి కల్దీయులదేశములోనుండి బయలువెళ్లుడి మందలకు ముందు మేకపోతులు నడుచునట్లు ముందర నడువుడి.
ప్రకటన గ్రంథం 18:4

యిర్మియా 51:28-29; యెషయా 13:4.

9. ఉత్తరదేశమునుండి మహాజనముల సమూహమును నేను రేపుచున్నాను బబులోనునకు విరోధముగా దానిని రప్పించుచున్నాను ఆ జనులు దానిమీదికి యుద్ధపంక్తులు తీర్చుచున్నారు వారి మధ్యనుండియే ఆమె పట్టబడును ప్రజ్ఞగల బలాఢ్యులు దోపుడుసొమ్ము పట్టుకొనక మరలని రీతిగా వారి బాణములు అమోఘములై తిరిగి రాకుండును.

10. కల్దీయుల దేశము దోపుడుసొమ్మగును దాని దోచుకొను వారందరు సంతుష్టి నొందెదరు ఇదే యెహోవా వాక్కు.

11. నా స్వాస్థ్యమును దోచుకొనువారలారా, సంతోషించుచు ఉత్సహించుచు నురిపిడిచేయుచు పెయ్యవలె గంతులువేయుచు బలమైన గుఱ్ఱములవలె మీరు సకిలించుచున్నారే?

దేవుడు బబులోను పైకి వినాశనాన్ని పంపడంలో కారణం ఇదే. వారు దేవుని సొత్తును (యూదాను) కొల్లగొట్టారు. అందుకు సంతోషంతో చంకలు కొట్టుకున్నారు.

12. మీ తల్లి బహుగా సిగ్గుపడును మిమ్మును కన్నది తెల్లబోవును ఇదిగో అది జనములన్నిటిలో అతినీచ జనమగును అది యెడారియు ఎండినభూమియు అడవియు నగును.

13. యెహోవా రౌద్రమునుబట్టి అది నిర్జనమగును అది కేవలము పాడైపోవును బబులోను మార్గమున పోవువారందరు ఆశ్చర్యపడి దాని తెగుళ్లన్నియు చూచి ఆహా నీకీగతి పట్టినదా? అందురు

వ 3,12,39,40. ప్రస్తుతం బబులోనునగరం ఒక శిథిలాల గుట్టగా పడివుంది.

14. ఆమె యెహోవాకు విరోధముగా పాపముచేసినది. విల్లు త్రొక్కువారలారా, మీరందరు బబులోనునకు విరోధముగా దాని చుట్టు యుద్ధపంక్తులు తీర్చుడి ఎడతెగక దానిమీద బాణములు వేయుడి

బబులోను యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసింది – దాని పతనానికి ఇదే కారణం.

15. చుట్టు కూడి దానిని బట్టి కేకలువేయుడి అది లోబడ నొప్పుకొనుచున్నది దాని బురుజులు పడిపోవుచున్నవి దాని ప్రాకారములు విరుగగొట్టబడుచున్నవి ఇది యెహోవా చేయు ప్రతికారము. దానిమీద పగతీర్చుకొనుడి అది చేసినట్టే దానికి చేయుడి.
ప్రకటన గ్రంథం 18:6

బబులోను పై తాను ప్రతీకారం చేసుకునేందుకు దేవుడు మనుషులను వినియోగించాడు. బబులోను ఇతరుల విషయంలో ఎలా చేసిందో దానికీ అలానే జరుగుతుంది – కీర్తనల గ్రంథము 137:8; యిర్మియా 25:14; ప్రకటన గ్రంథం 18:6.

16. బబులోనులో నుండకుండ విత్తువారిని నిర్మూలము చేయుడి కోతకాలమున కొడవలి పట్టుకొనువారిని నిర్మూలము చేయుడి క్రూరమైన ఖడ్గమునకు భయపడి వారందరు తమ ప్రజలయొద్దకు వెళ్లుచున్నారు తమ తమ దేశములకు పారిపోవుచున్నారు.

17. ఇశ్రాయేలువారు చెదిరిపోయిన గొఱ్ఱెలు సింహములు వారిని తొలగగొట్టెను మొదట అష్షూరురాజు వారిని భక్షించెను కడపట బబులోను రాజైన యీ నెబుకద్రెజరు వారి యెముకలను నలుగగొట్టుచున్నాడు.

వ 6.

18. కావున ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అష్షూరు రాజును నేను దండించినట్లు బబులోనురాజును అతని దేశమును దండించెదను.

అష్షూరువారి ముఖ్య పట్టణం నీనెవె క్రీ.పూ. 612లో శత్రువుల చేజిక్కింది. అష్షూరు గురించి నోట్ 2 రాజులు 15:19.

19. ఇశ్రాయేలువారిని తమ మేతస్థలమునకు నేను తిరిగి రప్పించెదను వారు కర్మెలుమీదను బాషానుమీదను మేయుదురు ఎఫ్రాయిము కొండలమీదను గిలాదులోను మేయుచు సంతుష్టినొందును.

20. ఆ కాలమున ఆ నాటికి ఇశ్రాయేలు దోషమును వెదకినను అది కనబడకుండును. యూదా పాపములు వెదకిను అవి దొరుకవు శేషింపజేసినవారిని నేను క్షమించెదను ఇదే యెహోవా వాక్కు.

దేవుడు క్షమించడమంటే ఇదే. దోషులైన వారిని వారు ఎప్పుడూ పాపం చేసి ఉండనివారిలాగా చేస్తుంది. ఆదికాండము 15:6; కీర్తనల గ్రంథము 32:1-2; మత్తయి 6:12; రోమీయులకు 3:21-26 దేవుని దగ్గర క్షమ, న్యాయవంతులుగా తీర్చడం గురించి నోట్స్ చూడండి.

21. దండెత్తి మెరాతయీయుల దేశముమీదికి పొమ్ము పెకోదీయుల దేశముమీదికి పొమ్ము వారిని హతముచేయుము వారు శాపగ్రస్తులని ప్రకటించుము నేను మీకిచ్చిన ఆజ్ఞ అంతటినిబట్టి చేయుము.

“మెరాతయీం”అంటే రెండంతలు తిరుగుబాటు. తనపై తిరుగుబాటు చేసినందుకు (వ 24, 29) దేవుడు బబులోనును ఈ పేరుతో పిలుస్తూ ఉండవచ్చు. పెకోదు అంటే హీబ్రూ భాషలో శిక్ష అని అర్థం. బబులోనులో ఇది టైగ్రస్‌కు అవతల దాని సమీపంలోనే ఉన్న ప్రాంతం (యెహెఙ్కేలు 23:23).

22. ఆలకించుడి, దేశములో యుద్ధధ్వని వినబడుచున్నది అధిక నాశనధ్వని వినబడుచున్నది

23. సర్వభూమిని కొట్టుచున్న సమ్మెట తెగి బొత్తిగా విరుగ గొట్టబడెను అన్యజనులలో బబులోను బొత్తిగా పాడైపోయెను.

“సమ్మెట”– దేశాలను చితగొట్టడానికి దేవుని చేతిలో ఉన్న సుత్తి బబులోను. ఇప్పుడు అదే చితగొట్టబడుతుంది. యిర్మియా 51:20; యెషయా 10:5 పోల్చి చూడండి.

24. బబులోనూ, నిన్ను పట్టుకొనుటకై బోను పెట్టి యున్నాను తెలియకయే నీవు పట్టబడియున్నావు యెహోవాతో నీవు యుద్ధముచేయ బూనుకొంటివి నీవు చిక్కుపడి పట్టబడియున్నావు.

మాదీయ, పారసీక జాతులు బబులోనుపై హఠాత్తుగా దాడిచేసి వశపరచుకున్నారు.

25. కల్దీయులదేశములో ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవాకు పనియున్నది యెహోవా తన ఆయుధశాలను తెరచి కోపముతీర్చు తన ఆయుధములను వెలుపలికి తెచ్చు చున్నాడు.
రోమీయులకు 9:22

“ఆయుధాలు”– అంటే ఇతర జాతులు (యెషయా 13:5).

26. నలుదిక్కులనుండి వచ్చి దానిమీద పడుడి దాని ధాన్యపుకొట్లను విప్పుడి కసవు కుప్పలువేసినట్లు దానిని కుప్పలువేయుడి శేషమేమియు లేకుండ నాశనము చేయుడి

27. దాని యెడ్లన్నిటిని వధించుడి అవి వధకు పోవలెను అయ్యో, వారికి శ్రమ వారి దినము ఆసన్నమాయెను వారి దండనకాలము వచ్చెను.

ఎద్దులు అంటే బబులోను సైనికులని అర్థమివ్వచ్చు.

28. ఆలకించుడి, పారిపోయి బబులోను దేశములోనుండి తప్పించుకొని వచ్చుచున్నవారి శబ్దము వినబడు చున్నది మన దేవుడగు యెహోవా చేయు ప్రతికార సమా చారమును తన ఆలయము విషయమై ఆయన చేయు ప్రతికార సమాచారమును సీయోనులో ప్రకటించుడి. వారు వచ్చుచున్నారు.

బబులోనునుండి తప్పించుకొని యూదాకు తిరిగివచ్చిన యూదులు. “ఆలయం”– యిర్మియా 51:11; యిర్మియా 52:13; 2 రాజులు 24:13.

29. బబులోనునకు రండని విలుకాండ్రమ పిలువుడి విల్లు త్రొక్కువారలారా, మీరందరు దానిచుట్టు దిగుడి. అది యెహోవామీద గర్వపడినది ఇశ్రాయేలు పరిశుద్ధునిమీద గర్వపడినది దానిలో నొకడును తప్పించుకొనకూడదు దాని క్రియలనుబట్టి దానికి ప్రతికారము చేయుడి అది చేసిన పనియంతటినిబట్టి దానికి ప్రతికారము చేయుడి.
ప్రకటన గ్రంథం 18:6

బబులోనులో కూడా ఉన్న ఘోర పాపాలలో గర్వం ఒకటి (యిర్మియా 48:29; యిర్మియా 49:16). దీనికి ఒక ఉదాహరణ దానియేలు 4:29-30 లో కనిపిస్తున్నది.

30. కావున ఆ దినమున దాని ¸యౌవనస్థులు దాని వీధులలో కూలుదురు దాని యోధులందరు తుడిచివేయబడుదురు ఇదే యెహోవా వాక్కు.

31. ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా వాక్కు ఇదే గర్విష్ఠుడా, నేను నీకు విరోధినై యున్నాను నీ దినము వచ్చుచున్నది నేను నిన్ను శిక్షించుకాలము వచ్చుచున్నది

32. గర్విష్ఠుడు తొట్రిల్లి కూలును అతని లేవనెత్తువాడెవడును లేకపోవును నేనతని పురములలో అగ్ని రాజబెట్టెదను అది అతని చుట్టుపట్టులన్నిటిని కాల్చివేయును.

33. సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఒకడును తప్పకుండ ఇశ్రాయేలువారును యూదా వారును బాధింపబడిరి వారిని చెరపెట్టినవారందరు వారిని గట్టిగా పట్టుకొను చున్నారు వారిని పోనిచ్చుటకు సమ్మతింపరు.

నిర్గమకాండము 5:2; నిర్గమకాండము 7:14; నిర్గమకాండము 8:32 పోల్చి చూడండి.

34. వారి విమోచకుడు బలవంతుడు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు భూమికి విశ్రాంతి కలుగజేయుటకును బబులోను నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యెమును కడ ముట్టించును.
ప్రకటన గ్రంథం 18:8

ఇస్రాయేల్ ఓడిపోయినప్పుడు యెహోవా దేవుడు ఓడిపోయినట్టు కాదు. వారు బలహీనులై తమ శత్రువులకు లొంగిపోవలసి వచ్చినంత మాత్రాన వారి దేవుడైన యెహోవా బలహీనుడని కాదు. వారి శత్రువులు అలా అనుకున్నారేమో. ఇస్రాయేల్‌వారి పక్షంగా యెహోవా తన బలప్రభావాలను ప్రదర్శించే సమయం రానున్నది. “విమోచకుడు”– కీర్తనల గ్రంథము 78:35 నోట్ చూడండి.

