సొలొమోను తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూశాడు, ప్రసంగి 1:14; ప్రసంగి 2:24; ప్రసంగి 3:12-13, ప్రసంగి 3:22 లో ఇతరుల కోసమని తాను రాసిన నియమాన్ని తానే ఆచరణలో పెట్టడం కష్టసాధ్యమని గమనించాడు. తాను చూచిన దాన్ని బట్టి పూర్తిగా నిరుత్సాహపడిపోయాడు. అతడు చూచినవి హద్దూ, అదుపూ లేని క్రౌర్యం (వ 1-3), అసూయ వల్ల ఒనగూడే ఫలితాలు (వ 4), మూర్ఖత్వం, అసలు సంతృప్తి కలిగించని ఒంటరి కష్టం (వ 7-12), జనప్రీతి, ఉన్నత పదవిలోని అర్థం లేనితనం (వ 13-16). ఇదంతా వ్యర్థం, శూన్యం. మనిషి చేసే పనులన్నీ ప్రయోజనం లేనివి. బావుందని మెచ్చుకునేందుకు వాటిలో ఏ మంచీ లేదు. తమ జీవిత కాలమంతా చేస్తూ ఉండదగిన మంచిని చూపించేది ఏమీ లేదు. “లోకంలో ఉన్నదంతా అంటే శరీరస్వభావం కోరికలు, కండ్ల కోరికలు, జీవితాన్ని గురించిన బడాయిలు తండ్రివల్ల కలిగేవి కావు గాని లోకం వల్ల కలిగేవే. లోకమూ, దాని ఆశలూ గతించిపోతూ ఉన్నాయి...” అంటూ యోహాను తన మొదటి లేఖలో స్పష్టంగా రాసిపెట్టిన దానిలో (1 యోహాను 2:15-17) కొంతయినా సొలొమోను ముందుగానే గ్రహించగలిగాడు. ఇలాంటి లోకంలో జీవించడం కంటే చావే మేలని సొలొమోను అభిప్రాయ పడ్డాడు. అసలు పుట్టకుండానే ఉంటే అది మరీ ఉత్తమం అనుకున్నాడు (వ 2,3. యోబు 3:1, యోబు 3:20-22 నోట్స్ చూడండి). కొత్త ఒడంబడికలో మనకు వెల్లడైన విషయాలను బట్టి మనం ఎంత కృతజ్ఞతతో ఉండాలి! క్రీస్తు మహిమార్థం మనుషులు పడే ప్రయాసకు కలిగే శాశ్వతమైన పరమార్థం, విలువ అక్కడ మనకు కనిపిస్తాయి (మత్తయి 10:42; యోహాను 12:26; 1 కోరింథీయులకు 15:58). ఈ లోకంలో తన కండ్లెదుట జరిగేవాటి గురించీ, తనకు అనుభవమయ్యే వాటిని గురించీ నిజమైన క్రైస్తవుడు నీరుగారి పోనక్కర్లేదు. దేవుని దగ్గర ఆశ్చర్యకరమైన ఉద్దేశాలు ఉన్నాయి. ఆయన వాటిని తప్పక నెరవేరుస్తాడు (రోమీయులకు 8:18-30).