దేవుని గురించి యోబు పలికిన మాటలన్నిటిలోకి ఇవే కఠినంగా ఉన్నాయి. తన నిరాశలో పూర్తిగా అధమ స్థితికి యోబు ఇక్కడ దిగజారాడు. తనకు దేవుడు చేసినవాటిని అపార్థం చేసుకోవడంలో యోబు ఇక్కడ చాలా దూరం వెళ్ళిపోయాడు. దేవుణ్ణి క్రూరుడైన నియంతగా, కనికరం లేకుండా తోచినది చేసేవాడిగా చిత్రీకరించాడు. న్యాయవంతులు, దుర్మార్గులు అనే తేడా చూపని దేవుడుగా వర్ణిస్తాడు. అయితే యోబు దుర్మార్గుడని ఈ మాటల వల్ల రుజువు కావడం లేదు. ఎడతెరిపి లేని బాధ, దుఃఖం, వేధించే ప్రపంచంలో అత్యంత యోగ్యుడైనవాణ్ణి కూడా ఎలా మాట్లాడించగలవో ఇక్కడ అర్థమౌతున్నది. శరీరం, ఆత్మ బాధతో మెలికలు తిరిగిపోతూ ఉంటే దారీ తెన్నూ తోచని మనిషి దేవదూతలాగానో, కష్టాలు అనుభవించని పవిత్రునిలాగానో ఎలా మాట్లాడగలడు? అయితే ఒకటి గమనించండి. ఇప్పుడు కూడా యోబు దేవుణ్ణి నిరాకరించడం లేదు. నాస్తికత్వం అనే అజ్ఞానం, దుర్మార్గతలో పడడం లేదు. సైతాను ఇలా వాదించి మనుషుల్ని నాస్తికత్వాన్ని అవలంబించడానికి ప్రేరేపిస్తాడు – ఈ లోకం అంతా నిర్దోషుల మీదికీ అమాయకుల మీదికీ వచ్చే అన్యాయమైన బాధలు, విపత్తులతో నిండి ఉంది. దేవుడంటూ ఉంటే ఇలా జరగనివ్వడు గదా. సైతాను తర్కం ఇది:
(1) దేవుడే గనుక ఉంటే నిర్దోషులు బాధలు పడరు;
(2) కానీ నిర్దోషులు బాధలు పడుతున్నారు;
(3) కాబట్టి దేవుడు లేడు.
సైతానుకు ఇది నిజం కాదని తెలుసు. గాని కొందరిని ఇది నిజమని నమ్మిస్తాడు. యోబు ఈ ఉచ్చులో పడలేదు. కానీ ఈ లోకంలో కనిపించే కీడు విషయంలో యోబుకు కలిగిన అయోమయావస్థ 24వ వచనంలో కనిపిస్తున్నది. దేవుడు దీన్ని ఎందుకు అరికట్టడు? పైగా దీన్ని సమర్థిస్తున్నట్టు కనిపిస్తున్నదేమిటి? యోబు గానీ బైబిల్లోని దేవుని సంపూర్ణ సత్యం తెలియని వారెవరైనా గానీ మనుషులతో దేవుని తీరు తెన్నులను అర్థం చేసుకోలేరు. బైబిలంతటితో పరిచయం ఉన్న మనం కూడా ఒక్కో సారి దిగ్భ్రమలో పడిపోతాం (కానీ నిరాశ చెందకూడదు). మనం కూడా యోబులాగానే విశ్వాసంతో నడుచుకోవాలి (2 కోరింథీయులకు 5:7), కనిపించేవాటిపై గాక కనిపించని వాటిపై మనస్సు లగ్నం చెయ్యాలి (2 కోరింథీయులకు 4:18).