నిజమైన సందేహం
తోమా అనే పేరు గురించి ప్రస్తావిస్తే అన్నిటికంటే ముందు మనకు గుర్తువచ్చేది “సందేహించేవాడు”. మరణమొంది, సమాధి చేయబడి, పునరుత్థానుడైన యేసు క్రీస్తు ప్రత్యక్షమైనపుడు ఆ సమయంలో మనమక్కడ వుండివుంటే మనలో ఎంత మందిమి సందేహించకుండా నమ్మియుండే వాళ్ళం?.
యోహాను సువార్త 11లోని సందర్భాన్ని ధ్యానించినప్పుడు; మరణించిన లాజరును చూడవలెనని యేసు – “మనము యూదయకు తిరిగి వెళ్లుదమని” తన శిష్యులతో చెప్పినప్పుడు. ఆయన శిష్యులు – “బోధకుడా, యిప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే; అక్కడికి తిరిగి వెళ్లుదువా అని ఆయన నడిగిరి”; అందుకు దిదుమ అనబడిన తోమా - “ఆయనతో కూడ చనిపోవుటకు మనమును వెళ్లుదమని తనతోడి శిష్యులతో చెప్పెను” (యోహాను 11:7,8,16). ఈ వాక్యమును బట్టి “ధైర్యవంతుడైన తోమా” గా మనం పిలిచి ఉండవచ్చు కదా!. తాను మరణానికి అప్పగించుకునే దిశగా యేసు ఉద్దేశపూర్వకంగా అడుగులు వేస్తున్నప్పుడు...తోమా చూపించిన ధైర్యం ప్రశంసనీయం.
తోమా ఉద్దేశాలు తన క్రియలకన్నా ఘనమైనవిగా అనిపించాయి. “నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని” తోమా ఒక ఋజువు కోరినప్పటికీ పునరుత్థానుడైన యేసు తోమాతో తన పునరుత్థానబలమును ప్రత్యక్షపరచుకున్నప్పుడు “నా ప్రభువా, నా దేవా” అనకుండా ఉండలేకపోయాడు. (యోహాను 20:28).
నిజమైన సందేహం వెలుతురు కొరకు అన్వేషిస్తుంది, అపనమ్మకం చీకటితో తృప్తిపడిపోతుంది. విశ్వాస జీవితంలో దేవుని శక్తిని తనకు తానె రుజువుపరచుకొని సాక్ష్యాధారము కలిగి జీవించడమే నిజమైన విశ్వాసం, తోమాలో అదే విశ్వాసము చూడగలము. ఆనాడు యేసు ప్రభువు తోమాకు ఇచ్చిన జవాబు నేడు సందేహించే మనకు నమ్మకాన్ని, అపరిమితమైన ఆదరణను కలుగజేస్తుంది. నిజమైన సందేహాలతో క్రీస్తును అన్వేషించిన తోమా, క్రొత్త వెలుగుల దిశగా భారత దేశానికి సువార్తను ప్రకటించి, క్రీస్తు నిమిత్తం హతసాక్షియై నేడు మనకు నిదర్శనంగా నిలిచిపోయాడు.
నిస్సందేహమైన విశ్వాసంతో అడుగులు ముందుకు వేద్దామా? ఆమెన్.
Audio: https://youtu.be/i8DwFQiTN5E