ఈ వచనంలో నిజమైన ధన్యతకూ దేవుడు వెల్లడించిన సత్యాన్ని ప్రేమించడానికీ మధ్య ఉన్న సంబంధం అర్థమౌతున్నది. ధన్యజీవి చెడు మాటలకూ చెడు విధానాలకూ దూరంగా ఉండడమే కాదు, పూర్తిగా వేరొక దానిలో నిమగ్నమై ఉంటాడు అని “ఆనందిస్తూ”, “ధ్యానం చేస్తూ” అనే రెండు ముఖ్యమైన పదాలు సూచిస్తున్నాయి. దేవుని ఉపదేశంలో ఆనందించడమంటే దేవునిలోను, దేవుని మార్గాల్లోను వెల్లడైన ఆయన సంకల్పంలోనూ ఆనందించడమే. హృదయానికి మరేదీ ఇవ్వలేనంత ఆనందాన్ని ఇది ఇస్తుంది. కీర్తనల గ్రంథము 37:4 మొ।। పోల్చిచూడండి. దేవుని ఉపదేశంలో ఆనందించే ఒక మనిషి ఉదాహరణ కావాలంటే 119వ కీర్తన చూడండి. ఇక్కడ ఉపదేశం అని తర్జుమా చేసిన మాటకు “ధర్మశాస్త్రం” అని కూడా అర్థం ఉంది. అప్పటివరకు దేవుడు తన ప్రవక్తల ద్వారా వెల్లడి చేసినదంతా అని దీని భావం. ఇప్పుడు మనకు బైబిలంతా అని అర్థం చేసుకోవాలి. దేవుని సత్యం మూలంగా మాత్రమే మనుషులు నిజమైన ధన్యతను అనుభవించగలరు. ఈ ధన్యత గురించి జ్ఞానులు, మతోపదేశకులు, వేదాంతులు అందరి రచనలన్నిటి కంటే బైబిలులో ఎంతో ఎక్కువ ఉంది. మనుషులు దేవుని వాక్కులో ఆనందించి, ధ్యానించి, లోబడే మేరకు ఈ ధన్యతను అనుభవిస్తారు.
“రాత్రింబగళ్ళు” అనే మాటలు చూడండి. అంటే దేవుడు వెల్లడించిన సత్యాన్ని అస్తమానం మననం చేసుకొంటూ మన సామాన్య దిన కృత్యాల్లో కూడా అది మన హృదయాలనూ మనస్సులనూ నిండిపోతూ ఉండాలి. యోహాను 15:7; కొలొస్సయులకు 3:16 మొ।। చూడండి. దాన్లో మనం ఆనందిస్తే ఇది అసాధ్యమని ఎంత మాత్రం అనిపించదు.
“ధ్యానం చేస్తూ”– అంటే దేవుని వాక్కు అర్థం చేసుకుంటూ మన జీవితాల్లో ఆచరిస్తూ ఉండేలా దాని గురించి ఆలోచిస్తూ ఉండడం గానీ జపం గానీ యోగ ధ్యాన సాధనాలు గానీ కాదు.