ప్రకటన గ్రంథ ధ్యానం 2వ అధ్యాయం - Revelation 2 Detailed Study


  • Author: Vijaya Kumar G
  • Category: Bible Study
  • Reference: Revelations Detailed Study

<< Previous - Revelation Chapter 1 వివరణ

>> Previous - Revelation Chapter 3 వివరణ

ఆసియాలో వున్న 7 సంఘములు: (Part – I)

మొదటి 3 అధ్యాయములలో 10సార్లు “సంఘము” అనే పదము కనబడుచున్నది, తిరిగి 22వ అధ్యాయములో సంఘము అనే పదము కనబడుచున్నది. ఏడు సంఘములు సార్వత్రిక సంఘమునకు సాదృశ్యము. ఈ యేడు సంఘములు ఒకే ప్రాంతములో అనగా చిన్న ఆసియాలో వున్నవి.. ప్రతి లేఖకు ముగింపులో “ఆత్మ సంఘములతో [బహు వచనము] చెప్పుచున్నమాట” అని చదువుచున్నాము. అనగా ఆ సమాచారము ఆ యేడు సంఘాలకు అనియూ, అంతమాత్రమే కాదు, నేడు ప్రప్రంచంలో వున్న సకల సంఘముల శాఖలకు (denominations) అనగా సార్వత్రిక సంఘము (universal church) నకు వ్రాయబడిన గద్దింపుతో కూడిన దేవుని ప్రేమ లేఖలు.

ఒక్కొక్క సంఘమునకు ఒక దర్శనము వున్నట్టు గ్రహించాలి. లేఖ ఆరంభములో “వాడు చెప్పు సంగతులేవనగా” అని వుంటుంది. ముగింపులో “ఆత్మ సంఘముల (బహు వచనము)తో చెప్పుచున్న మాట” అని వుంటుంది. మొదటిది ఆ సంఘము అను దీపస్థంభమును దర్శించుచున్న ఏసుక్రీస్తు ప్రత్యక్షత, చివరిది పరిశుద్ధాత్మ దేవుని సందేశము. పూర్వకాలమందు “మన పితరులతో మాటలాడిన దేవుడు” [యెహోవా దేవుడు] ఈ దినముల అంతమందు “కుమారుని [ఏసు దేవుడు] ద్వారా మనతో మాటలాడెను” (హెబ్రీ 1:1), ఆ కుమారుని రెండవ రాకడకు ముందు “ ఆత్మ [పరిశుద్ధాత్మ దేవుడు] సంఘములతో మాటలాడెను”.

ముఖ్యమైన 7 విషయాలు గమనములో వుంచుకొని ధ్యానము చేద్దాం. అవేవనగా : 1. క్రీస్తు ప్రత్యక్షత 2. సంఘ క్రమము - ప్రశంసలు 3. సంఘములోని తప్పిదములు - విమర్శలు 4. సంఘమునకు ప్రోత్సాహము. 5. ఆత్మదేవుని హెచ్చరికలు 6. సంఘమునకు వాగ్దానము. 7. పొందబోవు బహుమానము. సార్దీస్ మరియు లవోదికయ సంఘములు విమర్శింపబడని గొప్ప మాదిరియైన సంఘములు. ఇక నేటి సంఘాల మాటకొస్తే; దర్శనములేని సంఘములు చాలా వున్నాయి. కొన్ని సంఘాలైతే ఎవరికో దర్శనం వొచ్చింది, దానికి అనుబంధముగా మా సంఘము నడిపిస్తున్నాము అంటున్నారు. మరి మీ దర్శనము యేమిటి అంటే, జవాబు లేదు.

ప్రియ మిత్ర్హమా, నీ సంఘములో నీ పాత్ర ఏమిటీ? నీ దర్శనము ఏమిటి? దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుత ములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను (1 కొరిం 12:28). నీ సంఘములో నీ పరిచేర్య ఏమిటో, నీ బాధ్యత ఏమిటో తెలియపరచమని ప్రభువునడుగుము, ఇవ్విధముగా ఆత్మ ప్రస్తావించిన ఆత్మీయ సంగతులను మాత్రము ధ్యానించుదాము.

మొదటి అధ్యాయము లోనే ప్రభువు ఏడు సంఘముల దర్శనము చూపించారు. వాటి విషయమై నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాయుము (ప్రక 1:11) అని ప్రభువు సెలవిచ్చారు. అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు సంభవింపబోవు సంగతులను మనకు తెలియజేయును (యోహా 16:13) అని వ్రాయబడి యున్నది. అందుకే ఏడు సంఘముల సందేశములో మొదట క్రీస్తు ప్రత్యక్షత; అక్కడనుండి ఆత్మ చెప్పు సంగతులు వ్రాయబదియున్నవి.

ఐతే, ఆయా సంఘముల చరిత్ర, అప్పటి ప్రభుత్వము ఎలా ఉండేది, నా భౌగోళిక స్థితి వంటి విషయాలను ధ్యానించి సమయమును వ్యర్ధపరచక; ఆత్మ ప్రస్తావించిన విషయాల మీదనే ధ్యానముంచుదాము. శరీరానుసారులు శరీరవిషయ ములమీద మనస్సు నుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయ ములమీద మనస్సునుంతురు... ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమా ధానమునై యున్నది. (రోమా 8:5,6) అను వాక్యానుసారము ముందుకు సాగుడుముగాక. ప్రభువు సహాయము కొరకు ప్రార్ధన చేద్దాము.

ఆసియాలో వున్న 7 సంఘములు: (Part – II)

ఆదికాండము నుండి చూసినట్లైతే ఆదామును సృజించిన దినమున తండ్రియైన దేవుడు మానవుడు ఎంతకాలము జీవించాలని నిర్ణయించారు అనేది మన జ్ఞానమునకు మరుగైయున్నది. మరణించదానికే దేవుడు ఆది దంపతులను చేసారా అంటే; అలా అనలేము. ఐనా, వారి జీవనయానం ఈ భూమి మీద కొన్ని సంవత్సరాలకే మరణముతో ముగిసింది. దేవుని దృష్టిలో ఆదాము ఒక్క దినములోపే తనువు చాలించైనట్టు వ్రాయబడినది.

ఏలయన, ఆదాము బ్రతికిన సంవత్సరములు తొమ్మిది వందల ముప్పది (ఆది 5:5). అది ఒకదినము కంటే తక్కువే, ఏలయన ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను, వెయ్యిసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి (2 పేతు 3:8). మరణమే మానవ జీవిత అంతం ఐతే, హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను (ఆది 5:24). హనోకు మరణము చూడకుండునట్లు కొని పోబడెను (హెబ్రీ 11:5). ఏలీయా సైతము సుడిగాలిచేత ఆకాశమునకు ఆరోహణమాయెను (2 రాజు 2:11). ఇదెలా సంభవం?

కనుక జీవిత అంతము మరణము కాదు, కొనిపోబడుట, కూడా వున్నదని అర్ధమౌతున్నది. ఇలా ఈ లోకమును విడచిన ఆ పరిశుద్ధులు ఎక్కడికి వెళ్ళారు? ఇది యిలావుండగా; ఏసుక్రీస్తువారైతే అన్ని ప్రక్రియలనూ ఒక్కరే అనుభవించి చూపించారు. ఆదాము మృతి పొందెను (ఆది 5:5), యేసు మృతి పొందెను (1 థెస్స 4:14). రాహేలు సమాధి చేయబడెను (ఆది 35:20), యేసు సమాధి చేయబడెను (మత్త 27:60). మృతులు లేతురని మోషే సూచించెను (లూకా 20:38), యేసు తిరిగి లేచెను (మత్త 28:6). మార్పు పొందుదుము (1 కొరిం 15:51), యేసు రూపాంతరము పొందెను (మత్త 17:1)దే వుడు హనోకును తీసికొనిపోయెను (ఆది 5:24), యేసును ఒక మేఘము కొనిపోయెను (అపో 1:9).

మరణానంతర గమ్యములు మూడింటిని అనగా పరదైసు, పరలోకము మరియు నరకము అని యేసు బయలుపరిచారు. ఈ నరకమునకు మారుపేరే రెండవ మరణము అంటుంది ప్రకటన గ్రంధం (ప్రక 20:14).. రెండు మరణములనూ అధిగమించి అనగా జయించి (అనుభవించకనే) ఒక విశ్వాసి దేవ దేవుని ఆత్మతో మమేకమైపోవాలని దేవుని సంకల్పము, అదే పరలోకము, నూతన ఆకాశము, నూతన భూమి మరియూ నూతన యెరూషలేము. అట్టి మహిమాయుక్తమైన సంకల్పము బయలుపరచ బడుటకే ప్రకటన ప్రవచనము అనుగ్రహించబడినది.

అట్లు దేవునియొద్దకు లేక పరమునకు చేరు మార్గమును సంఘము నిర్దేశించుచున్నది. ఇది ఒక సంఘము ద్వారా మాత్రమే దేవుడు నియమించిన దేవుడు, పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై (అపో 2:1-3). యున్నారు. యేసుక్రీస్తు వారు ముందుగా వాగ్దానము చేసిన ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబడిన పరిశుద్ధాత్మ (యోహా 14:26) ఇతడే. అన్యజనులమైన మనమీద సయితము కుమ్మరింపబడుట చూచితిమి (అపో 10:45), అదే పరిశుద్ధ సంఘము.

ఆ సంఘమే క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన పరిశుద్ధ స్వాస్త్యము. ఆ సంఘమే వధువై; కుమారుడే వరుడై జరుగనైయున్న ఆ వివాహము యొక్క మర్మమే ప్రకటన గ్రంధ ప్రవచనము. అపో. పౌలు గారు ఈ సంఘమును దేవాసక్తితో పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు ప్రధానము చేసినారట (2 కొరిం 11:2). క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను (ఎఫే 5:25-27). గొఱ్ఱపిల్ల వివాహోత్సవ సమయము సమీపమగుచున్నది, త్వరపడి సిద్ధపడుడుము గాక. ఆమెన్

ప్రకటన 2:1 ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఏడు నక్షత్రములు తన కుడిచేత పట్టుకొని యేడు దీపస్తంభములమధ్య సంచరించువాడు చెప్పు సంగతు లేవనగా

ఎఫెసు అనగా కోరుకొనదగినది అని అర్ధము. ఆది అపోస్తలుల కాలమునాటి అనగా మొదటి శాతాబ్దమునాటి సంఘమును దేవుడు మనకు మాదిరిగా చూపుతూ; నేడు మన సంఘములను చక్కబెట్టుకొనుటకు మనలను హెచ్చరించుచున్నారు. ప్రకటన 1:13 నుండి 1:18 వచనములలో బూర ధ్వని వంటి గొప్ప స్వరముతో యేసుక్రీస్తు దర్శనములో ఏడు సంఘములను చూపించెను, వాటి వాటి స్థితిగతుల విషయమై ఆత్మ వివరించెను అని ధ్యానించి యున్నాము.

ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు. ఆ సంఘముల దూతలు దేవదూతలు ఐతే, మానవ శారీరి యోహానుగారు ఆత్మ శరీరులైన దేవదూతలకు ఎలా వ్రాయగలడు. ఇక్కడ దూతలు అనగా ఆయా సంఘముల కాపరులు. దాని 12:3 లో వ్రాయబడిన ప్రకారం: బుద్ధిమంతులైతే ఆకాశమండలము లోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు, ఆ నక్షత్రములు

పౌలు ఎఫేసువారిమీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారిమీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాటలాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరు ఇంచుమించు పండ్రెండుగురు పురుషులు (అపో 19:6,7). పరిశుద్ధాత్మ చేత అభిషేకించ బడి, ప్రవచన వారములు కలిగిన విశ్వాసులు అక్కడ వున్నారు. ఎఫేసు సంఘమును క్రీస్తు తన కుడిచేతితో పట్టుకొని సంఘముల మధ్య సంచరించుచున్నట్టు వున్నది..

ప్రియ స్నేహితుడా, నీవు ఏ దర్శనముతో సంఘము నడుపుతున్నావు? లేక ఏ దర్శనము గల సంఘముతో నీ విశ్వాస జీవితము కొనసాగుచున్నది? సంఘ దర్శనము “ నక్షత్రములు తన కుడిచేత పట్టుకొని యేడు దీపస్తంభములమధ్య సంచరించువాడు“ ఈ సంఘమునకు అధిపతిగా వున్నారు. ఎఫేసు సంఘ పనివారు దేవుని చేతిక్రింద పనివారుగా వున్నారు. ఆ దీపస్తంభమును అనగా ఆ సంఘమును క్రీస్తు పదే పదే దర్శించుచున్నారు.

యేసు ప్రేమించిన సంఘమది. క్రీస్తు శరీరమను ఈ సంఘమునకు క్రీస్తు శిరస్సుగా వున్నట్లు దేవుడు అపో. పౌలు గారికి బయలుపరచగా; ఆయన ఎఫేసి వారికి వ్రాసిన పత్రిక 5వ అధ్యాయములో “క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్నాడు (23వ వచనము) అనియూ, అటువలె క్రీస్తుకూడ ఆ సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను, నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను (25-27 వచనములు) ఉండవలెనని ఆశించినారనియూ వ్రాసినట్టు చదువగలము.

ఎవరిని అడిగినా వాక్య ప్రకారమే సంఘము నడుపుతున్నాము అంటుంటారు. నేను చూచిన సంగతి ఒకటి ఉదాహరిస్తాను గమనించండి. ఒకానొక పునరుత్హాన పండుగరోజు ఒక సేవకుడు తన మందిరములో ఒక దేవదూత పలికిన దేవుని వాక్యము ఇలా వ్రాయించి పెట్టాడు. “ఆయన ఇక్కడలేడు” (లూకా 24:6), ఇదెంత విచారకరము. తెలిసి చేసే పొరపాట్లు ఇలానే వుంటాయి.

ఎఫేసు సంఘమునకు లిఖించబడిన సంఘతులను ఆధారము చేసుకొని మన సంఘములో అవసరమైన సంస్కరణలు చేపట్టుదము; ఎత్తబడుతకు అర్హత సంపాదించు కుందాము. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి (1 పేతు 5:6) అను వాక్య ప్రకారము ఆయన సారధ్యములో ఆయన అధికారము క్రిందకు మన సంఘములను తెచ్చుకుందాము. ప్రభువు మనతో ఉండునుగాక. ఆమెన్

ప్రకటన 2:2,3 నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును; నీవు దుష్టులను సహింపలేవనియు, అపొస్తలులు కాకయే తాము అపొస్తలులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును.

“నేనెరుగుదును” – అవును ప్రభువు మనలను, మనలను మాత్రమే కాదు అందరి హృదయములను ఎరిగియున్న ప్రభువు (అపో 1:24). మనము ఏ స్థితిలో ఉన్నామో క్షణక్షణమూ గమనించుచున్న మన మంచి కాపరి (యోహా 10:14), మన ఆత్మల కాపరి (1 పేతు 2:25). ఆది అపోస్తలుల నాటినుండి నేటివరకు ఆత్మల రక్షణార్ధమై క్రైస్తవులు పడుచున్న పాట్లు ఎరిగిన దేవుడు.

ప్రయాసతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను (2 కొరిం 11:27) ఎందఱో చేసిన త్యాగఫలితమే మనకు దొరికిన రక్షణ, మనమున్న సంఘము. పాపాత్ములు తనకు వ్యతిరేకముగ చేసిన తిరస్కార మంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి (హెబ్రీ 12:3). లోకము మిమ్మును ద్వేషించినయెడల మీకంటె ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు (యోహా 15:18). సంఘము, సహవాసము పేరుతో ఎవరితో ముడిపడియున్నది మన క్రైస్తవ జీవితము? ప్రశించు కుందాము.

మేడిపండు వంటి సంఘములు కోకొల్లలు. ఎందుకనగా కొందరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు, తమ్మునుతాము నిర్భయ ముగా పోషించుకొనుచు, మీ ప్రేమవిందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు (యూదా 1:12). వారి విషయమై జాగ్రత్తగా వుండవలెనని పరిశుద్దాత్ముని హెచ్చరిక. బోధకులు సైతము అలాంటి వారున్నారంటే ఆశ్చర్యమేముంది. వాక్యప్రకారము వారు బోధించనియెడల వారికి అరుణోదయము కలుగదు. అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశసంచారము చేయుదురు (యెష 8:20, 21).

అటువలెనే మీలోను అబద్దబోధకులుందురు; వీరు తమ్మును కొనిన ప్రభువునుకూడ విసర్జించుచు, తమకుతామే శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరిచేష్టలను అనుసరించి నడుతురు; వీరినిబట్టి సత్యమార్గము దూషింపబడును. (2 పేతు 2:1, 2). ఇట్టివారికి విముఖుడవై యుండుము (2 తిమో 3:5).

ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్‌ క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును (రోమా 2:6, 7). నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును (మత్త 5:11, 12). మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు; అంతమువరకును సహించిన వాడు రక్షంపబడును (మత్త 10:22).

ఆయన నామము భరించుటకు నీవు సిద్ధమా? అలసిపోని పరిచర్యకు పూనుకొనుమని అభిషిక్తుని అభిలాష. అందుకు ప్రభువునీవు వెళ్లుము, అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై యున్నాడు (అపో 9:15). ఆత్మ మనలని అట్లు సిద్ధ పరచుగాక. ఆమెన్

ప్రకటన 2:4,5 అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీమీద తప్పు ఒకటి మోపవలసియున్నది. నీవు ఏ స్థితిలోనుండి పడితివో అది జ్ఞాపకము చేసికొని మారు మనస్సుపొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లుచేసి నీవు మారుమనస్సు పొందితేనే సరి; లేనియెడల నేను నీయొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటనుండి తీసివేతును.

నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము, నీవు పరీక్షించుట, నా నామము భరించుట, అలుపెరుగని నీ పరిచర్య నేనెరుగుదును; అయినను, ఒక తప్పు నీలో వున్నది. ఆది ప్రేమను వదలితివి, అనగా 1. దేవుని ప్రేమించుట లేదని 2. తోటి సహోదరుని ప్రేమించుట లేదని ఆత్మదేవుడు జ్ఞాపకము చేయుచున్నాడు.. అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును (మత్త 24:12).

ప్రియ విశ్వాసీ, ఒక్కసారి ఎఫేసు సంఘముతో మన సంఘమును మన క్రైస్తవ జీవితమును పోల్చి చూచుకుందామా. సంఘములో జరుగుచున్న సేవ ఎందుకు విశ్వాసులలో ఉజ్జీవ జ్వాలలు రగిల్చలేక చల్లారి పోతుంది? సంఘములో క్రమము లేకపోవుట ద్వారానే (ఇందులో సాతాను ప్రమేయమే లేదు) కాదా. యేసు : నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయు వారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును (మత్త 7:22).

మార్తవలె అన్ని పనులూ చేసి చివరికి వాక్యము వినకపోతే ? నీవనేకమైన పనులను గూర్చి విచార ముకలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే (లూకా 10:41). సమయ పాలనపై నిర్లక్ష్యముతో ఆరంభమై పక్షపాత ధోరణులకు దారితీస్తాయి సంఘాలు. ఎవరికిష్టమైన సమయానికి వారు వస్తారు, వారికిష్టమైన సమయానికి వెళ్లిపోతుంటారు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను (1 యోహా 2:5).

ఎవడైనను తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ఎలాగు ప్రేమింపగలడు (1 యోహా 4:20?) యెహోవా సెలవిచ్చునదేమనగా నన్ను వెంబడించుచు నీ యవ్వనకాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసికొనుచున్నాను (యిర్మీ 2:2). నేనికమీదట మీతోను మీ పిల్లల పిల్లలతోను వ్యాజ్యెమాడెదను; ఇది యెహోవా వాక్కు (యిర్మీ 2:9). నాడు క్రీస్తు యేసు యొక్క నిస్వార్ధ ప్రేమ, త్యాగసహిత సహజీవనము గడిపారు. ఈ రోజుల్లో అలాంటి సంఘమును కనుగొనగలమా.

బాప్తిస్మం తీసుకున్న క్రొత్తలో వున్నట్లు ఇప్పుడూ వున్నామా? రక్షింపబడినాను అని సాక్ష్యము చెప్పి, బాప్తిస్మం తీసుకుని, బల్లారాధనలో పాల్గొంటూ సంఘముతో సాగుతుంటే; ఇప్పుడు మళ్ళీ “నీవు మారుమనస్సు పొందితేనే సరి” అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను (1 కొరిం 10:12). నీవు ఏ స్థితిలోనుండి పడితివో, అదియూ జ్ఞాపకము చేసుకో.

అయితే మీరు వెలిగింపబడినమీదట, శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపుదినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి (హెబ్రీ 10:32). మీరు ఫలించితేనే సరి, లేనియెడల అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్షతోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పెను (లూకా 20:16). సంఘము పడిపోలేదు, నీవు, నేను పడిపోయాము. నాటి ఎఫేసు సంఘమే కాదు, నేడు నేనున్న నీవున్న మనమున్న సంఘము పడిపోయింది.

వర్గపోరు ఆరంభమైంది, రాజకీయము చోటుచేసుకుంది, అనుకూలమైన (హెచ్చరిక లేని) బోధలు ప్రవేశించాయి, గౌరవాలు మర్యాదలు కావాలి. మారుమనస్సు పొందనియెడల, సంఘము ఇక వుండదు. ఒకప్పుడు ఆత్మల సంపాదనలో అలుపెరుగని సంఘము నేడు ఇలా హెచ్చరించబడుతుంది అంటే, ఒకే ఒక్క కారణం ప్రేమ చల్లారిపోయిన స్థితి. మరోసారి మారుమనస్సు పొందవలెనని ప్రకటన 2:5వ వచనములో రెండుసార్లు దేవుని హెచ్చరిక కనబడుచున్నది

యెహోవా సెలవిచ్చున దేమనగామీరు నాతట్టు తిరిగినయెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు (జక 1:3). మారుమనస్సు నొంది తిరుగుడి (అపో 3:20). మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మునుగూర్చి విజ్ఞాపన చేయుచున్నాను (ఎఫే 1:19). ప్రభువు ఆత్మ మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్

ప్రకటన 2:6 అయితే ఈ యొకటి నీలో ఉన్నది, నీకొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు; నేనుకూడ వీటిని ద్వేషించుచున్నాను.