35. యెహోవా మాట యిదే కల్దీయులును బబులోను నివాసులును దాని అధిపతులును జ్ఞానులును కత్తిపాలగుదురు

36. ప్రగల్భములు పలుకువారు ఖడ్గవశులై పిచ్చివాండ్రగుదురు. బలాఢ్యులు నిర్మూలమగువరకు ఖడ్గము వారిమీద పడును

37. ఖడ్గము వారి గుఱ్ఱములమీద పడును వారి రథముల మీద పడును ఖడ్గము వారిమీదికి దిగుటచేత దానిలోనున్న పరదేశులు స్త్రీలవంటివారగుదురు అది దాని నిధులమీద పడగా అవి దోచుకొనబడును.

38. నీళ్లకు ఎద్దడి తగులును అవి ఇంకిపోవును అది చెక్కబడిన విగ్రహములుగల దేశము జనులు భీకరప్రతిమలనుబట్టి పిచ్చిచేష్టలు చేయుదురు.
ప్రకటన గ్రంథం 16:12

బబులోనులాగా విగ్రహపూజకు తనను ఇచ్చివేసుకొన్న ఏ దేశమూ అంతంలో వర్థిల్లదు. దాని పతనానికి ముఖ్య కారణాలలో ఒకటి దానికెంతో ఇష్టమైన విగ్రహారాధనే.

39. అందుచేతను అడవిపిల్లులును నక్కలును అక్కడ నివసించును నిప్పుకోళ్లును దానిలో నివాసముచేయును ఇకమీదట అది ఎన్నడును నివాసస్థలము కాకపోవును తరతరములు దానిలో ఎవరును కాపురముండరు.
ప్రకటన గ్రంథం 18:2

వ 13; యిర్మియా 51:37, యిర్మియా 51:62; యెషయా 13:19-22. బబులోను మాదీయ, పారసీక జాతులవారి చేతుల్లో ఓడిపోయిన వెంటనే ఇది జరగలేదు. ఆ నగరం క్షీణత క్రమక్రమేణా జరిగింది. దాని ప్రాముఖ్యతనంతటినీ పోగొట్టుకొని చివరికి పూర్తిగా నిర్జన స్థలమయింది. ఈనాడు బబులోను శిథిలాల కుప్పలు మినహా అక్కడ మరేదీ కన్పించదు. అదంతా సొదొమ, గొమొర్రాలాగా మానవ సంచారమేమీ లేక ఎండు భూమిగా అయిపోయింది. ఈ యుగాంతంలో బబులోనును తిరిగి కట్టించడం జరుగుతుందని కొందరు బైబిలు పండితుల అభిప్రాయం. ఇదే ప్రకటన 17,18లో ఉన్న బబులోను అనుకుంటారు. అయితే యిర్మీయా, యెషయాల్లో రాసివున్నవాటిని బట్టి చూస్తే బబులోను నగరాన్ని తిరిగి కట్టించడమనేది అసంభవం అని అనుకోవచ్చు.

40. యెహోవా వాక్కు ఇదే సొదొమను గొమొఱ్ఱాను వాటి సమీప పట్టణములను దేవుడు నాశనము చేసినప్పుడు జరిగిన రీతిగా ఎవడును అక్కడ కాపురముండకపోవును ఏ నరుడును దానిలో బసచేయడు.

41. జనులు ఉత్తరదిక్కునుండి వచ్చుచున్నారు మహాజనమును అనేక రాజులును భూదిగంతములనుండి రేపబడెదరు.

యిర్మియా 6:22-24 చూడండి. అక్కడ రాసినది బబులోను గురించే. ఇక్కడైతే బబులోను పైకి దండెత్తి వస్తున్న సైన్యాలను గురించి అదే మాటలు రాసివున్నాయి.

42. వారు వింటిని ఈటెను పట్టుకొని వచ్చెదరు వారు క్రూరులు జాలిపడనివారు వారి స్వరము సముద్రఘోషవలె ఉన్నది వారు గుఱ్ఱములను ఎక్కువారు బబులోను కుమారీ, ఒకడు యుద్ధపంక్తులు తీర్చు రీతిగా వారందరు నీమీద పంక్తులు తీర్చుచున్నారు.

