యుద్ధ కాలాల్లోను శత్రువులనుంచి పారిపోయి దాక్కున్న సమయాల్లోను ఇతర ప్రాంతాలకు వెళ్ళిన సమయాల్లోను దావీదు తరచుగా దేవుని ఆరాధన స్థలానికి దూరంగా ఉండేవాడు. అలాంటి సమయాల్లో అతడు తహతహలాడేది జెరుసలంలోని దేవుని నివాసం కోసం, ధ్యానం, ఆరాధన చేసుకునేందుకు క్షేమకరమైన, శాంతికరమైన ఆ స్థలం కోసం, ఆరాధన గుడారం దగ్గర జరిగే సంగీత వాద్యాల ఆనంద ధ్వనుల కోసం. అనంత యుగాలలో విశ్వాసులకు దక్కే భాగ్యం ఇదే.
“ఒకటి”– అతడు కోరినది ధనం, పైస్థానం, పేరుప్రతిష్టలు, ఇతరులపై శక్తి ఇవి కాదు. 1 రాజులు 3:5; లూకా 10:41-42; ఫిలిప్పీయులకు 3:8-10 పోల్చి చూడండి.
“యెహోవా మనోజ్ఞత”– హీబ్రూ పదానికి మనోహరత్వం, లేక ఉల్లాసం కలిగించేది అని కూడా అర్థం. కీర్తనల గ్రంథము 90:17 చూడండి. దేవుని ఆరాధన స్థలంలో ఎలాంటి ఆకృతీ లేదు, అందంగా ఉన్నదనుకోవడానికీ ఎలాంటి విగ్రహమూ లేదు. ఇక్కడ దావీదు మాట్లాడుతున్నది విశ్వాస నేత్రంతో మాత్రమే చూడగలిగిన దేవుని ఆధ్మాత్మిక సౌందర్యం.