Click here to Read Previous Devotions
హద్దులు లేని ఆలోచనలు
Audio: https://youtu.be/96J8CMw9sgM
మబ్బులు లేని ఆకాశాన్ని చూసినప్పుడు వింతైన అనుభూతి కలుగుతుంది. మన గొప్ప సృష్టి కర్త కళాఖండాల్లో మనం అశ్వాదించడానికి ఇవ్వబడిన అందమైన భాగం ఆకాశం. విమానాలు నడిపే వారిని అడిగినప్పుడు తమ అనుభూతులను మరెంతగానో వర్ణిస్తారు కదా. సరిహద్దులు లేని ఆకాశం, భవిష్యత్ కాలంలో మన జీవితం ఎలా ఉంటుంది అనే ఆలోచనలు రెండు సమానమే. మన జీవితం ఎటు పయనిస్తుందన్న సంగతి మనందరికీ అగమ్యగోచరమే.
జీవితంలో రేపేమి సంభావిస్తుందో, మన కొరకు ఏమి దాచి యుంచిందో అన్న దాన్ని చూడటానికి, అర్ధం చేసుకోడానికి కొన్ని సార్లు మనం పెనుగులాడుతూ ఉంటాము. బైబిల్ ఇలా చెబుతుంది “రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే.” (యాకోబు 4:14)
అయితే పరిమితమైన మన చూపు నిస్పృహకు కారణం కాదు. సరిగ్గా దానికి వ్యతిరేకమైనది. మన రేపటినంతా సంపూర్ణంగా చూడగలిగినవాడును, మన ముందున్న సవాళ్ళను, మనకేమి అవసరమో ఎరిగినవాడును అయిన దేవుణ్ణి మనం విశ్వసిస్తున్నాము. ఈ అనుభవాన్ని కనుగొన్న అపో.పౌలు “వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొను చున్నాము” (2 కొరింథీ 5:6) అంటూ నిరీక్షణతో కూడిన తన మాటలను గమనించగలం.
నేటి కొరకు, అదేసమయంలో మనం చూడలేని రేపటికోరకు దేవుణ్ణి విశ్వసించిన యెడల, జీవితం మనకేది అనుమతించినా చింతించ వలసిన అవసరం లేదు. మనం ఆయనతో నడుస్తూ ఉంటాము, ముందు ఏముందో ఆయనకు తెలుసు, దానితో వ్యవహరించడానికి ఆయన చాలినంత బలవంతుడు, జ్ఞానవంతుడు. ఆది నుండి అంతంవరకు చూసే దేవుడు, మన విశ్వాసమును బలపరచి, మన జీవితాలను పరిపూర్ణం చేయును గాక. ఆమెన్.