43. బబులోనురాజు వారి సమాచారము విని దుర్బలు డాయెను అతనికి బాధ కలిగెను ప్రసవ స్త్రీ వేదనవంటి వేదన అతనికి సంభవించెను.

44. చిరకాల నివాసమును పట్టుకొనవలెనని శత్రువులు యొర్దాను ప్రవాహములో నుండి సింహము వలె వచ్చుచున్నారు నిమిషములోనే నేను వారిని దానియొద్దనుండి తోలి వేయుదును నేనెవని ఏర్పరతునో వానిని దానిమీద నియమించెదనునన్ను పోలియున్నవాడై నన్ను ఆక్షేపణచేయువాడేడి?నన్ను ఎదిరింపగల కాపరి ఏడి?

యిర్మియా 49:19-21 చూడండి. అక్కడ ఎదోంకు వ్యతిరేకంగా ఈ మాటలు రాసి ఉన్నాయి. ఇక్కడ అదే మాటలు బబులోను పతనాన్ని సూచిస్తూ రాసి ఉన్నాయి.

45. బబులోనునుగూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి కల్దీయుల దేశమునుగూర్చి ఆయన ఉద్దేశించినది వినుడి నిశ్చయముగా మందలోని అల్పులైనవారిని వారు లాగు దురు నిశ్చయముగా వారినిబట్టి వారి నివాసస్థలము విస్మయ మొందును.

46. బబులోను పట్టబడుచున్నదను సమాచారము విని భూమి కంపించుచున్నది జనములలో అంగలార్పు వినబడుచున్నది.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Jeremiah - యిర్మియా 50 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

బాబిలోన్ నాశనం. (1-3,8-16,21-32,35-46;) 

దేవుని ప్రజల విమోచన. (4-7,17-20,33,34)

1-7
బబులోను రాజు యిర్మీయా పట్ల దయ చూపించాడు, అయినప్పటికీ ఆ రాజ్య పతనాన్ని అంచనా వేయడానికి ప్రవక్త ఒత్తిడి చేయబడ్డాడు. మన స్నేహితులు దేవునికి వ్యతిరేకంగా తమను తాము సమం చేసుకుంటే, మనం వారికి తప్పుడు సాంత్వన అందించడం మానుకోవాలి. బాబిలోన్ యొక్క పూర్తి విధ్వంసం ఇక్కడ చిత్రీకరించబడింది. యూదుల కోసం ఒక నిరీక్షణ సందేశం ఉంది - వారు చివరికి తమ దేవుడి వద్దకు మరియు వారి స్వదేశానికి తిరిగి వస్తారు. వారి మార్పిడి మరియు పునరుద్ధరణ యొక్క వాగ్దానం ఇతర వాగ్దానాలను నెరవేర్చడానికి వేదికను నిర్దేశిస్తుంది. వారి కన్నీళ్లు వారు బందీలుగా తీసుకున్నట్లుగా ప్రాపంచిక దుఃఖం కాదు, కానీ అవి నిజమైన దైవిక దుఃఖం నుండి ఉద్భవించాయి. వారు తమ దేవుడని ప్రభువును శ్రద్ధగా వెదకుతారు మరియు విగ్రహాలకు దూరంగా ఉంటారు. తమ సొంత భూమికి తిరిగి వెళ్లాలనే ఆలోచన వారి మనసులను ఆక్రమిస్తుంది. వినయపూర్వకమైన ఆత్మలు దేవునికి తిరిగి రావడాన్ని ఇది సూచిస్తుంది. నిజమైన మతమార్పిడులలో, వారి లక్ష్యాన్ని చేరుకోవాలనే నిజమైన కోరికలు మరియు సరైన మార్గంలో ఉండటానికి స్థిరమైన నిబద్ధత ఉంటాయి. వారి ప్రస్తుత పరిస్థితి తీవ్ర విచారకరమని సంతాపం వ్యక్తం చేశారు. క్రైస్తవులమని చెప్పుకునే వారి పాపాలు తమ విధ్వంసంలో ఆనందించేవారిని ఎన్నటికీ సమర్థించవు.

8-20
బాబిలోన్‌పై జరగబోయే వినాశనం వివిధ వ్యక్తీకరణల ద్వారా వివరించబడింది. ఈ విధ్వంసం లార్డ్ యొక్క కోపం యొక్క పర్యవసానంగా ఉంది ఎందుకంటే బాబిలోన్ అతనికి వ్యతిరేకంగా పాపాలు చేసింది. బబులోను దాని అతిక్రమాల వల్ల పూర్తిగా నాశనం చేయబడుతుంది. పాపం వ్యక్తులను దేవుని తీర్పులకు గురి చేస్తుంది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేసిన దయ ఈ విధ్వంసం సమయంలో ఉండటమే కాకుండా దాని నుండి కూడా పుడుతుంది. ఈ నమ్మకమైన వ్యక్తులు అరణ్యం నుండి సేకరించబడతారు మరియు సారవంతమైన పచ్చిక బయళ్లలో తిరిగి ఉంచబడతారు. దేవుని వైపు తిరిగి తమ విధులను నిర్వర్తించే వారు అలా చేయడం ద్వారా నిజమైన ఆత్మ సంతృప్తిని కనుగొంటారు. కష్టాల నుండి విముక్తి చాలా ఓదార్పునిస్తుంది, ప్రత్యేకించి అది పాప క్షమాపణ ఫలితంగా ఉన్నప్పుడు.

21-32
సైన్యాలు సమావేశమై బాబిలోన్‌ను నిర్మూలించడానికి అధికారం పొందాయి. వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చనివ్వండి మరియు అతను ముందుగా హెచ్చరించిన దానిని వారు నెరవేరుస్తారు. ప్రజల హృదయాలలోని అహంకారం దేవుని వ్యతిరేకతను ప్రేరేపిస్తుంది మరియు వారి రాబోయే నాశనాన్ని వేగవంతం చేస్తుంది. బాబిలోన్ పతనం దాని గర్వం యొక్క పరిణామం; అది ఇశ్రాయేలు పరిశుద్ధుడిని గర్వంగా ధిక్కరించింది. దేవుడు పడద్రోయాలని నిర్ణయించిన వారిని ఎవరు నిలబెట్టగలరు?

33-46
కష్ట సమయాల్లో, ఇజ్రాయెల్ వారు బలహీనులుగా ఉన్నప్పటికీ, వారి విమోచకుడు శక్తిమంతుడనే వాస్తవంలో ఓదార్పు పొందుతుంది. తమ స్వంత బలహీనతలను మరియు అనేక బలహీనతలను అంగీకరిస్తూ, పాపం మరియు అవినీతిని పట్టి పీడిస్తున్న విశ్వాసులకు ఇది వర్తించవచ్చు. వారి విమోచకుడు వారు తనకు అప్పగించిన వాటిని పూర్తిగా కాపాడుకోగలడు, పాపం వారిపై ఆధిపత్యం పొందకుండా చూసుకుంటాడు. దేవుని ప్రజల కోసం ఆయన వారికి శాశ్వత విశ్రాంతిని ఇస్తాడు. ఇక్కడ, మేము బాబిలోన్ యొక్క అతిక్రమణలను మరియు వాటి పర్యవసానాలను కూడా చూస్తున్నాము. ఈ పాపాలు విగ్రహారాధన మరియు హింసను కలిగి ఉంటాయి. తన ప్రజలను వారి పాపాల నుండి రక్షించడానికి నిరాకరించేవాడు వారి బహిరంగ శత్రువుల దుష్టత్వాన్ని ఎన్నటికీ సహించడు. ఈ అతిక్రమణలకు దేవుని తీర్పులు బాబిలోన్‌ను వృధా చేస్తాయి. సుసంపన్నమైన బాబిలోన్‌కు వ్యతిరేకంగా ప్రకటించబడిన తీర్పులు మరియు బాధలో ఉన్న ఇజ్రాయెల్‌కు వాగ్దానం చేసిన కరుణలలో, పాపం యొక్క క్షణికమైన ఆనందాలలో మునిగిపోయే బదులు దేవుని ప్రజలతో బాధను సహించడాన్ని ఎంచుకోవాలని మనకు బోధించబడింది.








Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |