నా జీవితానికి తొలి నేస్తం!


  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 5
  • Reference: Sajeeva Vahini Daily Inspirations

Click here to Read Previous Devotions

నా జీవితానికి తొలి నేస్తం!

మా నాన్న దగ్గర ఖరీదైన కారు ఉంది అని గొప్పింటి బిడ్డ అంటే, నా దగ్గర మా నాన్న ఉన్నాడంటూ గర్వంగా చెప్పింది పేదింటి బిడ్డ. అమ్మ జీవం పోస్తే ఆ జీవానికి జీవితం ఇచ్చేది నాన్న. నడకలో, నడవడిలో, భారంలో, బాధ్యతలో ఎల్లప్పుడూ వెన్నుతట్టి నడిపించేదీ నాన్నే కదా.

నువ్వు మీ నాన్న లా ఉన్నావని అని అందరు అంటుంటే ఒదిగిపోయి పొంగిపోయే నాన్నలు, తన భార్యను మహారాణిలా చూసుకోకపోయినా కూతురిని మాత్రం యువరాణిలా చూసుకుంటారు. మనం బాధతో కృంగిపోతున్నప్పుడు మొదట నాన్న చేయి మత్రమే ఆసరాగా కోరుకుంటూ ఉంటాము కదా. నేను నాన్న అయినప్పుడే ఆ భావన వెనక ఉన్న గొప్ప అనుభూతిని పొందగలిగాను.
బైబిలులోని గొప్ప తండ్రులను చూసినప్పుడు హనోకు, మొదలుకొని యేసు తండ్రియైన యోసేపు వరకు కుటుంబం పట్ల వారు నెరవేర్చిన బాధ్యతలను చూసి నేర్చుకోగలం. దినములు చెడ్డవిగా ఉన్నప్పుడు, నోవహు దేవుని ఉద్దేశాలు వారికి బోధిస్తూ తన కుటుంబాన్ని ఓడలో భద్రపరచుకొనగలిగాడు.

విశ్వాసులకు తండ్రియైన అబ్రాహాము తన కుమారుని ప్రేమించిన తండ్రిగానూ, దేవుని నుండి పొందిన వాగ్ధానఫలాలను రాబోయే తరానికి అందించిన వాడుగానూ వున్నాడు. తండ్రిని తల్లిని సన్మానించిన వాడు భూమి మీద దీర్ఘాయుష్మంతుడుగా ఉంటాడనే ఆజ్ఞ మనకు నేర్పిన దేవుడు 2 కొరింథీయులకు 6: 18. “మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురని” అంటున్నాడు. తండ్రి ఆజ్ఞలను చిత్తాన్ని నెరవేర్చుటలో కుమారుడైన క్రీస్తు యేసు మనకు మాదిరిగా ఉన్నాడు.

పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! కుమారుడు పుట్టగానే తండ్రికి సంతోషం కలగదు. ప్రజలు ఆ కుమారుడ్ని మెచ్చిన రోజుననే సంతోషము. ఈ మాటలు చదువుచున్నప్పుడు మనము ఈ లోకములో ఒక నాన్నకు బిడ్డలమనే భావన, అలాగే పరమతండ్రి యగు దేవునికి పిల్లలమనే భావన మనలో మనకే మన అంతరాత్మలో స్ఫురిస్తుండగా తండ్రికి ఘనత తెచ్చు పిల్లలుగా లోకము గుర్తించు జీవితము జీవించ తీర్మానము చేసుకుందామా.

నా జీవితానికి తొలి నేస్తమైన మా నాన్నకు...నాన్నలందరికీ “హ్యాపీ ఫాదర్స్ డే".

God Bless You All. Amen.

Audio:
https://m.youtube.com/watch?v=GBKR5bs2IJU