క్షమాపణ పొందాలంటే నేను ఏమి చేయాలి?
Audio : https://youtu.be/1arhwxWd2Ww
నూతనంగా క్రైస్తవ విశ్వాసం గూర్చి తెలుసుకున్న ఒక సహోదరుడు నాన్నో ప్రశ్న అడిగాడు “నేను జీవితంలో చేయరాని పొరపాట్లు చేశాను, దేవునికి అయిష్టంగా జీవించాను. నా పాపాలకు క్షమాపణ పొందాలంటే నేను ఏమి చేయాలి? ఉపవాసం ఉండాలా, దీక్ష చేయాలా, లేదా ప్రఖ్యాతిగాంచిన గుడికి వెళ్లి దేవుణ్ణి దర్శిచుకోవాలా?”. ఇటువంటి ప్రశ్న మిమ్మల్ని అడిగితే మీ అనుభవాన్ని బట్టి మీరు ఎటువంటి సమాధానం ఇవ్వగలరు?
వాస్తవంగా స్నేహితులతో లేదా సన్నిహితులతో ఏదైనా పొరపాటు చేశాము అని అనుకున్నప్పుడు, వారిని క్షమించమని అడిగి, వారు మనల్ని సంపూర్ణంగా క్షమించారనే నిర్ధాన పొందడానికి వారికి ఎదో ఒక సహాయమో లేదా వారిని సంతోషపరిచే పని చేయడానికి ప్రయత్నం చేస్తుంటాము. మనము వారికి మేలు చేస్తే వారు మన పొరపాటును క్షమించడమే కాకుండా ఎన్నటికీ మన పొరపాటును గుర్తుపెట్టుకోరనేది మన అభిప్రాయం. కొంతవరకు వాస్తవమే అనుకున్నా నిజానికి వారి మనసులో ఎప్పటికీ ఆ సంఘటన గుర్తుంటుంది. ఇది మానవ నైజం.
మనము అనేకసార్లు మన పాపాలను గుర్తు చేసుకొని దేవుని క్షమాపణను పొందడానికి ఎదో ఒకటి చెయ్యాలి అనుకుంటాము. అయితే దేవుడు అంటున్నాడు (ఎఫేసీ 2:8-9) “కృప చేతనే మీరు రక్షింపబదితిరిగాని మీ క్రియలవలన కాదు”. ఇశ్రాయేలీయులతో చేయనైయున్న “నూతన నిబంధన”ను గూర్చి దేవుడు వారికి వివరిస్తూ (యిర్మియా 31:34) దేవుడు అంటున్నాడు “నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను”. మనలను క్షమించి, మన తప్పులను ఇకను జ్ఞాపకము చేసికొనని దేవుడు మనకున్నాడు.
మన గతం గురించి మనము ఇప్పటికీ బాధపడవచ్చు. కాని ఆయన వాగ్దానాన్ని నమ్మి, యేసు క్రీస్తునందు విశ్వాసముంచుటద్వారా ఆయన కృప మరియు క్షమాపణలు నిజమని నమ్మినప్పుడు దేవుని నుండి క్షమాపణను పొందగలం. ఈ వార్త మనలను కృతజ్ఞత దిశగా నడిపించి, విశ్వాసమువలన వచ్చే నిశ్చయతను కలుగజేస్తుంది. దేవుడు క్షమించినప్పుడు, ఆయన ఇకేన్నాడు జ్ఞాపకం చేసికొనడు. కృప క్షమాపణ అనునవి దేవుడు మనం అడగకుండా ఇచ్చే బహుమానాలు. అట్టి క్షమాపణ ప్రభువు నుండి పొందుటకు ప్రయత్నిద్దాం. ఆమెన్.