నీకొలాయితుల బోధ అనగా యూదుల మతప్రవిష్టుడును అంతియొకయవాడును అగు నీకొలాసు (అపో 6:5 ) సిద్ధాంతము. విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, బిలాముబోధను అనుసరించుట, అబద్ద ప్రవచనాలు చెప్పుట, జారత్వము చేయుట, యూదులు కాకయే యూదులమని చెప్పుకొనుచు విశ్వాసులైన వారిని చంపుట వంటివి కనబడుచున్నవి.

అప్పుడప్పుడే ఎదుగుతూవస్తున్న సంఘాలలోనే దేవుడు లోపాలు ఎత్తి చూపిస్తుంటే, మరి నేటి తరము సంఘాల విషయము ఏమి చెప్పగలము. ఇట్టి క్రియలు నేను ద్వేషించిన క్రియలు అంటున్నారు ప్రభువు. ప్రియ విశ్వాసీ, నీ క్రియలు దేవుని ద్రుష్టికి ఎలా వున్నవి? ఎఫేసు సంఘము ఈ విషయములో దేవుని మెప్పు పొందుచున్నది; నీవునూ ద్వేషించు చున్నావు అనుచున్నారు.

నాకసహ్యమైన యీ హేయకార్యమును మీరు చేయ కుండుడి (యిర్మీ 44:4). మీ పండుగ దినములను నేను అసహ్యించు కొనుచున్నాను; వాటిని నీచముగా ఎంచుచున్నాను అంటున్నారు ప్రభువు (ఆమో 5:21). నీకొలాయితుల బోధ క్రీస్తు బోధలకు, అపో.పౌలు బోధలకు వ్యతిరేకమైన భిన్న బోధలు అని గమనించగలము. ఆరంభములో మొదటి సంఘము అపో.కా. 2:42 ప్రకారము ఆత్మ నియమము గల సంఘముగా కనబడుచున్నది. అపొస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట అను మూల సూత్రముల మీద కట్టబడి, దేవుని ప్రేమకు పాత్రమగుచున్నది. నేటికినీ అవ్విధానములో నడుపబడుచున్న సంఘములు కలవు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక.

వాక్యమును వక్రీకరించుటలో ఆరితేరిన బోధకులున్న ఈ దినములలో అన్ని బోధలూ వాక్యానుసారమే అనుకుంటే గ్రుడ్డి వాని వెంటబడిన గ్రుడ్డి గొర్రెల చందము కాదా! దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును (2 తిమో 3:16,17) భయమెందుకు బోధకుడా? ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదు (2 పేతు 1:20 ) కనుక ఊహలు మాని ధ్యానము చేయుట అవశ్యము. లేనియెడల మీరుకూడి వచ్చుట యెక్కువ కీడుకేగాని యెక్కువమేలుకు కాదు (1 కొరిం 11:17) అంటూంది వాక్యము.

అనేకసార్లు కొన్ని విషయములను నిరాకరించుటకు బదులు వక్ర భాష్యం చెప్పుతుంటారు, అవే బిలాము బోధలు, నికోలాయితుల క్రియలు. ఉదా :-

1. దేని రూపము నయినను విగ్రహమునైనను నీవు చేసికొనకూడదు (నిర్గ 20:4) అని ఆజ్ఞ. దేవుడైన యోహోవాకు ఆకారము లేదు కాబట్టి అలా చెప్పారని భాష్యము చెప్పిన బోధలు వున్నాయి. పోనీ యేసుక్రీస్తు వారికి రూపురేఖలు వున్నాయి కదా అంటే, ఆ విగ్రహముగాని, చిత్ర పటముగాని గీయరాదు అని చెప్పేస్తారు. ఇవన్నీ వాక్యమునకు వ్యతిరేకము అంటూనే; ఒక పావురము బొమ్మను పరిశుద్ధాత్మ అంటూ వివరణ ఇచ్చే వారూ వున్నారు.

2. దేవుడు పవిత్రము చేసినవాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దు (అపో 10:15) అను వాక్యమును ఆధారము చేసుకుని – ప్రార్ధన చేసుకొని ఏది తిన్నా ఫర్వాలేదు; నిషిద్ధమన్నదే ఉండదు అని బోధించుట, వాదించుట కూడా విన్నాము.

3. మీలో ఎవడైనను రోగియై యున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను; వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతనికొరకు ప్రార్థనచేయవలెను (యాకో 5:14). ఆ మధ్య ఒక పాస్టరుగారితో, వాక్యము ఇలా వుంది కదా మీరెందుకు చేస్తున్నారు? అని అడిగితే, పాపం నీళ్లు నమిలాడు. రోగియైతే నూనె వ్రాయమంటే, ఒక దైవజనుదైతే ఆ నూనెను గుమ్మములమీద, క్రొత్తగా కొన్న స్కూటర్ల మీద, కార్ల మీద వ్రాసి ప్రార్ధన చేస్తున్నాడు.

4. కొత్తకొత్తఃగా క్రొత్త నిబంధన చదువుతూ అన్నీ మానివేసినాడట ఒక విశ్వాసి. చదువుతూ చదువుతూ మారుమనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము (ప్రక 2:5) అనే భాగము చదివి తికమక పడ్డాడట. ఆ క్రొత్త నిబంధన బహూకరించిన సోదరుని దగ్గరకు వెళ్లి ఇదేమిటి, ఇలా వుంది? అని అడిగితే; ప్రకటన గ్రంధము నాకే సరిగా అర్ధము కాదు అన్నాడట.

నీకొలాయితుల క్రియలు అంటే ఇవే కాదా? బిలాము బోధకంటే ఏమీ తక్కువ కావు. ప్రవచనము చెప్పుతామంటూ తమ పేరుకు ముందు ప్రవక్త అని వ్రాసుకుంటున్న వారునూ నేడు కనిపిస్తున్నారు. నేను ద్వేషించిన క్రియలు నీవునూ ద్వేషించినావు, అది మంచిది అని దేవుని మెప్పు పొందుచున్నది ఎఫేసు సంఘము. సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను మనలను మనమే దేవునికి కనుపరచు కొనువారిగను జాగ్రత్తపడుదుము గాక (2 తిమో 2:15). అవసరమైతే మన సంఘము, మన బోధలు వాక్యప్రకారము ఉండునట్లు సరిచేసు కుందాము. మనందరి నిరీక్షణ ఒక్కటే, నా సంఘము ఎత్తబడాలి, ఆ సంఘములో నేనుండాలి. ఆమెన్

ప్రకటన 2:7 చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట వినునుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షఫలములు భుజింప నిత్తును.

పూర్వకాలమందు ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు: (హెబ్రీ 1:1)
1. చెవియొగ్గి నా మాట వినుడి ఆలకించి నేను పలుకునది వినుడి (యెష 28:23).
2. చెవియొగ్గి నాయొద్దకు రండి మీరు వినినయెడల మీరు బ్రదుకుదురు (యెష 55:3).
3. చెవియొగ్గి నేను నీతో చెప్పుమాటలన్నిటిని చెవులార విని మనస్సులో ఉంచుకొనుడి (యెహే 3:10).
4. చెవిని బెట్టి ఆలోచించుడి; రాజసంతతివార లారా, చెవియొగ్గి ఆలకించుడి (హోషే 5:1),
5. పెద్దలారా, ఆలకించుడి దేశపు కాపురస్థులారా, మీరందరు చెవియొగ్గి వినుడి (యోవే 1:2).

ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడిన దేవుడు :
1. వినుటకు చెవులుగలవాడు వినుగాక (మత్త 11:15).
2. చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను (మత్త 13:9).
3. చెవులుగలవాడు వినునుగాక (మత్త 13:43).
4. వినుటకు చెవులెవనికైన నుండినయెడల వాడు వినునుగాకనెను (మార్కు 4:23).
5. వినుటకు చెవులుగలవాడు వినునుగాక అని వారితో చెప్పెను (లూకా 14:35).

నేడు సంఘములతో మాటలాడుచున్న పరిశుద్ధాత్మ దేవుడు :
1. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట వినునుగాక (ప్రక 2:7).
2. సంఘములతో ఆత్మచెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక (ప్రక 2:11).
3. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక (ప్రక 2:17).
4. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక (ప్రక 2:29).
5. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక (ప్రక 3:6).
6. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక (ప్రక 3:13).
7. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక (ప్రక 3:22).
8. ఎవడైనను చెవిగలవాడైతే వినును గాక (ప్రక 13:9).

యేసు: మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చియున్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను (యోహా 5:25) అన్నారు. మృతులైన వారలారా (మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా - ఎఫే 2:1) చెవియొగ్గుడి. చెవులు గలవాడు అని పడే పడే త్రిత్వమైయున్న దేవుడు మాతాడుతున్నారు ఎందుకనగా జనులు హితబోధను సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని సత్యమునకు చెవినియ్యక కల్పనాకథలవైపునకు తిరుగుకాలము వచ్చియున్నది (2 తిమో 4:3, 4). ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు (1 కొరిం 2:14).

యేసు వారికి వినుటకు శక్తి కలిగినకొలది ఆయన వారికి వాక్యము బోధించెను (మార్కు 4:33). ఐననూ లేఖనము ఏమి చెప్పుచున్నది,
1. వినుటమట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహంపరు (మత్త 13:15).
2. వాక్యము విందురు గాని ఐహిక విచారములును, ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలును లోపల చొచ్చి, వాక్యమును అణచివేయుటవలన అది నిష్ఫలమగును (మార్కు 4:19).

ప్రియ సోదరీ, స్నేహితుడా, జీవముగల దేవుని సంఘమా వాక్యము వినవలసిన సమయములో ఇతర పనులు ప్రక్కకు పెట్టి శ్రద్ధగా విందామా. నేటి దినాలలో మొబైల్ ఫోన్ కనీసం స్విచ్ ఆఫ్ చెయ్యరు విశ్వాసులు. ఆత్మదేవుడు మాటాడుచుండగా, ఏ మాట నీకోసమో చేవియొగ్గని నీకు ఎలా తెలియును. ఆలోచించుము, బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము (1 సమూ 15:22). ప్రియుడు యేసు మాటాడుతున్నప్పుడే వధువు సంఘమా ఆలకించుము, లేనియెడల అతడు కోపించునేమో. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్లిపోయెను అతనిమాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను నేనతని వెదకినను అతడు కనబడకపోయెను నేను పిలిచినను అతడు పలుకలేదు (ప. గీ. 5:6).

జయించు వారు అనగా ఎవడు? బహుమానము పొందువాడే కదా. పందెపు రంగమందు పరుగెత్తువారందరు పరుగెత్తుదురుగాని యొక్కడే బహుమానము (జయము) పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి (1 కొరిం 9:24). అపో.పౌలు సాక్ష్యమిస్తూ. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇకమీదట నా కొరకు నీతికిరీట ముంచబడియున్నది (2 తిమో 4:8). జయజీవితమునకు సూత్రము ఒక్కటే; పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. అక్షయమగు కిరీటమును పొందుటకును మనమునూ మితముగా వుండవలెను (1 కొరిం 9:25). లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను (యోహా 16:33).

జయించు వానికి పరదైసు ప్రవేశము వాగ్దానము. సిలువ శ్రమలో వుండి కూడా, ఒకడు; యేసూ, నీవు నీ రాజ్యము లోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను. అందు కాయన వానితోనేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను (లూకా 23:42, 43). ఆదామును ఏదెను తోటలోనుండి వెళ్లగొట్టిన తదుపరి జీవవృక్షమునకు పోవు మార్గము మూసివేయబడెను (ఆది 3:24). తిరిగి పరడైసునండు అనగా పరలోక పట్టణపు రాజవీధిమధ్యను ప్రవహించుచున్న ఒక నదియొక్క ఈవలను ఆవలను ఆ జీవవృక్షమున్నది (ప్రక 22:2).

జీవ వృక్షము అంటేనే అది ఎన్నడూ వాడిపోనిది, ఆకు రాల్చనిది, నిత్యమూ కాపు కాయునది, ఎన్నటెన్నటికీ నిర్జీవము కానేరనిది అని అర్ధము. దాని ఫలము తినుట నిత్యజీవమును పొందుటయే. పరదైసులో వున్న జీవ వృక్షమునకు చేరుటకు పరిశుద్ధ సంఘము ద్వారా, సిలువ మార్గమున చేరుకొనవలెనని ఆత్మ నిర్దేశము, ఆ ఫలము భుజింపనిత్తు ననునదియే దేవుని వాగ్దానము. అట్టి వాగ్దానమును స్వతంత్రించు కొనునట్లు మన విశ్వాస జీవితము మరియూ సంఘ క్రమము ఆత్మచేత నడిపించబడును గాక. ఆమెన్

ప్రకటన 2:8 స్ముర్నలోఉన్న సంఘపుదూతకు ఈలాగు వ్రాయుము మొదటివాడును కడపటివాడునై యుండి, మృతుడై మరల బ్రదికినవాడు చెప్పు సంగతులేవనగా

స్ముర్న అనగా బోళము (చేదైనది) అని అర్ధము. ఆది అపోస్తలుల కాలమునాటి అనగా రెండవ శతాబ్దము మరియు నాలుగవ శతాబ్దముల మధ్యకాలము నాటి సంఘమును దేవుడు మనకు మాదిరిగా చూపుతూ; నేడు మన సంఘములను చక్కబెట్టుకొనుటకు మనలను హెచ్చరించుచున్నారు.

బూర ధ్వని వంటి గొప్ప స్వరముతో నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను అని పలికిన ఆ స్వర భావమును, అందున్న ఆత్మీయ సంగతులను ప్రకటన 1:18వ వచనములో ధ్యానించి యున్నాము.

సంఘమునకు ఆదియూ, అంతమునూ ఐయున్న దేవుడు మృతుడై మరల బ్రదికినవాడు అని పలుకుట ద్వారా, తన పునరుత్థాన శక్తితో బలపరచుచున్నాడు. మృతుడై మరల బ్రదికినవాడు అను మాటతోనే క్రీస్తు పునరుత్థాన శక్తిని సంఘమునకు అనుగ్రహించు చున్న దేవునికి మహిమ కలుగును గాక. సజీవమైన సంఘము ఆ దినమున ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడును (సంఘము ఎత్తబడును), ఆ మీదట సదాకాలము ప్రభువుతో కూడ ఉండును (1 థెస్స 4:17) గాక.

చెప్పబడుచున్న సంగతులకు చెవియొగ్గి ఆలకించి రానైయున్న రారాజు యేసు క్రీస్తును ఎదుర్కొనుటకు సిద్ధపడుదుము గాక. సంఘము అట్లు ఆయత్తమవును గాక. ఆమెన్

ప్రకటన 2:9 నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే; తాము యూదులమని చెప్పుకొనుచు, యూదులు కాక సాతాను సమాజపు వారివలన నీకు కలుగు దూషణ నే నెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము.

“నేనెరుగుదును” – అనే అంశమును మనము ప్రకటన 2:2 వ వచనములో అనగా ఎఫేసు సంఘముతో ధ్యానించి యున్నాము.

సంఘము హింసింప బడుచున్నది అంటే ఆ సంఘము ఏ సమాజములో ఉన్నదో ఆ సమాజమే కారణము, ఏలయన అది సాతాను సమాజము. అవిశ్వాసులైన యూదుల మధ్య నలుగుతున్న స్ముర్న సంఘమును గమనములోనికి తీసుకున్నప్పుడు; మన చుట్టూ వున్న సమాజము ఎలావున్నది అని ఆలోచించ వలసియున్నది.

యోహా 4:22 లో యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో “రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది” అంటున్నారు. అయితే యథార్థముగా ఆరాధించువారు కావలెనని తండ్రి కోరుచున్నాడు అని యోహా 4:23 చెప్పుచున్నది. యదార్ధత లోపించిన సమాజములో నాటి సంఘము పురుడు పోసుకున్నది. ఆత్మ శక్తిని ఎదుర్కొనలేని నాటి సమాజములు మనకు అపోస్తలుల కార్యముల గ్రంధములో కనబడుచున్నవి.

లిబెర్తీనులదనబడిన సమాజము లోను, కురేనీయుల సమాజములోను, అలెక్సంద్రియుల సమాజములోను, కిలికియనుండియు ఆసియనుండియు వచ్చినవారిలోను, కొందరు వచ్చి స్తెఫను మాటలాడుటయందు అతడు అగపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింప లేకపోయిరి (అపో 6:9, 10). చివరికి స్తెఫను మరణము కోరుకొనిన మృగ సమాజమది.

క్రీస్తు సిలువ దర్శనములో కీర్తనాకారుడు ఆత్మఆవేదన గీతము వ్రాస్తూ; మరణబంధములు నన్ను చుట్టుకొని యుండెను పాతాళపు వేదనలు నన్ను పట్టుకొనియుండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగెను (కీర్త 116:3) అని గానము చేస్తున్నాడు. ఆత్మీయ ధనసమృద్ధి కలిగిన స్ముర్న సంఘ క్రమము మనకు మాదిరిగా వున్నది. ప్రియ సేవకుడా, ప్రియ విశ్వాసీ ఆత్మాభిషెకము పొంది ఆత్మ దేవునికి దిన దినము అప్పగించుకొని సంఘము నడిపిస్తున్నావా? లేనియెడల చుట్టూ వున్న సమాజమువలన శ్రమలే శ్రమలు, జాగ్రత్త.

అయినను నీవు ధనవంతుడవే – దరిద్రతలో ధనవంతుడగుట !! భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి (మత్త 6:19, 20). సంఘము క్రీస్తు అడుగుజాడలలో నడుచుచున్నట్టు స్పష్టముగా కనబడుచున్నది. ఆయన దూషింప బడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను (1 పేతు 2:23).

యేసు చెప్పెను; నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును (మత్త 5:11, 12). ప్రియ సోదరీ, స్నేహితుడా, ప్రియ దేవుని సంఘమా; ప్రస్తుత సమాజములో ఎట్లున్నది నీ ఆత్మీయ జీవితము, ఎట్లున్నది నీ సాక్ష్యము?

నేటి దినాల్లో చూసినట్లైతే; క్రీస్తు సంఘములో ఉంటూనే క్రీస్తుకు వ్యతిరేకమైన ప్రసంగాలు చేసేవారు ఒక ప్రక్క, బైబిలులో వున్న విషయాలు ఇతర గ్రంధాలలో కూడా వున్నట్టు చెపుతూ అనేకులను తప్పు త్రోవను నడిపిస్తుంటారు మరో ప్రక్క. సంఘమునకు వెలుపటి సమాజము వారు ఆ తప్పు బోధలను ఆధారము చేసుకొని దేవుని దూషిస్తూ వుంటారు. వారు బైబిలు ప్రవచానములను గూర్చియూ, స్వస్థతలను గూర్చియూ ప్రశ్నిస్తూ, విశ్వాసులకు లేనిపోని అనుమానాలు కలిగించుచూ వాదనలు చేస్తుంటారు. వారి వలన సంఘమునకు శ్రమ.

వ్యర్థమైన మాటలవలన ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి; ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారిమీదికి వచ్చును (ఎఫే 5:6). సంఘము చుట్టూ పగలు మేఘ స్థంభముగాను, రాత్రి అగ్ని స్థంభముగాను ఆత్మ ఆవరించి కాపాడి నడుపును గాక. ఆమెన్

ప్రకటన 2:10 ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు; పది దినములు శ్రమ కలుగును; మరణమువరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీట మిచ్చెదను.

అపవాది మీలో కొందరిని అనగా స్ముర్న సంఘములోనుండే కొందరిని. 2:9 లో వెలుపటి సమాజము వలన శోధనలు ధ్యానిస్తూ వచ్చాము. ఇప్పుడు (2:10 లో) సంఘమును దేవుడే పరీక్షించు సమయము కనబడుచున్నది. మరణము వరకు అంటున్నారు ఆత్మ దేవుడు. యేసయ్య చెప్పారు; మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవచేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది (యోహా 16:2).

ప్రియ స్నేహితుడా, సంఘము అంటే సేవ, సేవ అంటే ప్రతిదినము సిలువ (లూకా 9:23), సిలువ అంటే శ్రమలు. అపవాదిని దేవుడే అనుమతించిన యోబును మనమెరుగుదుము. యెహోవా (అపవాదితో) నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలో చించితివా? (యోబు 1:8). సాతాను ఫిర్యాదియై (జక 3:1) దేవుని సన్నిధిని కనబడినప్పుడు దేవుడు పరీక్షను అనుమతిస్తాడు. విశ్వాసికి లేక సువార్తికునికి చెర దేవుని పరీక్ష. అపొస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి (అపో 5:18). చాల దెబ్బలు కొట్టి వారిని చెరసాలలోవేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకుని కాజ్ఞాపించిరి (అపో 16:23).

రెండు మాటలు ఆత్మ దేవుడు బయలుపరచు చున్నారు. పది దినములు అనియూ, మరణము వరకు అనియూ. మనలోని వారే మనకు శత్రువులుగా ఐతే ఎలా, ఇది దేనికి సంకేతము? మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోకనాథులతోను, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము లతోను పోరాడుచున్నాము (ఎఫే 6:12) అని వాక్యము వివరిస్తున్నది.

కనుక పోరాటము లేకుండా విజయము లేదు. విజయము లేకుండా బహుమానము లేదు. ఈ పోరాటములో విజయ రహస్యము స్పష్టమే – నమ్మకముగా ఉండుము. సంఘములో ఒకరి యెడల ఒకరి నమ్మకత్వము, సంఘము దేవుని యెడల నమ్మకత్వము ఎంత అవసరమై ఉన్నదో మనకు స్ముర్న సంఘము నేర్పుచున్నది. ప్రార్ధనలో సడలింపు ఏమాత్రమూ పనికిరాదు అంటున్నారు ప్రభువు. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి (మత్త 5:44).

మరణము వరకు అని పలికిన దేవుడే అంటున్నారు అపవాదితో: యెహోవాఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది; అతనికి మాత్రము ఏ హానియు చేయ కూడదు (యోబు 1:12). అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను (యోబు 2:6). వాగ్దానమిచ్చి నెరవేర్చు దేవుడు మహిమ పొందును గాక. పొందబోవు బహుమానము ముందుగా నిర్ణయించబడిన తరువాత ఈ పరీక్షలెందుకు? అని సందేహము.

అపో. పౌలుగారు తన స్వ అనుభవము తెలియజేస్తూ అంటున్నారు; నాకు శరీరములో ఒక ముల్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, నన్ను నలగగొట్టుటకు సాతానుయొక్క దూతగా ఉంచబడెను (2 కొరిం 12:7). ఒకవేళ ప్రభువు కోపించినా, అది ఎంతసేపు - ఆయన కోపము నిమిషమాత్రముండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును (కీర్త 30:5). శక్తిమంతుడైన దేవుడు ఒక్క నిమిషము మాత్రము కోపించుట ఎందుకని? ఇది కేవలము ఒక భక్తుని తలంపు కాదు. దేవాది దేవుడే సెలవిస్తున్నారు: నేను నిత్యము పోరాడువాడను కాను ఎల్లప్పుడును కోపించువాడను కాను ఆలాగుండినయెడల నా మూలముగా జీవాత్మ క్షీణిం చును నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు (యెష 57:16).

జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు (మత్త 24:9). తుదకు నేను నీకు జీవకిరీట మిచ్చెదను అంటున్నారు. శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును (యాకో 1:12). ప్రియులారా, సహించిన వారమైతే ఆయనతో కూడ ఏలుదుము (2 తిమో 2:12).

అంతే కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి శ్రమలయందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది (రోమా 5:3-5). సంఘము శ్రమలలో వున్నప్పుడు సహనము తో ప్రార్ధించి, పొందబోవు బహుమానము కొరకు నిరీక్షణ కలిగి యుందుము గాక. ఆమెన్

ప్రకటన 2:11 సంఘములతో ఆత్మచెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక.జయిం చువాడు రెండవ మరణమువలన ఏ హానియుచెందడు.

సంఘములతో ఆత్మచెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక – అను ఈ అంశాన్ని ప్రకటన 2:7లో ధ్యానిస్తూ వచ్చాము.

రెండవ మరణము వలన ఏ హానియుచెందడు అంటూ పరిశుద్ధాత్ముడు వాగ్దానము చేస్తున్నారు. యేడు సంఘముల క్లుప్త వివరణలో 2వ అధ్యాయము ఆరంబించక పూర్వము ధ్యానించి యున్నాము. రెండవ మరణము అనగా అగ్నిగుండము.

2వ అధ్యాయము 10వ వచనములో ఇచ్చిన వాగ్డానము “నేను నీకు జీవకిరీట మిచ్చెదను” యొక్క నేరవేర్పు ఈ వచనములో తెలిపి స్ముర్న సంఘ వర్తమానము ముగించబడుచున్నది.

దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి (2 కొరిం 1:20) గనుక మనద్వారా దేవునికి మహిమ కలుగు గాక. ఆమెన్

ప్రకటన 2:12 పెర్గములోఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము వాడియైన రెండంచులుగల ఖడ్గముగలవాడు చెప్పు సంగతులేవనగా

పెర్గము అను మాటకు గోపురము, దుర్గము అని అర్ధము. మొదటి 4వ మరియూ 12వ శతాబ్ద కాలమునాటి పెర్గము పట్టణము నేటి కాలములో బెర్గమో అనుపేరుగల పట్టణముగా నున్నది. పెర్గము సంఘమును దేవుడు మనకు మాదిరిగా చూపుతూ; నేడు మన సంఘములను చక్కబెట్టుకొనుటకు మనలను మనము సరిచేసుకోనుతకు ఆత్మ దేవుడు ప్రోత్సహించు చున్నారు.

పెర్గము లో వున్న దుర్బోధలను ఖండిస్తూ సంఘములో ఆయన నోటినుండి రెండంచులుగల వాడియైన ఖడ్గమొకటి బయలు వెడలుచున్నది (ప్రక 1:16). ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది (హెబ్రీ 4:12).

ప్రియులారా, సరియైన వాక్యము ప్రకటించు సంఘము పదునైన ఖడ్గము ధరించిన వీరునివలె అటు సాతానుపైనా, ఇటు లోకముమీద విజయము వెంబడి విజయము పొందగలదని మూడవదైన పెర్గము మనకు నేర్పించు చున్నది.

తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును (మనలను మన సంఘమును) నిర్దోషులనుగా నిలువ బెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, మహిమయు మహాత్మ్య మును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వ మును ఇప్పుడును సర్వయుగములును కలుగును గాక. ఆమెన్

ప్రకటన 2:13 సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును. మరియసాతాను కాపురమున్న ఆ స్థలములో, నాయందు విశ్వాసియైయుండి నన్నుగూర్చి సాక్షియైన అంతిపయనువాడు మీమధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపెట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును.

నేనెరుగుదును అనే ఈ మాటను ఒకే వచనములో రెండుసార్లు ప్రభువు జ్ఞాపకము చేస్తున్నారు. ఏడు సంఘములతో ఎనిమిది సార్లు ఈ మాటను ప్రస్తావించారు ప్రభువు. “నేనెరుగుదును” – అనే అంశమును మనము ప్రకటన 2:2 వ వచనములో అనగా ఎఫేసు సంఘముతో ధ్యానించియున్నాము.

సంఘము హింసింప బడుచున్నది అంటే ఆ సంఘము ఏ సమాజములో ఉన్నదో ఆ సమాజమే కారణము, ఏలయన అది సాతాను సమాజము అంటూ ప్రక 2:9 లో స్ముర్న సంఘము విషయమై ధ్యానించియున్నాము. “సాతాను సింహాసనమున్న స్థలము”, “సాతాను కాపురమున్న స్థలము” అనుచున్న దేవుని మాట ఏమి తెలియజేయుచున్నది? సంఘములో లోకమున్నది, లోకాచారములున్నవి. ఆత్మీయ క్రమశిక్షణ లోపించిన బోధలు అక్కడ చోటు చేసుకున్నవి.

రోమా చక్రవర్తి నీరో పరిపాలనలో అంతిప అనునతడు హతసాక్షి ఐయున్నాడని చరిత్ర చెపుతుంది. అతడు పెర్గము సంఘమునకు ప్రధానాధికారి (Bishop) గా వున్నట్లు చరిత్ర చెపుతున్నది. ఆత్మ చెప్పుచున్న సంగాతేమనగా, అతడు చంపబడినప్పటికీ సంఘము లేదా మిగతా విశ్వాసులు ఎవ్వరూ ప్రభువునుండి తొలగిపోలేదు.

సంఘము అనగా ఒక వ్యక్తి కాదు, ప్రభువు అని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. నేను లేకపోతే సంఘమే లేదు; ఇది నాది, నేను కట్టిన (లేక కట్టించిన) సంఘము అనుకునే వారెందరికో ఇది పాఠము. యేసు నామమును చేపట్టిన సంఘము ఒక వ్యక్తి మరణముతో ముగిసిపోలేదు.

క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడినవారము వధకు సిద్ధమైన గొఱ్ఱెలమని మేము ఎంచబడిన వారము (రోమా 8:35) అంటూంది పెర్గము.

ప్రియ స్నేహితుడా, అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ (1 కొరిం 9:16) అంటున్న అపో.పౌలును జ్ఞాపకము చేసుకుందాము. ఎట్లున్నది నీ సంఘము? ఎట్లున్నది నీ విశ్వాసము? ఎట్లున్నది నీ బహిరంగ సువార్త? కొందరు మానుకొను చున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచినకొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము (హెబ్రీ 10:24, 25). ప్రభువు ఆత్మ మనతో నుండును గాక. ఆమెన్

ప్రకటన 2:14,15 అయినను నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాముబోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలెనే నీకొలాయితుల బోధ ననుసరించు వారును నీలో ఉన్నారు.

ప్రకటన 2:4 లో మనము చూశాము; దేవుడు ఎఫేసు సంఘముతో “మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీమీద తప్పు ఒకటి (ఒక్కటి) మోపవలసియున్నది” అన్నారు. ఇపుడు పెర్గము సంఘముతో అంటున్నారు “నేను నీమీద కొన్ని (కొన్ని) తప్పిదములు మోపవలసియున్నది”.

ప్రియ దేవుని సంఘమా, ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికిలెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది (హెబ్రీ 4:13). ఆయన దృష్టికి పాతాళము తెరువబడియున్నది నాశనకూపము బట్టబయలుగా నున్నది (యోబు 26:6). విశ్వాసులమైన మనమీద ఆయన కను దృష్టి నిత్యమూ నిలుచుచున్నదని యోబు భక్తుడు తెలియజేయుచున్నాడు. ఆయన దృష్టి నరుల మార్గములమీద నుంచబడియున్నది ఆయన వారినడకలన్నియు కనిపెట్టి చూచుచున్నాడు (యోబు 34:21).

బాలాకునకు నేర్పిన బిలాముబోధ, నీకొలాయితుల బోధల విషయం ఎఫేసు సంఘముతో ప్రకటన 2:6 వ వచనము లో ధ్యానించియున్నాము. బోధింప బడిన వర్తమానములు లేఖనానుసారముగా ఉన్నవో లేవో ఆత్మ జ్ఞానముతో వివేచించిన వారమై, అట్టి దుర్బోధలను అనుసరింపక యుందము గాక. ప్రభువు ఆత్మ మనందరికీ తోడై యుండునుగాక. ఆమెన్

ప్రకటన 2:16 కావున మారుమనస్సు పొందుము; లేనియెడల నేను నీయొద్దకు త్వరగా వచ్చి నా నోటనుండి వచ్చు ఖడ్గముచేత వీరితో యుద్ధముచేసెదను.

బాలాకునకు నేర్పిన బిలాముబోధ, నీకొలాయితుల బోధ నీలో వున్నవి; కనుక మారుమనస్సు పొందుము; లేనియెడల – లేనియెడల నిన్ను శిక్షిస్థాను అనిగాని, పరలోకమునకు చేరలేవు అనిగాని, అగ్నిలో వేయబడుదువు అనిగాని, చెప్పుటలేదు. సంఘమా మారుమనస్సు పొందుము అనగా, నీ బోధలను సరిచేసుకొనుము అని అర్ధము.

పెర్గము సంఘము యెడలను, అక్కడి విశ్వాసుల యెడలను దేవుడు కలిగియున్న తన ప్రేమను కనబరచుచున్నారు. దుష్టులు మరణము నొందుటచేత నా కేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రదుకుటయే నాకు సంతోషము; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు (యెహే 18:23). ఆత్మస్వరూపి యైన క్రీస్తు తన నోటనుండి వచ్చు ఖడ్గము అనగా రెండంచులుగల వాక్య ఖడ్గముతో పోరాటము సలిపి, నీ ఆత్మను రక్షించుకొందును అని ప్రభువు మాటాడుతున్నారు.

ప్రియులారా, ఏ విధముచేతనైనను మృతులలోనుండి నాకు (సంఘమునకు) పునరుత్థానము కలుగవలెనని (ఎత్తబడవలెనని), ఆయన మరణవిషయ ములో సమానానుభవము పొంది, ఆయనను ఆయన పునరుత్థానబలమును ఎరిగి, ఆయన శ్రమలలో పాలివారై యుండవలెనని (ఫిలి 3:10), దేవుడు మనయెడల తన అపారమైన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు (రోమా 5:8).

ప్రియ క్రైస్తవ నేస్తం, వాక్యము చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు కొన్నిసార్లు నీ అంతరంగములో పోరాటములు కలుగుచున్నవా? బోధించుచున్నప్పుడు నిన్ను నీవు ప్రశ్నించుకుంటున్నావా? అలా వాక్యమైయున్న క్రీస్తు నిన్ను సంధించినప్పుడు నీవెలా స్పందించుచున్నావు? పూర్వస్థితి మారక, వాతవేయబడిన మనస్సాక్షి గలవారమై యున్నట్లితే, ఖండించు వాక్యము సరిదిద్దు వాక్యము వినుటకు ఇష్ట పడలేము, కరా ఖండిగా సంఘములో బోధించలేము.

అందునుబట్టియే కదా, నేటి దినాలలో ఎన్నో సంఘాలు మాకు దైవసేవకులు వద్దు, మాకు తెలిసిన వాక్యము మాకు నచ్చినట్టు మేమే బోధించుకుంటాము; లేదా మాకు అనుకూలమైన బోధకులను పిలిపించుకుంటాము అంటున్నాయి. అంతటితో ఆగిపోని సమరం క్రీస్తు శరీరమను సంఘమును రెండు ముక్కలు చేయడానికి ఏమాత్రమూ వేనుకాడుట లేదు.

సంఘమా, ప్రియ స్నేహితుడా నీవు త్వరపడి మరలా మారుమనస్సు పొందవలెనని ప్రభువు కోరుచున్నాడు. సమస్తమైన మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. ఆమెన్

ప్రకటన 2:17 (a) సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింప నిత్తును.

సంఘములతో ఆత్మచెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక – అను అంశాన్ని మరియూ జయించువారు అను అంశాన్ని ప్రకటన 2:7లో ధ్యానిస్తూ వచ్చాము.

ఇశ్రాయేలీయులు మన్నాను చూచినప్పుడు అది ఏమైనది తెలియక “ఇదేమి” అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి (నిర్గ 16:15). ఆ తదుపరి ఇశ్రాయేలీయులు దానికి “మన్నా” అను పేరు పెట్టిరి (నిర్గ 16:31). అది ఆకాశధాన్యము (కీర్త 78:24 ) అనియూ, దేవదూతల ఆహారము (కీర్త 78:25 ) అనియూ కీర్తించబడియున్నది.

ఇశ్రాయేలీయులు కనానుదేశపు పొలిమేరలు చేరువరకు మన్నాను తినిరి (నిర్గ 16:35). వాగ్దాన దేశపు పంటను వారు తినుచుండగా మన్నా మానిపోయెను; అటుతరువాత ఇశ్రాయేలీయులకు మన్నా దొరకకపోయెను (యెహో 5:12). కనుక అది వారికి మరుగైపోయెను. కాని అతిపరిశుద్ధస్థలములోనున్న మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను చేతికఱ్ఱయు, నిబంధన పలకలును ఉంచిరి అని హెబ్రీ 9:4 లో అపో. పౌలుగారు తెలియజేయుచున్నారు.

రాజైన సోలోమోను కట్టించిన మందిరములో యెహోవా నిబంధన మందసము నుంచుటకై మందిరములోపల గర్భాలయమును సిద్ధపరచెను (1 రాజు 6:19). చివరకు ఇశ్రాయేలు వారికి మందసము లేకపోవుననియు, దాని వారు మరిచిపోయెదరనియూ యెహోవా సెలవిచ్చియుండెను అని ప్రవక్తయైన యిర్మియా ద్వారా దేవుడు పలికినారు. (జనులుయెహోవా నిబంధన మందసమని ఇకను చెప్పరు, అది వారి మనస్సు లోనికి రాదు, దానిని జ్ఞాపకము చేసికొనరు, అది పోయి నందుకు చింతపడరు - యిర్మీ 3:16). కనుక అదియూ వారికి మరుగైపోయెను.

మరి పెర్గము సంఘమునకు ప్రభువు చేసిన వాగ్దానమును మనమెట్లు భావించగలము !! ప్రవక్తయైన యోహాను గారికి దర్శనములో పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధనమందసము ఆయన ఆలయములో కనబడెను (ప్రక 11:19). అట్లు లోకమునకు మరుగైయున్న మన్నాను మనకు అనుగ్రహించెదనని ప్రభువు వాగ్దానము చేయుచున్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక.

మీ పితరులు అరణ్యములో (భూమి మీద కురిసిన) మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకమునుండి దిగివచ్చిన (మన్నా ఇదే) ఆహారమిదే. పరలోకమునుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును (యోహా 6:49-51). ఆత్మ చెప్పుచున్న మాటకు లోబడిన ప్రతి క్రైస్తవుడు, విధిగా అట్టి పరలోకపు మన్నాను భుజించవలెను అనియేగదా, అపో. పౌలు భక్తుడు కొరింథీ సంఘము ద్వారా తెలియపరచి యున్నాడు.

జీవముగల దేవుని సంఘములో మారుమనస్సు పొందిన ప్రతి విశ్వాసి తన్ను తాను పరీక్షించుకొనవలెను; ఆలాగుచేసి ఆ రొట్టెను తిని, ఆ పాత్రలోనిది త్రాగవలెను (1 కొరిం 11:28). ఇది జయజీవితమునకు మొదటి మెట్టు. పెర్గము సంఘమును మనకు మాదిరిగా చూపి మనతో మాటాడుతున్న పరిశుద్ధాత్మ సందేశము వినియూ ప్రభువు బల్ల ఆచరించని సంఘముల మరియూ ప్రభువు బల్లను స్వీకరించని క్రైస్తవుల కడవరి స్థితి యేమౌనో !!?

వారికొరకు ప్రార్ధన చేద్దాం. క్రీస్తు సిలువ త్యాగము, పరిశుద్ధాత్మ ప్రోత్సాహము; అట్టి కృపలకు మనలను పాత్రులనుగా చేయును గాక. ఆమెన్

ప్రకటన 2:17 (b) మరియు అతనికి తెల్లరాతినిత్తును; ఆ రాతిమీద చెక్కబడిన యొక క్రొత్తపేరుండును; పొందిన వానికే గాని అది మరి యెవనికిని తెలియదు.

పరిశుద్ధ గ్రంధము లో రాయి ప్రతిష్టకు, నిశ్చయతకు, ఒప్పందమునకు, శాశ్వత సాక్ష్యమునకు గురుతుగా వున్నది. నీవు యోహాను కుమారుడవైన సీమోనువు; నీవు కేఫా అనబడుదువని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము (యోహా 1:42). మరియు నీవు పేతురువు? ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను (మత్త 16:18) అంటూ యేసుక్రీస్తు ఒక పరలోక నిర్ణయమును తెలియ పరచుచున్నారు.

ఇశ్రాయేలీయులు యోర్దాను దాటుట, లోకమును పాపమును దాటిన ఒక విశ్వాసి యొక్క జయజీవితమును సూచించుచున్నది. అట్లు వారు యోర్దాను నదీ తీరమున వేసిన రాళ్ల కుప్ప నేటికీ సాక్షిగా వున్నది. జనులందరు యొర్దానును దాటుట తుదముట్టిన తరువాత యెహోవా యెహోషువతో నీలాగు సెలవిచ్చెను; ప్రతిగోత్రమునకు ఒక్కొక మనుష్యుని చొప్పున పన్నిద్దరు మనుష్యులను ఏర్పరచి యాజకుల కాళ్లు నిలిచిన స్థలమున యొర్దాను నడుమనుండి పండ్రెండు రాళ్లను తీసి వాటిని ఇవతలకు తెచ్చి, మీరు ఈ రాత్రి బసచేయు చోట వాటిని నిలువబెట్టుడని వారి కాజ్ఞాపించుము (యెహో 4:1-3). అది యొర్దానును దాటుచుండగా యొర్దాను నీళ్లు ఆపబడెను గనుక యీ రాళ్లు చిరకాలము వరకు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా నుండును, అది ఒక ఆనవాలై యుండును (యెహో 4:7).

చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను (కీర్త 23:6) అంటూ గానము చేసిన దావీదు ఆకాంక్ష నేరవర్పువలె పరలోకమందున్న దేవాలయములో స్థానమునూ, దేవదూతల ఎదుట సాక్ష్యమునూ పొందుదుమనుటకు సాదృష్యముగా ఒక తెల్లని రాయిని పొందుదుమని దేవుని వాగ్దానము. ప్రక 15:6 లో చూసినపుడు ఏడు తెగుళ్లు చేత పట్టుకొనియున్న ఆ యేడుగురు దూతలు, నిర్మలమును ప్రకాశమానమునైన “రాతిని” ధరించు కొని, రొమ్ములమీద బంగారు దట్టీలు కట్టుకొనినవారై ఆ ఆలయములోనుండి వెలుపలికి వచ్చిరి.

దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి (2 కొరిం 1:20). రాతినిచ్చుట అనగా క్రీస్తు పరలోకమందున్న తండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను మన పేరును ఒప్పుకొనుట (ప్రక 3:5). మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును వానిని ఒప్పుకొందును (మత్త 10:32).

రాతిమీద చెక్కబడిన యొక క్రొత్తపేరు – అబ్రాము, శారయి లకు పేరులు మార్చిన దేవుడు యాకోబును ఇశ్రాయేలుగా మార్చి; అది శాశ్వత నామముగా అనగా భూమ్యాకాశములున్నంత వరకూ నిలిచి యుండునట్లు దయచేసి యున్నారు. అదే రీతిగా దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి యున్నవని సంతోషించుడని యేసయ్య చెప్పారు (లూకా 10:20) గదా!

ఐతే, భూమి మీద మనకున్న అన్యదేవతల పేరులు, విపరీత అర్ధమిచ్చే పేరులు, దయ్యముల పేరులు, దైవ దూషణ అర్ధమిచ్చు పేరులు అక్కడ వ్రాయబడవనియూ, ప్రతి ఒక్కరికీ ఒక్కో క్రొత్త పేరు పెట్టబడుననియూ తెలిసికొన వలసి యున్నాము. భూమిమీద మన యే పేరుకు పరలోకములో యే పేరు పెట్టబడుతుంది అనేది మర్మము. అది పొందిన వానికే గాని అది మరి యెవనికిని తెలియదు.

తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను (మత్త 1:21). ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము (అపో 4:12) – ఈ పేరులు ఆకాశము క్రింది వరకే పరిమితము అనియూ అర్ధమిచ్చుచున్నైది. ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు (మత్త 1:22). దేవదూతచే పలుకబడిన “యేసు” అను పేరు గాని, ప్రవక్తద్వారా పలుకబడిన “ఇమ్మానుయేలు” అను పేరు గాని పరలోకములో లేదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని యుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది (ప్రక 19:13).

ప్రియ సోదరీ, స్నేహితుడా నేడే నీ పేరు పరలోకములో వ్రాయించుకో. సమయము కొంచెముగా వున్నది, త్వరపడుము. ప్రభువు ఆత్మ మనతో ఉండును గాక. ఆమెన్

ప్రకటన 2:18 తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము అగ్నిజ్వాలవంటి కన్నులును అపరంజినిపోలిన పాదములునుగల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా

కుమార్తె లేక లోకముతో ఐక్యము అను అర్ధమిచ్చు తుయతైర అను పట్టణములో నున్న దేవుని సంఘమును దేవుడు మనకు మాదిరిగా చూపుతూ; నేడు మన సంఘములను చక్కబెట్టుకొనుటకు మనలను హెచ్చరించుచున్నారు. ఇది ఆది అపోస్తలుల కాలమునాటి అనగా నాలుగవ శాతాబ్దకాలమునాటి సంఘము.

బూర ధ్వని వంటి గొప్ప స్వరము విని, అగ్నిజ్వాలవంటి కన్నులును అపరంజినిపోలిన పాదములునుగల దేవుని కుమారుని చూచిన యోహాను దర్శనమును, అందున్న ఆత్మీయ సంగతులను ప్రకటన 1:14,15 వ వచనములలో ధ్యానించి యున్నాము. తుయతైర పట్టణస్థురాలు అయిన, లూదియయను దైవభక్తిగల యొక స్త్రీ ఆమెయు ఆమె యింటివారును బాప్తిస్మము పొందిరనియూ, తన యింటికి వచ్చియుండవలెనని అపోస్తలులను వేడుకొని వారిని బలవంతము చేసెననియూ అపో 16:14, 15 సాక్ష్యము పొందియుండెను.

జ్వాలామయమైన దీపములను పోలిన కన్నులుగలవాడు దానియేలును చూచినప్పుడు; నీవు బహు ప్రియుడవు అని ప్రశంసింప బడుట దానియేలు 10:5-11 లో చదువుచున్నాము. అలాగే దానియేలు 2:42 ప్రకారము పాదములు ఆయన రాజ్యమును సార్వభౌమాదికారమును సూచించుచున్నవి. అగ్నిజ్వాలవంటి కన్నులును అపరంజినిపోలిన పాదములునుగల దేవుని కుమారుడు తుయతైర సంఘము విషయములో ఏమై యున్నారు, తద్వారా మనకు, మన సంఘమునకు ఏమి సందేశ మిచ్చుచున్నారు తరువాయి భాగములో ధ్యానించుకుందాము.

మన తండ్రియైన దేవుని ప్రేమా, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిషుద్దాత్ముని నిత్య సన్నిధి సహవాసము మనకును మన సంఘమునకునూ ప్రభువు తిరిగి వచ్చు పర్యంతము తోడై యుండి నడిపించునుగాక. ఆమెన్

ప్రకటన 2:19 నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును; నీ మొదటి క్రియల కన్న నీ కడపటి క్రియలు మరియెక్కువైనవని యెరుగుదును.

“నేనెరుగుదును” – అవును ప్రభువు మనలను, మనలను మాత్రమే కాదు అందరి హృదయములను ఎరిగియున్న ప్రభువు అనే విషయాన్ని ప్రకటన 2:2, 3 లో ధ్యానించి యున్నాము.

నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును, అబద్ధికులను నీవు కనుగొంటివనియు, నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును అని ఎఫేసు సంఘముతో పలికిన దేవుడు ఇప్పుడు తుయతైర సంఘముతో మాటలాడుతూ, క్రియలను, సహనమును అను మాటలతోబాటు ప్రేమను, విశ్వాసమును, పరిచర్యను మరియూ నీ కడపటి అనుభవాలను ప్రస్థావిస్తున్నారు.

ప్రేమామయుడైయున్న దేవుడు మన ప్రేమను ప్రశ్నిస్తే ఆయన ఎదుట నిలువ గలమా? ఆత్మ ఫలములు అనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము (గల 5:22) గల సంఘము ఇది. ఎదుగూ బొదుగూ లేని సంఘాలను ఇన్ని సంవత్సరాల అనుభవము వుండికూడా ఇలా వున్నారేమిటి అంటే; ఎవరో ఒకరి మీద నింద వేస్తూ వారివలనే ఇలా ఉన్నాము అంటూ కితాబిస్తూ వుంటారు.

తుయతైర సంఘముతో దేవుడు మొదటి క్రియల కన్న నీ కడపటి క్రియలు మరియెక్కువైనవి అంటూ సెలవిస్తున్నారు. క్రియలమూలముగా విశ్వాసము పరిపూర్ణమగు చున్నది (యాకో 2:22). క్రియలు, విశ్వాసము, పరిచర్య, సహనము అనునవి సంఘము వెదజల్లుతున్న ప్రేమ పరిమళ సువాసనలు. ఆ ప్రేమే లోపిస్తే - వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటివరకును చీకటిలోనే యున్నాడు (1 యోహా 2:9).

ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు (1 యోహా 4:20 ). బీదలపోషణకొరకు నా ఆస్తి అంతయు ఇచ్చి నను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమియు లేదు (1 కొరిం 13:3).

ప్రేమ విశ్వాసము సహనములతో పరిచర్య జరిగిస్తూ ప్రేమ కార్యములను చేయుటకు మనలను మన సంఘమును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో నిర్దోషమైనదిగా నిలువ బెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా, మహిమయు మహాత్మ్య మును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వ మును ఇప్పుడును సర్వయుగములును కలుగును గాక. ఆమెన్

ప్రకటన 2:20 అయినను నీమీద తప్పు ఒకటి నేను మోపవలసి యున్నది; ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ వుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది.

దైవ జ్ఞాని ప్రసంగి చెబుచున్నాడు: బుక్కా వాని తైలములో చచ్చిన యీగలు పడుట చేత అది చెడువాసన కొట్టును; కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచినయెడల జ్ఞానమును ఘనతను తేల గొట్టును (ప్రస 10:1). యేసు చెప్పెను : మీరు లోకమునకు ఉప్పయి యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యులచేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు (మత్త 5:13). పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా (1 కొరిం 5:6) ?

సువిశాలమైన మందిరము కట్టించినా, క్రిక్కిరిసిన జనసమూహము హాజరవుతున్నా, సమృద్ధిగా కానుకలు వస్తున్నా, హృదయాలను తెప్పరిల్లజేసే జీవవాక్యము ప్రకటించబడకపోతే అది మృతమైన సంఘమే. యరొబాము తాను జరిగించిన పాపక్రియలకు తోడు యెజెబెలును వివాహము చేసికొని బయలు దేవతను పూజించుచు వానికి మ్రొక్కుచునుండెను (1 రాజు 16:31) అని వ్రాయబడియున్నది.

యెజెబెలు బోధలు నేటి సంఘములో బోధలు చేస్తున్న సహోదరీలకు సూచనగా వున్నది అని వ్రాయడానికి చింతించ వలసి వస్తున్నది. అటువంటి దుష్క్రియలను అనుసరించు వారిని సంఘములో వాడుకొనుట మంచిది కాదు. లోకముననుసరిస్తూ, లోకములోని సంగతులను మిళితము చేసి బోధించు బోధలు యెజెబెలు బోధలే. దుర్భోదల నుండి తప్పించబడి, వెలుగుతున్న దివిటీలు కలిగిన వారమై వరుడు క్రీస్తును ఎదుర్కొనగల బుద్ధి గల కన్యకల వలె సిద్ధపడుదుము గాక. ఆమెన్

ప్రకటన 2:21-23 మారుమనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చితినిగాని అది తన జారత్వము విడిచిపెట్టి మారుమనస్సు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితోకూడ వ్యభిచరించు వారు దాని క్రియలవిషయమై మారుమనస్సు పొందితేనే గాని వారిని బహు శ్రమలపాలు చేతును, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘము లన్నియు తెలిసికొనును.

మారుమనస్సు యొక్క ఆవశ్యకతను పరిశుదాత్మ దేవుడు పదేపదే ప్రస్తావించుట మనకు కనబడుతున్నది. మారుమనస్సు పొందుటకు నీ తీర్మానము ఏమిటి? జాప్యం దేనికి? పాపం ఒప్పుకొనుట కష్టంగా ఉందా లేక దానిని విడిచిపెట్టడానికి ఇష్టంలేదా!

తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవాచేత నిర్దోషి అని యెంచబడినవాడు ఆత్మలో కపటములేనివాడు ధన్యుడు (కీర్త 32:1,2). ప్రియ స్నేహితుడా, నేడే రక్షణ దినము. ఇంకా రక్షణతీర్మానము లేకపోతే మనస్సు మారి నూతన పరచబడక పోతే; మంచము పట్టించవచ్చు. నేనొక్కడిని మారకపోతే సంఘముకు ఏమీ కాదులే అనుకుంటున్నావా. నీవొక్కడివే కాదు, నీ అనుచరులను కూడా వదలను అంటున్న దేవుడు - దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను అని రూడిగా చెబుతున్నారు.

నిన్ను బోధించమని ప్రేరేపించిన వాడు, నీ బోధలను అనుసరించిన నీ అనుచరుడు నీతో ఏకీభవించిన వారు సహా మరణము పాలగుట తధ్యము. పేతురు: ప్రభువుయొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టినవారి పాదములు వాకిటనే యున్నవి; వారు నిన్నును మోసికొని పోవుదురని ఆమెతొ చెప్పెను. వెంటనే ఆమె అతని పాదములయొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు, లోపలికి వచ్చి, ఆమె చనిపోయినది చూచి, ఆమెను మోసికొనిపోయి, ఆమె పెనిమిటియొద్ద పాతిపెట్టిరి (అపో 5:9, 10).

ఇదేదో ఆది అపోస్తలుల కాలములోనో; తుయతైరలో ఉన్న సంఘమునకో సంభందించినది అనుకుంటే పొరపాటే, సంఘము లన్నియు తెలిసికొనును అని వ్రాయబడియున్నది, చదువువాడు గ్రహించుగాక (మత్త 24:15). అంతరింద్రియములను హృదయములను పరీక్షించువానికి మరుగైనది ఏది లేదని జ్ఞాపకము చేసుకుందాము. ఎవరికీ తెలియని, పరులెవరికీ కనబడని మన ప్రతి చర్యను అంతే కాదు మన హృదయములో పుట్టే ప్రతి ఆలోచననూ ఎరిగియున్న దేవుడు. ఇది అందరునూ, ప్రతి సంఘమూ ఎరుగవలెనని ప్రభువు హెచ్చరిస్తూ వున్నారు.

నూతన తీర్మానముతో నిజమైన మారుమనస్సు పొంది, మనము మనలను అనుసరిస్తున్న వారిని మన సంఘమును రక్షించు కుందాము. ప్రభువు మనతో నుండునునుగాక. ఆమెన్

ప్రకటన 2:23 మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను.

ప్రియ స్నేహితుడా; ప్రతివానికి ప్రతిఫలము అనగా, తాను జరిగించిన క్రియలచొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును (2 కొరిం 5:10). మంచి పనులకు వచ్చు ఫలము మంచిదే కనుక మానవులు అంతో ఇంతో పుణ్యం చేసుకుంటే మంచిది అని ఆలోచించి, దాన ధర్మాలు చేస్తుంటారు.

ప్రభువు చేసే హెచ్చరికలో మర్మము ఏమంటే, ప్రేమామయుడైన దేవుడు మనము బహుమానము పొందే వారిగానే జీవించాలని కోరుచున్నాడు గాని, శిక్షించబడాలని కోరుటలేదు. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయనయొద్దనే యున్నది ఆయన ఇచ్చు జీతము ఆయన తీసికొని వచ్చుచున్నాడు (యెష 62:11) అను యెషయా ప్రవచనము ఏమి చెప్పుచున్నది? విజ్ఞత గలవారమై ఇప్పుడైనా దేవుని ద్రాక్షావనములో పనిచేస్తే, కడపటివారు మొదటి వారగుదురు, మొదటివారు కడపటివారగుదురు (మత్త 20:16) అంటుంది ఉపమానము.

ఏలయన పనివాడు తన జీతమునకు పాత్రుడు (లూకా 10:7). పక్షపాతము లేకుండ క్రియలనుబట్టి ప్రతివానిని తీర్పుతీర్చువాడు తండ్రి (1 పేతు 1:17). ఇట్లుండగా, క్రీస్తులో క్షమాపణ నిత్యమూ మనకున్నది, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పామునుండి మనలను పవిత్రులనుగా చేయును (1 యోహా 1:7). కాని, పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు (మత్త 12:32) అనే విషయము ఎన్నడూ మరువరాదు.

కాబట్టి ప్రతివాడును తాను చేయుపనిని పరీక్షించి చూచుకొనవలెను (గల 6:4). మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట. అప్పుడు గ్రంథములు విప్పబడుట; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడుట; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందుట (ప్రక 20:12) యోహాను గారు చూస్తూ వున్నానని సాక్ష్యమిస్తున్నాడు.

సమయము సమీపించుచున్నది, ఒకదినమున మనమందరము దేవుని న్యాయ పీఠము ఎదుట నిలువ వలసియున్నది (రోమా 14:10). దేవుని సేవ చేస్తే ఫలితము తప్పక వుంటుంది పరలోకానికి వెళ్ళొచ్చు అనుకొనవద్దు. పిలుపులేని సేవకునికి ఆత్మల సంపాదన ఎక్కడిది; ఆత్మల సంపాదన లేని సేవకు జీతమెక్కడిది? ప్రభువు ఇస్తానంటున్న జీతము కానుకల రూపములో వొచ్చే డబ్బు కాదు. డబ్బు కోసమో పలుకుబడి కోసమో సేవ చేసేవాడు ద్రోహియైన యూదా ఇస్కరియోతు కంటే ఏమీ తక్కువ కాదని గ్రహించాలి.

కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను (రోమా 12:1). ప్రభువు ఆత్మ మనందరికీ తోడై యుండును గాక. ఆమెన్

ప్రకటన 2:24, 25 అయితే తుయతైరలో కడమవారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక సాతానుయొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొనువారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీపైని మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చువరకు మీకు కలిగియున్నదానిని గట్టిగా పట్టు కొనుడి.

కడమవారు అనగా సాతానును దాని క్రియలను ఎరుగమని చెప్పు కొందరు. క్రైస్తవ విస్వాసులే చాలామంది తమరు కోరుకోనినది జరిగినపుడు దేవుడు ఆశీర్వదించాడు అంటారు. తమకు ప్రతికూలత కలిగినపుదు సాతాను శోధన అంటారు.

ప్రియులారా, సాతాను సంగతులు ఎరుగని నీతిమంతుడైన యోబును మనము ఎరుగుదుము. శోధన సమయములో అతడేమంటున్నాడు; మనము దేవునివలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అంటున్నాడు. మేలైనా కీడైనా దేవుడు అనే మాటే గాని మారుమాట అతని నోట లేనేలేదు. ఈ సంగతులలో ఏ విషయ మందును యోబునోటి మాటతోనైనను పాపము చేయలేదు (యోబు 2:10). నీకు ఒక్కడైయున్న నీవు ప్రేమించిన ఇస్సాకును బలిగా యిమ్మని ప్రభువు అడిగినప్పుడు, అబ్రహాము – ఇది దేవుని పరీక్షా లేక సాతాను శోధనా అని ఆలోచించనే లేదు.

తుయతైర సంఘములో అటువంటి వారున్నారంటే ఆశర్యమే కదా ! మరి మన సంఘము లోనో ?? వారితో దేవుడు మాటాడుతున్న మాట లేక ఓ చక్కని వాగ్దానము; మీపైని మరి ఏ భారమును పెట్టను, వారిపై నున్న భారములను సహా తీసివేసెదను అంటున్నారు. వారినే కాదా దేవుడు పిలుస్తున్నాడు; ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును (మత్త 11:28). నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయువాడు (కీర్త 94:13) ఆయనే.

కనుక మనము కలిగియున్న విశ్వాసమునుండి తొలగిపోకుండా చూచుకొన వలసియున్నది. ఏలయన, తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను (1 కొరిం 10:12). సాతానుయొక్క గూఢమైన సంగతులు అనుమాటను లోతుగా ఆలోచించినట్లైతే; ఈ విషయమైన ప్రవచనము 1966 లో నేరవరినట్లు గ్రహించగలము.

1966 ఏప్రిల్ మాసములో ఆమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరములో సాతాను మందిరము (CHURCH OF SATAN) ఆరంభమైనది. ఆయొక్క సాతాను సంఘము మొట్టమొదట 1966, జూన్ మాసములో అనగా 6-6-66 తేదీన ప్రప్రంచ నలుమూలలనుండి వచ్చిన 100 మంది శాశ్వత సభ్యులతో ఒక పెద్ద కూడికను కాలిఫోర్నియాలో నిర్వహించినది. వారి ప్రామాణిక గ్రంధము సాతాను బైబిలు (SATANIC BIBLE).

నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు (1 పేతు 5:8) జాగ్రత్త. నీకు కలిగియున్నదేమిటి? దానిని గట్టిగా పట్టుకొనుట ఏమిటి? ఉపదేశసారమేదనగా, పవిత్ర హృదయమునుండియు, మంచి మనస్సాక్షినుండియు, నిష్కపటమైన విశ్వాసము నుండియు కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయిరి (1 తిమో 1:5-6).

అయితే క్రీస్తు కుమారుడైయుండి, ఆయన యింటిమీద నమ్మకముగా ఉన్నాడు; ధైర్యమును నిరీక్షణవలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినయెడల మనమే ఆయన యిల్లు (హెబ్రీ 3:6). అట్లు మనము మనము ఒప్పుకొనినదానిని గట్టిగా చేపట్టుదము (హెబ్రీ 4:14). అంతమువరకును సహించిన వాడు రక్షంపబడును (మత్త 10:22). ఆమెన్

ప్రకటన 2:26 - 28 నేను నా తండ్రివలన అధికారము పొందినట్టు జయించుచు, అంతమువరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనులమీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును; వారు కుమ్మరవాని పాత్రలవలె పగులగొట్టబడుదురు మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను.

సంఘముతో 6 మారులు “నీ క్రియలు” అని ప్రస్తావించిన దేవుడు ఇప్పుడు “నా క్రియలు” అని పలుకుట గమనించవలసి యున్నాము. నీకొలాయితుల క్రియలు (ప్రక 2:6), యెజెబెలను స్త్రీ క్రియలు (ప్రక 2:22), నీ మొదటి క్రియలు (ప్రక 2:5), నీ కడపటి క్రియలు (ప్రక 2:19), అసంపూర్ణమైన క్రియలు (ప్రక 3:2) అని ఆయా సంఘాలతో పలికిన దేవుడు ఇపుడు “నా క్రియలు” అని చెప్పుటలోని మర్మము తెలిసికొన ప్రయత్నిద్దాము.

మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయ వలెనని ఆయనను (యేసయ్యను) అడుగగా యేసు ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను (యోహా 6:28, 29). ఆవగింజంత విశ్వాసము మొదటి [1] క్రియ. ఆ విశ్వాసములో విజయ మున్నది. మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను (ఫిలి 2:4).

మరియూ, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తు డగును గాక (యిర్మీ 48:10) అని వ్రాయబడి యున్నది. కనుక దేవుని క్రియలు లేక సేవా సంబంధమైన కార్యక్రమములు బహు జాగ్రత్తగా చేయవలెను, ఏలయన అది దేవుని యిల్లు. అశ్రద్ధ ఏమాత్రమూ పనికిరాదు. అట్లు అశ్రద్ధగా చేయువాడు అపవాది సంబంది. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను (1 యోహా 3:8).

నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనులమీద అధికారము ఇచ్చెదను అను మాట ఏమిటి? క్రీస్తు తన రాజ్యముతో వచ్చినప్పుడు అధికారము పొంది వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము చేసెదరు (ప్రక 20:4). వాక్యమునకు బద్ధులగుట రెండవ [2] క్రియ. మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుందురు (యోహా 8:31) అంటున్నారు ప్రభువు. వాక్యప్రకారము వారు బోధించనియెడల వారికి అరుణోదయము కలుగదు (యెష 8:20).

ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడుకాడు (2 కొరిం 10:18). నమ్మకముగా జీవించుట మూడవ [3] క్రియ. అప్పుడు భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మక ముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను (మత్త 25:21) అని అంటారట, ప్రభువు. వేకువ చుక్కను ఇచ్చెదను అను వాక్యభావమేమని ఆలోచించినప్పుడు ఇంతకంటె స్థిరమైన ప్రవచనవాక్యము మనకున్నది.

తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించువరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది; దానియందు మీరు లక్ష్యముంచినయెడల మీకు మేలు ( 2 పేతు 1:19). ముందుగా యెషయా ప్రవక్త ద్వారా పలుకబడిన ప్రవచనము మనకు ఇక్కడ కనబడుచున్నది. అదేమనగా; నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటికచీకటి జనములను కమ్ముచున్నది యెహోవా నీమీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీమీద కనబడుచున్నది (యెష 60:1, 2).

దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము (ప్రస 12:1,2). ప్రియ స్నేహితులారా, రండి మనము యెహోవా వెలుగులో నడుచుకొందము (యెష 2:5). వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటివరకును చీకటిలోనే యున్నాడు (1 యోహా 2:9). తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు (1 యోహా 2:10 ) అది అతనిలో ప్రజ్వాలించుచున్నవేకువ చుక్కయే. ప్రియులారా, 1 కొరిం 14:1 ప్రకారము ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుదము. ఆమెన్

ప్రకటన 2:29 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక.
సంఘములతో ఆత్మచెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక – అను ఈ అంశాన్ని ప్రకటన 2:7లో ధ్యానించి యున్నాము.