Episode 5: విశ్వాసములో సంపూర్ణ నిశ్చయతలో - జీవముగల వాక్యం
Audio: https://youtu.be/O6eoZa0fI-o
హెబ్రీ 10:19-23 విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము.
విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలగాలంటే నీ చేతిలో ఉన్న వాక్యం దేవుని మాటలని, ఆ వాక్యములో జీవమున్నదని తెలసుకోవాలి. వాక్యమును చూస్తే చాలా సులువుగా ఉంటుంది కాని వాక్య ప్రకారం జీవించుట అతి కష్టమైనది. అందుకే ఇరుకు మార్గంగుండా పోవువారు కొందరే. ఈ పవిత్రమైన వాక్యం తల క్రిందనో, చేతిలోలోనో మరేచోట కాకుండ హృదయంలో ఉంటే; ఈ వాక్యం మాట్లాడుతుంది, నడిపిస్తుంది, బలపరుస్తుంది, ఆదరిస్తుంది, నీ జీవితమును కడుతుంది. త్రోవ ప్రక్కన ఉన్నవారుకూడ వాక్యం విన్నారు కాని నమ్మలేకపోయారు, జీవితములో స్థిరపడలేకపోయారు.
వాక్యం ఓకేచోట ఉండదు, ఒక చోట నుండి మరొకచోటకు ప్రయాణం చేస్తుంది. అందుకనే కీర్తనాకారుడు నీ వెలుగును సత్యమును బయలుదేరజేయుము; అవి నాకు త్రోవచూపునని ప్రార్థించాడు.
(John 4:46 - 53) కపెర్నహూములోని ఒక ప్రధాని దాదాపు 30కి.మి ప్రయాణం చేసి కానాకు వచ్చి, తన కుమారుడు చావ సిద్ధమైయుండెనని నా కుమారుడు చావక మునుపే; రమ్మని యేసుని వేడుకొన్నప్పుడు, యేసు - నీవు వెళ్లుము, నీ కుమారుడు బ్రదికియున్నాడని అతనితో చెప్పాడు. ఆ ప్రధాని యేసు ప్రభువు వస్తే అద్భుతం జరుగుతుంది అనుకున్నాడు కాని యేసు వెళ్ళవలసిన పని లేదు ఆయన వాక్కు ఎక్కడైన కార్యం చేస్తుంది. ఆ ప్రధాని దేవుని మాట నమ్మి ఇంకా ఇంటికి చేరకముందే యేసు చెప్పిన గడియలోనే స్వస్థత పొందుకున్నాడు. అదే దేవుని వాక్కులో ఉన్న శక్తి.
స్వస్థత ఒక్కటే కాదు భూమిని స్వతంత్రించుకొనటకు ఆయన నిన్ను హెచ్చించునని దేవుడు మాట ఇస్తే, ఆ వాగ్ధానం స్వతంత్రించుకొనేవరకు మనలను విడువదు. (Psa 107:17-20) బుద్ధిహీనులు తమ దుష్టప్రవర్తనచేతను తమ దోషము చేతను బాధతెచ్చుకొందురు. బుద్ధిహీనులను ఎవరు పాడుచేయలేదు వారి ప్రవర్తనే వారిని పాడుచేసింది. కష్టకాలమందు వారు దేవునికి మొఱ్ఱపెట్టినప్పుడు ఆయన వారిని గద్దించక ఆపదలలోనుండి వారిని విడిపించాడు. ఎలా విడిపించాడంటే - ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను ఆయన వారు పడిన గుంటలలోనుండి వారిని విడిపించెను.
ప్రియ విశ్వాసి! నీవే స్థితిలో ఉన్నా అది రోగమైన, బలహీనతైన, హీనదశయైన, కృంగుదలయైన మరేదైన నిన్ను విడిపించేది, లేవనెత్తేది, బాగుచేసేది, బలపరచేది, ప్రోత్సహించేది, నడిపించేది దేవుని వాక్యమోక్కటే అది తప్ప ఈ సృష్ఠిలో మరేది లేదు. వాక్యమును నిర్లక్ష్యము చేయక, వాక్యము నీ జీవితమును కట్టగలదని, నిన్ను హెచ్చించి నీ శత్రువు అందుకోలేని బలమైన స్థితిలో నిన్ను ఉంచగలడని వాక్యమును ప్రేమించి, చదివి, గ్రహించి విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము.